అగ్ని మహా పురాణము

Table of Contents

ఛందస్సారము

అగ్నిదేవుడు పలికెను:

ఈ ప్రకరణమును చివరివరకు ‘పాదము’ అను పదము అనువర్తించును. గాయత్రికి ఒక పాదమున ఎనిమిది అక్షరములు ఉండును. జగతికి పండ్రెండు అక్షరములు, విరాట్ నకు పది, త్రిష్టుపునకు పండ్రెండు అక్షరములు ఉండును. ఛందస్సులలో కొన్ని ఏక పాదములు, ద్విపాదములు ఇత్యాది విధమున నుండును. గాయత్రి ఆరేసి అక్షరముల నాల్గు పాదములతో కూడ ఉండును. కొన్ని చోట్ల ఏడు అక్షరముల మూడు పాదములతో కూడ ఉండును. దీనికి నిచ్ఛత్ అని పేరు. ప్రథమ పాదము ఎనిమిది అక్షరములు ద్వితీయ పాదము ఏడు అక్షరములు, తృతీయ పాదము ఆరు అక్షరములు అయినచో అది ప్రతిష్ఠా గాయత్రి. ఇందుకు విపరీతముగా మూడు పాదములలో వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది అక్షరములున్నచో వర్ధమాన గాయత్రి మొదటి పాదము ఆరు, రెండవది ఎనిమిది, మూడవది ఏడు అక్షరములున్నచో అతిపాద నిచ్ఛత్’ అని పేరు. రెండు పాదము లందు తొమ్మిదేసి అక్షరములు, తృతీయ పాదమున ఆరు అక్షరములు ఉన్నచో ‘నాగీ గాయత్రి’ ఆరు తొమ్మిది తొమ్మిది ఉన్నచో వారాహి గాయత్రి. ఇపుడు మూడవ భేదము చెప్పుబడుచున్నది. ద్విపాద ఛందస్సులో వరుసగా పండ్రెండు ఎనిమిది అక్షరములు ఉన్నచో అది ద్విపాద విరాట్. పదకొండేసి అక్షరముల ఒక పాదము వున్నచో ఉష్ణిక్, ప్రథమ తృతీయ పాదములందు ఏడేసి అక్షరములు ద్వితీయ పాదమున పండ్రెండు అక్షరములు, ద్వితీయ తృతీయములు ఎనిమిదేసి అక్షరములైన పునరుష్ణిక్. ప్రథమ ద్వితీయములు ఎనిమేసి అక్షరములు, తృతీయము పండ్రెండు అక్షరములు అయినా, పరోష్ణిక్. ఏడేసి అక్షరముల నాలుగు పాదములున్నను ఉప్టిక్ చంధస్. ఎనిమిదేసి అక్షరములు నాలుగు పాదములున్నది అనుష్టుప్ ఛందస్సు. త్రిపాద అనుష్టుప్ కూడ వుండును. దీనిలో మొదటి పాదమున ఎనిమిది, ద్వితీయ, తృతీయములందు పండ్రెండేసి అక్షరములున్నది ఒక భేదము మధ్యమ పాదముగాని అంతిమ పాదముగాని అష్టాక్షరమై మిగిలిన రెండు పాదములందు పండ్రెండేసి అక్షరములున్నది రెండవ భేదము. ఒకపాదము జగతీఛందస్సు, మూడు పాదములు గాయత్రి ఛందస్సు అయినచో అది బృహతీ ఛందస్సు. మూడవ పాదము మొదటి పాదమువలె అయినచో అది పథ్యాబృహతి. ప్రథమమగు జగతీ పాదము ద్వితీయ పాదమై మిగిలినవి మూడు గాయత్రి పాదములైనచో యదిన్యంకు సారిణీ బృహతీయగును. క్రోష్టుకి మతము ప్రకారము దీనికే స్కంద లేదా గ్రీవాయని పేరు. అంతిమ పాదము జగతియై మొదటి మూడుపాదములు గాయత్రియైనచో అది ఉపరిష్టాద్బృహతి. ప్రథమ పాదము జగతియై మిగిలిన పాదములు గాయత్రియైనచో అది పురస్తాద్భుృహతి. తొమ్మిదేసి అక్షరములు నాలుగు పాదములు కూడ కనబడుచున్నవి. పది అక్షరముల రెండు పాదములు, ఎనిమిదేసి అక్షరముల రెండు పాదములు వున్నది కూడ బృహతియే. కేవల జగతీ పాదములు మూడున్నచో మహాబృహతీ.

