అగ్ని మహా పురాణము
దానాది మాహాత్మ్యము
పుష్కరుడు పలికెను:
పూర్వము మరీచికి చెప్పిన ఏబదివేల శ్లోకములుగల బ్రహ్మపురాణమును వ్రాసి, బ్రాహ్మణునకు దానము చేయవలెను. స్వర్గకాముడు వైశాఖ పూర్ణిమనాడు జల ధేనువుతో కూడ బ్రహ్మపురాణ దానము చేయవలెను. పన్నెండువేల శ్లోకములుగల పద్మ పురాణమును ధేనువుతో జ్యేష్ఠ మాసమున దానము చేయవలయును. పరాశరుడు, వరాహకల్ప వృత్తాంతమును, ఇరువదిమూడు వేల శ్లోకములుగల విష్ణు పురాణముగ రచించెను. దీనిని ఆషాఢ మాసమున జలధేనువుతో దానముచేసిన వాడు విష్ణుపదమును పొందును. పదునాలుగువేల శ్లోకములుగల వాయుపురాణము హరికి ప్రియమైనది. దీనిలో వాయుదేవుడు శ్వేత కల్ప ప్రసంగముచే ధర్మమును చెప్పెను. ఈ పురాణమును వ్రాయించి శ్రావణ మాసమున గుడధేనువుతో బ్రాహ్మణునకు దానము చేయవలయును. గాయత్రిని ఆధారముగ తీసుకుని విస్తృతముగ భాగవత ధర్మములు బోధించిన సారస్వత కల్ప సంబద్ధమగు నదియు, వృత్రాసురవధ కలదియగు భాగవతమున పదునెనిమిదివేల శ్లోకములు ఉన్నవి. దీనిని బంగారు సింహాసనముతో భాద్రపద మాసమున దానము చేయవలయును. బృహత్కల్పమునకు సంబంధించిన ధర్మములను దేనియందు బోధించెనో ఇరువది ఐదువేల శ్లోకములుగల ఆ పురాణము నారదపురాణము. దీనిని ధేను సహితముగా ఆశ్వీయుజ మాసమున దానముచేసినవాడు పరిపూర్ణ సిద్ధిని పొందును, ఏ పురాణమున పక్షులు ధర్మాధర్మ విచారణ చేసినవో నవ సహస్ర శ్లోకములు గల ఆ మార్కండేయ పురాణమును కార్తీకమాసమున దానము చేయవలయును. అగ్ని వవిష్ఠునకు చెప్పిన పురాణము ఆగ్నేయము. దీనిని వ్రాసి మార్గశీర్షమున బ్రాహ్మణునకు దానము చేసినచో సర్వఫలములు లభించును. దీనిలో పన్నెండువేల శ్లోకములున్నవి. అన్ని విద్యలును బోధించును. భవిష్య పురాణము సూర్య సంభవము. పదునాలుగువేల శ్లోకములుగలది. శివుడు మనువునకు చెప్పెను. పుష్యమాసమున గుడాదులతో దీనిని దానము చేయవలయును.
