అగ్ని మహా పురాణము

Table of Contents

యమగీత

అగ్నిదేవుడు పలికెనుః

నచికేతునికి చెప్పిన యమగీతను చెప్పెదను. ఇతి మోక్షార్హులగు పఠించువారికిని, వినువారికిని భుక్తి ముక్తిప్రదము. యముడు పలికెను. మానవుడు తాను అస్థిరుడైనను, అశాశ్వతుడైనను అతి మోహావిష్ణుడై ఆసన, శయన, యానవస్త్ర గృహాదికమును స్థిరముగ నుండవలెనని కోరుకొనును. భోగములయందు ఆసక్తి లేకుండుట, సర్వదా ఆత్మను చూచుట ఇది మనుష్యులకు పరమ శ్రేయస్సు అని కపిలుడు చెప్పినాడు. సర్వత్ర సమముగా చూచుట, మమకారము, లేకుండుట, అసంగత్వము ఇది మనుష్యులకు పరమ శ్రేయస్సు అని పంచశిఖుడు చెప్పెను. గర్భవాసము మొదలు జన్మ బాల్యాది, వయస్సులకు సంబంధించి అవస్థలను తెలుసుకొనుట మనుష్యులకు పరమ శ్రేయస్సు అని గంగా విష్ణువులు చెప్పిరి. ఆధ్యాత్మికాది దుఃఖములకు ఆద్యంతాదులను తెలుసుకొని ప్రతిక్రియ చేయుట మానవులకు పరమ శ్రేయస్సు అని జనకుడు బోధించెను. భేదములేని తత్త్వమునందు భేదమును చూచుటను, శమింప చేయునది, ఉత్తమ శ్రేయస్సు అని బ్రహ్మ చెప్పెను. ఋగ్యజుస్సామ విహితమగు కర్మను కర్తవ్య బుద్ధితో సంగములేక చేసిన శ్రేయస్కరము అని జైగీశవ్యుడు బోధించెను. సమస్త కార్యారంభములను పరిత్యజించుటయే సుఖ సాధనము. అదియే మనుష్యులకు పరమ శ్రేయస్సు అని దేవలుడు బోధించెను. కామములను త్యజించినచో, విజ్ఞాన, సుఖ, పరమపద ప్రాప్తి కలుగును. కామవంతులకు విజ్ఞానము కలుగదు అని సనకుడు బోధించెను.

