అగ్ని మహా పురాణము

Table of Contents

రాజనీతి కథనము

శ్రీరాముడు పలికెను: షడ్విధమగు సేనను కవచాదులతో సన్నద్ధముచేసి, వ్యూహము ఏర్పరచి, ఇష్టదేవతలను, యుద్ధ సంబంధి దుర్గాది దేవతలను పూజించి, శత్రువుపై ఆక్రమణము చేయవలెను. మూల, భృతి, శ్రేణి, మిత్ర, శత్రు, ఆటవికములని సేనలు ఆరు విధములు. వీటిలో పూర్వపూర్వ సేనలు శ్రేష్ఠములు, వీటి వ్యసనములు కూడ ఈ విధముగనే గరిష్టములు. పదాతి, అశ్వ, రథ, గజములు సేనకు నాలు అంగములు. మంత్రము, కోశము అను రెండు అంగములు కూడ కలిసి ఆరు అంగములు. నదీదుర్గ, పర్వతదుర్గ, వనదుర్గములలో, భయకారణములు ఉన్నచోట, సేనాపతి సంనద్ధములై, వ్యూహబద్ధములైన సైన్యములతో వెళ్ళవలెను. అధికవీరులైన యోధులతో కలిసి ఒక సేనానాయకుడు ముందుగా వెల్ళవలెను. విజిగీషురాజు, వాని అంతఃపురము సేనామధ్యలో నుండి యాత్ర సాగించవలెను. స్వామికి ఇరువైపుల ఆశ్విక సైన్యము, దాని ఇరుప్రక్కల రథసేన, దానికి ఇరుప్రక్కల గజసేన, దాని రెండు ప్రక్కల ఆటవిక సేన ఉండవలెను. కుశలుడగు ప్రధాన సేనాపతి, యాత్రా సమయమున తాను స్వామికి వెనుకనుండి, ఇతరులనందరిని ముందు ఉంచి నడువవలెను. హతోత్సాహులగు సైనికులకు మెల్లమెల్లగ ఆశ్వాసన మిచ్చుచు పోవలెను. సైన్య మంతయు యుద్ధసన్నద్ధమై ఉండవలెను. ఎదుటినుండి శత్రువుల ఆక్రమణము జరుగునను భయమున్నచో రెక్కలు చాపిన శ్యేనపక్షి ఆకారముగల వ్యూహమును, సన్నని మార్గము నుండి ఆక్రమణము జరుగునను భయము ఉన్నచో గొప్ప మకర వ్యూహమేర్పరచి ముందుకు సాగవలెను. అడ్డముగా ఆక్రమణము జరుగునను భయమున్నప్పుడు వీరులు అగ్రమునందున్న సూచీముఖ వ్యూహమును, వెనుకనుండి భయమున్నచో శకట వ్యూహమును, ప్రక్కల నుండి భయమున్నచో వజ్రవ్యూహమును, నలుమూలల నుండి భయమున్నచో సర్వతో భద్ర వ్యూహమును నిర్మించుకొని ముందుకు వెళ్ళవలెను.

