అగ్ని మహా పురాణము

Table of Contents

శృంగారాది రస నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

అక్షరము, సనాతనము, జన్మరహితము, సర్వవ్యాప్తము, పరబ్రహ్మ స్వరూపము, అద్వితీయము, జ్యోతీ రూపము అగు ఏ చైతన్యము, వేదాంతములలో చెప్పబడుచున్నదో దానికి ఆనందము సహజము. అది అపుడపుడు అభివ్యక్తమగును. ఈ అభివ్యక్తియే చమత్కారము అనియు చెప్పబడును. దాని ప్రథమ వికారమునకు అహంకారమని పేరు. దానినుండి అభిమానము పుట్టినది. ఈ భువన త్రయము ఈ అభిమానమునందే అంతర్గతమై ఉన్నది. అభిమానమునుండి రతి పుట్టును. అది వ్యభిచర్యాది భావ సామాన్యముచే పరిపుష్టమై శృంగారము అని చెప్పబడును. ఇతరమైన హాస్యాగులు ఈ శృంగార భేదములే. వాటికి ఆయా స్థాయీ భావములు ఉండును. వాటి పరిపోషమే ఆ రసముల లక్షణము.

సత్త్వాది గుణ సముదాయములు పరమాత్మ నుండి జనించును. రాగము నుండి శృంగారము తీక్ష్ణత్వము నుండి రౌద్రము, ఉత్సాహము నుండి వీరము, సంకోచము నుండి బీభత్సము పుట్టును. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంతములు తొమ్మిది రసములు. నాల్గు రసములు (శృంగార రౌద్ర వీర బీభత్సములు) సహజములు. త్యాగము లేని ధనమువలె, రసము లేని వాక్కు ప్రకాశించదు. అపారమైన కావ్యసంసారములో కవియే ప్రజాపతి. ఆతనికి ఈ సంసారము ఎట్లు ఇష్టమగునో అట్టి మార్పు చెందుచుండును. కవి శృంగారియైనచో కావ్య జగత్తు రసమయమగును. ఆతడు రసహీనుడైనచో కావ్యము నీరసమగును. భావహీనమగు రసము, రసవర్జితమగు భావము వుండవు. భావములు రసములను అభివ్యక్తము చేయును. ‘భావ్యంతే రసాః ఏభిః’ అను వ్యుత్పత్తిచే భావములు చెప్పబడును. రతి మొదలగు స్థాయీ భావములు ఎనిమిది. స్తంభాదులు ఎనిమిది. మనస్సుకు అనుకూలమగు సుఖానుభవము రతి, హర్షాదులచే చిత్త వికాసము హాసము. చిత్రాది దర్శనమువలనకూడ హాసము కలుగును. చిత్తమునకు విక్లబత్వము భయమని చెప్పుదురు. చెడ్డవస్తువుల నింద జుగుప్స. ఉత్కృష్టమగు వస్తువులను చూచుటచే కలుగు చిత్త విస్తారము విస్మయము. స్థంభాదులగు ఎనిమిది భావములు సత్త్వమువల్ల కలుగును. రజస్తమస్సులకు అతీతములు. భయరాగాదులచే కల్గిన చేష్టా విఘాతము స్తంభము. శ్రమరాగాదులతో కూడిన అంతర క్షోభముచే కలిగిన శరీరజలము స్వేదము. హర్షాదులచే దేహము పులకరించుట పులకోద్గమము. హర్షాది జన్యమగు వచన అస్పష్టత్వము స్వర భేదము. ఇష్ట క్షయాదులచే కలిగిన మనోవైక్లబ్యము శోకము. ప్రతికూలముగా ప్రవర్తించువాని విషయమున తీక్ష్ణత్వము. క్రోధము పురుషార్థమును పూర్తి చేయుటకు యత్నము ఉత్సాహము. చిత్త శోభము కలిగిన ఉత్తభము వేపథువు. విషాధాదుల వలన కాంతికోల్పోవుట వైవర్ణ్యము. దుఃఖా నాందాదులవలన కల్గిన నేత్ర జలము అశ్రువు. లంఘనాదులచే ఇంద్రియములు పనిచేయకుండుట ప్రళయము.

వైరాగ్యాదులచే కలుగు మనః క్లేదము నిర్వేదము. మానసిక పీడాదుల వలన కలిగిన శరీర దౌర్బల్యము గ్లాని. అనిష్టప్రాప్తిని ఊహించుట శంక. మత్సరము అసూయ. మదిరాదుల ఉపయోగము వలన కలిగిన మానసిక మోహము మదము. ఎక్కువ పనిచేయుటచే కలిగిన శరీర క్లాంతి శ్రమము. చిత్తమునకు శృంగారాది క్రియలయందు ద్వేషము ఆలస్యము. సత్త్వము నుండి తొలగుట దైన్యము. విషయములను గూర్చి ఆలోచించుటచింత, చేయదగిన ఉపాయము తెలియ జాలకుండుట మోహము. అనుభవించిన వస్తువును మరల ప్రతిబింబింపచేసుకొనుట స్మృతి, యథార్థ జ్ఞానమువలన విషయ నిర్ణయము మతి. అనురాగాదుల వలన కలిగిన ఒకానొక విధమగు చేత స్సంకోచము, వ్రీడా, అస్థిరత్వము చపలతా, చిత్తప్రసన్నతా, హర్షము; ప్రతీకార వాంఛచే కలిగిన అంతః కరణ వైకల్యము ఆవేశము. కర్తవ్యము విషయమున ఏమి తోచుకుండుట జడత. అభీష్ట వస్తు ప్రాప్తిచే కలిగిన ఆనందము ధృతి. ఇతరులయందు అనాదరమును, తనయందు ఉత్కర్ష భావన గర్వము. అభీష్ట వస్తు ప్రాప్తిచే కలిగిన ఆనందము ధృతి. ఇతరుల యందు అనాదరమును, తన యందు ఉత్కర్ష భావన గర్వము. అభీష్ట వస్తువు యందు దైవాది విఘాతము విషాదము. ఈప్సిత సిద్ధి కొరకై చంచలమైన మానసిక స్థితి ఔత్సుక్యము. చిత్తేంద్రియాదులు పనిచేయకుండుట అపస్మారము. యుద్ధములందు బాధాదుల వలన స్థిరముగ ఉండజాలక పోవుట త్రాజము, చిత్త చమత్కారము వీప్స. క్రోధము శమించకుండుట అమర్షము. చేతన హృదయము ప్రబోధము. ఇంగితాకారములను దాచుకొనుట అవహిత్థము. గురువుల విషయమున కోపముచే వాక్పారుష్య, దండ పారుష్యములు ఉగ్రత, ఊహ, వితర్కము, మనస్సు శరీరము సరిగా వుండకపోవుట వ్యాధి కామాదులచే అసంబద్ధ ప్రలాపము ఉన్మాదము. తత్వ జ్ఞానాదులచే చిత్తమాలిన్యము తొలగుట శమము.

