అగ్ని మహా పురాణము
స్నపనాది విధానం
హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఆచార్యుడు ఈశాన్యమునందు ఒక హోమ కుండము నిర్మించి దానిలో వైష్ణవాగ్నిని స్థాపింపవలెను. గాయత్రీ మంత్రముతో నూట ఎనిమిది హోమములు చేసి, సంపాతవిధిచే కలశములను ప్రోక్షించవలెను. మూర్తి పాలకులగు విద్వాంసులతోడను, శిల్పుల తోడను కలిసి యజమానుడు వాద్యములతో, శిల్పశాలకు వెళ్ళవలెను. అచట “విష్ణవేశిపివిష్టాయ నమః” అను మంత్రముచ్చరించుచు, ఇష్టదేవతా ప్రతిమ కుడిచేతికి కౌతుక సూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆచార్యుని హస్తమునకు గూడ ఉన్నిదారము, ఆవాలు, పట్టు వస్త్రము వీటితో కౌతుకము కట్టవలెను. మండలముపై ఆ ప్రతిమను వస్త్రమును చుట్టి స్థాపించి ఈ విధముగ స్తుతించవలెను. “విశ్వకర్మ నిర్మించిన, దేవేశ్వరియైన ఓ ప్రతిమా! నీకు నమస్కారము. సమస్త జగత్తును ప్రభావితము చేయు ఓ జగదంబా! నకు మాటి మాటికి నమస్కరించుచున్నాను. ఈశ్వరీ! నేను నీపై నిరామయుడగు నారాయణుని పూజించుచున్నాను. నీ యందు శిల్పసంబంధ దోషము లేవియు లేకుండుగాక. నా విషయమున సర్వదా సమృద్ధి శాలినివిగా ఉండుము”. ప్రతిమను ఈ విధముగ ప్రార్థించి దానిని స్నానాగారమునకు తీసికొని వెళ్ళవలెను.
శిల్పికి ద్రవ్యమును ఇచ్చి సంతోషపరచవలెను. గురువునకు గోదానము ఈయవలెను. “చిత్రందేవానామ్” ఇత్యాది మంత్రము పఠించుచు ప్రతిమ నేత్రములను తెరవవలెను. “అగ్నిర్జ్యోతిః” ఇత్యాది మంత్రముచే దృష్టిసంచారము చేయవలెను. ప్రతిమను భద్ర పీఠముపై నుంచి ఆచార్యుడు తెల్లని పుష్పములు, నెయ్యి, ఆవాలు, దూర్వలు, కుశలు దేవత శిరస్సుపై ఉంచవలెను. “మధువాతా” ఇత్యాది మంత్రముచే నేత్రములందు అంజనము ఉంచవలెను. ఆ సమయమున “హిరణ్యగర్భం”, “ఇమంమేవరుణః” ఇత్యాది మంత్రములు పఠింపవలెను. ఘృతవతీ ఇత్యాది ఋక్కు పఠించుచు ఘృతము శరీరమునకు పూయవలెను. శనగపిండితో నలిచి “అతోదేవాః” ఇత్యాది మంత్రము పఠింపవలెను. “సప్తతే అగ్నే” ఇత్యాది మంత్రము పఠించి గర్భజలముతో ప్రతిమను కడగవలెను. “ద్రువదాదివ” ఇత్యాది మంత్రముచే అనులేపనము, ఆపోహిష్ఠామ” ఇత్యాది మంత్రముచే అభిషేకము చేయవలెను. అభిషేకానంతరము నదీ-తీర్థ జలములచే స్నానము చేయించి, ‘పావమానీ’ ఋక్కు పఠించుచు రత్నస్పర్శగల ఉదకముతో స్నానము చేయించవలెను. “సముద్రం