అగ్ని మహా పురాణము

Table of Contents

కుబ్జికాపూజ

అనంతరము పరమేశ్వరుడు ఇట్లు చెప్పెను:

ఇపుడు, ధర్మార్థ కామ విజయాదులను ప్రసాదించు కుబ్జికాదేవీ మంత్రము చెప్పెదను. మూల మంత్రముతో పరివార సహితురాలగు ఈ దేవి పూజ చేయవలెను. ‘ఓం ఐం హ్రీం శ్రీం ......... కిలి కిలి’ అనునది (మూలోక్తము) కుబ్జికా మంత్రము-అంగన్యాస కరన్యాసములు చేసి సంధ్యా వందనము చేయవలెను. వామా-జ్యేష్ఠా రౌద్రులు ముగ్గురు సంధ్యలు. ‘కాలవాగీశి విద్మహే మహా కౌలీతి ధీమహి తన్నః కౌలీ ప్రచోదయాత్ అనునది కౌలీగాయత్రి. దీనిలో ఐదు మంత్రములున్నవి. ప్రారంభమున ప్రణవము, అంతమున నమః ప్రయోగించవలెను. మధ్య ఐదుగురు నాథుల పేర్లు, అంతమున ‘శ్రీ పాదుకాం పూజయామి’ అని చేర్చవలెను. మధ్యయందు చతుర్థ్యంతమగు దేవతా నామము చేర్చవలెను. ఈ విధముగా ఐదు మంత్రములలో ఒక్కొక్కటి దాదాపు పదునెనిమిది అక్షరములు కలిగి ఉండును. ఈ పేరులు అన్నింటిని షష్ఠీ విభక్తిలో ప్రయోగించవలెను. ఈ విధముగ వాక్యయోజన చేసి ఈ మంత్రముల స్వరూపమును తెలిసికొనవలెను. కౌలీశనాథ, శ్రీకంఠనాధ, కౌలనాథ, గగనానందనాథ, తూర్ణనాధులనువారు పంచనాధులు. వీరి పూజా మంత్రవాక్యములు ‘ఓం కౌలీశనాధాయ నమస్తస్మై పాదుకాం పూజయామి’ ఇత్యాది విధమున నుండవలెను. వీరితో పాటు, పుట్టుక నుండియు గూను ఉండుటచే కుబ్జికా అను పేరుగల సుకలాదేవి, చటులాదేవి, వికారాల రూపముగల మైత్రేశ్రీదేవి, అతలదేవి, శ్రీ చంద్రాదేవి అను ఐదుగురు దేవులను పూజించవలెను. వీరి పేర్లకు చివర దేవీ అని ఉండును. పూజా మంత్ర వాక్యములు ‘సుకలాదేవ్యై నమస్తస్యై భగాత్మ పుంగణ దేవమోహినీం పాదుకాం పూజయామి’ ఇత్యాది విధమున ఉండును. చటులాదేవి పాదుకకు ‘అతీత భువనానన్ద రత్నాఢ్యాం’ అను విశేషణము, మూడవ దేవిపాదుకకు ‘బ్రహ్మ జ్ఞానాఢ్యామ్’ అను విశేషణమును, నాల్గవ దేవి పాదుకకు ‘కమలాఢ్యామ్’ అను విశేషణమును, ఐదవ పాదుకకు ‘పరమ విద్యాఢ్యామ్’ అను విశేషణమును చేర్చవలెను. ఈ విధముగా విద్యా, దేవీ, గురువుల శుద్ధికి త్రిశుద్ధి’ అని పేరు. గగనానంద, చటులి, ఆత్మానంద, పద్మానంద, మణి, కలా, కమల, మాణిక్యకంఠ, గగన, కుముద, శ్రీపద్మభైరవా నంద, కమలదేవ, శివ, భవకృష్ణులు అను పదునారుగురు నూతన సిద్ధులు చంద్రపూర, గుల్మ, శుభకామ, అతిముక్తక వీరకంఠ, కుశల, దేవభోగక, విశ్వదేవ, ఖడ్గదేవ, రుద్ర, ధాతృ, అసి ముద్రాస్పోట, వంశపూర, భోజులను పదునారుగురు సిద్ధులు.