పర్వత గుహలందును, దుర్గమ పర్వత మార్గమునందును, దీర్ఘప్రయాణముచే అలసి పోయి నదియు, ఆకలిదప్పులచే పీడింపబడినదియు, రోగ, దుర్భిక్ష, మహామారులతో బాధపడుచున్నదియు, దోపిడి దొంగలచే చెల్లాచెదరు చేయబడినదియు, బురద, ధూళి, నీళ్ళు-వీటిలో చిక్కుకొన్నదియు, వ్యాకులముగా ఉన్నదియు, ఒక వ్యక్తి మాత్రమే నడచుటకు తగిన మార్గము ఉండుటచే ముందుకు నడవక ఒకేచోట నిలిచిపోయినదియు, భోజన పానములు చేయుచున్నదియు, అయోగ్యమైన ప్రదేశమునందున్నదియు, కూర్చుండి పోయినదియు, చోరాగ్ని భయవ్యాకులమైనదియు, వర్షములచేతను, తుపానుచేతను పీడితమైనదియు, ఇట్టి ఇతర సంకటములలో చిక్కుకొనినదియు అగు తన సేనను అన్నివైపులనుండి రక్షించుకొనుచు, శత్రు సైన్యముపై దెబ్బతీయుడకై వేచి యుండవలెను. శత్రువుకంటె తనకు దేశకాలములు ఎక్కువ అనుకూలముగ ఉన్నపుడును. శత్రు ప్రకృతులలో పరస్పర వైషమ్యము ఏర్పడినప్పుడును, తన బలము అధికముగా నున్నపుడును, శత్రువుతో ప్రత్యక్షముగ యుద్ధమునకు దిగవలెను. పరిస్థితి ఇందుకు విరుద్ధముగా నున్నపుడు కూట యుద్ధమునకు ఉపక్రమించవలెను. శత్రుసైన్యము పైనచెప్పిన వ్యసనములలో చిక్కుకొని యుద్ధాయోగ్యమైన ప్రదేశమునందు ఉన్నపుడు, విజిగీషువు, అనుకూల ప్రదేశమునందుండి, శత్రువుపై ఆక్రమణముచేసి, నశింపచేయవలెను. శత్రుసైన్యము అనుకూల ప్రదేశమునందు ఉన్నపుడు, వారి ప్రకృతులలో భేదము కల్పించి, సమయము చూచుకొని శత్రువులను నశింపచేయవలెను.

యుద్ధమునుండి వెనుకవైపు పరుగెత్తుకొని వెళ్ళి శత్రువులను ఆతని భూమినుండి బైటకు లాగి కొనివచ్చు, ఆటవికులచేతగాని, అమిత సైనికులచే గాని లాగికొనిరాబడిన శత్రువులను వీరులగు యోధులచే చంపించవలెను. అల్పసంఖ్యాకులగు సైనికులను ఎదుట నిలబెట్టి శత్రువుతో యుద్ధము చేయుచు, వారేమరియుండగా, ఉత్తమవీరులుగల సైన్యముతో వెనుకనుండి శత్రుసైన్యమును ప్రవేశించి నశింపచేయవలెను. లేదా వెనుక వైపు సైన్యమును సమీకరించి, శత్రువుల దృష్టి అటువైపుననున్నపుడు ముందునుండి ప్రవేశించి వారిని చంపవలెను. వెనుకనుండియు, ముందునుండియు ఆక్రమణము చేసిన విధముననే పార్శ్వములనుండి కూడ చేయవలెను. ఇది కూట యుద్ధమునందు అవలంబించవలసిన పద్ధతి. ముందుగా దూష్యబలముతోను, అమిత్ర బలముతోను, ఆటవిక బలముతోను యుద్ధముచేసిన శత్రుసేన అలసిపోయిన పిమ్మట, తన సేన అలసిపోక పూర్వము, శత్రు సేనపై ఆక్రమణముచేసి నశింపచేయవలెను. లేదా దూష్యబలమును, అమిత్రసేనను యుద్ధ భూమి నుండి పారిపోవునట్లు ఆజ్ఞాపించి, నేను జయించితిని అని శత్రువునకు విశ్వాసము కలిగిన పిమ్మట, మంత్ర బలము నాశ్రయించి, ప్రయత్నపూర్వకముగ ఆక్రమించి శత్రువును నశింప చేయవలెను. స్కంధావారమును, పురములను, గ్రామములను, సస్యములను, గోష్ఠములను దోచుకొనుటకు శత్రువుల మనస్సులో లోభము కలిగించి, వారు ఆ పనిలో నిమగ్నులై ఉన్నపుడు తాను మాత్రము సావధానుడై వారినందరిని సంహరించవలెను. లేదా శత్రురాజుల గోవులను అపహరించి, వారి దృష్టిని వాటిని విడిపించుకొనుట యందు మరలునట్లు చేసి, వాళ్లను మార్గమధ్యము నందే ఆపి సంహరించవలెను. తమపై ఆక్రమణము జరుగునను భయముచే రాత్రి యంతయు మేల్కొనియున్న శత్రు సైనికులు, నిద్రాలసులై యున్నపుడు వారి నాక్రమించి సంహరించవలెను. లేదా రాత్రి నిశ్చింతగా నిద్రించుచున్న సైనికులను ఖడ్గధాదులచే చంపించవలెను.