గచ్ఛస్వాహా” ఇత్యాది మంత్రమును చదువుచు తీర్థమృత్తికచేత, కలశ జలముచేతను స్నానము చేయించవలెను. “శంనో దేవీః” ఇత్యాది మంత్రము గాయత్రీ మంత్రము పఠించుచు వేడి నీళ్ళతో స్నానము చేయించవలెను. “హిరణ్యగర్భః” ఇత్యాది మంత్రములచే పంచవిధ మృత్తికలతో స్నానము చేయించవలెను. పిమ్మట “ఇమంమే గంగేయమునే” ఇత్యాది మంత్రముచే ఇసుక కలిపిన జలముచేతను, “తద్విష్ణోః పరమంపదమ్” అను మంత్రముతో పుట్టమట్టి కలిపిన ఉదకము చేతను, పూర్ణ ఘటముతో స్నానము చేయించవలెను. “యా ఓషధీః” ఇత్యాది మంత్రము చదువుచు ఓషది మిశ్రజలము చేతను, యజ్ఞా యజ్ఞా” ఇత్యాది మంత్రము చదువుచు ఉసిరి మొదలగు కషాయ పదార్థములు కలిపిన జలముల చేతను, “పయః పృథివ్యామ్” ఇత్యాది మంత్రముతో పంచగవ్యముల చేతను, “యాః ఫలినీః” ఇత్యాది మంత్రముతో ఫలమిశ్రిత జలముల చేతను స్నానము చేయించవలెను. “విశ్వతశ్చక్షుః” ఇత్యాది మంత్రముతో ఉత్తర దిక్కుననున్న కలశము చేతను, “సోమం రాజానమ్” అను మంత్రముతో పూర్వదిక్కున ఉన్న కలశముచేతను “విష్ణోర రాటమసి” ఇత్యాది మంత్రముతో దక్షిణకలశముచేతను, “హంసః శుచిషత్” ఇత్యాది మంత్రముతో పశ్చిమముననున్న కలశము చేతను ఉద్వర్తన స్నానము చేయించవలెను.
“మూర్ధానందివో” ఇత్యాది మంత్రముతో ఉసిరికాయతో కూడిన జలముచేతను, “మానస్తోకే” ఇత్యాది మంత్రముతో జటామాంసికలసిన జలముచేతను, “గన్ధద్వారామ్” ఇత్యాది మంత్రముతో గంధమిశ్రిత జలముచేతను, “ఇదమాపః” ఇత్యాది మంత్రముతో ఎనుబది యొక్క పదముల వాస్తు మండపమునందు ఉంచిన కలశములచేతను స్నానము చేయించవలెను. స్నానానంతరము “సమస్త లోకములను అనుగ్రహించు భగవంతుడవైన మహావిష్ణూ! రమ్ము, రమ్ము, ఈ యజ్ఞభాగమును గ్రహింపుము. మీకు నమస్కారము” అని ప్రార్థించుచు దేవేశ్వరుని ఆవాహనముచేసి, “ముఞ్చా మిత్వా” ఇత్యాది మంత్రము చదువుచు విష్ణు విగ్రహ హస్తమునకు కట్టిన కౌతుక సూత్రమును, ఆచార్యుని చేతికి కట్టిన సూత్రమును కూడ విప్పివేయవలెను. పిమ్మట “హిరణ్మయేన” ఇత్యాది మంత్రముతో పాద్యము “అతో దేవాః” ఇత్యాది మంత్రముతో అర్గ్యము, “మధువాతాః” ఇత్యాది మంత్రముతో మధుపర్కము ఇచ్చి “మయిగృహ్ణామి” ఇత్యాది మంత్రముతో ఆచమనము చేయించ వలెను. పిమ్మట విద్వాంసుడు “అక్షన్నమీమదన్త” ఇత్యాది మంత్రము చదువుచు శ్రీమహావిష్ణువు అవయవములపై దూర్వలు, అక్షతలు చల్లవలెను.
