అగ్ని మహా పురాణము
సమాధి
అగ్నిదేవుడు పలికెనుః
చైతన్యము ప్రశాంత సముద్రమువలె స్థిరమై ఆత్మభిన్నములగు పదార్థము లేమియు భాసించక ఆత్మ మాత్రమే భాసించు ధ్యానము సమాధి. ధ్యాన సమయమున చిత్తమును ధ్యేయము నందు నిలిపి గాలిలేని ప్రదేశము నందలి దీపమువలె కదలకుండనుండు యోగి ‘సమాధిస్థుడు’ అని చెప్పబడును. ఆ సమయమున ఆతడు వినడు వాసనచూడడు, రుచిచూడడు, స్పర్శము తెలుసుకొనడు, మనస్సుచే సంకల్పించడు, దేనియందును అభిమానము కలవాడుకాడు. దేనిని తెలిసికొనక కాష్ఠము వలె ఉండును. ఈ విధముగ ఈశ్వరుని యందు లీనుడైనవాడు సమాధిస్థుడు. వాయువు లేని ప్రదేశమునందున్న దీపము ఎట్లు కదలదో అది ఉపమగా చెప్పబడినది. ఆత్మ స్వరూపుడు అగు విష్ణువును ధ్యానము చేయుచున్న యోగికి ఎన్నియో దివ్యములగు విఘ్నములు ఎదురగును. అవి సిద్ధి సూచకములు. సాధకుడు పైనుంచి క్రిందకు పడవేయును. చెవిలో బాధ కలుగును. అనేక విధములగు ధాతువులు కనబడును. శరీరము నందు ఎక్కువ బాధకలుగును. అట్టి యోగికి దివ్య భోగములను ఇచ్చెదమని దేవతలు లోభపెట్టుదురు. రాజులు భూమిని, ధనవంతులు, ధనములను ఇచ్చెదరు. వేదాది శాస్త్రములు అన్నియు స్వయముగనే స్ఫురించును. ఇష్టమైన ఛందస్సులతో కావ్యరచనకూడ అతడు చేయును. దివ్యమైన రసాయనములు దివ్యౌషధులు సకల శిల్పములు, కళలు అతనికి లభించును. సురేంద్ర కన్యకలు, ప్రతిభాది గుణములు కూడ అతనివద్దకు వచ్చును. వీటినన్నింటిని ఎవడు తృణమువలె పరిత్యజించునో వానిని విష్ణువు అనుగ్రహించును.
అణిమాది గుణైశ్వర్యవంతుడగు యోగి శిష్యునకు జ్ఞానము ఇచ్చి ఇచ్చాను సారముగ భోగములు అనుభవించి లయయోగము ద్వారా శరీరమును పరిత్యజించి విజ్ఞానము ఆనందమయము, బ్రహ్మ స్వరూపము, ఐశ్వర్య సంపన్నము అగు స్వాత్మయందు స్థితిని పొందవలెను. మలినమైన అద్దమున ప్రతిబింబమును గ్రహింప శక్యము కానట్లు అంతః కరణ పరిపాకము లేనివాడు ఆత్మ జ్ఞానము పొందజాలడు. దేహము సకల రోగ భాజనము. దాని యందు అభిమానము కలవాడు దుఃఖమును పొందును. కాని యోగి యోగబలమువలన దుఃఖము పొందడు. ఒకే ఆకాశము ఘటాదుల ద్వారా వేర్వేరుగా కనబడు నట్లును ఒకే సూర్యుడు అనేక జలాధారములందు అనేక రూపముల కనబడు నట్లును, ఒకే ఆత్మ అనేకము వలె కనబడుచున్నది. ఆకాశ, వాయు, అగ్ని, జల, ప్పథివీ, ధాతువులు-ఈ లోకములన్నియు సచరాచర జగత్తు జీవాత్మ ఇవన్నియు బ్రహ్మ స్వరూపములు. కుంభకారుడు మట్టి దండము, చక్రము, వీటిని కలిపి కుంభమును చేసినట్లు గృహకారకుడు తృణమృత్తికా కాష్ఠములతో గృహమును నిర్మించినట్లును ఆత్మయే ఆయాకరణములను సమకూర్చుకొని ఆయా యోనులందు తనను తానే స్పృశించుకొనును. కర్మచేతను, దోషమోహముల చేతను బద్దుడగును. జీవులు జ్ఞానము వలన ముక్తుడగును. యోగి ధర్మాను స్థానము చేయుటచే రోగ విముక్తుడగును. వత్తికి ఆధారము తైలము. వీటి కలయికచే-దీపము నిలచినట్లును ఏ ఒక్కటి లేకున్నను అది నిలువకున్నట్లును యోగ ధర్మములు లేకపోవుటచే వికారము కలిగి అకాలమున ప్రాణ నాశనము కలుగుచున్నది.
