అగ్ని మహా పురాణము

Table of Contents

షాడ్గుణ్య కథకము

శ్రీరాముడు చెప్పెను: రాజు ముఖ్యముగ ద్వాదశ మండలములను గూర్చి ఆలోచించు చుండవలెను. విజిగీషువగు (జయింపనిచ్ఛగల) రాజునకు పురోభాగమునందు (1) అరి (2) మిత్రుడు (3) అరిమిత్రుడు (4) మిత్రమిత్రుడు (5) అరిమిత్ర మిత్రుడును అను రాజులు (ఒకరి తరువాత ఒకరు) ఉందురు. వెనుకభాగమున (1) పార్ష్ణిగ్రాహుడు (2) ఆక్రందుడు, పార్ణ్షిగ్రాహాసారుడు (4) ఆక్రందాసారుడు అను రాజులు (ఒకరి వెనుక ఒకరు) ఉందురు. అరి విజిగీషువుల రాజ్యసీమలతో కలియు రాజ్యసీమ కలవాడు మధ్యముడు. అరివిజిగీషువులు కలిసినచో మధ్యముడు కోశము, సైన్యాదిసాహాయ్యము చేసి వీరిరువురిని అనుగ్రహింప సమర్థుడగును. కాని వీరిరువురును కలియకపోయినచో మధ్యమరాజు వీరిరువురిని వేరువేరుగా గాని క్రమమునగాని చంప సమర్థుడగును. వీరందరి మండలముల వెలుపలనున్న అధిక బలశాలియు అధికసైన్య సంపన్నుడును అగు రాజు ఉదాసీనుడు. విజిగీషు, అరి, మధ్యములు కలిసినచో ఉదాసీనుడు వీరిపై అనుగ్రహము మాత్రము చూపగలుగును. వీరు కలియకపోయినచో వీరిని అందరిని పరిమార్చి వేయగలుగును.

లక్ష్మణా! నీకు ఇప్పుడు సంధి, విగ్రహ, యాన, ఆసనాదుల విషయమును చెప్పెదను. బలవంతుడగు రాజుతో యుద్ధము వచ్చినపుడు తన పరిస్థితి శోచనీయముగ నున్నచో అపుడు సంధి చేసికొనుటయే మంచిది. కపాల, ఉపహార, సంతాన, సంగత, ఉపన్యాస, ప్రతీకార, సంయోగ, పురుషాంతర, అదృష్టనర, ఆదిష్ట, ఆత్మామిష, ఉపగ్రహ, పరిశ్రయ, ఉచ్ఛిన్న, పరదూషణ, స్కంధోపగేయములని సంధిలో పదునారు భేదములు ఉన్నవి. ఎవరితో సంధి చేసుకొనుచున్నారో అతడు సంధేయుడు. అభియోక్త అనభియోక్త అని సంధేయుడు రెండు విధములు. అనభియోక్తతో (ఆక్రమణము చేయని వానితో) ఉపన్యాస, ప్రతీకార, సంయోగములను మూడు సంధులు చేసికొనవలెను. మిగిలినవి అభియోక్త (ఆక్రమణకారి)తో చేసికొనవలెను. కొందరి అభిప్రాయము ప్రకారము పరస్పరోపకారము, మైత్రము, సంబంధజుము, ఉపహారము అని నాలుగు మాత్రమే సంధి భేదములు బాలకుడు, వృద్ధుడు, చిరకాల రోగి, బంధుసోదరాది బహిష్కృతుడు, పిరికివాడు, పిరికిపందలైన సైనికులు గలవాడు, దురాశాపరులగు సేవకులు గలవాడు, అమాత్యాది ప్రకృతుల అనురాగము కోల్పోయినవాడు, అత్యంత విషయాసక్తుడు, అస్థిరచిత్తుడై అనేకుల ఎదుట మంత్రమును ప్రకటించువాడు, దేవతా బ్రాహ్మణ నిందకుడు, దైవహతుడు, దైవమే సంపద్విపత్తులకు కారణమని నమ్మి పురుష ప్రయత్నము చేయనివాడు, దుర్భిక్ష క్లేశములో నున్నవాడు, కారాగారము నందు ఉంచబడిన లేదా శత్రువుచే చుట్టుముట్టబడిన సైన్యము కలవాడు, అయోగ్య ప్రదేశము నందున్న వాడు, చాలమంది శత్రువులు కలవాడు, యుద్ధమునకు తగిన సమయమున తన సేనను నియమించనివాడు, సత్యధర్మ భ్రష్టుడు-ఈ ఇరువది రకముల రాజులతో సంధి చేసికొన గూడదు; విగ్రహము మాత్రమే చేయవలెను.