“కాండాత్” ఇత్యాది మంత్రముతో నిర్మంథనముచేసి, “గంధవతీ” ఇత్యాది మంత్రముతో గంధమును, “ఉన్నయామి” ఇత్యాది మంత్రముతో పుష్పమాలను, “ఇదం విష్ణుః” ఇత్యాది మంత్రముతో పవిత్రకమును అర్పింపవలెను. “బృహస్పతే” ఇత్యాది మంత్రముతో వస్త్ర ద్వయమును, “వేదాహ మేతమ్” ఇత్యాది మంత్రముతో ఉత్తరీయమును “మహావ్రతేన” ఇత్యాది మంత్రముతో పుష్పములను, ఓషధులను సమర్పింపవలెను. పిమ్మట “ధూరసి” అను మంత్రముతో ధూపము అర్పించి, ‘విరాట్’ సూక్తముతో అంజనమును, ‘యజ్ఞన్తి’ ఇత్యాది మంత్రముతో తిలకమును ఇవ్వవలెను. “దీర్ఘాయుష్ట్వాయ” అను మంత్రముతో పుష్పమాల సమర్పింపవలెను. ‘ఇన్ద్రక్షత్రమభి’ ఇత్యాది మంత్రముతో ఛత్రమును, ‘విరాట్’ మంత్రముతో అద్దమును, ‘వికర్ణ’ మంత్రముతో చామరమును, రథంతర మంత్రముతో అలంకారములను సమర్పింపవలెను. వాయుదేవతకు సంబంధించిన మంత్రములతో వింజామరను, “ముఞ్చమిత్వా” ఇత్యాది మంత్రముతో పుష్పములను సమర్పించి, ఓంకారముతో కూడిన పురుషసూక్తముతో శ్రీ హరిని స్తుతింపవలెను. ఈ వస్తువులను అన్నింటిని పిండికాదులపైనను శివుడు మొదలగు దేవతలకును ఈ విధముగనే సమర్పింపవలెను. దేవతను పైకి ఎత్తునపుడు సౌపర్ణ సూక్తమును పఠింపవలెను. “ప్రభో లెమ్ము” అని పలుకుచు శ్రీ మహావిష్ణువును ఎత్తి శకుని సూక్తము పఠించుచు మండపమునందలి శయ్యమీదకు తీసికొని వెళ్ళవలెను. బ్రహ్మరథము మీదగాని, పల్లకీ మీదగాని తీసికొని వెళ్ళవలెను. “అతోదేవాః” అను సూక్తము పఠించుచు, “శ్రీశ్చతే లక్ష్మీశ్చ” అను మంత్రము పఠించుచు, ప్రతిమను, పిండికను శయ్యపై చేర్చవలెను. పిమ్మట మహా విష్ణువునకు నిష్కలీకరణ క్రియ చేయవలెను. సింహము, వృషభము, గజము, వ్యజనము, కలశము, పతాక, భేరి, దీపము-ఈ ఎనిమిదియు మంగళ సూచక వస్తువులు. వీటినన్నింటిని, అశ్వ సూక్తము పఠించుచు, భగవంతునకు చూపవలెను. ‘త్రిపాత్’ ఇత్యాది మంత్రము చదువుచు భగవంతుని చరణ ప్రాంతమునందు ఉఖ (ఒక విధమైన పాత్ర) దాని మూత, అంబిక (చిన్న బూర్లమూకుడు), దర్వి (గరిటె) పాత్ర, రోలు, రోకలి, శిల, చీపురు, భోజన పాత్ర, ఇతర గృహపాత్రలు ఉంచవలెను. తలవైపు వస్త్రములు, రత్నములు ఉంచిన కలశము ఉంచవలెను. ఆ కలశమును పటిక బెల్లము ముక్కలతో నింపవలెను. దానికి ‘నిద్రా’అని పేరు. ఈ విధముగ భగవంతుని శయన విధానము చెప్పబడినది. (58)
అధివాసన విధానము
