అగ్ని మహా పురాణము

Table of Contents

సర్వదేవ పవిత్రారోపణ విధి

అగ్నిదేవుడు చెప్పెను: ఇపుడు సమస్త దేవతా పవిత్రారోపణ విధానమును సంక్షేపముగ చెప్పుచున్నాను. వినుము. పైన చెప్పిన లక్షణములుగల పవిత్రములనే దేవతలకు సమర్పింపవలెను. వాటిలో “స్వరసము”, “అనలగము” అని రెండు భేదములు ఉన్నవి. మొదట ఇష్టదేవతను ఈ క్రింద చెప్పిన విధముగ ఆహ్వానింపవలెను- “జగత్తునకు కారణమైన బ్రహ్మదేవా! పరివారసహితుడవై ఇచటకు రమ్ము. నేను నిన్ను ఆహ్వానించుచున్నాను. రేపు ప్రాతః కాలమునందు నీకు పవిత్రకము సమర్పింపగలను”. మరునాడు మరల ఈ విధముగ ప్రార్థించుచు పవిత్రకములు సమర్పింపవలెను. “జగత్సృష్ఠి కర్తలైన విధాతా! నీకు నమస్కారము. ఈ పవిత్రకమును స్వీకరింపుము. నా పవిత్రత్వము కొరకై నీకు దీనిని సమర్పించుచున్నాను. ఇది సంవత్సరమంతయు జరుగు పూజాఫలమును ఇచ్చునది”. “వేదవేత్తలను రక్షించు శివా! దేవా! నీకు నమస్కారము. ఈ పవిత్రకమును స్వీకరింపుము. దీనిచే మణులతో పగడములతో, మందార కుసుమాదులతో నీకు సంవత్సరము అంతయు చేయు పూజ దీనిచే సంపన్నమగుగాక”. “ఓ పవిత్రకమా! నేను చేయు ఈ వార్షిక పూజను యథా విధిగ సుసంపన్నముచేసి, నీవు స్వర్గలోకమునకు పొమ్ము”. సూర్యదేవా! నీకు నమస్కారము. ఈ పవిత్రకము స్వీకరింపుము. పవిత్రము చేయగలదను ఉద్దేశ్యముతో దీనిని నీకు సమర్పించుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజకు ఫలము నివ్వగలదు”, “గణేశా! నీకు నమస్కారము. ఈ పవిత్రకము స్వీకరింపుము. పవిత్రము చేయుటకై దీనిని ఇచ్చుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజా ఫలము ఇచ్చును” “ఓ ! శక్తిదేవీ ! నీకు నమస్కారము. ఈ పవిత్రకము స్వీకరింపుము. పవిత్రము చేయునను ఉద్దేశ్యముతో దీనిని ఇచ్చుచున్నాను. ఇది ఒక సంవత్సరము జరుగు పూజాఫలము ఇచ్చును.”

“పవిత్రకము నందలి ఈ దారము నారాయణ-అనిరుద్ధమయము అయినది. ధన, ధాన్య, ఆయురారోగ్యములను ఇచ్చునది. దీనిని నీకు సమర్పించుచున్నాను. ఈ శ్రేష్ఠమైన దారము ప్రద్యుమ్న-సంకర్షణమయమైనది. విద్యా, సంతతి, సౌభాగ్యములను ఇచ్చును. దీనిని మీకు సమర్పించుచున్నాను. వాసుదేవమయమగు ఈ సూత్రము ధర్మ అర్థ కామ మోక్షములను ఇచ్చును. సంసార సాగరమును దాటుటకు ఇది ఉత్తమ సాధనము. దీనిని మీ పాదములపై సమర్పించుచున్నాను. విశ్వరూపమయమగు ఈ సూత్రము సర్వ కామములను సఫలము చేయును. సమస్త పాపములను నశింపచేయును. కడచిన తరములవారిని, రాబోవు తరములవారిని కూడ ఉద్ధరించును. దీనిని మీకు సమర్పించుచున్నాను. కనిష్ఠము, మధ్యమము, ఉత్తమము, పరమోత్తమము అని నాలుగు విధములగు పవిత్రకములను, మంత్రోచ్చారణ పూర్వకముగ క్రమానుసారముగ మునులు సమర్పించిరి.” (37)