అగ్ని మహా పురాణము
పంచాక్షరాది పూజాదికము
అగ్ని దేవుడు పలికెను:
మేషము(న), సంజ్ఞావిషము(మః), శకార పూర్వాక్షరము(శ), దానితో అక్షి(సి), దీర్ఘోదకము(వా), మరుత్(య). ఇది పంచాక్షర మంత్రము (నమః శివాయ). ఇది శివ స్వరూపము, మంగళప్రదము. దీనికి ఓంకారము చేర్చి జపించినచో దేవత్వాదులను పొందును. జ్ఞానాత్మకమగు పరబ్రహ్మయే పరమ బుద్ధి రూపము. అదియే శివ రూపమున హృదయము నందున్నది. శక్తి రూపమునగు ఆ సర్వేశ్వరుడే బ్రహ్మాది మూర్తులతో వున్నాడు. మంత్రము నందలి అక్షరములు ఐదు మహాభూతములు. ఐదు తన్మాత్రలు, ఐదు విషయములు, ఐదు ప్రాణాది వాయువులు, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు. ఇవన్నియు పంచాక్షర బ్రహ్మ స్వరూపమైనవి. అట్లే అష్టాక్షరాత్మకమైనవి. దీక్షా స్థానమును మంత్రోచ్చారణ చేయుచు పంచగవ్యములతో ప్రోక్షించవలయును. సంభారములు సమకూర్చుకుని శివుని పూజించి మూలమంత్రము ఇష్టమూర్తికి సంబంధించిన మంత్రములు, అంగమంత్రములు పఠించుచు అక్షతలను చల్లి భూతములను తొలగించుకొని ఆత్మరక్షణ చేసికొన వలెను. పిదప చరువు (పాయసము) వండి మూడు భాగములు చేసి ఒక భాగము ఇష్ట దేవతకు నివేదనచేసి రెండవ భాగము ఆహుతి ఇచ్చి మూడవ భాగము శిష్య సహితుడై తాను భుజించవలెను. పిదప ఆచమన సకలీ కరణములుచేసి శిష్యుని హృదయ మంత్రముతో అభిమంత్రించి పాలచెట్టుకు సంబంధించిన కాష్టమును దంతధావ నార్థమై ఇవ్వవలెను. దానితో దంతములు శోధన చేసుకుని, దానిని చీరి నాలుక శుభ్రము చేసుకొని కడిగి నేలపై విసిరి వేయవలెను. తూర్పు వైపు విసిరిన ఆ దంతకాష్టము ఉత్తరము వైపుకాని పశ్చిమము వైపుకాని వెళ్ళి పడినచో శుభమగును. అట్లు కానిచో అశుభము. పిదప తన ఎదుటకు వచ్చుచున్న శిష్యునకు శిఖా బంధముచే రక్షణ కల్పించి జ్ఞానవంతుడైన గురువు ఆతనితో కలిసి వేదికపై ఉన్న కుశాస్తరణముపై నిద్ర పోవలయును. శిష్యుడు రాత్రి తాను చూసిన స్వప్నము ప్రాతః కాలమున గురువునకు చెప్పవలెను.