హృదయములో దీపమువలెనున్న ఆత్మయొక్క రశ్ములు అనంతములై వ్యాపించి యున్నవి. సితములు అసితములు కద్రువర్ణములు, నీల వర్ణములు, కపిలవర్ణములు, పీత లోహితములు అగువాటిలో ఒకటి ఊర్ధ్వ ముఖమై సూర్య మండలమును భేదించి బ్రహ్మ లోకమునుకూడ అతిక్ర మించి వెళ్లును. దాని మార్గమున పయనించినవాడు ఉత్తమ గతిని పొందును. ఇదికాక మరి నూరురశ్ములు ఊర్ధ్వముఖములై ఉన్నవి. వాటి ద్వారా పయనించినవాడు ఆయా దేవ లోకములను పొందును. క్రిందకు ప్రసరించు అల్ప కాంతిగల వివిధరశ్ముల ద్వారా పయనించినవాడు కర్మోప భోగమునకై ఈ లోకమునందే జనించును. జ్ఞానేంద్రియములు, మనస్సు, కర్మేంద్రియములు, అహంకారము, బుద్ది పంచభూతములు, అవ్యక్తమగు ప్రకృతి వీటికి క్షేత్రము అని పేరు. వీటి స్వరూపము తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అతడే సర్వ భూతాధీశ్వరుడు. అతడు సత్తు అసత్ సద సద్రూపుడు. ప్రకృతి నుండి బుద్ది (మహత్తత్త్వము), దానినుండి అహంకారము, దానినుండి పంచ మహా భూతములు జనించును. వీటిలో ఉత్తరోత్తరమునకు ఒక్కొక్క గుణము అధికముగ నుండును. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, భూతగణములు ఏది దేనిని ఆశ్రయించి ఉన్నచో అది దాని యందే లీనమగును. సత్త్వ రజస్తమస్సులు అవ్యక్త ప్రకృతి యొక్క గుణములు. రజ స్తమో గుణములచే అవిష్టుడగు జీవుడు చక్రమువలె తిరుగుచుండును.
అన్నిటికి ఆదియైన పరమపురుషుడు ఆనాది. మనస్సు చేతను ఇంద్రియములచేతను గ్రహింప బడునది, వికారము, వేదపురాణ విద్యా ఉపనిషత్ శ్లోక సూత్ర, భాష్యాది వాజ్మయము ఈ పరమాత్మ నుండియే ఆవిర్భవించినది. సంతాన కాలములగు అగ్ని హోత్రులు పితృయాన మార్గమునందలి ఉపవీథి మొదలు అగస్త్య నక్షత్ర మధ్యము వరకు వున్న మార్గము ద్వారా స్వర్గమును చేరుదురు. దాన తత్పరులై అష్టగుణ సంపన్నులగు వారుకూడ ఈ మార్గముననే పయనింతురు. ఎనుబది ఎనిమిదివేల గృహస్థ మునులు ధర్మ ప్రవర్తకులు. వారే పునరావృత్తికి కారణభూతులు. వారు సప్తర్షులకును నాగవీథికిని మధ్యనున్న మార్గముద్వారా దేవ లోకమునకు వెళ్ళిరి. అంతే సంఖ్యగల మునులు సర్వారంభ వూజ్యులై తపో, బ్రహ్మచర్య, అసంగతి, త్యాగ, మేధా శక్తుల ప్రభావముచే ఒక కల్పము వరకు ఆయా దేవ లోకములలో నివసింతురు.
వేదాధ్యయనము యజ్ఞము, బ్రహ్మచర్యము, తపస్సు, శ్రద్ధా, ఇంద్రియ నిగ్రహము, ఉపవాసము, సత్యము, వీటి వలన ఆత్మ జ్ఞానము కలుగును. ద్విజాతులు సత్త్వ గుణమును ఆశ్రయించి ఆత్మను గూర్చి శ్రవణ, మనన నిధి, ధ్యాసనములు చేసి ఆత్మ సాక్షాత్కారము పొందవలెను. ఈ విధముగ తెలుసుకొనువారు వానప్రస్థులై, శ్రద్ధాయుక్తులై, సత్యోపాసన చేయుచు క్రమముగ అగ్ని, దిన, శుక్లపక్ష, ఉత్తరాయణ దేవలోక, సూర్య మండల విద్యుద్దేవతల లోకములు చేరుదురు. పిదప మానస పురుషుడు అచటకువచ్చి వారిని బ్రహ్మలోకమున చేర్చును. వారికి పునరావృత్తి వుండదు. యజ్ఞ తపోదానములచే స్వర్గము పొందువారు క్రమముగ ధూమ, రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన పితృ లోక చంద్రలోక అభిమాని దేవతల లోకములకు వెళ్లి మరల ఆకాశ, వాయు, జల మార్గముల ద్వారా భూలోకమునకు తిరిగివత్తురు.
ఈ లోకమున జన్మించి, మరణానంతరము మరల ఆ మార్గముననే ప్రయాణము చేయుదురు. జీవాత్మకు సంబంధించిన ఈ రెండు మార్గములును తెలియనివాడు సర్పముగాను, పతంగముగాను, కీటముగాను, క్రుమిగాను పుట్టును. హృదయాకాశమున దీపమువలె భాసించుచున్న బ్రహ్మను ధ్యానించుటచే జీవుడు అమృత స్వరూపుడు అగును. న్యాయముగ ధనసంపాదనచేయుచు అతిథి ప్రియుడై తత్త్వజ్ఞాననిష్ఠుడై శ్రాద్ధములు చేయుచు సత్యవాదియై వున్న గృహస్థుడు కూడ విముక్తుడగును. (376)
