అగ్ని మహా పురాణము

Table of Contents

మంత్ర రూప ఔషధ కథనము

ధన్వంతరి పలికెను:

ఓంకారాది మంత్రములు, ఆయురారోగ్య ప్రదములు, స్వర్గము ఇచ్చునవి కూడ, ఓంకారము అత్యుత్తమమైన మంత్రము. దానిని జపించినవాడు, అమృత్యుడగును. గాయత్రి పరమమంత్రము దానిని జపించినవాడు భుక్తిముక్తులను పొందును. ‘ఓం నమోనారాయణాయ’ అను మంత్రము సర్వార్థసాధకము; ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అను మంత్రము సర్వ ఫలప్రదము; ‘ఓం హ్రుం నమో విష్ణవే’ అను మంత్రము పరమౌషధము. దీనిచే దేవతలు, అసురులు, లక్ష్మీవంతులై రోగముక్తులైరి. దీనివలన లోకోపకారము ధర్మము కలుగును. ఇది మహౌషధము. ‘ధర్మః సద్ధర్మ కృద్ధర్మీ’ యను ధర్మ సంబంధి నామములను జపించువాడు నిర్మలుడగును. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీధరః శ్రీనికేతనః శ్రియఃపతిః శ్రీపరమః’ అను పదములను జపించువాడు ఐశ్వర్యమును పొందును. కామకామ ప్రదః కామః కామపాల స్తథాహరిః; ఆనందోమాధవశ్చైవ’ అను హరి నామములు కామప్రదములు. ‘రామః పరశురామశ్చ నృసింహో విష్ణురేవచ, త్రివిక్రమః’ యను నామములు జయేచ్ఛకలవారు జపించవలెను. విద్యాభ్యాసముచేయువారు నిత్యము పురుషోత్తమ నామము జపించవలెను.’దామోదరః’ అను నామము బంధహరము పుష్కరాక్షః యను నామము నేత్రరోగములను తొలగించును. “హృషీకేశః అను నామము భయహరము. ఔషధకర్మ యందు అచ్యుతయను అమృత మంత్రమును జపించవలెను. “అపరాజితః” అను నామమును యుద్ధము నందును, జలము దాటునపుడు శ్రీనృసింహ నామమును స్మరించవలెను, పూర్వాది దిక్కులందు క్షేమము కోరువాడు చక్రీ, గదీ, శార్ఙ్గి, ఖడ్గీయను నామములు స్మరించవలెను. నారాయణ స్మరణము సదాచేయ వలయును. నృసింహస్మరణము సకల భీతినివారకము, గరుడధ్వజ స్మరణము విషహరము, వాసుదేవ నామము సర్వదా జపించవలెను. ధాన్యాదులను ఇంటిలో ఉంచు నపుడును శయన సమయము నందును, అనంత అచ్యుత నామములు స్మరించవలెను. దుః స్వప్నమున నారాయణుని, అగ్ని దాహాదులందు జలశాయిని స్మరించవలెను. విద్యార్థి హయగ్రీవుని, పుత్రప్రాప్తి కాముడు జగత్పతిని శౌర్యకాముడు బలభద్రుని స్మరించవలెను. వీటిలో ఒక్కొక్క నామము అనేక ఫలముల నిచ్చును. (284)