వీరి దేహము కూడ షడ్విధన్యాస నియంత్రితమై ఆత్మతో సమానమగును. మండలముపై పుష్పములుచల్లి మండలపూజ చేయవలెను. అనంత, మహత్, శివ పాదుకా, శూన్య, పంచతత్త్వాత్మక  మండల, శ్రీకంఠనాథ పాదుకా, శంకర, అనంతుల పూజ చేయ వలెను. సదాశివ, పింగల, భృగ్వానంద, నాథసముదాయ, లాంగూలానంద, సంవర్తులను మండల స్థానమున పూజించవలెను. నైరృతీయందు శ్రీమహాకాల, పినాకి, మహేన్ద్ర, ఖడ్గ, నాగ, బాణ, అఘాసి, శబ్ద, వశ, ఆజ్ఞారూప, నంద రూపములకు బలి ఇచ్చి క్రమముగా వాటిని పూజించవలెను. వటుకునకు అర్ఘ్య, పుష్ప, ధూప, దీప, గంధ, బలులను క్షేత్రపాలునకు పుష్ప-బలులను సమర్పించవలెను. అపుడు ‘హ్రీం ఖం ఖం.....నమస్తుభ్యమ్’ ‘ఓం హ్రాం హ్రీం.....స్వాహా’ అను (మూలోక్తములగు) మంత్రములను వినియోగించవలెను. బలిచివర కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన, ఎదుట త్రికూటమును పూజించవలెను. ఇందుకు మంత్రము-’హ్రీం హ్రూం హోం శ్రీం త్రికూటాయ నమః’ పిదప ఎడమ ప్రక్కన నిశానాథుని, కుడి ప్రక్కన తమోరినాథుని (సూర్యనాథుని), ఎదుట కాలానలుని పాదుకలను పూజించవలెను. పిదప ఉడ్డియాన, జాలంధర, పూర్ణగిరి, కామరూపులను, గగనానంద దేవ వర్గసహితస్వర్గా నందదేవ, పరమానందదేవ, సత్యానంద దేవ పాదుకా, నాగానంద దేవులను పూజించవలెను. ఈ విధముగ ‘వర్గము’ అను పేరుగల పంచరత్నములను గూర్చి చెప్పబడినది. ఉత్తర-ఈశాన్యము లందు సురనాధ పాదుకను, సమయ కోటీశ్వరుని, విద్యాకోటీశ్వరుని, కోటీశ్వరుని, బిందుకోటీశ్వరుని, సిద్ధకోటీశ్వరుని పూజించవలెను. ఆగ్నేయమున నలుగురు సిద్ధులను, అమరీశేశ్వర, చక్రీశేశ్వర, కురంగేశ్వర, వృత్రీశ్వర, చంద్రనాథులను గంధాది పంచోపచారములతో పూజించవలెను. దక్షిణమున అనాది విమల, సర్వజ్ఞవిమల, యోగీశ విమల, సిద్ధవిమల, సమయ విమలులను పూజించవలెను.

నైరృతియందు నాలుగు వేదములను, కందర్పనాథుని, వెనుక చెప్పిన అందరు శక్తులను, కుక శ్రీపాదుకను పూజించవలెను. కుజ్జికాపూజ ‘ఓం హ్రాం హ్రీం కుజ్జికాయై నమః’ అను నవాక్షర మంత్రముతో గాని, లేదా కేవలము పంచప్రణవరూపమగు మంత్రముతోగాని చేయవలెను. తూర్పుమొదలు ఈశాన్యమువరకు బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, నిరృతి, అనంత, వరుణ, వాయు, కుబేర, ఈశానులను దశదిక్పాలకులను పూజించ వలెను. సహస్రనేత్రుడగు ఇంద్రుని, అనవద్యుడగు విష్ణువును, శివుని సదా పూజించవలెను. తూర్పు మొదలు ఈశాన్యము వరకును ఎనిమిది దిక్కులలో క్రమముగా బ్రహ్మాజీ, మహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఐంద్రీ, చాముండా, మహాలక్ష్ములను పూజించవలెను. వాయవ్యము మొదలు ఆరు ఉగ్ర దిక్కులందు వరుసగ డాకినీ, రాకిణీ, లాకినీ, కాకినీ, శాకినీ, యాకినులను పూజించవలెను. పిదప ధ్యానపూర్వకముగ కుబ్జికాదేవిని పూజించవలెను. ముప్పది రెండు వ్యంజనాక్షరములు ఆమె శరీరము. ఆమెను పూజించు నపుడు ఐదు ప్రణవములను గాని, ‘హ్రీం’ గాని, బీజ రూపమున ఉచ్చరించవలెను. ఆమె దేహచ్ఛాయ నీల కమలదల శ్యామము. ఆరు ముఖములు ఉండును. వాటి కాంతి గూడ ఆరువిధములనుండును. ఆమె చైతన్య శక్తి స్వరూపురాలు. అష్టాదశాక్షర మంత్రముచే ప్రతిపాదింపబడునది. పండ్రెండు భుజములుండును. సుఖముగా సింహాసనముపై కూర్చుండును. కర్కోటకుడు ఆమెకు మేఖల, తక్షకుడు శిరస్సుపైనుండును. వాసుకి కంఠ హారము. ఆమె రెండు చెవులకును, కులికుడు, కూర్ముడు అనునాగములు కుండల ముగానున్నవి. రెండు కనుబొమ్మలపై పద్మ, మహాపద్మములను నాగములు ఉన్నవి. వామహస్తములందు నాగ, కపాల, అక్షసూత్ర, ఖట్వాంగ, శంఖ-పుస్తకములు, దక్షిణ హస్తములందు త్రిశూల, దర్పణ, ఖడ్గ, రత్నమాలా, అంకుశ, ధనుస్సులు ఉండును. తూర్పువైపు ముఖము పాండు వర్ణముగలది. దక్షిణమువైపు ముఖము కోపముతో నున్నట్లు కనబడును, పశ్చిమ ముఖము నల్లగాను, ఉత్తర ముఖము హిమ, కుంద, చంద్రులవలె తెల్లగాను ఉండును. ఆమె చరణ తలమున బ్రహ్మయు, జఘనమున విష్ణువు, హృదయ మునరుద్రుడు, కంఠమునందు ఈశ్వరుడు, లలాటమునందు సదాశివుడు ఆమె పై భాగము నందు శివుడును ఉందురు, కుబ్జికాదేవి ఊగుతున్నట్లు ఉండును. పూజాది సమయము లందు కుబ్జికను ఈ విధముగ ధ్యానించవలెను. (144)