ఆ స్వప్నము శుభమై సిద్ధి సూచకమైనచో మంత్ర దేవతల విషయమున భక్తి కలుగును. పిదప మండలార్చనము చేయవలయును. సర్వతో భద్రాది మండలములలో పూజించినచో సర్వ సిద్ధులు కలుగును. స్నానాచమనములు చేసి మంత్రోచ్చారణ పూర్వకముగ శరీరమునకు మట్టి పూసుకొని శివతీర్థమునందు అఘమర్షణ పూర్వకముగా స్నానము చేయవలెను. హస్తశుద్ధి చేసికొని పూజా గృహమును ప్రవేశించి మూల మంత్రముతో కమలాసనమును భావనచేసి మూల మంత్రముతో పూరక కుంభక, ప్రాణాయామములు చేయవలెను. జీవాత్మను పైన బ్రహ్మ రంధ్రమునందు ఉన్న పరమాత్మతో కలుపవలెను. శిరస్సు మొదలు శిఖాంతము వరకువున్న పన్నెండు అంగుళముల విస్తృత స్థానమే బ్రహ్మ రంధ్రము. వాయు బీజముతో శరీరమును శుష్కింపచేసి అగ్ని బీజముతో శరీరమును భస్మముచేసి అమృత బీజముతో ఆ భస్మమును ఆప్లావితము చేయవలయును. దివ్యరూప ధ్యానము చేయుచు జీవాత్మను మరల తన శరీరములో ఉంచుకొనవలెను. ఇట్లు చేయుటచే ఆత్మశుద్ధియగును. పిదప న్యాసముచేసి పూజ ప్రారంభించవలెను. పంచాక్షరిలోని ఐదు అక్షరముల వర్ణములు క్రమముగ కృష్ణశ్వేత, శ్యామ, రక్త పీతములు, నకారాద్యక్షరములతో వరసగా అంగన్యాసము చేసి ఆ అంగములపైననే తత్పురుషాది మూర్తి పంచకాది న్యాసము చేయవలెను. పిదప అంగుష్ఠము మొదలు కనిష్టిక వరకు ఐదు వ్రేళ్ళపై క్రమముగా అంగమంత్రములను న్యాసము చేసి పాద గుహ్య హృదయ ముఖ శిరస్సులందు మంత్రాక్షర న్యాసము చేయవలయును. పిదప శిరస్సు మొదలగు వాటియందు ఈ అంగముల వ్యాపకన్యాసము చేయవలయును. మూల మంత్రమును అంగ మంత్రములను కూడ అచట న్యాసము చేయవలయును. ఆగ్నేయాది విదిక్కులందు ధర్మాది పీఠపాదములు క్రమముగా రక్త పీత శ్యామ శ్వేత వర్ణములను భావనచేసి వాటిపై మంత్రాక్షర న్యాసముచేసి పూర్వాది దిక్కులందు ఆధర్మాదులను భావనచేసి వాటిపై అంగ మంత్రన్యాసము చేయవలెను. ఇట్లే యోగపీఠమును దానిపై అష్టదళ కమలమును సూర్య సోమ అగ్ని మండలములను సత్వాది గుణ త్రయమును భావన చేయవలెను. పూర్వాది దళములందు వామాది శక్త్యష్టకమును కర్ణికపై తొమ్మిదవ శక్తిని భావన చేయవలయును. వామా జ్యేష్టా రౌద్రీ కాళీ, కల వికారిణీ బల వికారిణీ బలప్రమథనీ సర్వ భూతదమనీ మనోన్మ నీయను ఈ శక్తులు జ్వాలా స్వరూపములు. వీటి వర్ణములు క్రమముగ శ్వేతరక్త, సితపీత, శ్యామ, అగ్ని, సదృశ, అసిత, కృష్ణ, అరుణములు. ఈ విధముగ భావన చేయవలెను.
అనంతయోగ పీఠముపై తన హృదయ పద్మములో నున్న శివుని ఆ ‘స్ఫటిక కాంతిని కలవాడు, నాలుగు బాహువులు కలవాడు, పంచవదనుడు త్రిలోచనుడు అగు శివుని ఆవాహన చేయుచున్నాను” అని చెప్పుచు ఆవాహన చేయవలెను. పిదప కమల దళములపై తత్పురుషాది పంచమూర్తులను స్థాపించవలెను. తూర్పున తత్పురుషుడు శ్వేతవర్ణుడు. అష్ట భుజుడగు అఘోరుడు కృష్ణ వర్ణుడు, సద్యోజాతుడు పశ్చిమమున ఉండును. ఆతనికి నాలుగుబాహువులు నాలుగు ముఖములు ఉండును. వర్ణము