అగ్ని మహా పురాణము

Table of Contents

సంస్కార కథనము.

అటు పిమ్మట అగ్ని దేవుడు ఇంకను ఇట్లు చెప్పెను: బుద్ధిమంతుడగు పురుషుడు నిర్వాణాది దీక్షలలో నలుబది ఎనిమిది సంస్కారములు చేసికొనవలెను. ఆ సంస్కారములను గూర్చి వినుము. వీటిచే మనుష్యుడు దేవతాతుల్యుడగును. (1) మొట్ట మొదట యోనిలో గర్భాధానము. పిమ్మట (2) పుంసవన సంస్కారము చేయవలెను పిమ్మట (3) సీమంతోన్నయనము (4) జాతకర్మ (5) నామకరణము (6) అన్నప్రాశనము (7) చూడాకర్మ (8) బ్రహ్మచర్యము (9) వైష్ణవి (10) పార్థి (11) భౌతికి (12) శ్రౌతికి అను నాలుగు బ్రహ్మచర్య వ్రతములు (13) గోదానము (14) సమావర్తనము (15) అష్టక (16) అన్వష్టక (17) పార్వణ శ్రాద్ధము (18) శ్రావణి (19) ఆగ్రహాయణి (20) చైత్రి (21) ఆశ్వయుజి అను ఏడు పాకయజ్ఞములు (22) ఆధానము (23) అగ్నిహోత్రము (24) దర్శము (25) పౌర్ణమాసము (26) చాతుర్మాస్యము (27) పశుబంధము (28) సౌత్రామణి అను ఏడు హవిర్యజ్ఞములు (29) యజ్ఞములలో శ్రేష్ఠమైనది అగు అగ్నిష్టోమము (30) అత్యగ్నిష్టోమము (31) ఉక్థ్యము (32) షోడశి (33) వాజపేయము (34) అతిరాత్రము (35) అప్తోర్యామము అను ఏడు సోమసంస్థలు (36) హిరణ్యాంఘ్రి (37) హిరణ్యాక్షము (38) హిరణ్యమిత్రము (39) హిరణ్యపాణి (40) హేమాక్షము (41) హేమాంగము (42) హేమసూత్రము (43) హిరణ్యాస్యము (44) హిరణ్యాంగము (45) హేమజిహ్వము (46) హిరణ్యవత్తు (47) అన్ని యజ్ఞములకును అధిపతియైన (48) అశ్వమేధము అను సహస్రేశ యజ్ఞములు, సర్వభూతదయ, క్షమ, ఋజుత్వము, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను ఎనిమిది గుణములు. ఈ సంస్కారములను చేయవలెను. ఇష్ట దేవతామూల మంత్రమున నూరు ఆహుతులు ఇవ్వవలెను. సౌర, శాక్త, వైష్ణవ, శైవ దీక్షలలో అన్నింటియందును ఇవి సమానమే. ఈ సంస్కారములచే సంస్కృతుడగు పురుషుడు భోగములను, మోక్షమును కూడ పొందుసు. సమస్త రోగములచే విముక్తుడై దేవతా పురుషుడువలె నుండును. మనుష్యునకు ఇష్ట దేవతామంత్ర జప-హోమ-పూజా-ధ్యానములచే అభీష్ట ప్రాప్తి కలుగును. (32)