సేన ఒకసారి ముందుకు దుమికిన తరువాత శత్రువులు మార్గమునందు అవరోధములు కల్పించినచో, తన్నివారణార్థమై ఏనుగులను ముందు నడుపవలెను. అశ్వములు కూడ ప్రవేశింప జాలని వనదుర్గమునందు గజముల సాహాయ్యముచేతనే సైన్యము ప్రవేశింప గలుగును. గజములు ఎదుటనున్న వృక్షాదులను విరచివేసి సైనికులకు మార్గమును కల్పించును. దృఢముగానున్న సైనిక పంక్తిని భేదింపవలెనన్నచో గజములనే ఉపయోగించవలెను. వ్యూహము భిన్నమగుటచే ఛిద్రములు ఏర్పడినచోట ఏనుగుల నుంచి ఆ ఛిద్రములు పూడ్చవలెను. శత్రువులలో భయము కలిగించుట, శత్రు దుర్గ ద్వారములను శిరస్సుతో పగులగొట్టుట, సైన్యముతో కోశమును తీసుకొని వెళ్ళుట, ఏదైన భయము ఉత్పన్నమైనపుడు రక్షించుకొనుట-ఇదియంతయు గజముల ద్వారా మాత్రమే సాధింప శక్య మగును. అభిన్నమగు సైన్యమును భేదించుట, భిన్నమైన దానిని పూడ్చుట అను పనులు రథసేనా సాహాయ్యముతో కూడ చేయవచ్చును. వనములలో ఎచట ఉపద్రవములున్నవి, ఎచటలేవు అను విషయమును పరిశీలించుట, మార్గమును నిర్ణయించుట, ఇది అశ్వసేన చేయవలసిన కార్యము. తనపక్షము వారికి ఆహారాది సామగ్రిని అందజేయుట, పారిపోవుచున్న శత్రుసైన్యమును శీఘ్రముగా తరుముట, సంకట సమయములందు శీఘ్రముగా పారిపోవుట, పనులు శీఘ్రముగా చేయుట, తమ సైన్యము కష్ట పరిస్థితులలో నున్నపుడు శీఘ్రముగా అచట చేరి సాహాయ్యము అందించుట, శత్రు సేనాగ్ర బాగమున ప్రహారముచేసి వెంటనే వెనుకకుపోయి అక్కడకూడ ప్రహారముచేయుట, అశ్వసేనాకార్యములు, సర్వదా శస్త్రధారణము చేసియుండుట కాలిబంటుల కార్యము. సైన్యమునకు విడిది ఏర్పరచు స్థానము మార్గము మొదలగునవి అన్వేషించుట వెట్టి వారి కర్తవ్యము. పెద్ద పెద్ద మోళ్లు, చెట్లు, పొదలు ఉండి ముళ్ళచెట్లు లేనిదియు, పారిపోవుటకు అనువైన మార్గము గలదియు, ఎక్కువ మెరకపల్లములు లేనిదియు అగు భూమి పదాతి సైన్యసంచార యోగ్యము. వృక్షములు శిలలు తక్కువగా నున్నది, శీఘ్రముగా లంఘింపవీలగు భూచ్ఛిద్రములు, గట్టి నేలగలది రాళ్లు, బురదలేనిది, బైటికిపోవుటకు అనువగు మార్గముకలది అగు భూమి అశ్వ సంచారయోగ్యము. పాదాలతో త్రొక్కివేయుటకు శక్యమైన చెట్లు, ఛేదించవీలైన తీగలు కలదియు, బురదలేనిదియు, గోతులు లేనిదియు, గజారోహణ యోగ్యములగు చిన్న పర్వతములు మాత్రమే ఉన్నదియు అగు భూమి నిమ్నోన్నతముగా ఉన్నను గజ సేనాగమన యోగ్యము.

