అగ్ని మహా పురాణము
అభిషేక మంత్రములు
పుష్కరుడు పలికెను:
ఇపుడు రాజ దేవతాద్యభిషేకమునకు సంబంధించిన మంత్రములను గూర్చి చెప్పెదను. ఇవి సకల పాపములను తొలగించును. కలశమును కుశయుక్త జలముతో నింపి రాజ్యాభిషేకము చేసినచో సకల మనోరథములు సిద్ధించును. (మంత్రముల అర్థము)-రాజా! బ్రహ్మ విష్ణు శివాది దేవతలందరును నీకు అభిషేకము చేయుదురు గాక! వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు, ఇంద్రాది దశదిక్పాలకులు, రుద్ర, ధర్మ, మనుదక్ష, రుచి శ్రాద్ధాది దేవతలును నీకు సర్వదా విజయము నిచ్చెదరుగాక. భృగు, అత్రి వసిష్ఠ, సనకసనందన, సనత్కుమార అంగిరస, పులస్త్య, పులహ, క్రతు, మరీచి, కశ్యపాది మహర్షులు ప్రజా శాసనముచేయు భూపతిని రక్షింతురు గాక. ప్రకాశవంతులగు ‘బర్హిషద్’ ‘అగ్నిష్వాత్త’ అను పితృదేవతలు నిన్ను రక్షింతురు గాక. క్రవ్యాదులు, ఆవాహితులగు ఆజ్యపులు, సుకాలి, ధర్మప్రియ, లక్ష్మి మొదలగు దేవతలును వృద్ధిపొందిన అగ్నులును నీకు అభిషేకము చేయుదురు గాక, అనేక పుత్రవంతుడైన ప్రజాపతి, కశ్యపుని ఆదిత్యాది పుత్రగణము, అభినందన, కృశాశ్వులు, అరిష్టనేమి భార్యలును నీకు అభిషేకము చేయుదురు గాక. అశ్విన్యాది చంద్రభార్యలు, పులహుని భార్యలు, భూతా, కపిశా, దంష్ట్రీ, సురసా సరమా, దను, శ్యేనీ, భాసీ, క్రౌంచీ, ధృతరాష్ట్రీ, శుకి మొదలగు దేవతలును, సూర్యుని సారథియైన అరుణుడును, నీ అబిషేకమును సుసంపన్నము చేయుదురు గాక. అతిథి, నియతి, రాత్రి, నిద్రాది దేవతలును, లోక రక్షణ తత్పరురాలగు ఉమాదేవియు, మేనా, శచీ ప్రభృతి దేవతలును, ధూమ్రా, ఊర్ణా, నైరృతీ, గౌరీ, శివా బుద్ధి, వేలా, నడ్వలా, అసిక్నీ, జ్యోత్స్నా దేవతలును, దేవాంగనలును, వనస్పతులును నిన్ను పాలించు గాక.
మహాకల్ప, కల్ప, మన్వంతర, యుగ, సంవత్సర, వర్ష, అయన, ఋతుమాస, పక్ష, రాత్రి, దివస, సంధ్యా, తిథి, ముహూర్తములు, కాలము యొక్క విభిన్న అయనములును నిన్ను రక్షించుగాక. సూర్యాది గ్రహములు, స్వాయంభువాది మనువులు నిన్ను రక్షింతురు గాక. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సావర్ణి, బ్రహ్మపుత్ర, ధర్మపుత్ర, రుద్రపుత్ర, దక్షపుత్ర, రౌచ్య, భౌత్యులను పదునాల్గురు మనువులు నిన్ను రక్షింతురుగాక. విశ్వభుక్, విపశ్చిత్, శిఖి, విభు, మనోజవ, ఓజస్వి, బలి, అద్భుత శాంతి, వృష, ఋతధామ, దివస్పృక్, కవి, ఇంద్ర, రైవంత, కుమార, కార్తికేయ, వత్స వినాయక, వీరభద్ర, నంది, విశ్వకర్మ, పురోజువ, దేవవైద్య, అశ్వినీ కుమారులు, ధ్రునాద్యష్ట వసువులు ఈ ప్రధాన దేవతలందరును ఇచట పాదార్పణముచేసి నీ అభిషేక కార్యమును సుసంపన్నము చేయుదురుగాక. అంగిరసుని కులమునందు ఉద్భవించిన పదిమంది దేవతలును, నాలుగు వేదములును సిద్దికొరకై నీకు అభిషేకము చేయుదురుగాక. ఆత్మ, ఆయుష్, మనస్, దక్ష, మద, ప్రాణ, హవిష్మత్, గరిష్ఠ, ఋత, సత్యములు నిన్ను రక్షించుగాక. క్రతు, దక్ష, వాసు, సత్య, కాల, కామ, ధురి అనువారు నీకు విజయ ప్రదానము చేయుదురుగాక. పూరూరవస్, ఆర్ద్రవ, విశ్వేదేవ, రోచన, అంగారకాది విగ్రహ, సూర్య, నిరృతి, యములు నిన్ను రక్షించుగాక. అజైకపాద, అహిర్బుధ్న్య, ధూమకేతు, రుద్రపుత్ర, భరత, మృత్యుకాపాలి, కింకణి, భవన, భావన, స్వజన్య, స్వజన, క్రతుశ్రవస్, మూర్ధ యాజన, ఉశనసులు నిన్ను రక్షించుగాక. ప్రసవ, అవ్యయ, దక్ష, భృగువంశ్య ఋషి, దేవతా, మను, అనుమంతృ, ప్రాణ, నవ, బలవదపాన వాయు, వీతి హోత్ర, నయ, సాధ్య, హంస, విభు, ప్రభు, నారాయణులను లోకక్షేమకారులగు దేవతలు నిన్ను పాలింతురుగాక. ధాతృ, మిత్ర, ఆర్యమన్, పూషన్, శుక్ర, వరుణ, భగ, త్వష్టృ, వివస్వత్, సవితృ, భాస్కర, విష్ణువులను పండ్రెండుగురు సూర్యులు నిన్ను రక్షించుగాక. ఏకజ్యోతి, ద్విజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశక్ర, ద్విశ, మహాబల, త్రిశక్ర, ఇంద్ర, పతికృత్, మిత, సంమిత, మహాబలి, అమిత, ఋతజిత్, సత్యజిత్, సుషేణ,సనజత్, అతిమిత్ర, పురుమిత్ర, అపరాజిత, ఋత, ఋతవాక్, ధాతృ, విధాతృ, ధారణ, ధ్రువులును, ఇంద్రుని పరమ మిత్రుడును తేజః శాలి యునగు విదారణుడును, ఐదృక్ష, అదృక్ష, ఏతాదృక్, అమితాశన, క్రీడిత, సదృక్ష, సరళ, మహాతపస్, ధర్తృ, ధుర్య, ధురి, భీమ, అభియుక్త, అక్షపాత, సహ, ధృతి, వసు, అనాధృష్య, రామ, కామ, జయ, విరాట్టులను నలుబది తొమ్మండుగురు మరుత్తులుసు దేవతలును నీకు అభిషేకముచేసి, నీకు లక్ష్మి నొసంగుదురుగాక. చిత్రాంగద, చిత్రరథ, చిత్రసేన, కలి, ఊర్ణాయు, ఉగ్రసేన, ధృతరాష్ట్ర, నందన, హాహా, హూహూ, నారద, విశ్వావసు, తుంబురులను గంధర్వులు నీ అభిషేకమును సుసంపన్నము చేయుదురు గాక; నీకు విజయమును ఇత్తురుగాక, అతి ప్రధానులైన మునులు, అనవద్యా, సుకేశీ, మేనకా, సహజన్యా, క్రతుస్థలా, ఘృతాచీ, విశ్వాచీ, పుంజిక స్థలా, ప్రమ్లోచా, ఊర్వశీ, రంభా, పంచచూడా, తిలోత్తమా, చిత్రలేఖా, లక్ష్మణా, పుండరీకా, వారుణీ అను దివ్యాప్సరసలు నిన్ను రక్షింతురుగాక.
ప్రహ్లాద, విరోచన, బలి, బాణులు, బాణుని పుత్రులు, ఇతర దానవులు, రాక్షసులు, నీ అభిషేకమును సిద్ధము చేయుదురుగాక. హేతి, ప్రహేతి, విద్యుత్, స్ఫూర్జథు, అగ్రక, యక్ష, సిద్ధ, మణిభద్ర, నందనులు నిన్ను రక్షించుగాక. పింగాక్ష, ద్యుతిమత్, పుష్పవన్త, జయావహ, శంఖ, పద్మ, మకర, కచ్ఛపములను నిధులు నీకు జయప్రదములు అగుగాక. ఊర్ధ్వకేశాది పిశాచములు, భూమ్యాదులందు నివసించు భూతములు, మాతృ దేవతలు, మహాకాల నృసింహులను ఇందు ఉంచుకొని నిన్ను పాలింతురుగాక. గుహ, స్కంద, విశాఖ, నైగమేయులు నీకు అభిషేకము చేయుదురు గాక. భూతలమునందును ఆకాశము నందును సంచరించు డాకినులు, యోగినులు, గరుడ, అరుణ, సంపాత్యాది పక్షులు నిన్ను పాలించుగాక. అనంతుడు మొదలగు మహానాగములు, శేష, వాసుకి, తక్షక, ఐరావత, మహాపద్మ, కంబల, అశ్వతర, శంఖ, కర్కోటక, ధృతరాష్ట్ర, ధనంజయ, కుముద, ఐరావత, పద్మ, పుష్పదంత, వామన, సుప్రతీక, అంజనములను నాగములు ఎల్లప్పుడును అన్ని వైపుల నుండియు నిన్ను