పండ్రెండేసి అక్షరముల రెండు పాదములు ఎనిమిదేసి అక్షరముల రెండు పాదములు ఉన్నచో ‘పంక్తి’ ఛందస్సు. విషమ పాదమైనచో అనగా ప్రథమ తృతీయ చరణములు పండ్రెండేసి అక్షరములు మిగిలినవి రెండు ఎనిమిదేసి అక్షరములు అయినచో సతః పంక్తి ఛందస్సు. అవి విపరీతావస్థలో ఉన్నచో అది కూడ సతః పంక్తి. మొదటి రెండు పాదములు పండ్రెండేసి అక్షరములు మిగిలిన రెండు పాదములు ఎనిమిదేసి అక్షరము లైనచో ప్రస్తార పంక్తి. చివరి రెండు పాదములందు పండ్రెండేసి అక్షరములు మొదటి రెండు పాదములందును ఎనిమిదేసి అక్షరములున్నచో ఆస్తార పంక్తి. పండ్రెండేసి అక్షరములున్న రెండుపాదములు మధ్యనుండి మిగిలిన పాదములందు ఎనిమిదేసి అక్షరములున్నచో విస్తారపంక్తి.

ప్రథమ చతుర్థములందు పండ్రెండేసి అక్షరములు, ద్వితీయ చతుర్థములందు ఎనిమిదేసి అక్షరములు వున్నచో సంచార పంక్తి. ఐదేసి అక్షరముల నాలుగు పాదములు ఉన్నచో అక్షర పంక్తి. ఐదేసి అక్షరముల రెండు పాదములే వున్నచో అల్పశః పంక్తి. అయిదేసి అక్షరములు ఐదు పాదములున్నది పదపంక్తి. ప్రథమమునందు నాలుగు అక్షరములు, ద్వితీయమునందు ఆరు అక్షరములు మిగిలిన మూడింటియందు ఐదేసి అక్షరములు ఉన్నను పద పంక్తియే. ఎనిమిదేసి అక్షరముల ఐదు పాదములున్నది పథ్యా పంక్తి. ఎనిమిదేసి అక్షరముల ఆరు పాదములు ఉన్నది జగతీ పంక్తి.

ఒక పాదము త్రిష్టుప్, ఎనిమిదేసి అక్షరములు నాలుగు పాదములు ఉన్నది త్రిష్టుప్ జ్యోతిష్మతి. ఒక పాదము జగతి నాలుగు పాదములు గాయత్రియైనచో జగతీ జ్యోతిష్మతి. మొదటి పాదము పదకొండు అక్షరములు, మిగిలిన నాలుగు పాదములు ఎనిమిదేసి అక్షరములైనచో పురస్తా జ్యోతి. మొదటి పాదము పండ్రెండు అక్షరములు, మిగిలిన నాలుగు పాదములు ఎనిమిదేసి అక్షరములైనను అదియే పేరు. మధ్యమ చరణమున పండ్రెండు అక్షరములు, మిగిలిన చరణములందు ఎనిమిదేసి అక్షరములున్నచో అది మధ్యేజ్యోతి మధ్య చరణము పండ్రెండు అక్షరములు మిగిలినవి ఎనిమిదేసి అక్షరములు ఉన్నను అదియే పేరు. మొదటి నాలుగు పాదములందు ఎనిమిదేసి అక్షరములు, చివర పాదమునందు పదకొండు అక్షరములు లేదా పండ్రెండు అక్షరములు ఉన్నచో అది ఉపరిష్టాజ్యోతి. గాయత్త్ర్యాది ఛందస్సులందు ఒక పాదమున ఐదు అక్షరములు ఇతర పాదములందు నియతాక్షరములు ఉన్నచో శంకుమతి. ఒక చరణము ఆరు అక్షరములు ఇతర చరణములందు నియతములగు అక్షరములున్నచో కకుద్మతి. మూడు పాదముల ఛందస్సులో ప్రథమ తృతీయ పాదములందు ఎక్కువ అక్షరములుండి మధ్యయందు తక్కువ అక్షరములున్నచో అది పిపీలిక మధ్య, దీనికి విపరీతముగ ఉన్నది యవమధ్య గాయత్రి లేదా ఉష్ణిక్ మొదలగు ఛందస్సులలో ఒక అక్షరము తగ్గినచో నిచ్ఛత్ అనియు, ఒక అక్షరము పెరిగినచో భూరిక్ అనియు రెండు అక్షరములు తగ్గిన విరాట్ అనియు, రెండు అక్షరములు పెరిగిన స్వరాట్ అనియు పేర్లు. సందేహము కల్గినపుడు మొదటి పాదమున బట్టి ఛందస్సును నిర్ణయించవలెను. దేవతా, స్వర, వర్ణ, గోత్రాదుల ద్వారా కూడ నిర్ణయించవలెను. గాయత్ర్యాది ఛందస్సులకు క్రమముగా అగ్ని సూర్య చంద్ర బృహస్పతి, మిత్రావరుణ ఇంద్ర విశ్వే దేవతలు, షడ్జాదులు స్వరములు. శ్వేత సారంగ, కృష్ణ, నీల, లోహిత, గౌరవములు వర్ణములు. కృతి ఛందస్సు యొక్క వర్ణము గోరోచనా సమానము అతి ఛందస్సుల వర్ణము శ్యామలము ఏడు ఛందస్సులకును వరుసగా అగ్ని వేశ్య, కాశ్యప, గౌతమ, అంగీరస, భార్గవ, కౌశిక, వశిష్టులు దేవతలు. (330)