అగ్ని మహా పురాణము
ధనుర్వేద వర్ణనము -1
అగ్నిదేవుడు పలికెను: వశిష్ఠా! ఇప్పుడు నాలుగు పాదములుగల ధనుర్వేదమును గూర్చి చెప్పెదను. ధనుర్వేదము నాలుగు విధములు: రథములు, గజములు, అశ్వములు, పదాతులు-ఈ యోధులను బట్టి దీనిని వర్ణించవచ్చును. యంత్రముక్తము, పాణిముక్తము, ముక్త సంధారితము, అముక్తము, బాహుయుద్ధము అనునవి ధనుర్వేదము నందలి ఐదు ప్రకారములు. అందును శస్త్ర సంపత్తి-అస్త్ర సంపత్తులచే యుద్ధము రెండు విధములు. ఋజుయుద్ధము, మాయాయుద్ధము అని మరల రెండు భేదములు. క్షేపణి (విసరునది) ధనస్సు, యంత్రము మొదలగు వాటిచే విడువబడునది ‘యంత్ర ముక్తము’. శిలాఖండము, తోమరము మొదలగునవి ‘పాణి ముక్తములు’. శత్రువుమీద విసరి మరల గ్రహింపబడు బల్లెము మొదలగునవి ‘ముక్త సంధారితములు’. ఖడ్గాదులు ‘అముక్తములు’, అస్త ప్రయోగము లేకుండ కలియబడిచేయు యుద్ధము ‘నియుద్ధము’ లేదా ‘బాహు యుద్ధము’. యుద్ధము చేయగోరువాడు శ్రమను జయించి, యోగ్యములగు శస్త్రములను సంగ్రహించు కొనవలెను. ధనుర్బాణముల ప్రయోగమునయుద్ధము సర్వశ్రేష్ఠము. బల్లెముల యుద్ధము మధ్యమము. ఖడ్గయుద్ధము అధమము. బాహుయుద్ధము అత్యంత నికృష్టము. ధనుర్వేదమున క్షత్రియవైశ్యులకు ఇరువురికిని బ్రాహ్మణుడే గురువు. ఆపత్సమయమున శూద్రుడు కూడ యుద్ధా భ్యాసముచేసి యుద్ధము చేయవలెను. దేశములో నున్న వర్ణసంకరులు కూడ యుద్ధ సమయమున రాజునకు సాహాయ్యము చేయవలెను.
అంగుష్ఠములు, మణవలు, గుల్పములు, పాదములు ఒకే వైపునకుండి పరస్పరము దూరముగా నున్నచో అది ‘సమపద స్థానము’. రెండు పాదములును వ్రేళ్ళ బలముపై నిలచి, మోకాళ్లు బిగియబిట్టి ఉండగా రెండు పాదముల మధ్యభాగము మూడు జానలున్నచో అది ‘వైశాఖ స్థానము’. రెండు మోకాళ్ళు హంస పంక్త్యాకారమున కనబడుచు నాలుగు జానల ఎడముననున్నచో అది ‘మండల స్థానము’. కుడికాలు మోకాలు ముందుకు చాపగా రెండు పాదముల మధ్య ఐదు జానలున్నచో అది ‘ఆలీఢము’. దీనికి విపరీతముగా ఎడమకాలు చాపినపుడు ‘ప్రత్యాలీడము’. కుడికాలు వంకరగను, ఎడమకాలు అవక్రముగను రెండు పాదముల గుల్ప పార్ష్ణిభాగముల ఎడమ ఐదు అంగుళములున్నచో ఇది పండ్రెండు అంగుళముల ‘పెద్ద స్థానకము’. ఎడమ మోకాలు అవక్రముగా నుండి, కుడికాలు బాగుగా చాపినను, లేదా, కుడి మోకాలు వంగి నిశ్చలముగానున్నను లేదా మోకాలితోపాటు కుడికాలు దండాకారమున విశాలముగ కనబడినను ‘వికటము’ అను స్థానకము. దీనిలో రెండు పాదముల నడుమ రెండు హస్తములు ఎడముండును. రెండు మోకాళ్ళు కలిసి, ఉత్తానములైనచో అది ‘సంపుట’ స్థానము. కొంచెము తిరిగిన రెండు పాదములు సమ భావముతో దండమువలె విశాలముగను, స్థిరముగను కనబడినచో ఆ రెండు పాదములు సమభావముతో దండమువలె విశాలముగను, స్థిరముగను కనబడినచో ఆ రెండింటి మధ్య పొడవు పదునారు అంగుళములు ఉండును. ఇది స్థానముల యథోచిత స్వరూపము.