రక్షించుగాక. బ్రహ్మ వాహనమైన హంసయు, శంకరుని వాహనమైన వృషభము, దుర్గాదేవీ వాహనమైన సింహము, యముని వాహనమైన మహిషము నిన్ను పాలించుగాక. అశ్వరాజమైన ఉచ్ఛశ్రవస్సు, ధన్వంతరి, కౌస్తుభమణి, శంఖజమైన పాంచజన్యము, వజ్ర, శూల, చక్ర, నందక ఖడ్గాదిశస్త్రములు నిన్ను రక్షించు గాక. దృఢ నిశ్చయవంతుడగు యమధర్మరాజు, చిత్రగుప్త, దండ, పింగల, మృత్యు, కాలులు, వాలఖిల్యాది మునులు, వ్యాస, వాల్మీక్యాది మహర్షులు, ప్పథు, దిలీప, భరత, దుష్యంతులు, అత్యంత బలవంతుడగు శత్రుజిత్తు, మను, కకుత్థ్స, అనేనా, యవనాశ్వ, జయద్రథ, మాంధాతృ, ముచుకుంద, పురూరవులు నిన్ను రక్షింతురుగాక. వాస్తుదేవతయు, ఇరువదియైదు తత్త్వములును నీకు విజయము కూర్తురు గాక. రుక్మభౌమ, శిలాభౌమ, పాతాల, నీలమూర్తి, పీతరక్త, క్షితి, శ్వేతభౌమ, రసాతల, భూర్లోక, భువర్లోకాది లోకములు, జంబూ ద్వీపము మొదలగు ద్వీపములు నీకు రాజ్యలక్ష్మి నిచ్చుగాక. ఉత్తరకురు, రమ్య, హిరణ్యక, భద్రాశ్వ, కేతుమాల, బలాహక, హరివర్ష, కింపురుష, ఇంద్రద్వీప, కశేరుమత్, తామ్రవర్ణ, గభస్తిమత్, నాగద్వీప, సౌమ్యక, గాంధర్వ, వారుణ, నవమాది వర్షములు నిన్ను రక్షించుగాక; నీకు రాజ్యమును ఇచ్చుగాక. హిమవత్, హేమకూట, నిషధ, నీల, శ్వేత, శృంగవత్, మేరు, మాల్యవల్, గంధమాదన, మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమత్, ఋక్షవత్, వింధ్య, పారి యాత్ర, పర్వతములు నీకు శాంతి నిచ్చుగాక. ఋగ్వేదాది వేద చతుష్టయము, షడ్వేదాంగములు, ఇతిహాస, పురాణ, ఆయుర్వేద, గాంధర్వవేద, ధనుర్వేదాది ఉపవేదములు, శిక్షా-వ్యాకరణ, ఛందస్, నిరుక్త, జ్యోతిష, కల్పము అను ఆరు వేదాంగములు, మీమాంసా, న్యాయ, ధర్మశాస్త్ర, పురాణములు అను ఈ పదునాలుగు విద్యలు నిన్ను రక్షించుగాక.
సాంఖ్య, యోగ, పాశుపత, వేద, పాంచరాత్రములకు సిద్ధాంతపంచకమని పేరు. ఇవియు, గాయత్రీ, శివా, దుర్గా, విద్యా, గాంధారీ దేవులును నిన్ను రక్షించుగాక. లవణ, ఇక్షురస, సురా, ఘృత, దధి, దుగ్ధ, జలసముద్రములు నీకు శాంతినొసగుగాక. నాలుగు సముద్రములును, వివిధ తీర్థములును నిన్ను రక్షించుగాక. పుష్కర, ప్రభాస, నైమిశారణ్య, గయాశీర్ష, బ్రహ్మశిరస్తీర్థ, ఉత్తర మానస, కోలోదక, నందికుండ, పంచనద తీర్థ, భృగుతీర్థ, అమరకంటక, జంబూమార్గ, విమల, కమలాశ్రమ, గంగాద్వార, కుశావర్త, వింధ్య, నీలగిరి, వరాహపర్వత, కనఖలతీర్థ, కాలంజర, కేదార, రుద్రకోటి, వారాణసీ మహాతీర్థ, బదరికాశ్రమ, ద్వారకా, శ్రీశైల, పురుషోత్తమ తీర్థ, శాలగ్రామ, వారాహ, సింధు సముద్ర సంగమ తీర్థ, ఫల్గుతీర్థ, బిందుసర, కరవీరాశ్రమములును, గంగా, సరస్వతీ, శతద్రు, గండకీ, అచ్ఛోదా, విపాశా, వితస్తా, దేవికా, కావేరీ, వరుణా, నిశ్చిరా, గోమతీ, పారా, చర్మణ్వతీ, రూపా, మహానదీ, మందాకినీ, తాపీ, పయోష్ణీ, వేణా, వైతరణీ, గోదావరీ, భీమరథీ, తుంగభద్రా, అరణీ, చంద్రభాగా, శివా, గౌరీ మొదలగు పవిత్ర నదులును నీకు అభిషేకముచేసి నిన్ను పాలించుగాక. (219)