ఒకరినొకరు అపకారము చేసికొనుటచే మనుష్యులలో పరస్పరము కలహము ఏర్పడును. అభ్యుదయము కోరు రాజు శత్రుపీడితుడైనప్పుడు దేశకాలముల అనుకూల త్వమును, సైనిక శక్తిని చూచుకొని విగ్రహము ప్రారంభింపవలెను. సప్తాంగ రాజ్యము, స్త్రీలు, జనపదమునందలి స్థాన విశేషము, రాష్ట్రములోని ఒక భాగము, జ్ఞాన ప్రదులగు ఉపాధ్యాయాదులు, సేన-వీటిలో దేనినైన అపహరించుటచే విగ్రహము ఏర్పడును. ఈ కారణములేగాక, మదము, అహంకారము, జనపదపీడ, జనమును నశింపచేయుట, ధనమునకు విఘాతము కలిగించుట, శక్తులకు విఘాతము, ధర్మ విఘాతము, దైవము, మిత్రకార్య సాధనము, మాననీయుల అవమానము, బంధువర్గ వినాశము, ప్రాణులకు తాన్చిన అభయమును విచ్ఛేదించుట, మండలదూషణము ఒకే ప్రయోజనమును ఇరువురు అపేక్షించుట ఈ ఇరువది కూడ విగ్రహహేతువులు. కొందరు విగ్రహము, సాపత్నము (సవతి సోదరుల మధ్య ఉండునది), వాస్తుజము (భూసువర్ణాది హేతుకము), స్త్రీ హేతుకము, కటువచన జనిత క్రోధహేతుకము, అపరాధ జనిత ప్రతిక్రియా బుద్ధిచే ఏర్పడునది అని ఐదు విధములని చెప్పిరి. ఫలితము చాల తక్కువ ఉండునది, నిష్ఫలము, ఫలప్రాప్తి విషయమున సందేహమున్నది, వెంటనే దోషములను కలిగించునది, భవిష్యత్తులో కూడ నిష్పలమైనది, వర్తమాన భవిష్యత్తులందు రెండింటి యందును దోషజనకమైనది, ఎంత బలపరాక్రమములు ఉన్నవాడో తెలియని శత్రువుతో ఏర్పడినది, ఇతరులచే రెచ్చగొట్ట బడినది, ఇతరుల స్వార్థసిద్ధి కొరకైగాని, ఏదైన ఒక సాధారణ స్త్రీని పొందుటకు గాని ఏర్పడినది, సుదీర్ఘకాలము సాగునట్లు కనబడునది, శ్రేష్టులైన ద్విజులతో ఏర్పడినది, సుదీర్ఘ కాలము సాగునట్లు కనబడునది, శ్రేష్ఠులైన ద్విజులలో ఏర్పడినది, దేవతావరములను పొంది అకస్మాత్తుగా బలవంతుడైన వానితో ఏర్పడినది, అధిక బలశాలులగు మిత్రులు కలవానితో సంభవించినది, వర్తమానము నందు ఫలమును ఇచ్చినను భవిష్యత్తునందు నిష్పలమైనది. భవిష్యత్తునందు ఫలప్రదమైనను వర్తమానమున నిష్పలమైనది-ఈ పదునారు విధములగు విగ్రహములలో ఎన్నడును చిక్కుకొనరాదు. వర్తమానము నందును భవిష్యత్తు నందును గూడ పూర్ణఫలము నీయగలుగు విగ్రహమును మాత్రమే రాజు అవలంబింపవలెను.

తనసేన హృష్ట పుష్టమై ఉత్సాహముతో ఉన్నట్లును, శత్రుసేన ఇందుకు విపరీతముగా ఉన్నట్లును నమ్మకము ఏర్పడిన పిదప రాజు శత్రువును నిగ్రహించుటకై విగ్రహము నవలంబింపవలెను. మిత్ర, ఆక్రంద, ఆక్రందాసారులకు తనపై దృఢభక్తి యుండి శత్రువు పరిస్థితి దీనికి భిన్నముగా నున్నపుడు విగ్రహము ప్రారంభింపవలెను. విగృహ్యగమనము, సంధాయగమనము, సంభూయ గమనము, ప్రాసంగికగమనము, ఉపేక్షాపూర్వక గమనము అని యానము ఐదు విధములని నీతిజ్ఞులు చెప్పుదురు. శత్రువు, విజిగీషువు కూడ ఒకరి నొకరు ఏమియు చేయజాలక పోవుటచే ఆక్రమణము చేయక కూర్చుండుట ‘ఆసనము’, యానము నందువలె దీనియందు కూడ విగృహ్యాసనము, సంధాయాసనము, సంభూయా సనము, ప్రసంగాసనము, ఉపేక్షాసనము అని ఐదు భేదములున్నవి. బలవంతులగు ఇద్దరు శత్రువుల వద్దకు రహస్యముగా ‘నేను నా రాజ్యము కూడ నీకు చెందినవే’ అని రహస్యముగా వార్త పంపి తాను దుర్గమునందు దాగియుండుట ‘ద్వైధీభావము’, ఆ శత్రువులు ఇద్దరును కలిసి ఆక్రమణము చేసినచో వారిలో అధిక బలశాలిని శరణు పొంద వలెను. వారిరువురును తనతో, ఎట్టి షరతుపైనను గూడ సంధిచేసికొనుటకు నిరాకరించినచో వారిరువురికిని శత్రువైన మరొక రాజునుగాని, అధిక బలశాలియగు రాజును గాని ఆశ్రయించవలెను. బలవంతుడైన శత్రువు ఆక్రమించగా ఆ కష్టమునుండి తప్పించు కొను ఉపాయాంతం “మేదియు లేనపుడు కులీనుడును, సత్యవాదియు, సదాచారవంతుడును, శత్రువు కంటె అధిక బలవంతుడును అగు వేరొక రాజును ఆశ్రయించవలెను. ఇట్లు ఆశ్రయము కోరువారు ఆశ్రయదాత దర్శనము కొరకై వానిని ఆరాధించవలెను. సర్వదా అతని అభిప్రాయమునకు అనుకూలముగ ప్రవర్తించవలెను. అతని కార్యములు చేయవలెను. సర్వదా అతని విషయమున ఆదరము చూపవలెను. ఇది ఆశ్రయించువాని కర్తవ్యము. (240)