అగ్ని మహా పురాణము

Table of Contents

జగత్ సృష్టి వర్ణనము

అగ్ని పలికెను: ఇపుడు విష్ణువు యొక్క జగత్సృష్టి మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన అతడే సృష్టికి ఆదియైనవాడు. ఆతడు గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ.

ప్రారంభమున సద్రూపమైన బ్రహ్మయే అవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశముగాని, రాత్రిగాని, పగలుకాని లేకుండెను. (ఆ బ్రహ్మ) ప్రకృతిని, పురుషుడైన విష్ణువును ప్రవేశించి క్షోభింపచేసెను.

సృష్టి సమయమున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహత్తత్వము జనించెను. దానినుండి అహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణమైన అహంకారము తైజనము. పంచభూతములకు కారణమైనది తామసము. అహంకారము నుండి శబ్దతన్మాత్ర రూపమైన ఆకాశము, దాని నుండి స్పర్శతన్మాత్ర రూపమైన వాయువు, దాని నుండి రూపతన్మాత్ర రూపమైన అగ్ని, దాని నుండి రసతన్మాత్ర రూపమైన ఉదకము, దానినుండి గంధతన్మాత్ర రూపమైన పృథివియు జనించెను. ఇవన్నియు తామసాహంకారము నుండి జనించెను. పిదప (తైజసాహంకారము నుండి తైజసమైన ఇంద్రియములు పది వైకారిక దేవతలు, పదకొండవ ఇంద్రియమైన మనస్సు పుట్టినవి. పిమ్మట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై ముందుగా జలమును సృజించెను. దానియందు తన వీర్యమును విడచెను. ఉదకమునకు నారములు అని పేరు. అవి నరుని వలన పుట్టెను కదా! పూర్వము నారములు అనగా ఉదకములు, నరునకు స్థాన మాయెను. అందుచే ఆతడు నారాయణుడని చెప్పబడెను. ఉదకములో ఉన్న ఆ వీర్యము బంగారు వర్ణముగల అండమాయెను. దాని యందు స్వయంభువైన బ్రహ్మ జనించెనని మేము వింటిమి.

భగవంతుడైన హిరణ్యగర్భుడు ఆ అండము నందు పదివత్సరముల కాలముండి, దానిని రెండు ప్రక్కలుగా చేసి ద్యులోకమును, భూలోకమును నిర్మించెను ఆ రెండు ప్రక్కల మధ్యయందు ఆకాశమును సృజించెను. ఉదకమునందు తేలుచున్న భూమిని, పది దిక్కులను సృజించెను. అచట కాలమును, మనస్సును, వాక్కును, కామమును, క్రోధమును మరియు రతిని నిర్మించెను. ప్రజాపతి ఈ రాబోవు సృష్టిని పైన చెప్పిన ఆకాశాదులతో సంబంధించిన దానినిగా చేయదలచి, ముందుగా వాటిని సృజించెను.

మెరుపులను, వజ్రమును (పిడుగును), మేఘములను, రక్తమును, ఇంద్ర ధనస్సును లేదా ఎఱ్ఱని రంగుగల ఇంద్ర ధనుస్సులను, పక్షులను, పర్జన్యుని సృజించెను. పిదప యజ్ఞ సిద్ధికొరకై ముఖము నుండి ఋగ్యజుస్సామ వేదములను సృజించెను.

ఆ వేదములచే సాధ్యులను, దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేసెను. అనేక విధములగు భూతములను సృజించెను. భుజమునుండి సనత్కుమారుని, క్రోధము నుండి రుద్రుని సృజించెను. మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు అనువారిని సృజించెను. ఈ ఏడుగురును బ్రహ్మ మానసపుత్రులగు బ్రహ్మలని ప్రసిద్ధిచెందిరి. ఈ సప్త బ్రహ్మలును, రుద్రులును ప్రజాసృష్టి చేసిరి. తన దేహమును రెండు భాగములుగా చేసి, ఒక భాగము పురుషుడుగాను, మరొక భాగము స్త్రీగాను అయి బ్రహ్మ ఆమెయందు ప్రజలను సృజించెను. (17)