అశ్వసైన్యాదులు విచ్ఛిన్నమైనపుడు వాటిని ఆదుకొని ఆ లోపమును పూరించు సైన్యమునకు ‘ప్రతిగ్రహము’ అని పేరు. ప్రతిగ్రహమును చక్కగా సంఘటితము చేసికొనవలెను. అది భారమును సహింప సమర్థమై యుండును. ప్రతిగ్రహము లేని వ్యూహము శూన్యమువలె కనబడును. విజయాభిలాషియైన బుద్ధిమంతుడగు రాజు ప్రతిగ్రహ సైన్యమును కూర్చుకొనకుండ యుద్ధము చేయగూడదు. కోశము రాజు దగ్గరనే ఉండవలెను. రాజత్వము కోశాధీనము. విజయము సాధించిన యోధులకు ఆ కోశమునుండియే పారితోషికము ఈయవలెను. దాతకోసమై యుద్ధము చేయనివాడెవ్వడైన ఉండునా? శత్రు రాజును వధించిన యోధునకు ఒక లక్ష ముద్రలు ఇవ్వవలెను రాజకుమారుని చంపిన వానికి దానిలో సగము పారితోషికముగా ఈయవలెను. సేనాపతిని చంపినవానికి గూడ అంతయే. ఏనుగ రథము మొదలగు వాటిని నశింపచేసినవారికి గూడ ఉచితరీతిని పారితోషికములు ఈయవలెను. పదాతులు, అశ్వికులు, రథికులు, హాస్తికులు కూడ తమ బడలికకు, విశ్రాంతి నిమిత్తమై వెనుకకు వెళ్ళుటకు అడ్డు ఉండనంత దూరమునందు ఉండి యుద్ధము చేయవలెను. యోధులందరును దూరదూరముగా ఉండి యుద్ధము చేయవలెను. కలిసిపోయి యుద్ధము చేసినచో అది సంకులమైపోవును. మహాసంకుల యుద్ధము నందు అలసిపోయిన పదాత్యాదులగు అసహాయ సైనికులు పెద్దపెద్ద ఏనుగుల సాహాయ్యము తీసికొనవలెను. ఒక్కొక్క ఆశ్వికుని ఎదుట ముగ్గురు పదాతులు ప్రతి యోద్ధలుగా, అనగా అగ్రగాములుగా ఉండవలెను. ఒక్కొక్క హస్తికుని ఎదుట ఐదుగురేసి చొప్పున ఆశ్వికులుండవలెను. వీరు కాక ఏనుగకు పాదరక్షకులు గూడ అంతమందియే, అనగా ఐదుగురేసి ఆశ్వికులు, పదునైదుగురు పదాతులు. ప్రతియోద్ధలు ఏనుగుకు ముందును, పాదరక్షకులు గజపాద సమీపమునందును ఉందురు. ఇది ఏనుగులకు సంబంధించిన వ్యూహము. రథవ్యూహ విషయమునందు కూడ ఇట్లే తెలియవలెను. గజ వ్యూహమునకు చెప్పబడిన రీతియందే నవగజవ్యూహము కూడ ఏర్పరుపవలెను. దీనికి ‘అనీకము’ అని పేరు. ఒక అనీకమునకు, ఒక అనీకమునకును మధ్య అయిదు ధనస్సుల దూరము ఉండవలెను. ఈ విధముగ అనేక విభాగాను సారము వ్యూహసంపత్తిని ఏర్పరుచుకొనవలెను.