హయగ్రీవుడు చెప్పెను: శ్రీహరి సాన్నిధ్యము సంపాదించుటకు అధివాసనమని పేరు. “నేను సర్వజ్ఞుడు, సర్వవ్యాపియు అయిన పురుషోత్తముడను” అని భావన చేయుచు సాధకుడు ఓంకార వాచ్యుడగు పరమాత్మతో ఏకత్వమును చేయవలెను. పిమ్మట చైతన్యాభిమానియైన జీవుని వేరుచేసి, ఆత్మకును, ఆ జీవునకును ఏకత్వమును చేయవలెను. ఈ విధముగా చేసి, స్వాత్మరూపుడును, సర్వవ్యాపియు అగు పరమేశ్వరునితో దానిని కలిపివేయవలెను. పిమ్మట ప్రాణవాయువు ద్వారా (లం బీజరూపయగు)ప్పథివిని అగ్ని బీజ (రం) చింతనముచే ఆవిర్భవించిన అగ్నియందు కాల్చివేయవలెను. అనగా పృథివి అగ్నిలో లీనమైనదని భావన చేయవలెను. పిమ్మట అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు లీనము చేయవలెను. అధిభూత, అధ్యాత్మ, అధిదైవ విభవములతో కూడిన సమస్త భూతములను తన్మాత్రలలో విలీనము చేసి, వీటినన్నింటిని క్రమముగ ఆకాశమునందు విలీనము చేయవలెను. ఆకాశమును మనస్సునందు, మనస్సును అహంకారమునందు, అహంకారమును మహత్తత్త్వమునందు, మహత్తత్త్వమును అవ్యాకృత ప్రకృతి యందును లీనము చేయవలెను.
అవ్యాకృతమును (ప్రకృతిని లేదా మాయను) జ్ఞాన స్వరూపుడగు పరమాత్మయందు విలీనము చేయవలెను. ఈ పరమాత్మయే వాసుదేవుడు. శబ్ద స్వరూపుడైన ఆ వాసుదేవుడు సృష్టి చేయవలెనని సంకల్పించి, అవ్యాకృత మాయాశ్రయముచే స్పర్శమను పేరుగల సంకర్షణుని ఆవిర్భవింప చేసెను. సంకర్షణుడు మాయను క్షుబ్ధముచేసి తేజోరూప ప్రద్యుమ్నుని సృజించెను. ప్రద్యుమ్నుడు రసరూపుడగు అనిరుద్ధుని, అనిరుద్ధుడు గంధస్వరూపుడగు బ్రహ్మను సృజించెను. బ్రహ్మ మొట్టమొదట జలమును సృజించి, దానిలో పంచభూతములతో కూడిన బంగారు గ్రుడ్డును సృజించెను. ఆ అండమునందు జీవశక్తి సంచారమేర్పడెను. ఆత్మయందు లీనము చేయబడినట్లు మొదట చెప్పబడినది ఈ జీవ శక్తియే. జీవశక్తితో ప్రాణమునకు సంయోగమేర్పడినప్పుడు అది ‘వృత్తి మతి’ అని చెప్ప బడును. వ్యాహృతి సమేతుడగు జీవుడు ప్రాణములలో నుండి ఆధ్యాత్మిక పురుషుడని చెప్పబడుచున్నాడు. వానినుండి ప్రాణయుక్తమగు బుద్ధి పుట్టినది. దీనికి ఎనిమిది వృత్తులు ఉండును. బుద్ధి నుండి అహంకారము, అహంకారము నుండి మనస్సు జనించినది. మనస్సు నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనెడు సంకల్పాదియుక్తములగు ఐదు విషయములు ఉత్పన్నమైనవి.
