అగ్ని మహా పురాణము

Table of Contents

రాజవంశ వర్ణనము

అగ్నిదేవుడు పలికెను:

తుర్వసునికి వర్గుడు వానికి గోభానుడు వానికి త్రైశాని, వానికి కరంధముడు, వానికి మరుత్తుడు, వానికి దుష్యంతుడు, వానికి వరూథుడు, వానికి గాండీరుడు, వానికి గాంధారుడు పుట్టెను. గాంధారునకు ఐదుగురు పుత్రులు పుట్టిరి. వీరి నామధేయముల అనుసరించి గాంధార, కేరళ, చోళ, పాండ్య, కోసల దేశములు ఏర్పడినవి. వీరందరును మహాబలవంతులు, దృహ్యునికి బభ్రుసేతువు, వానికి పురోవసువు, వానికి గాంధారుడు, వానికి ధర్ముడు, వానికి ఘృతుడు వానికి విదుషుడు, వానికి ప్రచేతసుడు పుట్టిరి. ప్రచేతసుని నూర్గురి కుమారులలో ఆనద్ర, సభానర, చాక్షుష, పరమేశువులు ప్రధానులు. సభానరునకు కాలానలుడు, వానికి సృంజయుడు, వానికి పురంజయుడు, వానికి జనమేజయుడు, వానికి మహాశాలుడు, వానికి మహామానసుడు, వానికి ఉశీనరుడు పుట్టెను. మహామానసుని భార్యయగు నృగకు నృగుడను కుమారుడు పుట్టెను. నృగునకు నరయను భార్యయందు నరుడును కృమియను భార్యయందు కృమియు, దశయను భార్యయందు సువ్రతుడు దృషద్వతియందు శిబి జనించెను. శిబికి పృథుదర్భుడు వీరకుడు, కైకేయుడు, భద్రకుడు అను నలుగురు పుత్రులు జనించిరి. వీరి పేర్లతో నాలుగుదేశములు ప్రసిద్ధములైనవి. ఉశీనరునికి తితిక్షువు వానికి రుషద్రథుడు, వానికి పైలుడు, వానికి సుతకుడు, వానికి మహాయోగియైన బలి జన్మించెను. బలికి అంగ, వంగ, ముఖ్యక, పుండ్ర, కళింగులను పుత్రులు పుట్టిరి. వీరందరికిని బాలేయులని పేరు. యోగియైన బలి మహా బలవంతుడు. అంగునికి దధివాహనుడు, వానికి దివిరథుడు వానికి ధర్మరథుడు, వానికి చిత్రరథుడు, వానికి సత్యరథుడు, వానికి లోమపాదుడు, వానికి చతురంగుడు, వానికి పృథులాక్షుడు, వానికి చంపుడు, వానికి హర్యంగుడు, వానికి భద్రరథుడు, వానికి బృహత్కర్మ, వానికి బృహద్భానుడు, వానికి జయద్రథుడు, వానికి బృహద్రథుడు, వానికి విశ్వజిత్తు, వానికి కర్ణుడు, వానికి వృషసేనుడు పుట్టెను. అంగవంశమునందు పుట్టిన రాజులను గూర్చి చెప్పితిని. ఇపుడు పురువంశ వర్ణనము వినుము. (277)