అగ్ని మహా పురాణము

Table of Contents

యుద్ధజయార్ణవము-నానాయోములు

ఇపుడు యుద్ధజయార్ణవ ప్రకరణము నందు, విజయాది శుభకార్యసిద్ధికె, ప్రధాన విషయములను చెప్పెదను, అ, ఇ, ఉ, ఏ, ఓ-ఈ ఐదును స్వరములు. వీటి క్రమము ననుసరించి నందా, భద్రా, జయా, రిక్తా, పూర్ణా అను తిథులు ఉండును. ‘క’ మొదలు ‘హ’ వరకును వర్ణములు వెనుక చెప్పిన స్వరములకు క్రమముగ సూర్య, మంగళులు, బుధ-చంద్రులు, బృహస్పతి-శుక్రులు, శని-మంగళులు అధిపతులు, 40ని 60చే గుణించ వలెను. దానిని పదకొండుచే భాగించవలెను. లబ్ధమును ఆరుచే గుణించి దాని ఫలమును మరల 11చే భాగించవలెను. లబ్ధమును మూడుచే గుణించి, దాని ఫలమునందు ఒకటి కలుపగా అన్ని పర్యాయములు నాడీస్ఫురణమును బట్టి ఫలము ఏర్పడును. దాని పిదప కూడ రాత్రింబగళ్లు నాడీస్ఫురణము అగుచుండును. ఉదా: 40 X 60 = 2400; 2400/11 = 219. ఈ లబ్ధము స్వల్పాంతరముచే ఏర్పడినది. దీనిని 6చే గుణించగా 219 X 16 = 1314. దీనిని మరల 11చే భాగించగా 1314/11 = 119.శేషమైన 5ను విడచివేయవలెను. లబ్ధమైన 119ని 3చే గుణించగా గుణనఫలము 357. దీనికి 1 కలపగా 358. కొంచెము అంతరముచే దీనిని 360గా గ్రహించవలెను. అనగా చేతి నాడి 360 సార్లు కొట్టుకొనుటను బట్టి ఫలమగును. దానిని గుర్తించు పద్ధతి మున్ముందు చెప్పబడును. ఈ విధముగా నాడీ స్ఫురణము రాత్రింబగళ్ళు అగుచునే ఉండును. దాని మానము ననుసరించియే అకారాది స్వరములు ఉదయించుచుండును. మూడు స్ఫురణములచే ఒక ఉచ్ఛ్వాసము. ఆరు ఉచ్ఛ్వాసములు ఒక పలము. 60 పలములు ఒక లిప్త. అనగా ఒక దండము (ఘడియ). 60 దండములు ఒక అహోరాత్రము. అ, ఇ, ఉ, ఏ, ఓ లకు వరుసగ బాల, కుమార, యువ, వృద్ధ, మృత్యువు అని ఐదు పేర్లు. వీటిలో ఏదైన ఒక స్వరము ఉదయించిన పిదప మరల దాని ఉదయము ఐదవ ఖండముపై అగును. ఉదయమునకు ఎంత సమయము పట్టునో అస్తమునకు కూడ అంత సమయమే పట్టును. వీటి ఉదయాస్త కాలముల మానము 60 దండముల ఏకాదశాంశమునకు సమానము. ఒక స్వరము ఉదయించిన పిదప రెండవ స్వరము 5 దండముల 27 పలముల తరువాత అగును. ఈ విధముగ ఐదు స్వరముల ఉదయాస్తములు తెలియవలెను. మృత్యు స్వరోదయ సమయమున యుద్ధము చేసినచో పరాజయముతో పాటు మృత్యువు కూడా కలుగును. శని చక్రము నందు 15 దినములందు క్రమముగా గ్రహోదయము జరుగుచుండును. ఈ పంచదశ విభాగానుసారము శనిభాగమునందు యుద్ధము మృత్యుదాయకము. దశకోటి సహస్ర త్రయోదశ లక్షలకు దాని దశమాంశము కలుపగా ఎంత సంఖ్య వచ్చునో అన్ని యోజనముల ప్రమాణముగల కూర్మ రూప శని బింబ పృష్ఠమునకు క్షేత్ర ఫలమేర్పడును. మఘా ప్రథమ చరణమునుండి కృత్తిక ఆది నుండి అంతమువరకు శని నివాసము తన స్థానమునందుండును. ఆ సమయమునందు యుద్ధము చేయుట మంచిది కాదు. రాహు చక్రము కొరకు ఏడు నిలువు గీతలు, ఏడు అడ్డగీతలు గీయవలెను. దానిపై వాయవ్యము నుండి నైరృతి మీదుగా అగ్ని కోణము వరకును శుక్లపక్ష ప్రతిపత్తు మొదలు పూర్ణిమ వరకునున్న తిథులను వ్రాయవలెను. ఆగ్నేయమునుండి ఈశాన్యము మీదుగా వాయవ్యము వరకును, కృష్ణపక్ష ప్రతిపత్తు మొదలు అమావాస్య వరకును తిథులు వ్రాయవలెను. ఈ విధముగ తిథిరూప రాహున్యాస మేర్పడును. దక్షిణమున ‘రా’ను, ‘హును వాయవ్యము నందును వ్రాయవలెను. ప్రతిపదాది తిథులతో కకారాద్యక్షరములు కూడ వ్రాయవలెను. నైరృతియందు సకారము వ్రాయవలెను. ఈ విధముగ రాహు చక్రమేర్పడును. రాహు ముఖము నందు యాత్ర చేసినచో యాత్రా భంగమగును. 