వీటినుండి జ్ఞానశక్తిగల త్వక్, శ్రోత్ర, ఘ్రాణ, నేత్ర, జిహ్వలను ఐదు ఇంద్రియములు ఆవిర్భవించినవి. వీటికి జ్ఞానేంద్రియములని పేరు. పాద, పాయుపాణి, వాక్, ఉపస్థలు పంచ కర్మేంద్రియములు. ఇప్పుడు పంచభూతముల పేర్లు వినుము, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివులు పంచమహా భూతములు. అన్నింటికిని ఆధారమగు స్థూలశరీరము ఈ భూతముల నుండియే పుట్టుచున్నది. ఈ తత్త్వములకు వాచకములగు ఉత్తమ బీజాక్షరములను న్యాసము నిమిత్తమై చెప్పుచున్నాను. ‘మం’ అను బీజము జీవస్వరూపము (జీవతత్త్వ వాచకము) ఇది శరీరము అంతయు వ్యాపించియున్నదని భావనచేసి దీనిని సకల దేహవ్యాపకన్యాసము చేయవలెను. ‘భం’ అనునది ప్రాణతత్త్వ బీజము, ఇది జీవోపాధియందున్నది. అందుచే దీనిని దానియందే న్యాసము చేయవలెను. బుద్ధితత్త్వ వాచకమగు ‘బం’ అను బీజమును, విద్వాంసుడు హృదయముపై న్యాసము చేయవలెను. అహంకార రూపమగు ‘ఫం’ అను బీజమును కూడ హృదయము నందే న్యాసము చేయవలెను. సంకల్పకరణ భూతమనస్తత్త్వ రూపమగు ‘పం’ అను బీజమును గూడ హృదయము నందే న్యాసము చేయవలెను.
శబ్దతన్మాత్ర తత్త్వవాచకమగు న కారమును (నం) శిరస్సుపైనను, స్పర్శరూప ధ కారమును (ధం) ముఖ ప్రదేశమునందును, రూపతత్త్వ వాచకమగు ద కారమును (దం) నేత్ర ప్రాంతము నందును, రసతన్మాత్ర బోధక ‘థ’ కారమును (థం) వస్తి ప్రదేశ (మూత్రాశయ)మునందును, గంధ తన్మాత్ర స్వరూపమగు త కారమును (తం) పిక్కల యందును, ణ కారమును (ణం) శ్రోత్రములందును, ఢ కారమును (ఢం) త్వక్కుపై నను, డ కారమును (డం) నేత్రములందును, ఠ కారమును (ఠం) జిహ్వయందును, ట కారమును (టం) నాసిక యందును, ఇ కారమును (ఞం) వాగింద్రియమునందును, పాణితత్త్వ రూపమగు ఝ కారమును (ఝం) హస్తములందును, జ కారమును (జం) పాదములందును, ఛ కారమును (ఛం) పాయువు నందును, చ కారము (చం) ఉపస్థ యందును, పృథ్వీతత్త్వ రూపమగు ఙ కారమును (ఙం) పాదములందును, ఘ కారము (ఘం) వస్తి యందును, తేజస్తత్తరూపమగు (గం)ను హృదయమునందును, వాయుతత్త్వ రూపమగు ఖ కారమును (ఖం) నాసికయందును న్యాసము చేయవలెను. క కారము (కం) ఆకాశ తత్త్వ రూపమైనది. విద్వాంసుడు దానిని ఎల్లప్పుడును శిరస్సుపై న్యాసము చేయవలెను.
హృదయ కమలమునందు సూర్యదేవతకు సంబంధించిన ‘యం’ బీజము న్యాసము చేసి, హృదయము నుండి బయలు వెడలిన డెబ్బది రెండువేల నాడులలో షోడశ కళాయుక్త సకార (సం) న్యాసము చేయవలెను. దాని మధ్య భాగము నందు బిందు స్వరూప వహ్ని మండలమును భావించవలెను. ఓ సురశ్రేష్ఠా! దానిపై ప్రణవసహిత ‘హ’ కార (హం)న్యాసము చేయవలెను. “ఓం ఆం నమః పరమేష్ఠ్యాత్మనే” ఓం ఆం నమః పురుషాత్మనే, ఓం వాం నమో నిత్యాత్మనే, ఓం నాం నమో విశ్వాత్మనే, ఓం వం నమః సర్వాత్మనే” అను నవి ఐదు శక్తులు. ప్రథమ శక్తిని స్నానము నందును, ఆసనకర్మయందు, ద్వితీయ శక్తిని, శయనమునందు, తృతీయ శక్తిని, యాన కర్మయందు చతుర్థ శక్తిని, అర్చనా కాలమునందు పంచమ శక్తిని వినియోగించవలెను. ఈ ఐదును ఉపనిషత్తులు. వీటి మధ్యయందు మంత్రమయుడగు శ్రీహరిని ధ్యానించి ‘క్ష’ కారము (క్షం)ను న్యాసము చేయవలెను.