పీతము. వాసుదేవ రూపము స్త్రీతో ప్రకాశించును. అరుణ వర్ణుడగు ఇతడు నాలుగు ముఖములతో నాలుగు భుజములతో ఉత్తరమునందుండును. ఈశాన్య దిక్కునందున్న ఈశానునకు ఐదు ముఖములుండును. ఆతడు శ్వేతవర్ణుడు సర్వకామప్రదాత. పిదప అంగదేవతలను యథోచితముగ పూజించి పూర్వాది దిక్కులందు అనంత సూక్ష్మ సిద్ధేశ్వర ఏకనేత్రులను పూజించ వలెను. ఈశాన్యాదివిదిక్కులందు ఏకరుద్ర త్రినేత్ర శ్రీకంఠ, శిఖండులను పూజించవలెను. వీరందరకును విద్యేశ్వరులు. కమలాసనముపై కూర్చుందురు. వీరి శరీరకాంతి క్రమముగ శ్వేత పీత సిత రక్త ధూమ్ర రక్త అరుణ నీలములు. వీరందరును చతుర్భుజులు, శూల అశని, శర, చాపములను ధరించి ఉందురు. వీరికి ముఖములు కూడ నాల్గేసి ఉండును. తృతీయ అష్టదళ కమలమునందు ఉత్తరాది దళములపై ప్రదక్షిణ క్రమమున ఉమాచండీశ, నందీశ, మహాకాల, గణేశ్వర, వృషభ, భృంగిరిటి, స్కందులను పూజించవలెను. పిదప పూర్వాది దిక్కులందు చతురస్రరేఖపై ఇంద్రాది దిక్పాలకులను వారి అస్త్రములగు వజ్రశక్తి, ఖడ్గ, పాశ, ధ్వజ, గదా, శూల, చక్ర, పద్మములను పూజించవలెను. ఈ విధముగా దేవతా పూజచేసి గురువు అధివాసితుడగు శిష్యునిచే పంచ గవ్యపానము చేయించి, ఆచమ నానంతరము ఆతనిని ప్రోక్షించవలెను. పిదప నూతన వస్త్రముచే “వౌషట్” అని ఉచ్చరించుచు ఆతని నేత్రములు బంధించి మండప దక్షిణ ద్వారమున ప్రవేశము చేయించి కువాసనముపై కూర్చుండబెట్టి శోధనము చేయవలెను. పాంచ భౌతికతత్త్వముల సంహారము చేసి క్రమముగా శిష్యుని పరమాత్మ విలీనుని చేసి పిదప సృష్టి మార్గముచే యాతనిని మరల పుట్టించవలెను. పిదప శిష్యుని దివ్య శరీరముపై న్యాసముచేసి దక్షిణ క్రమమున పశ్చిమ ద్వారమునకు తీసుకొని వచ్చి వానిచే పుష్పాంజలి విసరునట్లు చేయవలెను. ఆ పుష్పములు ఏ దేవత శిరస్సుపై బడునో ఆ దేవత నామమును ఆదియందుంచి శిష్యునకు పేరు పెట్టవలెను. యజ్ఞ భూమి ప్రక్క సుందరమగు నాభియు మేఖలయు ఉన్న అగ్ని కుండమునందు శివాగ్నిని ఆవిర్భవింప చేసి తాను పూజించి శిష్యునిచేతకూడ పూజచేయించవలెను. ఆ శిష్యుని సంహార క్రమమున తనలో విలీనుని చేసుకొని మరల సృష్టి క్రమమున ఉత్పాదనముచేసి ఆతని హస్తమునందు అభిమంత్రితములగు కుశలు వుంచి హృదయాది మంత్రములతో పృథివ్యాదితత్త్వములను ఉద్దేశించి వాటి మంత్రములతో వంద చొప్పున హోమములుచేసి, ఆకాశ తత్త్వమునకు కూడ నూరు హోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చి అస్తమంత్రమును ఉచ్చరించుచు ఎనిమిది హోమములు చేయవలెను. పిదప, విశుద్ధి కొరకై ప్రాయశ్చిత్తము చేసి, అభిమంత్రితమగు కలశను పూజించి, పీఠముపైనున్న శిష్యునకు అభిషేకముచేసి, ఆతనికి సమయాచారము ఉపదేశింపవలెను. శిష్యుడు స్వర్ణాదులను ఇచ్చి గురువును పూజించవలెను. ఇది శివపంచాక్షరీ దీక్ష, విష్ణ్వాది దేవతామంత్ర దీక్షకూడ ఇట్లే చేయవలెను. (304)