ప్రవృత్తి నివృత్తి రూపమగు కర్మ చేయవలెను. కాని నైష్కర్మ్యమే పరమ శ్రేయస్సు. ఇదియే హరిస్వరూపము. జ్ఞానియైన పురుషుడు పరమము, అవ్యయము విష్ణు సంజ్ఞకము అగు బ్రహ్మతో ఎన్నడును భేదమును పొందడు. తపస్సుచే జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము సౌభాగ్యము, ఉత్తమ రూపము లభించును. మనస్సుతో కోరినదెల్లయు లభించును. విష్ణువుతో సమానమైన ధ్యేయములేదు, ఉపవాసమును మించిన తపస్సులేదు. ఆరోగ్యముతో సమానమైన ఉత్తమ వస్తువులేదు. గంగా సమానమైన నదిలేదు. జగద్గురులైన, విష్ణువు తప్ప మరి ఎవ్వరును బంధువులు లేరు, క్రింద, పైన, ముందు దేహేంద్రియ మనోముఖములందును హరియే వున్నాడు అని స్మరించుచు ప్రాణములను త్యజించువాడు హరియే అగును. దేనినుండి సర్వము పుట్టినదో దేనియందే నిలచియున్నదో అట్టి, గ్రహింప శక్యముగానిదియు, అనిర్దేశ్యము, సుప్రతిష్ఠితము అగునది పరబ్రహ్మ. విష్ణువు పరాపర స్వరూపములతో అందరి హృదయములందును వున్నాడు. కొందరు అతనిని యథేశుడు, యజ్ఞపురుషుడు అని చెప్పుదురు. కొందరు విష్ణువనియు కొందరు శివుడు అనియు కొందరు బ్రహ్మ అనియు ఆ పరమేశ్వరునే చెప్పెదరు. కొందరు ఇంద్రాది నామములతో పేర్కొందురు. కొందరు సూర్యుడు, సోముడు, కాలపురుషుడు అని చెప్పుదురు. బ్రహ్మాది స్తంభ పర్యంతమగు జగత్తు విష్ణు రూపమని చెప్పుదురు. ఆ విష్ణువే పరబ్రహ్మ. ఆ స్థానము చేరినవారు పునరావృత్తి పొందరు. సువ రాది మహాదానముల చేతను, పుణ్య తీర్థస్నానముల చేతను, ధ్యాన, ప్రత, పూజా ధర్మ శ్రుతుల చేతను ఆ స్థానమును పొందవలెను. ఆత్మయే అధికుడని తెలుసుకొనవలెను. శరీరము రథము. బుద్ధి సారథి, మనస్సు కళ్ళెము. ఇంద్రియములు అశ్వములు. విషయములు వాటి గమ్యములు, ఆత్మేంద్రియ మనస్సముదాయమును పండితులు భోక్త అందురు. నిగ్రహింపబడని మనస్సు కలవాడై, విజ్ఞానమును సంపాదింపనివాడు. ఆ పరమ పదమును పొందజాలడు. సంసారమునే పొందును. మనో నిగ్రహవంతుడై విజ్ఞానమును సంపాదించినవాడు ఆ పరమ పదమును పొందును. మరల దాని నుండి వెనుకకురాడు. విజ్ఞాన సారథియై మనస్సు అను పగ్గముగల నరుడు మార్గమును దాటి, ఆ పరమ విష్ణు పదమును చేరును. ఇంద్రియముల కంటే అర్థములు పరములు. వాటికంటే మనస్సు పరము, దానికంటే బుద్ది పరము, బుద్ధికంటే మహత్తుపరము. మహత్తుకంటే అవ్యక్తము పరము, దానికంటే పురుషుడు పరుడు, పురుషుని కంటే పరమైనది ఏదియు లేదు. పురుషుడే పరాకాష్ఠ. ఆతడే పరాగతి. సర్వ భూతములందు గూఢమై ఉన్న ఆత్మ పైకి కనబడుట లేదు. కాని సూక్ష్మదర్శులచే సూక్ష్మమగు బుద్ధితో చూడబడుచున్నది.

పండితుడు వాక్కును మనస్సు యందు నిలుపవలెను. దానిని జ్ఞానమునందు నిలుపవలెను. దానిని మహదాత్మ యందు నిలుపవలెను. దానిని శాంతమగు ఆత్మయందు నిలుపవలెను. బ్రహ్మాత్మల యోగమును యమాదులచే తెలుసుకొని మానవుడు బ్రహ్మ స్వరూపుడగును. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, అనునవి యమములు. శౌచము సంతోషము, తపస్సు స్వాధ్యాయము, ఈశ్వర పూజ-ఈ ఐదును నియమములు. పద్మాదికము ఆసనము, ప్రాణవాయువును జయించుట ప్రాణాయామము. ఇంద్రియ నిగ్రహము ప్రత్యాహారము. శుభమగు ఒక విషముపై చిత్తమును నిలుపుట ధారణ. ఒకే విషయముపై మాటిమాటికి ధారణచేయుట ధ్యానము. నేనే బ్రహ్మను అను స్థితిలో ఉండుట సమాధి. ఘటము నశించగనే ఘుటాకాశము మహాకాశముతో అభిన్నమైనట్లు ముక్తుడగు జీవుడు బ్రహ్మతో ఐక్యమును పొందును. సర్ర్బహ్మ స్వరూపుడగును. జీవుడు అజ్ఞాన వశముచే తాను బ్రహ్మ భిన్నుడనని అనుకొనుచున్నాడు. అజ్ఞానము దాని కార్యములు తొలగిపోయిన వెంటనే ఆతడు అజరామరుడు అగును. అగ్నిదేవుడు పలికెను. వశిష్టా! పఠితలకు భుక్తి ముక్తి ప్రదమగు యమ గీతను చెప్పితిని. వేదాంత జ్ఞానముచే, సర్వత్ర బ్రహ్మబుద్ధి కలుగుటయే ఆత్యంతిక ప్రళయము. (382)