ఏ మూర్తి స్థాపింపబడుచున్నదో ఆ మూర్తికి సంబంధించిన మూలమంత్రము న్యాసము చేయవలెను. (విష్ణు స్థాపన చేసినపుడు) “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనునది మూలమంత్రము. ఈ మూలమంత్రముయొక్క ఒక్కొక్క అక్షరమును శిరస్సు, నాసిక, లలాటము, ముఖము, కంఠము, హృదయము, భుజములు, పిక్కలు, పాదములు వీటియందు క్రమముగ న్యాసము చేయవలెను. పిమ్మట శిరస్సుపై కేశవుని, ముఖముపై నారాయణుని, కంఠముపై మాధవుని, భుజములపై గోవిందుని, హృదయముపై విష్ణువును, పృష్ఠభాగమున మధుసూదనుని, జఠరమున వామనుని, కటిపై త్రివిక్రముని, పిక్కలపై శ్రీధరుని, దక్షిణ భాగమున హృషీకేశుని, చీలమండలపై పద్మనాభుని, పాదములపై దామోదరుని న్యాసము చేసి, పిమ్మట హృదయాది షడంగన్యాసములు చేయవలెను. సత్పురుషులలో శ్రేష్ఠుడవైన బ్రహ్మదేవా! ఇది ఆదిమూర్తి విషయమున చెప్పిన సాధారణ న్యాసము.
లేదా ఏ దేవత ప్రతిష్ఠింపబడుచున్నదో దాని మూలమంత్రముచేతనే మూర్తి సజీవకరణ ప్రక్రియ జరుపవలెను. ఆ మూర్తి యొక్క పేరులోని మొదటి అక్షరము గ్రహించి, దానికి పండ్రెండు స్వరములను చేర్చి అంగకల్పన చేయవలెను. దేవేశ్వరా! విగ్రహముపై హృదయా ద్యంగ న్యాసము, ద్వాదశాక్షర మూలమంత్ర న్యాసము, తత్త్వ న్యాసము ఏ విధముగ చేయబడునో ఆ విధముగనే తన శరీరముమీద కూడ చేయవలెను. పిమ్మట చక్రాకారమగు పద్మమండలముపై మహావిష్ణువును గంధాదులచే పూజించవలెను. వెనుకటి వలెనే మహా విష్ణు శరీరమును, వస్త్రాలంకారాదులను, ఆసనమును ధ్యానించవలెను. పై భాగమున పండ్రెండు ఆకుల సుదర్శన చక్రమును ధ్యానించవలెను. ఆ చక్రమునకు మూడు నాభులు, రెండు నేములు (చక్రాంతములు), పండ్రెండు స్వరములు ఉండును. పిమ్మట విద్వాంసుడు పృష్ఠదేశమున ప్రకృత్యాదులను స్థాపింపవలెను. ఆకుల చివర పండ్రెండుగురు సూర్యులను పూజింపవలెను. పిమ్మట అచట పదునారు కళలతో కూడిన చంద్రుని ధ్యానించవలెను. చక్రనాభియందు మూడు వస్త్రములను ధ్యానించవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు పద్మములోపల ద్వాదశదళ పద్మమును ధ్యానించవలెను.
