అగ్ని మహా పురాణము
ఛత్రాది మంత్రములు
పుష్కరుడు పలికెను:
ఛత్రాది మంత్రములను చెప్పెదను. వాటిని పూజించుటచే విజయాదికమును పొందును. మహామతియైన ఓ ఛత్రదేవా! నీవు హిమము, మల్లెపూవు, చంద్రుడువలె, తెల్లని కాంతితో ప్రకాశించుచున్నావు. బ్రహ్మ యొక్క సత్య వచనముచేతను, వరుణ సూర్య ప్రభావములచేతను నీవు సర్వదా వృద్ధి పొందుము. మేఘము మంగళము కొరకై ఈ భూమిని ఆచ్ఛాదించునట్లు నీవు విజయము కొరకును ఆరోగ్యవృద్ధి కొరకును రాజును ఆచ్ఛాదించుము. ఓ అశ్వమా! నీవు గంధర్వ కులమున పుట్టి తివి కావున కులదూషకము కావద్దు. బ్రహ్మ సత్య వాక్యము చేతను, హోమ వరుణ అగ్నుల ప్రభావము చేతను, సూర్య తేజస్సుచేతను, మునుల తపస్సుచేతను, రుద్రుని బ్రహ్మ చర్యముచేతను, వాయువు బలముచేతను, నీవు సర్వదా మున్ముందుకు సాగుము. నీవు అశ్వరాజపుత్రుడను విషయము స్మరించుము. కౌస్తుభమణిని స్మరించుము. బ్రహ్మహత్య, పితృహత్య, మాతృహత్య చేసిన వాడును, భూమి కొరకై అసత్యమాడినవాడు, యుద్ధము నుండి పరాఙ్ముఖుడైన క్షత్రియుడును ఎంత శీఘ్రముగా అధోగతిని పొందుదురో, యుద్ధమునందు పృష్ఠము చూపించుటచే నీవు కూడ అట్లే దుర్గతిని పొందుదువు. నీకు అట్టి వికారము కలుగకుండు గాక! అట్టి పాపము కలుగకుండు గాక! సమరాంగణమున శత్రువులను సంహరించుచు నీ స్వామితో కూడ సుఖముగ నుండుము. మహాపరాక్రమమునకు ప్రతీకమైన ఓ ఇంద్రధ్వజమా! నారాయణుని ధ్వజమైన గరుత్మంతుడు నీపై ప్రతిష్ఠింపబడినాడు. ఇతడు సర్ప శత్రువు. విష్ణు వాహనము కశ్యపకుమారుడు. దేవలోకములో నుంచి బలాత్కారమున అమృతమును అపహరించినాడు. అతను విశాలకాయుడు. ఆతని బలవేగములు గొప్పవి. అమృతమును ఆస్వాదించినవాడు. అతని శక్తి అప్రమేయము, యుద్ధములో దుర్జయుడై శత్రుసంహారము చేయును. వాయుతుల్య గతి కలవాడు. అట్టి గరుత్మంతుడు ఇంద్రుని కొరకై శ్రీ మహా విష్ణువుచే నీపై స్థాపింపబడినాడు. నీవు సర్వదా నాకు విజయమును ఇమ్ము. నా బలమును పెంచుము. అశ్వములు, కవచములు, ఆయుధములు వీటితో కూడిన నా యోధులను రక్షించి శత్రువులను కాల్చి భస్మము చేయుము.
కుముద, ఐరావత, పద్మ, పుష్పదంత, వామన, సుప్రతీక, అంజన, నీలులు అను ఎనిమిది గజరాజులు దేవయోనియందు పుట్టినవి. వీటి పుత్రపౌత్రులే ఎనిమిది వనములందు నివసించుచున్నవి. భద్ర, మంద్ర మృగ, సంకీర్ణ జాతీయ గజములు ప్రతి వనమునందు పుట్టుచున్నవి. ఓ మహాగజములారా! నీ జాతిని స్మరించుడు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణములు మిమ్ములను రక్షించుగాక! ఓ గజేంద్ర! నీ నియమును పాటించి స్వామిని రక్షించుము. వజ్రధారియైన దేవేంద్రుడు ఐరావతమును ఎక్కి నీ వెనుకనే వచ్చుచున్నాడు. అతడు నిన్ను రక్షించుగాక. యుద్ధమునందు విజయముపొంది స్వస్థుడవై ముందుకు నడువుము. యుద్ధమునందు నీకు ఐరావతము వంటి బలము వచ్చుగాక. చంద్రుని నుండి కాంతిని, విష్ణువు నుండి బలమును, సూర్యుని నుండి తేజస్సును, వాయువు నుండి వేగమును, పర్వతము నుండి స్థిరత్వమును, రుద్రుని నుండి విజయమును, ఇంద్రుని నుండి యశమును పొందుము. దిగ్గజములు, దిక్కులు దిక్పాలకులు, యుద్ధమున నిన్ను రక్షింతురుగాక. గంధర్వ సహితులగు అశ్వికుమారులు అన్ని వైపుల నుండి నిన్ను రక్షింతురుగాక. మను, వసు, రుద్ర, వాయు, చంద్ర, మహర్షి, నాగ, కిన్నర, యక్ష, భూత, ప్రమథ, గ్రహ, ఆదిత్యులు, మాతృకా సహితుడగు భూతాధి పతియైన శివుడు, ఇంద్రుడు, దేవసేనాపతియైన కార్తికేయుడు, వరుణుడు నిన్ను అధిష్ఠించి ఉన్నారు. వారు సమస్త శత్రువులను భస్మము చేయుదురు గాక! రాజు విజయము పొందుగాక!
