అగ్ని మహా పురాణము

Table of Contents

అర్థాలంకార వర్ణనము-1

అగ్నిదేవుడు పలికెను:

అర్థములను అలంకరించుట అర్థాలంకారము. అది లేనిచే శబ్ద సౌందర్యము కూడ మనోహరముగా ఉండదు. అర్థాలంకార హీనమగు వాక్కు నాథుడులేని స్త్రీ వంటిది. స్వరూపము, సాదృశ్యము ఉత్ప్రేక్ష, అతిశయము, విభావనా, విరోధము, హేతువు, సమమని అర్థాలంకారములు ఎనిమిది విధములు. పదార్థముల స్వభావమునకు స్వరూపమని పేరు. నిజము ఆగంతుకమని అది రెండు విధములు. పుట్టుకతో వచ్చినది నిజము. నిమిత్తమును బట్టి వచ్చినది ఆగంతుకము. ధర్మ సామ్యమునకు సాదృశ్యమని పేరు. అది ఉపమా, రూపకము. సహోక్తి అర్ధాంతర న్యాసము అని నాలుగు విధములు. భేదము, ఉపమానోపమేయములకు సామాన్య ధర్మ బంధము వున్నచో అది ఉపమా. ఏదియో కొంత సాదృశ్యమును ఆధారముగా తీసుకొని లోకయాత్ర నడుచుచున్నది. ససమాస, అసమాసయని ఉపమా రెండు విధములు. ఉపమానము సమస్తమైనచో ససమాస. అట్లుకానిచో అసమాస. ఉపమాద్యోతక పదములుగాని, ఉపమేయ వాచకములుగాని రెండును గాని లోపించగా ససమాస మూడు విధములగును. అసమాస కూడ మూడు విధములు. విశేషణములతో యుక్తమైనపుడు ఉపమాపదునెనిమిది విధములగును. సాధారణ ధర్మమును చెప్పు ఉపమలో ఆ ధర్మమునకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ధర్మోపమా, వస్తు ప్రాధాన్యమును బట్టి వస్తూపమా. ఉపనోపమేయముల ప్రసిద్ధిని బట్టి పరస్పరము సామ్యము చెప్పినచో అది పరస్పరోపమా ప్రసిద్ధికి విరుద్ధముగా ఉపమానోపమేయములలో వైషమ్యము ఉన్నచో విపరీతోపమా. ఒక వస్తువుతో మాత్రమే సామ్యము చెప్పి ఇతర ఉపమానములను నిషేధించినచో నియమోపమా. ఉపమేయము యొక్క గుణాదులు ఉపమానాంతరము నందు గూడ అనువృత్తములైనచో అనియమోపమా.

ఒకటికి మించిన ధర్మములను చెప్పినచో సముచ్చయోపమా, అనేక ధర్మములలో సామ్యమున్నను, ఉపమానము కంటే ఉపమేయమునందు వైలక్షణ్యమున్నట్లు చెప్పినచో అది వ్యతిరేకోపమ అనేక ఉపమానములు చెప్పినచో బహూపమా. ఆ ఉపమానములలో వేర్వేరు సాధారణ ధర్మములున్నచో మాలోపమా. ఉపమేయమును ఉపమాస వికారముగా చెప్పి పోల్చినచో విక్రియోపమా. ఉపమానమునందు లోకత్రయమునందును అసంభావ్యమగు ఒక వైశిష్ట్యమును ఆరోపించి కవి వర్ణించినచో అది అద్భుతోపమా. ఉపమానమును ఆరోపించి ఉపమేయము తదభిన్నమని చెప్పి తద్వారా భ్రమ కల్గినట్లు వర్ణించుట మోహోపమా, రెండు వస్తువుల మధ్య వాటి స్వరూపమును గుర్తించుటకు శక్యము గానిచో సంశయోపమా. మొదట సంశయము కలిగి పిదప నిశ్చయము కలిగినచో నిశ్చయ ఉపమ. ఒక వాక్యార్థమును మరొక వాక్యార్థమునకు ఉపమగా వర్ణించినచో వాక్యార్థోపమా, ఉపమానమును బట్టి సాధారణీ, అతిశాయినీ అని ఉపమ రెండువిధములు. ఉపమేయమే ఉపమానమైనచో అది అన్యోన్యోపమ. ఈ విధముగా ఉత్తరోత్తరము నడచినచో గమనోపమా. ప్రశస్తము, నింద, కల్పితము, సదృశి, కించిత్స దృశి అని మరల ఉపమలో ఐదు భేదములు ఉండును. గుణసామ్యముచే ఉపమేయ స్వరూపమునకు, ఉపమాన స్వరూపమునకు అభేదమును ప్రతిపాదించినచో రూపకాలంకారము లేదా భేదముతో రోహితమైనపుడు ఉపమయే రూపకము. తుల్య ధర్మములగు రెండు పదార్థములు కలిసి ఉన్నట్లు వర్ణించిన సహోక్తి.

పూర్వ వర్ణితమగు వస్తువును సమర్థించుటకై సాధర్మమును కాని వైధర్మ్యమును గాని పురస్కరించుకొని మరియొక అర్థమును ఉపన్యసించుట అర్థంతరన్యాసము. సచేతనమగు పదార్థము లేదా అచేతన పదార్థము ఒక విధముగా ఉండుటను, మరొక విధముగా ఊహించినచో ఉత్ప్రేక్షాలంకారము, లోకాతీతముగా వర్ణించుట, అతిశయాలంకారము సంభవము అసంభవము అని రెండు విధములు. గుణ, జాతి, క్రియాదుల లోపమును చెప్పుట ద్వారా ఒక వస్తువునందలి విశేషమును వర్ణించినచో విశేషోక్తి. ప్రసిద్ధమైన కారణమును నిరాకరించి మరియొక కారణమును కాని, స్వాభావిక రూపమున కార్యోత్పత్తిని కాని ఊహించినచో విభావనాలంకారము. పరస్పర విరుద్ధములగు పదార్థములను కలిసియున్నట్లు యుక్త పూర్వకముగా వర్ణించుట విరోధాలంకారము. అభిలషితార్థ సాధక నిమిత్త వర్ణనము హేత్వలంకారము. కారకము జ్ఞాపకము అని ఇవి రెండు విధములు. కారక హేతువు కార్య జన్మమునకు పూర్వమునందును, తరువాతను ఉండును. దీనికి పూర్వశేషమను పేరు. ఈ భేదములందే కార్యకారణ భావముచే గాని, నియామ కమగు స్వభావముచే గాని, అవినాభావ దర్శనముచే గాని, అవినాభావ నియమము వున్నచో అది జ్ఞాపక హేతువు. నదీ పూరాది దర్శనము జ్ఞాపకమునకు ఉదాహరణము. (344)