వ్యూహమునకు ప్రధానముగా మూడు అంగములున్నవి. ‘ఉరస్యము’, ‘కక్షము’, ‘పక్షము’, అను మూడును కల్పింపదగినవి. ఉరస్సు, కక్షము, పక్షములు, మధ్యము, ప్రతి గ్రహము, కోటి అని వ్యూహమునకు ఏడు అంగములు శాస్త్రజ్ఞులచే చెప్పబడినవి. ఉరస్య, కక్ష, పక్ష, ప్రతిగ్రహాదులతో కూడిన వ్యూహవిభాగము బృహస్పతిచే చెప్పబడినది. శుక్రాచార్యుని మతమున కక్ష, ప్రకక్షములు లేవు. సేనాపతులు ఉత్తమ వీరపరివృత్తులై యుద్ధ రంగమునందు నిలువవలెను. వారందరును సంఘటితులై యుండి ఒకరిని ఒకరు రక్షించుచు యుద్ధము చేయవలెను. దుర్బల సైన్యమును వ్యూహమధ్యమునందు ఉంచవలెను. యుద్ధమునకు సంబంధించిన యంత్రములు, ఆయుధములు, ఓషధులు మొదలగు ఉప కరణములను సైన్యమునకు వెనుక ఉంచవలెను. యుద్ధమునకు ప్రాణము రాజు. రాజు లేనిచో యుద్ధములో పాల్గొన్నవారు హతులగుదురు. హృదయస్థానము నందు గజములను, కక్షస్థానమున రథములను, పక్షస్థానములందు అశ్వములను, కక్షభాగమునందు రథములను, పక్షములందు గజములను ఉంచిన వ్యూహము ‘అంతభేది’కక్షములందు అశ్వములను, మధ్యదేశమున పదాతులను ఉంచి ఏర్పరచినది మరొక విధమగు ‘అంతభేది వ్యూహము’, ఈ రథములు లేనిచో వ్యూహము లోపల అంతటను గజములను ఉంచ వలెను. సేన అధికముగా ఉన్నచో అది ‘ఆవాసము’. మండలము, అసంహతము, భోగము, దండము అనునవి నాల్గును ప్రకృతి వ్యూహములు. దండాకారమున పొడవుగా ఏర్పరచిన వ్యూహము ‘దండ వ్యూహము’. సర్ప శరీరాకారమున ఏర్పరచినది ‘భోగ వ్యూహము’ దానిలో సైనికుల అన్వావర్తనము జరుగు చుండును. సర్వతోముఖమునుండి గోళాకారమున ఏర్పరచిన వ్యూహము ‘మండలవ్యూహము’ అనీకములను దూరదూరముగా నిలబెట్టిన వ్యూహము ‘అసంహత వ్యూహము’.

ప్రదరము, దృఢకము, అసహ్యము, చాపము, చాపకుక్షి, ప్రతిష్ఠము, సుప్రతిష్ఠము, శ్యేనము, విజయము, సంజయము, విశాలవిజయము. సూచి, స్థూణాకర్ణము, చమూ ముఖము, ఝషాస్యము, వలయము, సుదుర్జయము అని దండవ్యూహము పదునేడు విధములు. పక్ష, కక్ష, ఉరస్యములను మూడు స్థానములందును సైనికులు సమస్థితిలో నున్నచో అది ‘దండ ప్రకృతి’ కక్ష భాగమునందు సైనికులు కొంచెము ముందుకు వెళ్ళగా మిగిలిన రెండు స్థానములందలి సైనికులు లోనికి అణగియున్నచో అది ‘ప్రదరము’. శత్రువులను చీల్చివేయును గాన దీనికి ఆ పేరు వచ్చినది. కక్ష-పక్షములు రెండును లోనికి అణగియుండి, ఉరస్యము మాత్రము బైటకు వచ్చినచో అది దృఢకము’ రెండు పక్షములు మాత్రము బైటకు వచ్చినచో అది ‘అసహ్యము ప్రదర్శన-దృఢక అసహ్యములను విపరీతముగా ఏర్పరచినచో