ఓ పతాకా! శత్రువులు నలువైపుల నుండి చేయు ఘాతక ప్రయోగములు నీ తేజస్సుచే కొట్టబడి నశించుగాక! కాలనేమి-త్రిపుర సంహార యుద్ధములందును, హిరణ్య కశిపు యుద్ధము లందును, సకల దైత్య యుద్ధములందును, నీవు ఎట్లు ప్రకాశించితివో అట్లే నేడు ప్రకాశించుము. నీ ప్రతిజ్ఞను స్మరించుము. నల్లగను తెల్లగను ఉన్న నిన్ను చూచి రాజుశత్రువులు వెంటనే నశింతురు గాక! వ్యాధులచేతను శస్త్రములచేతను పరాజితు లగుదురు గాక! నీవు పూతన, రేవతి, లేఖాకాళరాత్రి మొదలగు పేర్లతో ప్రసిద్ధురాలవు. ఓపతాకా! నిన్ను ఆశ్రయించుచున్నాము. మా శత్రువులందరిని కాల్చివేయుము, సర్వమేధ మహాయజ్ఞమును, దేవదేవుడగు రుద్రుడు జగత్తు యొక్క సారముతో నిన్ను స్మరించినాడు. శత్రునాశకమగు ఓ ఖడ్గమా! నీవు నారాయణుని, నందకమను ఖడ్గమునకు రెండవ మూర్తివను విషయమును స్మరింపుము. నీవు నీలకమల దళముతో సమానమగు శ్యామకృష్ణ వర్ణములు కలదానవు. దుస్వప్నములను నశింప చేయుదువు. పూర్వము బ్రహ్మ దేవుడు నీకు అసి, విషసనము, ఖడ్గము, తీక్ష్ణధారము, శ్రీ గర్భము, విజయము, ధర్మపాలము అను ఎనిమిది పేర్లు పెట్టినాడు. నీది కృత్తికా నక్షత్రము. మహేశ్వరుడు నీ గురువు. సువర్ణము నీ శరీరము. జనార్దనుడు నీ దేవత. ఓ ఖడ్గమా! శయనా నగర సహితుడగు రాజును రక్షింపుము. దేవ శ్రేష్టుడగు పితామహుడు నీకు తండ్రి నీవు సర్వదా మమ్ములను రక్షించుము.
ఓ కవచమా! నీవు రణ భూమిలో కల్యాణ ప్రదము. ఓ నిష్పాపమా నేను నీ నుండి రక్ష పొందుటకు అర్హుడను. నన్ను రక్షింపుము. నీకు నమస్కారము, ఓ దుందుభీ నీవు ధ్వనిచే శత్రువుల హృదయములను కంపింపచేయుదువు. మా రాజసేనలకు విజయ వృద్ధిని చేయుము. మేఘధ్వనిచే ఉత్తమ గజములు సంతసించినట్లు నీ శబ్దముచే మాకు హర్షము కలుగుగాక! మేఘగర్జనముచే స్త్రీలకు భయము కలుగునట్లు నీ ధ్వనిచే యుద్ధమునకు వచ్చిన నా శత్రువులు భయపడుదురు గాక! ఈ తంత్రములతో రాజోపకరణములను పూజించి వాటిని విజయకార్యమునకై వినియోగించవలెను. దైవజ్ఞుడు అగు రాజపురోహితుడు రక్షాబంధనాదుల ద్వారా రాజరక్షణము చేసి, ప్రతి సంవత్సరము విష్ణ్వాది దేవతలకును రాజునకును అభిషేకము చేయవలెను. (269)
