అగ్ని మహా పురాణము

Table of Contents

వ్యవహార కాండమున దివ్యములు

అగ్నిదేవుడు చెప్పెను: తపస్వులు, కులీనులు, దానశీలులు, సత్యవాదులు, కోమల హృదయులు, ధర్మాత్ములు, పుత్రయుక్తులు, ధనవంతులు, పంచయజ్ఞములు చేయువారు అయిన ఐదుగురుగాని, ముగ్గురుగాని సాక్షులు ఉండవలెను. వారు జాతి వర్ణానుసారముగ ఉండవలెను. లేదా అందరికిని అందరును ఉండవచ్చును. స్త్రీలు, బాలకులు, వృద్ధులు, జూదరులు, మత్తులో ఉన్నవారు, ఉన్మత్తులు, పాతకులు, నటులు, పాషండులు, పంచకులు, వికలమైన ఇంద్రియములు కలవారు, పతితులు, ఆప్తులు, అర్థ సంబంధము కలవారు, సహాయకులు, శత్రువులు, చోరులు, సాహసవంతులు, దోషులుగ పరిగణింపబడినవారు, బంధ్వాది పరిత్యక్తులు సాక్షులుగా ఉండుటకు అర్హులుకారు. వాది ప్రతివాదులు ఇరువురును అంగీకరించినచో ధర్మవేత్తయగు ఒక్క వ్యక్తియే సాక్షిగ ఉండవచ్చును. స్త్రీని బలాత్కరించుట, దొంగతనము చేయుట, ఎవరైన నిందించుట, కఠిన దండనము వేయుట, మొదలగు దుస్సాహస కార్యములందు అందరిని సాక్షులుగా గ్రహింపవచ్చును.

సాక్ష్యము చెప్పని వానిచే రాజు నలుబది ఆఱవరోజున పదవవంతు అధికముగా కలిపి ఋణమును ధనికునకు ఇప్పించవలెను. తెలిసి కూడ సాక్ష్యము చెప్పని నరాధమునకు అసత్యముగా సాక్ష్యము చెప్పిన వానికి వచ్చు పాపము వచ్చును. ఆతనిని కూడ సాక్షిని శిక్షించునట్లు శిక్షించవలెను. పాపములు చేసిన వారికిని, మహా పాతకములు చేసిన వారికిని, గృహదానము చేసిన వారికిని, స్త్రీ బాల ఘాతుకులకును ఏ లోకములు వచ్చునో కూట సాక్ష్యము చెప్పిన వానికి కూడ ఆ లోకములే ప్రాప్తించును. నీవు అసత్యముగా సాక్ష్యము చెప్పి ఎవరిని పరాభవింప చూచుచున్నావో వానికి నీవు నూరు జన్మములలో చేసిన పుణ్యములు అన్నియు చేరిపోవును’ అని వాది ప్రతివాదుల సమీపము నందున్న సాక్షులకు చెప్పవలెను. చాలమందితో అభిప్రాయభేదము వచ్చినప్పుడు గుణవంతుల సాక్ష్యమును అంగీకరించవలెను. గుణవంతుల మధ్య భేదము వచ్చినపుడు అధిక గుణవంతుల సాక్ష్యమును గ్రహించవలెను. సాక్షులు ఎవని మాటను సమర్థింతురో ఆతనికి జయము కలుగును. వ్యతిరేకముగా ఇచ్చినచో ఆతడు పరాజయము పొందును.