కావ్యాదులందు కవులు భావములను రసములను కూర్చవలెను. దేనిచే రత్యాదులు విభావిత ములగునో అది విభావము. విభివ్యతేయేన అని విగ్రహము. ఆలంబనము ఉద్దీపనము అని అది రెండు విధములు. ఈ రత్యాది భావ వర్గము దేనిని ఆధారముగా తీసుకుని పుట్టునో అది ఆలంబన విభావము. ఇది నాయకారులను ఆధారముగా చేసుకుని పుట్టును. ధీరోదాత్త, ధీరోద్దత, ధీరలలిత, ధీరప్రశాంతులని నాయకులు నాలుగు విధములు. అనుకూలుడు, దక్షిణుడు, శరుడు, ధృష్టుడు అని మరి నాలుగు విధములు. శృంగారమున నాయకునకు పీఠమర్దుడు, విటుడు, విదూషకుడుయని ముగ్గురు ధర్మ సచివులుగా ఉందురు. వీరు అనునాయకులు. పీఠమర్ధుడు శ్రీమంతుడైనాయకునివలె బలవంతుడై వుండును. విటుడు నాయకుని దేశమునకు చెందిన వాడై ఉండును. నవ్వించువాడు విదూషకుడు. నాయకుని నాయికలు కూడ ఎన్నివిధములుగా వుందురు. స్వకీయ, పరకీయ, పునర్భూ అని కౌశికుడు చెప్పెను. మరికొందరు, ‘పునర్బూ’రికి బదులుగ ‘సామాన్య’ను అంగీకరింతురు. ఈ నాయికలలో చాలభేదములున్నవి. ఉద్దీపన విభావములు వివిధ సంస్కార రూపముల నుండి ఆలంబన విభావమునందు భావోద్దీపనము చేయును, కర్మాదుల చేతను గీతికాదులచేతను, చతుష్పష్టి కళలు ఆరు విధములు. సాధారణముగ కోకన్మృతులు హాసోపహాకారములు. ఉద్బుద్ధములు సంస్కృతములుయగు భావములచే ఇచ్ఛాద్వేష ప్రయత్నముల సంయోగములచే కలుగు మనోవాణి బుద్ది శరీర కార్యములను విద్వజ్జనులు అనుభావములందురు. ‘సః అనుభూయతే అత్ర’ అని కాని సః అనుభవతి అని కాని దీని నిర్వచనము. మానసిక వ్యాపారము అధికముగా ఉన్నది మానసిక ఆరంభము. పౌరుషము స్త్రైణము అని అది రెండు విధములు.

శోభా, విలాస, మాధుర్యస్థైర్య, గాంభీర్య, లలిత, ఔదార్య, తేజస్సులను ఎనిమిది పౌరుషములు నీచుల నింద ఉత్తములతో స్పర్ధ, శౌర్యము, చాతుర్యము వీటిచే మను ధర్మమునందు శోభ కలుగును. ఇది ఇంటిలో శోభవంటిది. భావ, హావ, హేళా, శోభ, కాంతి, దీప్తి, మాధుర్య, శౌర్య, ప్రాగర్భ్య, ఉదారతా, స్థైర్య, గంభీరతలు అను పండ్రెండు స్త్రీల విభావములు. విలాస హావములను భావమందురు. ఇది కొంచెము హర్షముచే పుట్టును. వాక్సంబంధము వాగారంభము వీనికి పండ్రెండు భేదములున్నవి. మాటలాడుట ఆలాపము, ఎక్కువ మాటలాడుట ప్రలాపము దుఃఖవచనము విలాపము. మాటిమాటికి చెప్పుట యనులాపము, ఉక్తి ప్రత్యుక్తులు సల్లాపము, మరొక విధముగ చెప్పుట అపలాపము. వార్తను మోసికొని పోవుట సందేశము. ఒక విషయమును ప్రతిపాదించుట నిర్దేశము. తత్త్వమును చెప్పుట అతిదేశము. అన్య వర్ణనము అపదేశము; శిక్షాపూర్వక వచనము ఉపదేశము; వ్యాజోక్తి వ్యపదేశము. ఇతరులకు విషయమును బోధించుటకై ఉత్తమ బుద్ధి నాశ్రయించి వాగారంభము చేయవలెను. దానికి రీతి, వృత్తి ప్రవృత్తి అని మూడు భేదములు. (339)