అగ్ని మహా పురాణము

Table of Contents

రత్న పరీక్షా కథనము

అగ్నిదేవుడు పలికెను: ద్విజశ్రేష్ఠా! ఇపుడు రత్నముల లక్షణములు చెప్పెదను. రాజు, వజ్ర, మరకత, పద్మరాగ, ముక్తా, మహానీల, ఇంద్రనీల, వైదూర్య, గంధసస్య, చంద్రకాంత, సూర్యకాంత, స్ఫటిక, పులక, కర్కేతన, పుష్పరాగ, జ్యోతీరస, రాజపట్ట, రాజమయ, శుభసౌగంధిక, గంజు, శంఖ, బ్రహ్మమయ, గోమేద, రుధిరాక్ష, భల్లాతక, ధూలీ, మరకత, తుష్యక, సీస, పీలు, ప్రవాళ, గిరివజ్ర, భుజంగమణి, వజ్రమణి, టిట్టిభ, భ్రామర, ఉత్పలములను రత్నములను ధరించవలెను. మధ్యకాంతిగలవి, నిర్మలములు, మంచి ఆకారముగలవి అగు రత్నములను మాత్రమే ధరించవలెను. ప్రభావిహీనములు, మలినములు, ఖండితములు, బీటలు తీసినవి అగువాటిని ధరింపరాదు. అన్ని రత్నము లందును హీరమును ధరించుట ఉత్తమము. నీటిలో తేలునది, అభేద్యము, షట్కోణము, ఇంద్రధనస్సువలె నిర్మల ప్రభాయుక్తము, తేలికయైనది, సూర్యసమాన తేజము, లేదా చిలుక రెక్కల రంగు గలదియగు వజ్రము శుభకరము. సువర్ణ చూర్ణసమానమైన సూక్ష్మ బిందువులుగల మరకతమణి శ్రేష్ఠము. స్ఫటికము అత్యంత నిర్మలముగనున్నచో శ్రేష్ఠము. ఆరుణమగు పద్మరాగము శ్రేష్ఠము. ముత్యములు ముత్యపు చిప్పలలో పుట్టును. వాటికంటె శంఖము నుండి పుట్టినవి నిర్మలములు, ఉత్కృష్టములు అని చెప్పబడినది. ఋషిప్రవరా! గజదంతముల నుండియు, గజకుంభముల నుండియు, సూకర, మత్స్య, వేణునాగముల నుండియు, మేఘముల నుండియు ఉత్పన్నములైనవి అత్యంత శ్రేష్ఠములు. ముత్యములలో వృత్తత్వము, తెలుపు, స్వచ్ఛత్వము, మహత్వము అను గుణములుండును. ఉత్తమమైన ఇంద్రనీలమణిని పాలలో ఉంచగా అది చాల ప్రకాశవంతముగ నుండును. తమ కాంతిచే అంతను రంజింపజేయు రత్నములు అమూల్యములు. నీల-రక్త కాంతిగల వైదూర్యము శ్రేష్ఠము. ఇట్టి దానిని హారములో కూర్చుకొనవచ్చును. (246)