అగ్ని మహా పురాణము

Table of Contents

ద్వాదశీ వ్రతములు

అగ్ని దేవుడు పలికెను:

ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు ద్వాదశీ వ్రతములను గూర్చి చెప్పెదను. ద్వాదశినాడు రాత్రి మాత్రమే భోజనము చేయవలెను. ఎవనినుండియు, ఏమియు గ్రహింపరాదు. ఉపవాసముచేసి కూడ భిక్షాగ్రహణము చేయువానికి ద్వాదశీ వ్రత ఫలము సిద్ధించదు. చైత్ర శుక్ల ద్వాదశినాడు మరున ద్వాదశీ వ్రతము చేయువాడు భోగమోక్షములను కోరుచు కామదేవ రూపుడగు మహా విష్ణువును పూజించవలెను. మాఘ శుక్ల ద్వాదశినాడు ‘భీమద్వాదశీ వ్రతముచేసి ‘నమో నారాయణాయ’ అను మంత్రముతో శ్రీమహా విష్ణువును పూజించవలెను. ఇట్లు చేసినవాడు సర్వమును పొంద గలుగును. ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు ‘గోవింద ద్వాదశీ మంత్రము చేయవలెను. ఆశ్వయుజము నందు ‘విశోక ద్వాదశీ వ్రతము చేయువాడు శ్రీమహావిష్ణువును పూజించవలెను. మార్గశీర్షశుక్ల ద్వాదశినాడు శ్రీకృష్ణుని పూజించి లవణ దానము చేయువాడు సకల రస దానములు చేసిన ఫలము పొందును. భాద్రపదమున ‘గోవత్స ద్వాదశీ వ్రతము చేయువాడు గోవత్సమును పూజించ వలెను. మాఘ మాసము తరువాత వచ్చు ఫాల్గున కృష్ణ ద్వాదశి శ్రవణ నక్షత్ర యుక్తమైనచోదానికి ‘తిలద్వాదశి’ అని పేరు. ఆ దినమున తిలలతో స్నానముచేసి, తిలలతో హోమముచేసి, చిమ్మిలి నైవేద్యము పెట్టవలెను. దేవాలయమునందు తైలదీపము వెలిగించి, పితరులకు తిలతర్పణములు చేయవలెను. బ్రాహ్మణులకు తిలదానము చేయవలెను. హోమము, ఉపవాసముల వలననే తిల ద్వాదశీ వ్రత ఫలము లభించును. ‘ఓం నమో భగవతే వాసు దేవాయ’ అను మంత్రముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఈ విధముగ ఆరు పర్యాయములు తిలద్వాదశీ వ్రతము చేసినవాడు తన కులముతో కూడ స్వర్గమునకు పోవును. ఫాల్గుణ శుక్ల పక్షమునందు ‘మనోరథ ద్వాదశీ వ్రతము చేసినవాడు శ్రీమహా విష్ణువును పూజించవలెను. ఈ దివసమునందే ‘నామ ద్వాదశీ వ్రతము చేయువాడు ఒక సంవత్సరము, కేశవాది నామములతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. అతడు మరణానంతరము స్వర్గమునకే వెళ్ళును. నరకమున కెన్నడును వెళ్ళడు. ఫాల్గుణ శుక్ల పక్షమున ‘సుమతి ద్వాదశీ’ వ్రతముచేసి విష్ణువును పూజించవలెను. భాద్రపద శుక్ల  పక్షమున ‘అనంత ద్వాదశీ’ వ్రతము చేయవలెను. మాఘ శుక్ల పక్షమునందు ఆశ్లేషతోగాని, మూలతోగాని కూడిన తింద్వాదశి చేయువాడు ‘కృష్ణాయనమః’ అను మంత్రముతో శ్రీకృష్ణుని పూజించి, తిలహోమము చేయవలెను. ఫాల్గుణ శుక్ల పక్షమున సుగతి ద్వాదశీ వ్రతము చేయువాడు ఒక సంవత్సరము-‘జయ కృష్ణ నమస్తుభ్యమ్’ అను మంత్రముతో శ్రీకృష్ణుని పూజించవలెను. ఇట్లు చేయుటచే భుక్తి, ముక్తులను రెండింటిని పొందును. పుష్యశుక్ల ద్వాదశినాడు ‘సంప్రాప్తి ద్వాదశీ వ్రతము చేయవలెను. (188)