అగ్ని మహా పురాణము

Table of Contents

అభిషేకాది విధి

పరమేశ్వరుడు చెప్పెను: శివ పూజానంతరము గురువు శ్రీ ప్రాప్తికై శిష్యాదులకు స్నానము చేయించవలెను. ఈశాన్యాది దిక్కులందు ఎనిమిది కలశములను, మధ్య ఒక కలశమును స్థాపించవలెను. ఆ ఎనిమిది కలశములలో వరుసగ క్షారోదక, క్షీరోదక, దధ్యుదక, ఘృతోదక, ఇక్షుక సోదక, సురోదక, స్వాదూదక, గర్భోదక సముద్రముల ఆవాహనము చేసి, క్రమముగ శిఖండి, శ్రీకంఠ, త్రిమూర్తి, ఏకరుద్ర, ఏకనేత్ర, శివోత్తమ, సూక్ష్మ, అనంత రుద్రులను ఎనమండుగురు విశ్వేశ్వరులను స్థాపించవలెను. మధ్యనున్న కలశములో శివ, సముద్ర, శివ మంత్రములను స్థాపించవలెను. యాగమండప దిక్కునందు స్వామికొరకై ఏర్పరచిన స్నాన మండపము నందు రెండు బెత్తుల పొడవు, ఎనిమిది అంగుళముల ఎత్తుగల ఒక వేది నిర్మించవలెను. దానిపై కమలా ద్యాసనములు కప్పి, దానిపై ఆసన స్వరూపుడైన అనంతుని న్యాసముచేసి శిష్యుని పూర్వాభిముఖముగ కూర్చుండబెట్టి సకలీకరణ పూర్వకముగ పూజచేయవలెను. ఆతని శరీరమునకు గంజి, అన్నము, మట్టి, భస్మము, దూర్వలు, గోమయగోళములు, ఆవాలు, పెరుగు, ఉదకము వ్రాసి క్షారోదకాది క్రమమున, నమస్కార సహితములగు విశ్వేశ్వర నామ మంత్రములతో, కలశ జలములో శిష్యునికి స్నానము చేయించవలెను. శిష్యుడు మనస్సులో తాను అమృతముచే స్నానము చేయించబడుచున్నట్లు భావన చేయవలెను. పిదప ఆతనికి రెండు శ్వేత వస్త్రములుకట్టించి శివుని కుడి వైపున కూర్చుండబెట్ట వలెను. పైన చెప్పిన ఆసనము నందు శిష్యునకు, వెనుకటి వలెనే, మరల పూజ చేయవలెను. పిమ్మట ఆతనికి తలపాగ, కిరీటము, యోగపట్టిక, కర్తరి, చిన్న పాత్ర, అక్షమాల, పుస్తకము, పల్లకి మొదలగునవి ఇచ్చి ఆతనికి అధికారము నీయవలెను. నేటి నుండి నీవు బాగుగ తెలిసికొని పరీక్షించి, ఎవని కైనను దీక్షా, వ్యాఖ్యా, ప్రతిష్ఠాదుల ఉపదేశమును ఇచ్చుచుండుము అని ఆజ్ఞను వినిపింపవలెను. శిష్యుని అభివాదనము స్వీకరించి, మహేశ్వరునకు ప్రణామముచేసి, విఘ్న సమూహ నివారణార్థమై- ‘పరమేశ్వరా! నీవు గురు స్వరూపుడవు. ఈ శిష్యునకు అభిషేకము చేయుటకై నాకు ఆజ్ఞ ఇచ్చితివి. తదనుసారము నేను అభిషేకము చేసితిని. ఇతడు సంహితాపారంగతుడైనాడు’ అని పలుకుచు ప్రార్థించవలెను. మంత్ర చక్ర తృప్తికొరకై ఐదేసి ఆహుతులు ఇచ్చి మరల పూర్ణాహుతి చేయవలెను. పిమ్మట శిష్యుని తన కుడి ప్రక్క కూర్చుండ బెట్టుకొని, ఆతని కుడి చేతి బొటనవ్రేలు మొదలగు వ్రేళ్లకు, దర్భాగ్రములు కాల్చిన మసి పూయవలెను. వానిచేతిలో పుష్పములుంచి ఆతనిచే కలశ, అగ్ని, శివులకు నమస్కరింపచేయవలెను. ‘నీవు శాస్త్రాను సారముగ బాగుగా పరీక్షించి శిష్యులను అను గ్రహించవలెను’ అని ఆతనికి ఉపదేశించవలెను. మానవాదులకు అభిషేకము రాజాభిషేకమువలె చేయుటచే అభీష్టసిద్ధి కలుగును. ‘ఓం శ్రాం శ్రౌం పశు హూం ఫట్’ అనునది అస్త్రరాజమైన పాశుపత మంత్రము. దీనితో అస్త్ర రాజమును పూజించి, అభిషేకము చేయవలెను. (90)