సావర్ణి బ్రహ్మవైవర్త పురాణమును నారదునకు చెప్పెను. దీనిలో రథంతర కల్ప వృత్తాంతము వున్నది. పదునెనిమిది వేల శ్లోకములుగల దీనిని మాఘ మాసమున దానము చేయవలయును. వరాహచరితము చెప్పు వరాహపురాణమును కూడ మాఘమాసమున దానము చేసినవాడు బ్రహ్మ లోకము పొందును. అగ్ని మయమగు లింగము నందున్న మహేశ్వరుడు ఆగ్నేయకల్పము నందలి వృత్తాంతములతో కూడిన ధర్మమును బోధించిన పన్నెండు వేల శ్లోకములుగల లింగ పురాణమును తిలధేనుసహితముగ ఫాల్గుణ మాసమున దానము చేసినవాడు శివలోకమును పొందును. విష్ణువు భూ దేవికి మానవ ప్రవృత్తి మొదలు వరాహచరితమును చెప్పిన వరాహపురాణమున ఇరువది నాలుగువేల శ్లోకములు వున్నవి. చైత్రమున సువర్ణముతో గరుడపురాణమును దానము చేసినవాడు విష్ణుపదమును పొందును. స్కంద పురాణమున ఎనుబది నాలుగువేల శ్లోకములున్నవి. కుమారస్వామి తత్పురుష కల్పకథను శైవమతమును ఆధారముగగొని ఈ పురాణమును చెప్పెను. దీనిని కూడ చైత్రమున దానము చేయవలయును. పదివేల శ్లోకములున్న వామన పురాణమున ధౌమకల్పము నందలి విష్ణు చరిత్రమును బోధించబడినది. దానిని పూర్ణిమ నాడు విషువ సంక్రాంతి సమయమున దానము చేయవలయును. ఇది ధర్మార్థాది బోధకము. కూర్మ పురాణమున ఎనిమిదివేల శ్లోకము లున్నవి. కూర్మమూర్తియగు విష్ణువు ఇంద్రద్యుమ్న కథా ప్రసంగమున దీనిని పాతాళమునందు చెప్పెను. సువర్ణఖచ్ఛముతో దీనిని దానము చేయవలెను. మత్స్యరూపియగు విష్ణువు కల్పాదియందు పదమూడువేల శ్లోకములుగల మత్స్య పురాణమును మనువుకు చెప్పెను. బంగారముతో నిర్మించిన మత్స్యముతో కలిపి దీనిని దానముచేయవలెను. శ్రీ మహావిష్ణువు తార్క్ష్య కల్పమునందు ఎనిమిదివేల శ్లోకములుగల గరుడపురాణమును బోధించెను. విశ్వాండమునుండి గరుత్మంతుని పుట్టుకకు సంబంధించిన కథ దీనిలో చెప్పబడినది. దీనిని స్వర్ణహంసతో కూడ దానము చేయవలెను. బ్రహ్మదేవుడు బ్రహ్మాండ మాహాత్మ్యమును గూర్చి చెప్పిన పండ్రెండు వేల శ్లోకములుగల బ్రహ్మాండ పురాణమును గూడ బ్రాహ్మణునకు దానము చేయవలయును.
మహాభారత శ్రవణ సమయమున ప్రతి పర్వసమాప్తి యందును వస్త్రగంధ మాల్యాదులతో ముందుగా పౌరాణికుని పూజించవలయును. పిదప బ్రాహ్మణులకు పాయసముతో భోజనము పెట్టవలెను. ఒక్కొక్క పర్వము పూర్తియైనపుడు గో, భూమి, గ్రామ సువర్ణాదులను దానము చేయవలయును. మహాభారతము పూర్తియైన పిమ్మట బ్రాహ్మణునకును మహా భారత సంహితకును పూజచేయవలయును. గ్రంథమును పవిత్ర స్థానమందుంచి దానికి పట్టు వస్త్రముచుట్టి పూజించవలెను. పిదప నరనారాయణులను పుష్పాదులతో పూజించవలయును. గో, అన్న, భూమి, సువర్ణాదులు, దానముచేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి క్షమాప్రార్థన చేయవలయును. పౌరాణికులకు మహా దానములు వివిధ రత్నములు ఇవ్వవలెను. ప్రతి మాసమునందును ఆతనికి రెండు లేక మూడు మాషముల సువర్ణమును ఇచ్చి, ఆయన ప్రారంభమున కూడ ముందుగా ఆతనికి సువర్ణ దానము చేయవలయును. ఓ ద్విజ శ్రేష్ఠా! శ్రోతలందరును కూడ పౌరాణికుని పూజించవలయును. ఇతిహాసములను, పురాణములను పూజించి దానము చేయువాడు ఆయురారోగ్య స్వర్గమోక్షములను పొందును. (272)