అవి క్రమముగ చాప, చాపకుక్షి, ప్రతిష్ఠలు అగును. రెండు పక్షములు బైటకురాగా ఉరస్యము అంతః ప్రవిష్టమైనచో అది ‘సుప్రతిష్ఠితము’. ఏత ద్విరుద్ధస్థితి ‘శ్యేనవ్యూహము’. నిలబెట్టిన దండము వంటి ఆకారముగల దండ వ్యూహమునకు స్థూణాకర్ణములు రెండు పక్షములైనచో అది ‘విజయము’, రెండు చాప వ్యూహములు రెండు పక్షములుగా నున్నది. ‘సంజయము’ ఒక దానిపై ఒకటి చొప్పున రెండు స్థూణాకర్ణములు నిలిపినచో అది ‘విశాల విజయము’, కక్ష-పక్షాదులను ఒకదానిపై ఒక టిగ నిలబెట్టినచో అది ‘సూచి’, రెండు రెట్లుగా ఉన్న పక్షములుగల దండవ్యూహము ‘స్థూణాకర్ణము’. మూడేసి పక్షములు బైటకు వచ్చినది చతుర్గుణ పక్షములు కలది అగు వ్యూహము ‘చమూముఖము’; దీనికి విపరీతమైనది ఝుషాస్యము; రెండుగండ వ్యూహములచే వలయవ్యూహము ఏర్పడును. నాలుగు దండవ్యూహములచే దుర్జయవ్యూహము ఏర్పడును.

భోగ వ్యూహమున గోమూత్రిక, అహింసచారి, శకటము, మకరము, పరిపతన్తికము అని ఐదు భేదములు ఉన్నవి. నడచుచున్న ఎద్దు మూత్రము పోసినపుడు ఎట్లు రేఖ ఏర్పడునో ఆ విధముగా సైన్యమును నిలిపిన గోమూత్రికా వ్యూహము. సర్వము సంచరించునపుడు ఏర్పడు రేఖవలె సైన్యమును నిలిపిన అది అహిసంచారి, రక్ష-పక్షములు రెండును ముందు వెనుక క్రమమున దండ వ్యూహమువలె నుండి ఉరస్య సంఖ్య రెట్టింపు అయినచో అది ‘శకట వ్యూహము’; దీనికి విపరీతముగ నున్నది మకర వ్యూహము. ఈ రెండు వ్యూహములలో దేనికైన మధ్యభాగమునందు అశ్వ-గజాదుల ఆవాపము చేసినచో అది పరిపతంతిక వ్యూహము. సర్వతోభద్రము దుర్జయము అని మండల వ్యూహము రెండు విధములు. దీనిలో ఐదు అనీకముల సేన ఉండును. ఆవశ్యకతాను సారము ఉరస్యము నందును, రెండు కక్షములందును ఒక్కొక్క అనీకమును పెంచినచో దుర్జయమను వ్యూహము. అర్ధచంద్రము, ఉత్థానము వజ్రము అని అసంహతము మూడు విధములు. కర్కట, శృంగి, కాకాపాది, గోధిక అని కూడ అసంహతమున మరిమూడు భేదములు. అర్ధ చంద్ర, కర్కట శృంగులందు మూడేసి అనీకములుండును. ఉత్థాన-కాకపాదులందు నాలుగేసి అనీకములును, వజ్ర-గోధికలు ఐదేసి అనీకములతో ఏర్పడును. అనీకములను పట్టి మూడు భేదములేయైనను, ఆకృతి భేదమును బట్టి ఆరు భేదములు చెప్పబడినవి. ఈ విధముగ దండవ్యూహమున పదునేడు భేదములు, మండల వ్యూహమునకు రెండుభేదములు అసంహతమునకు ఆరుభేదములు, భోగ వ్యూహమునకు ఐదు భేదములు చెప్ప బడినవి. పక్షాది అంగముల ఏదైన ఒక అంగము సేనచే శత్రువ్యూహమును భేదించి, మిగిలిన అనీకములచే దానిని చుట్టుముట్టవలెను. లేదా ఉరస్యము