వశిష్ఠా! యోధులు ముందుగా ఎడమ చేత ధనస్సును, కుడిచేత బాణములు ధరించి, విడచిన బాణములు స్వస్తి కాకారమున నుండునట్లు చేసి వాటితో గురుజనులకు నమస్కారము చేయవలెను. ధనుర్ధారియగు యోధుడు వైశాఖ స్థానమున స్థిరముగ నిలచి, స్థిత్యాయతులందు, (వర్తమాన భవిష్యత్తులందు) ఆవశ్యకత ఏర్పడినపుడు ధనస్సుపై నారిని విస్తరించి, ధనస్సు యొక్క క్రింది అగ్రమును బాణఫలమును భూమిపై ఆన్చి మూర్లతోను, మణిబంధములతోను కొలవవలెను. ఓ ఉత్తమవ్రతపాలకా! ఆ యోధుని బాణము కంటె ధనస్సు సర్వదా పెద్దదిగా నుండవలెను. పిడికిలికి ఎదుట బాణ పుంఖమునకును, ధనుర్దండమునకును మధ్య పండ్రెండు అంగుళములు దూరముండవలెను. ఇట్లున్నపుడు ధనస్సుకు నారి కట్టవలెను, ఇంతకంటె ఎక్కువగాని తక్కువగాని ఉంచరాదు, ధనస్సును నాభిస్థానము నందును, బాణమును నితంబము నందును ఉంచి, ఎత్తిన హస్తమున కంటికి చెవికి మధ్య ఉంచి, అట్టి స్థితిలో బాణము విడువవలెను. మొదట బాణమును పిడికిలి యందు పట్టుకొని దానిని దక్షిణ స్తనాగ్రమునకు ఎదురుగా ఉంచవలెను. పిదప దానిని నారిపై ఉంచి, నారిని పూర్తిగా లాగి పూర్తిగా విస్తరింప చేయవలెను. నారిలోనికి గాని, బైటకు గాని, ఎత్తుగా గాని, క్రిందుగా గాని, బోర్లపడి గాని, ఉత్తానముగ గాని, చంచలము గాని, అత్యంతావేష్టితము గాని కాకూడదు. అది సమముగను, స్థిరముగను, దండమువలె ఋజువు గను ఉండవలెను. ఈ విధముగ ముష్టితో లక్ష్యమును ఆచ్ఛాదించి బాణమును విడువవలెను.
ధానుష్కుడు ప్రయత్న పూర్వకముగ పక్షమును ఎత్తుగా నుంచి శరీరము త్రికోణాకారముగ నుండునట్లు వంగవలెను. భుజములు శిథిలముగ నుండి కంఠము నిశ్చలమై, శిరస్సు మయూర శిరస్సువలె ప్రకాశించవలెను. లలాట, నాసికా, ముఖ, బాహు, మూల కూర్పరములు సమావస్థలో నుండవలెను. గడ్డమునకును భుజమునకును మధ్య మూడు అంగుళముల వ్యవధానముండవలెను. ఈ వ్యవధానము మొదట మూడు అంగుళములు, తరువాత రెండు అంగుళములు, తరువాత ఒక అంగుళము అని చెప్పబడినది. బాణ పుంఖమును తర్జన్య అంగుష్ఠములతో పట్టుకొనవలెను. పిదప మధ్యమ -అనామికలతో కూడ పట్టుకొనవలెను. పూర్తి బాణమంతయు ధనస్సుపైకి వచ్చునంత వరకును వేగపూర్వకముగా లాగవలెను. ఈ విధముగ ఉపక్రమించి బాణమును విధి పూర్వకముగ విడువవలెను. ఓ సువ్రతా! దృష్టిచేతను ముష్టిచేతను ముందుగ అహతమగు లక్ష్యమునే బాణముచే భేదించవలెను. బాణము విడచిన హస్తమును శత్రువు భేదించకుండుటకై వెంటనే దానిని వీపువైపునకు ఉంచుకొనవలెను. అందుచే ధానుష్కుడు ధనస్సును లాగి మోచేతికి క్రిందుగా, నుంచి బాణమువిడచు సమయమున దానిని పైకి తేవలెను. ధనుః శాస్త్రజ్ఞులు ఈ విషయమును బాగుగా గుర్తు ఉంచు కొనవలెను. మోచేతిని కనబడకుండ ఉంచుట మధ్యమ రక్షణోపాయము, శత్రు లక్ష్యము కాకుండ ఉంచుకొనుట ఉత్తమము, పండ్రెండు ముష్టుల పొడవుగల బాణము ఉత్తమము, పదునొకండు ముష్టుల పొడవుగలది మధ్యమము, పదిముష్టులు అధమము, నాలుగు హస్తముల పొడవుగల ధనస్సు ఉత్తమము, మూడున్నర హస్తములు మధ్యమము, మూడు హస్తములు అధమము, పదాతులు సర్వదా మూడు హస్తములు ధనస్సును మాత్రమే ఉపయోగించవలెను. అశ్వము, రథము, గజము ఎక్కి యుద్ధము చేయువారు ఉత్తమ ధనస్సునుమాత్రమే ఉపయోగించవలెను. (249)