పౌర్ణమి యందు భద్రయొక్క పేరు ‘విష్టి’. అది ఆగ్నేయము నందు ఉండును. తృతీయనాడు భద్ర పేరు ‘కరారి’. అది తూర్పున ఉండును. సప్తమినాడు భద్ర పేరు ‘ఘోర’. అది దక్షిణమునందు ఉండును. సప్తమీ-దశముల యందు భద్ర క్రమముగ ఈశాన్య-ఉత్తరములందు ఉండును. చతుర్దశినాడు వాయవ్యమునందును, చతుర్థియందు పశ్చిమమునందును, శుక్ల అష్టమి-ఏకాదశులందు దక్షిణము నందును ఉండును. దీనిని అన్ని శుభకార్యములందును పరిత్యజించవలెను. రౌద్ర, శ్వేత, మైత్ర, సారభట, సావిత్రి, విరోచన, జయదేవ, అభిజిత్, రావణ, విజయ, నంది, వరుణ, యమ, సౌమ్యభవులు పదిహేను ముహూర్తములు. రౌద్రముహూర్తమునందు భయానకములగు కార్యములు చేయవలెను. స్నానాది కార్యములు శ్వేత ముహూర్తము నందు చేయవలెను. కన్యా వివాహమునకు మైత్రముహూర్తము శుభకరము. సారభట ముహూర్తమునందు శుభ కార్యములును, సావిత్ర ముహూర్తమున దేవతాస్థాపనమును, విరోచన ముహూర్తమునందు రాజకీయ కార్యములును, జయదేవ ముహూర్తమునందు విజయమునకు సంబంధించిన కార్యములును, రావణ ముహూర్తమునందు సంగ్రామమును, విజయ ముహూర్తమునందు కృషి-వ్యాపారములను, నందీ ముహూర్తమున షట్కర్మలను, వరుణ ముహూర్తమునందు తటాకాది నిర్మాణమును, యమ ముహూర్తమునందు వినాశకర కార్యములను, సౌమ్య ముహూర్తమునందు సౌమ్యకార్యములను చేయ వలెను. భవ ముహూర్తమునందు అహోరాత్రములు శుభలగ్నమే. అందుచేత దానియందు శుభకార్యములు అన్నియు చేయవలెను. ఈ విధముగ ఈ పదునైదు ముహూర్తములు శుభాశుబ హేతుత్వము వాటి పేర్లను బట్టి యుండును. రాహువు తూర్పున వాయవ్యమువరకును, వాయవ్యము నుండి దక్షిణము వరకును, దక్షిణమునుండి ఈశాన్యమువరకును, ఈశాన్యము నుండి పశ్చిమము వరకును. పశ్చిమము నుండి ఆగ్నేయమువరకును, ఆగ్నేయము నుండి ఉత్తరము వరకును మూడేసి దిక్కుల చొప్పున నాల్గు ఘడియలలో భ్రమణము చేయును.

చండీ, ఇంద్రాణీ, వారాహీ, ముశలీ, గిరికర్ణికా, బలా, అతిబలా, క్షీరీ, మల్లిగా, జాతీ, యూథికా, శ్వేతార్క శతావరీ, గుడూచీ, వాగురీ నామకములగు దివ్యోషధులను యథాప్రాప్తముగ ధరించినచో యుద్ధమునందు విజయము లభించును. ‘ఓం నమో భైరవాయ ఖడ్గ పరశు హస్తాయ ఓం హుం విఘ్న వినాశాయ ఓం హుం ఫట్’ అను మంత్రముతో శిఖను బంధించి యుద్ధము చేసినచో తప్పక విజయము లభించును. ఇపుడు (యుద్ధమున విజయమునిచ్చు) తిలక, అంజన, ధూప, ఉపలేప, స్నాన, పాన, తైల, యోగ చూర్ణాదులను గూర్చి చెప్పెదను వినుము. సుభగా, మనఃశిలా, తాళములను లాక్షారసమునందు కలిపి, స్త్రీ చనుబాలతో రంగరించి, లలాటమునందు తిలక ముంచుకున్నచో శత్రువు వశంగతుడగును. విష్ణుక్రాంతా, సర్పాక్షీ, సహదేవీ, రోచనలను మేక పాలతో నూరి తిలకముగ ధరించినచో శత్రువులు లొంగిపోవుదురు. ప్రియంగు, కుంకుమ, కుష్ఠ, మోహినీ, తగర, ఘృతములు కలిపి తిలకము ధరించినచో అది వశ్యకరము. రోచనా, రక్తచందన, నిశా (పసుపు) మనఃశిలా, తాల, ప్రియంగు, సర్షప, మోహినీ, దూర్వా, విష్ణుక్రాంతా, సహదేవా, శిఖలను ఓషధులను మాతులుంగ రసమునందు నూరి లలాటమునందు ఉంచిన తిలకము వశకరము. ఈ తిలకములచే ఇంద్రునితో సహదేవతలు కూడ వశమగుదురు. ఇక క్షుద్రులగు మానవుల విషయము చెప్పవలెనా? మంజిష్ఠా, రక్తచందన, కటుకందా, విలాసినీ, పునర్నవలను కలిపి లేపము చేసినచో సూర్యుడుకూడ వశమగును. మలయచందన, నాగపుష్ప, మంజిస్ఠా, తగర, వచాలోధ్ర, ప్రియంగు, రజనీ, జటామాంసుంను కలిపి తయారుచేసిన తైలము వశంకరము.(123)