నందలి అనీకముచే శత్రువ్యూహమును ఆక్రమించి, రెండు ప్రపక్షములచే చుట్టుముట్టవలెను. శత్రుసేన యొక్క రెండుప్రపక్షములందును తన వ్యూహమునందలి పక్షములచే ఆక్రమణము సలిపి, శత్రు జఘన భాగమును తన ప్రతిగ్రహ-కోటి ద్వయములతో నశింపచేయవలెను. ఉరస్యము నందలి సేనతో శత్రు పక్షమును పీడించవలెను. వ్యూహమునందు సారహీన సైనికులున్న చోట్లను, విభేదములు ఏర్పడిన సైన్యము నందును, దూష సైనికులున్న ప్రదేశములందును శత్రుసేనను సంహరించి, తన పక్షమునందున్న అట్టి స్థానములకు బలము చేకూర్చవలెను. బలిష్ఠ సేనను, అంతకంటె బలిష్ఠమగు సేనను ఉపయోగించి, పీడించవలెను. నిర్బల సైన్యమును సబల సైన్యముతో అణచివేయవలెను. శత్రుసైన్యము సంఘటితముగ నున్నచో, ప్రచండమగు గజసేనతో ఆ శత్రు సైన్యమును చీల్చి వేయవలెను. పక్ష, కక్షి, ఉరస్యములు మూడును సమస్థితిలో నున్నపుడు అది దండవ్యూహము. దండము యొక్క ప్రయోగమును, స్థానమును వ్యూహ చతుర్థాంగముతో ప్రదర్శించ వలెను. దండముతో సమానముగ రెండు పక్షములు కూడ ముందుకు వచ్చినచో అది ‘ప్రదరము’ లేదా ‘ప్రదారక’ వ్యూహము. అదే పక్ష కక్షముద్వారా అంతిక్రాంతమైనచో అది దృఢవ్యూహము. రెండు పక్షములు మాత్రమే ముందుకు చొచ్చుకున్నచో అది ‘అసహ్య వ్యూహము’. కక్షమును పక్షమును క్రిందనుంచి, ఉరస్యముద్వారా ముందుకు వచ్చినది ‘చాపవ్యూహము’ రెండు దండములు కలిసిన ‘వలయ వ్యూహము’ ఏర్పడును. ఈ వ్యూహము శత్రువులను చీల్చివేయును. నాలుగు వలయ వ్యూహములు కలిసినచో, శత్రుసేనను మర్దించు ‘దుర్జయ వ్యూహము’ ఏర్పడును. కక్ష పక్ష-ఉరస్యము విషమములుగా నున్నచో అది ‘భోగవ్యూహము’. సర్పచారి, గోమూత్రిక, శకటము, మకరము, పరిపతంతికము అని దానికి ఐదు భేదములు. సర్పము సంచరించు ఆకారమున సర్పచారి, గోమూత్రాకారమున గోమూత్రిక, శకటాకారమున శకటము, దీనికి విపరీతముగ మకర వ్యూహము ఏర్పడును. ఇట్లు పంచభేదములుగల భోగవ్యూహము శత్రువినాశకము. మండల వ్యూహమునకు చక్రవ్యూహ, పద్మవ్యూహదులు భేద ప్రభేదములు. ఇదే విధముగ సర్వతోభద్ర, వజ్ర, అక్షవర, కాక, అర్ధచంద్ర, శృంగార, అచలాది వ్యూహములు ఉన్నవి. వీటి ఆకారములను బట్టి పేర్లు వచ్చినవి. వ్యూహములను తమ ఇచ్ఛననుసరించి ఏర్పరచుకొనవలెను. వ్యూహములు శత్రుసేన ప్రగతిని నిలిపి వేయును. అగ్ని చెప్పెను: శ్రీరాముడు రావణుని వధించిన పిదప అయోధ్యా రాజ్యమును పొందెను. శ్రీరాముడు చెప్పిన ఈ నీతిని అనుసరించుట చేతనే లక్ష్మణుడు పూర్వము, ఇంద్రజిత్తును వధించెను. (242)