మొదట కొందరు సాక్షులు సాక్ష్యము చెప్పినను తరువాత అధిక గుణవంతులు కొందరుగాని రెట్టింపు సంఖ్యకల వారుగాని మరొకవిధముగా సాక్ష్యము చెప్పినచో పూర్వము సాక్ష్యము చెప్పిన వారు కూట సాక్షులగుదురు. కూటసాక్షులను ఒక్కొక్కరిని వివాదాస్పదమైన ధనముకంటె రెట్టింపు ధనము దండించవలెను. కూటసాక్షి బ్రాహ్మణుడైనచో ఆతనిని దేశమునుండి వెడలగొట్టవలెను. ఇతరులు చెప్పిన సాక్ష్యమును కప్పిపుచ్చిన వానినుండి ఎనిమిదిరెట్ల ధనమును దండముగా గ్రహించవలెను. బ్రాహ్మణుడైనచో దేశము నుండి బహిష్కరించవలెను. వర్ణములవారికి వధ ప్రాప్తించు సందర్భమునందు సాక్షి అసత్యముకూడ చెప్పవచ్చును. ధనికుడును, అధమర్ణుడును (ఋణమును తీసుకున్న వాడు) పరస్పరాంగీకార పూర్వకముగా ఋణము తీసికొనిన ధనమును గూర్చి సాక్షులతో పత్రముపై వ్రాయించుకొనవలెను. ఆ పత్రముపై సంవత్సరము, మాసము, పక్షము, దినము, పేరు, జాతి, వారి గోత్రము, వారి మిత్రులు, బంధువులు, తండ్రులు, మొదలగు వారి పేర్లు కూడ వ్రాయవలెను. వ్రాయుట పూర్తియగు పిమ్మట ఋణగ్రహీత అముకుని (ఫలానావారి) పుత్రుడనైన నాకు ఈ పత్రముపై వ్రాసినది అంగీకార్యమే అని చేవ్రాలు చేయవలయును. సాక్షులందరును అముకుడనైన నేను దీనికి సాక్షినియని తమతమ తండ్రుల పేరు కూడ నిర్దేశించుచు హస్తాక్షరములు ఉంచవలెను అధమర్ణుడు లిపిజ్ఞానము లేనివాడైనచో అతడు అందరి సాక్షుల యెదుట తన మతమును వ్రాయించవలెను. సాక్షి అందరి సాక్షుల యెదుట అముకుడి కుమారుడనైన నేను ఇరువురును కోరగా వ్రాయుచున్నాను అని ప్రారంభించి లేఖకార్థమును వ్రాయవలెను. స్వహస్త లిఖితమైన లేఖ్యము సాక్షులు లేకపోయినను ప్రమాణమే. కాని బలాత్కారముచేత గాని, మోసముచేత గాని వ్రాయించబడినది ప్రమాణముకాదు. లేఖ్య పూర్వకమైన ఋణమును మూడు తరముల వరకును చెల్లించవలసియుండును. తాకట్టు పెట్టిన వస్తువును దానిపై తీసుకొనిన ఋణము తీర్చనంతవరకు ధనికుడు అనుభవించవచ్చును. లేఖ్యము వ్రాసిన వాడు దేశాంతరమునందు ఉన్నను లేఖ్యము నష్టమైనను తుడిచివేయబడినను, హరింపబడినను భిన్నమైనను ఛిన్నమైనను దగ్ధమైనను మరొక లేఖ్యమును వ్రాయించవలెను. లేఖ్యము సందిగ్ధముగా నున్నపుడు మరల మరొక లేఖ్యము వ్రాయ వలెను. లేఖ్యమునకు శుద్ధి, యుక్తి ప్రాప్తిచేతను (ఆ దేశ కాలములలో ఆతని వద్ద ఇంత ధనము ఉండుటకు అవకాశమున్నది అని యుక్తిచేతను) క్రియ (సాక్షుల హస్తాక్షరములు) చేతను చిహ్నముల చేతను (ప్రత్యేకముగా ఉపయోగించిన గుర్తులు) ధనిక ఋణ గ్రహీతల సంబంధము చేతను వారి ధనప్రాప్తి సంభావ్యమే అను ఆగమము చేతను నిర్ణయింపబడును. ఋణములోని కొంత ధనము చెల్లించినప్పుడెల్ల ధనికుడు ఆ లేఖ్యము వెనుక వైపున చెల్లించిన ధనమును వ్రాసి హస్తాక్షరములు ఉంచ వలెను. ఋణము పూర్తిగ చెల్లించివేసినప్పుడు అలేఖ్యమును చింపివైచి చెల్లించినట్లుగా ధనికుడి నుండి పత్రమును పొందవలెను. సాక్షులు ఉన్నపుడు తీసుకున్న ఋణమును వారి యెదుటనే చెల్లించవలెను.

ధర్మశాస్త్రములలో సందిగ్ధమైన విషయమును నిర్ణయించుటకై తుల, అగ్ని, జలము, విషము, కోశము అను ఐదు దివ్య ప్రమాణములు చెప్పబడినవి. అభియోగము చాల తీవ్రమైనపుడున్న అభియోక్త వ్యవహారము చివరనున్నపుడును వీటిని ప్రయోగించవలెను. వాది ప్రతివాదులు అంగీకరించి ఈ దివ్య ప్రమాణ ప్రయోగమునకు సిద్ధము కావలెను. లేదా ఇతరములగు శారీరక ఆర్థిక దండములకు సిద్ధము కావలెను. రాజ ద్రోహము, మహా పాతకము, మొదలగు విషయము లందు సందేహము కలిగినపుడు శీర్షకస్థితి (వివాదము చరమావస్థ) రాకున్నను ఈ దివ్యములను స్వీకరించవచ్చును. వెయ్యి పణములకు తక్కువైన అభియోగమునందు తులా-విష దివ్యములను ప్రయోగించకూడదు. కాని రాజుద్రోహ మహాపాతకమునందు వీటిని గ్రహించవచ్చును. అభియోగము వేయి పణముల కొరకు అయినచోతుల మొదలగు మూడు ప్రమాణములను ప్రయోగించవచ్చును. అంతకు తక్కువైనను కోశమును ప్రయోగించవచ్చును.

