అగ్ని మహా పురాణము

Table of Contents

స్త్రీ లక్షణ వర్ణనము

సముద్రుడు చెప్పెను: గర్గాచార్యా! ఉత్తమ శ్రేణికి చెందిన శరీరముగల స్త్రీ యొక్క సర్వాంగములును మనోహరముగా నుండును. ఆమె మత్త గజమువలె మందముగా నడచును. ఊరు-జఘన దేశములు విశాలములుగా నుండును. నేత్రములు ఉన్మత్తపారా వతము నేత్రములవలె మదభరితములై కేశములు నీలవర్ణములై యుండును. శరీరము పల్చగాను, రోమరహితముగాను ఉండును. చూడగనే ఆమె మనస్సును మోహింపచేయును. పాదములు పూర్తిగా నేలపై ఆనును. స్తనములు ఒకదానితో ఒకలి కలిసి ఉండును. నాభి దక్షిణావర్తమై ఉండును. యోని రావి ఆకు ఆకారములో నుండును. మణమలు అణగి యుండును. నాభి అంగుష్ఠ ప్రమాణముగ నుండును. పొట్ట వ్రేలాడదు. రోమావళిచే రూక్షముగా నున్న స్త్రీ మంచిది కాదు. నక్షత్ర, వృక్ష, నదీనామములు కలది, కలహప్రియ, అగు స్త్రీ మంచిదికాదు.

చాపల్యము లేనిది కటువచనములు పలుకనిది యగు స్త్రీ దేవతాదుల చేతగూడ పూజింపబడిన శుభలక్షణములు కలది. మధూక పుష్పములవలె తెల్లని కపోలములు గల స్త్రీ శుభురాలు. రోమావళితో నిండిన అవయవములు, నాడులు కనబడుచున్న శరీరముకల స్త్రీ ఉత్తమురాలు కాదు. వంకరగా నుండి ఒకదానితో ఒకటి కలిసిపోయిన కనుబొమ్మలు కలది కూడ మంచిది కాదు. తన ప్రాణములను పతిపై ఉంచినది, పతికి ప్రియురాలును అగు స్త్రీ లక్షణ రహితయైనను శుభలక్షణ సంపన్నగా చెప్పబడినది. సుందరమైన ఆకారమెచటనుండునో అచట శుభగుణములు కూడ ఉండును. పాదము కనిష్ఠిక (చిన్న వ్రేలు) భూమికి తగలని స్త్రీ మృత్యు స్వరూపురాలే. (244)