అగ్ని మహా పురాణము

Table of Contents

సంస్కార దీక్షా విధానము

ఈశ్వరుడు పలికెను-కుమార స్వామీ! ఇపుడు సంస్కార దీక్షా విధానమును గూర్చి చెప్పెదను. అగ్ని యందున్న శివుని అర్ధనారీశ్వర రూపమును తన హృదయమునందు ఆవాహన చేయవలెను. శివుడును, పార్వతియు ఒకే శరీరమున కలిసియున్నారు అని భావనచేసి పూజించి, హృదయ మంత్రముచే తర్పింపచేయవలెను. వారి సాన్నిధ్యమును కోరుచు హృదయ మంత్రముతో ఐదు హోమములు చేయవలెను. అస్త మంత్రముచే పుష్పమును అభిమంత్రించి, దానితో శిష్యుని హృదయ మున తాడనము చేయవలెను. వానిలో నక్షత్రాకారమున ప్రకాశించుచున్న జీవుని భావించవలెను. హుంకార యుక్త రేచక ప్రాణాయామముతో శిష్య హృదయము నందు ప్రవేశించినట్లు భావనచేసి, సంహారిణీ ముద్రతో ఆజీవుని అచటినుండి లాగి, పూరక ప్రాణాయామముచే తన హృదయమున స్థాపించుకొనవలెను. ఉద్భవ ముద్రను ప్రదర్శించుచు, హృత్సంపుటితమగు ఆత్మ ముద్రను ఉచ్చరిం చుచు, రేచక ప్రాణాయామ సాహాయ్యముచే దానిని వాగీశ్వరీదేవి యోనియందు ఉంచినట్లు భావన చేయవలెను. “హాం హాం హామాత్మనే నమః అనునది ఆత్మ మంత్రము. బాగుగా ప్రజ్వలించుచున్న, ధూమ రహితమైన అగ్నిలో అభీష్ట సిద్ధి కొరకై హోమము చేయవలెను. ధూమయుక్తమై, ప్రజ్వలించని అగ్నిలో చేసిన హోమము సఫలము కాజాలదు. అగ్నిజ్వాలలు దక్షిణావర్తములై ప్రసరించినను ఉత్తమమగు గంధము వచ్చుచున్నను, అగ్ని చాల తేజోవంతముగ కనబడినను, అది శ్రేష్ఠము. ఇందుకు విపరీతముగ, అగ్ని నుండి నిప్పు నెరసులు ఎగురుచున్నను, అగ్నిజ్వాల భూమిని స్పృశించు చున్నను ఉత్తమముకాదు. ఈ గుర్తులచే శిష్యుని పాపమును గుర్తించి అగ్నిలో హోమము చేయవలెను. లేదా పాపభక్షణ హోమములచే ఆ పాపమును భస్మము చేయవలెను. శిష్యునకు నూతన విధమున ద్విజత్వము సిద్ధించుటకును, రుద్రాంశ భావనకును, ఆహార బీజశుద్ధి నిమిత్తమును, గర్భాదాన, గర్భస్థితి, శీమంతోన్నయన, జాతకర్మ, నామకరణముల కొరకును, వేరువేరుగా, మూల మంత్రముతో, ఐదేసి వందల ఆహుతుల నీయవలెను. చూడాకర్మాదుల కొరకై దశమాంశ హోమములు చేయవలెను.

ఈ విధముగ శిధిలమైన బంధనముగల జీవాత్మలో కలుగు శక్త్యుత్కర్షమే రుద్ర పుత్రుడు అగుటకు నిమిత్తమగుటచే గర్భాధానమని చెప్పబడును. వానిలో స్వతంత్రముగ ఆత్మ గుణములు ఆవిర్భవించుటయే పుంసవనము. మాయ వేరు, ఆత్మ వేరు అను జ్ఞానము కలుగుటయే సీమంతోన్న యనము. శివాదిశుద్ధ సద్వస్తు స్వీకారమే జన్మ. ‘నేను శివుడను’ అను జ్ఞాన ముదయించుటయే శివత్వయోగ్యుడగు శిష్యునకు నామకరణము ప్రకాశించుచున్న అగ్నికణమువలె ఉన్న జీవాత్మను, సంహారముద్రచే తీసి తన హృదయ కమలమునందు ఉంచుకొనవలెను. పిమ్మట కుంభక ప్రాణాయా మముతో మూల మంత్రోచ్చారణము చేయుచు హృదయమునందు శివశక్తులను కలుపవలెను. క్రమముగా బ్రహ్మాది కారణములను పరిత్యజించుచు, రేచకముచే జీవాత్మను శివుని దగ్గరకు తీసికొని పోయి, మరల ఉద్భవ ముద్రచే వెనుకకు తీసికొనివచ్చి, వెనుక చెప్పిన హృత్సంపుటితాత్మ మంత్రముతో, రేచక ప్రాణాయామము చేయుచు, విధానమును ఎరిగిన గురువు శిష్యుని హృదయ కమల కర్ణికయందు ఆ జీవాత్మను స్థాపించవలెను. పిమ్మట గురువు తత్కాలోచితముగ శివాగ్నుల పూజచేసి, శిష్యునిచే తనకు నమస్కారము చేయించుకొని, ఆతనికి సమయాచారోపదేశము చేయ వలెను. ‘నీవెన్నడును ఇష్టదేవతా (శివ) నిందగాని, శైవశాస్త్ర నిందగాని చేయరాదు. శివ నిర్మాల్యాదులను దాటకూడదు. జీవితాంతము వరకును శివ, అగ్ని, గురువుల పూజ చేయవలెను. బాలకులకు, మూఢులకు, వృద్ధులకు, స్త్రీలకు, భోగమును కోరువారికిని (అన్నార్థులకును), రోగులకును యథాశక్తి ధనాది దానము చేయవలెను.’ సమర్థులైనవారు సర్వమును దానము చేయవలెనని నియమము చెప్పబడినది.

వ్రతాంగములైన జటా, భస్మ, దండ, కౌపీనాదులను, సంయమపోషకములను అన్య వస్తువులను, ఈశానాది నామములచే గాని, లేదా వాటి ప్రారంభమున ‘నమః’ చేర్చి నామమంత్రములచే గాని అభిమంత్రించి, స్వాహాంతములగు సంహితా మంత్రములను పఠించుచు పాత్రలలో ఉంచి, వెనుకటి వలెనే సంపాతాభి హతములు (సంస్కార విశేష సంస్కృతములు) చేసి, స్థండిలీశుడగు శివుని ఎదుట ఉంచవలెను. వీటి రక్షణము కొరకై క్షణకాలముపాటు కలశము క్రింద ఉంచవలెను. పిమ్మట శివుని ఆజ్ఞ గైకొని వాటిని శిష్యునకు ఈయవలెను. ఈ విధముగ విశిష్ట సమయదీక్షా సంపన్నుడగు శిష్యుడు అగ్ని హోమ ఆగమజ్ఞానాది యోగ్యత కలవాడగును. (82)