ఆ పద్మముపైన పురుషశక్తిని ధ్యానించి, దానిని పూజించవలెను. పిమ్మట, దేశికుడు, ప్రతిమపై శ్రీహరి న్యాసముచేసి, ఆ శ్రీహరిని, ఇతర దేవతలను పూజింపవలెను. గంధపుష్పా ద్యుపచారములు సమర్పించి అంగావరణ సహితముగా ఇష్ట దేవతను బాగుగా పూజింపవలెను. ద్వాదశాక్షర మంత్రము లోని ఒక్కొక్క అక్షరమును బీజాక్షరముగచేసి దానితో కేశవాది భగవద్విగ్రహములను క్రమముగ పూజింపవలెను. పండ్రెండు ఆకులుగల మండలము మీద ఆ క్రమముగ లోక పాలాదులను పూజింపవలెను. పిమ్మట, ద్విజుడు, గంధ పుష్పాద్యుపచారములతో పురుషసూక్తమును పఠించుచు పురుష ప్రతిమలను, శ్రీ సూక్తము పఠించుచు పిండికలను పూజింపవలెను. పిమ్మట జననాదిక్రమమున వైష్ణవాగ్నిని ఆవిర్భవింపచేయవలెను. విష్ణు దేవతకు సంబంధించిన మంత్రములతో అగ్నిలో హోమముచేసి, విద్వాంసుడు, శాంతిజలమును సిద్ధముచేసి దానిని ప్రతిమ శిరస్సుపై చల్లి, అగ్ని ప్రణయనము చేయవలెను. ‘అగ్నిం దేదూతం’ ఇత్యాది మంత్రముతో దక్షిణ కుండము నందును, ‘అగ్నిమగ్నిమ్’ ఇత్యాది మంత్రముతో పూర్వకుండము నందును ‘అగ్నిమగ్నిం హవీమభిః’ ఇత్యాది మంత్రముతో ఉత్తర కుండమునందును అగ్ని ప్రణయనము చేయవలెను. అగ్ని ప్రణయన సమయము నందు ‘త్వమగ్నేద్యుభిః” ఇత్యాది మంత్రము పఠింపవలెను.
ఒక్కొక్క కుండములో ఓంకారోచ్చారణ పూర్వకముగ ఒక వెయ్యి ఎనిమిది చొప్పున పలాశ సమిధలను యవలు మొదలగు వాటిని హోమము చేయవలెను. వ్యాహృతి మంత్రముతో ఘృతమిశ్ర తిలలను, మూలమంత్రముతో ఘృతమును హోమము చేయవలెను. పిమ్మట మధుర త్రయము (నెయ్యి, తేనె, పంచదార)తో శాంతిహోమము చేయవలెను. ద్వాదశాక్షర మంత్రముతో పాదనాభి, హృదయ, శిరస్సులను స్పృశింపవలెను. నెయ్యి, పెరుగు, పాలు, హోమముచేసి శిరస్సు స్పృశింప వలెను. పిమ్మట శిరో, నాభి, పాదములు స్పృశించి గంగా, యమునా, గోదావరి, సరస్వతీ నదులను ఆవాహనము చేయవలెను. విష్ణు గాయత్రితో అగ్నిని రగిల్చి, గాయత్రితో ఆ అగ్నిపై చరువును వండవలెను. గాయత్రీ మంత్రముతో హోమముచేసి, బలులు ఇచ్చి, పిమ్మట బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. మాసాధిపతులైన ద్వాదశాదిత్యుల తుష్టికై ఆచార్యునకు బంగారము, గోవు దక్షిణగా ఈయవలెను. దిక్పాలకులకు బలి ఇచ్చి, వేదపాఠ-గీత కీర్తనాదులతో రాత్రి జాగరణము చేయవలెను. ఈ విధముగ అధివాసనము పూర్తి చేసినవానికి అన్ని ఫలములును లభించును. (59)