శపథము చేసినవాడు శుద్ధుడు అని (నిర్దోషి) నిర్ణయమైనచో రెండవ వానిచే ఆతనికి యేబది పణములు ఇప్పించవలెను. దోషియైనచో దండించవలెను. పరీక్షింపదగిన వానిచే మొదటి రోజున ఉపవాసము చేయించి మరునాడు సూర్యోదయ సమయమున వస్త్ర సహితముగా స్నానము చేయించి రాజబ్రాహ్మణ సముఖమున దివ్య ప్రమాణము చేయించవలెను. స్త్రీ, బాలకులు, వృద్ధులు, అంధులు, కుంటివారు, బ్రాహ్మణులు, రోగములతో బాధపడుతున్నవారు ఇట్టి అపరాధులచే తులా దివ్య ప్రమాణము మాత్రమే చేయించవలెను. శూద్రునకు అగ్నికాని, జలముకాని, విషయముయొక్క ఏడు యవలుకాని దివ్య ప్రమాణములుగా విధింపబడినవి. తూచుటయందు నేర్పు కలవారు అభియుక్తుని (దోషిని) తులలో (కాంటాలో) ఒకవైపున వుంచి మరొక వైపున ప్రతిమానము (సమమైన మరొక పదార్థమును) వుంచి ఒక రేఖ గీసి క్రిందికి దింపవలెను. ఆతడు ఈ క్రింది వాక్యమును చదువుచు తులను అభిమంత్రించవలెను. “సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము, హృదయము, యముడు, పగలు, రాత్రి, రెండు సంధ్యలు, ధర్మదేవత, వీరందరును మానవుని వృత్తము తెలుసుకొనగలరు. ఓతులా! నీవు సత్యమునకు స్థానముగా పూర్వము దేవతలచే నిర్మింపబడితివి. ఓకల్యాణీ! సత్యమునే చెప్పుము. నన్ను సంశయము నుండి విడిపించుము. ఓ తల్లీ! నేను పాపము చేసియున్నచో నన్ను క్రిందికి దింపుము. శుద్ధుడనైనచో నన్ను పైకి లేపుము. అభియుక్తునిచే చేతులలో ధాన్యమును నలిపించి చేతులకు రంగుపూసి ఆతని చేతులలో ఏడు అశ్వత్థ పత్రములను దారముతో కట్టవలెను. అతనిచే ‘ఓ అగ్నిదేవా! నీవే సర్వభూతముల లోపల సాక్షివై సంచరించుచున్నావు. నీవు నా పుణ్యపాపములను గూర్చి సత్యముగా చెప్పుము’ అని చెప్పించి గోళాకారములోనున్న యేబది పలముల లోహపిండమును ఎర్రగా కాల్చి ఆతని చేతులలో వుంచవలెను. అతడు దానిని గ్రహించి మెల్లగా ఏడు మండలములు నడువవలెను. మండలము అనగా పదహారు అంగుళముల దూరము. అక్కడ అగ్నిని విడిచిపెట్టి మరల చేతులతో ధాన్యమును నలిపి చేతులు కాలకుండ వున్నచో అతడు శుద్ధుడు. ఆ అయఃపిండము మధ్యలో పడిపోయినను ఏదైన సందేహము కలిగినను మరల ఆతడు ఆ పిండమును తీసుకొని వెళ్లవలెను. ‘ఓవరుణదేవా! నీవు పవిత్రులలో పవిత్రుడవు. ఓ పావకా! శోధింపదగిన నన్ను శోధించుము. అభిశస్తుడనైన నన్ను సత్యముచే రక్షింపుము’ యని జలమును అభిమంత్రించి బొడ్డులోతు నీటిలో నిలబడివున్న పురుషుని కాళ్లు పట్టుకొని అభియుక్తుడు జలములో ప్రవేశించ వలయును. అదే సమయమున ఒకడు బాణము విడువగా వేగవంతుడగు మరొకడు ఆ బాణమును తిరిగి తీసుకొని వచ్చునంతవరకు అతడు (అభియుక్తుడు) నీటిలో మునిగియున్నచో శుద్దుడగును( నిర్దోషి). ‘ఓ విషమా! నీవు బ్రహ్మ పుత్రుడవు, సత్యధర్మమునందు నిలచి యున్నావు. నన్ను ఈ అభిశాపము (దోషారోపణము) నుండి రక్షించుము. సత్యముచే నీవు నాకు అమృతము అగుము’ అని పలికి జీర్ణించుకొన్నచో ఆతడు శుద్ధుడు యని నిర్ణయింపవలయును. న్యాయాధికారి ఉగ్ర దేవతలను పూజించి వారి అభిషేకోదకమును తీసుకొని వచ్చి అభియుక్తునకు ఆ విషయమును చెప్పి వారిచే చారడేసి చొప్పున మూడు మారులు త్రాగించవలయును. పదునాలుగు దినముల లోపుగా ఆతనికి రాజు వలన కాని, దైవము వలన కాని, ఘోరమైన వ్యసనము కలుగకున్నచో ఆతడు నిస్సందేహముగా శుద్ధుడు. అధిక మూల్యములగు వస్తువుల విషయమున అభియోగమునందు స్వల్ప సంశయము కలిగినపుడు సత్యము వాహనములు శస్త్రములు గోవులు బీజములు సువర్ణము దేవతలు గురుచరణములు ఇష్టాపూర్తములు మొదలగు పుణ్యకార్యములు వీటిపై శపథము చేయించవలయును. (255)