అగ్ని మహా పురాణము

Table of Contents

చండపూజావిధి

ఈశ్వరుడు పలికెను: స్కందా! పిమ్మట శివ విగ్రహము దగ్గరకు వెళ్ళి ‘పరమేశ్వరా! నేను చేసిన హోమ పూజాదులవలన కలిగిన పుణ్యమును గ్రహింపుము’ అని ప్రార్థించి, స్థిరచిత్తుడై ‘ఉద్భవ’ ముద్ర చూపి, అర్ఘ్యజలముతో, ‘నమః’ చేర్చిన పూర్వోక్త మూల మంత్రము చదువుచు ఇష్టదేవతకు అర్ఘ్యము సమర్పింపవలెను. పిమ్మట వెనుకటి వలెనే పూజించి, స్తోత్రములతో స్తుతించి, నమస్కరించి, పరాఙ్ముఖుడై అర్ఘ్యమిచ్చి, “ప్రభో! నా అపరాధములను క్షమించుము” అని పలుకుచు నారాచముద్ర చూపి, “అస్త్రాయ ఫట్” అని ఉచ్చరించుచు సమస్త సంగ్రహములను తనలో ఉప సంహారము చేసికొని, శివలింగమును మూర్తి మంత్రములతో అభిమంత్రించవలెను. వేదికపై ఇష్ట దేవతాపూజ చేసి, మంత్రమును తనలో విలీనముచేసికొని పూర్వోక్తవిధమున చండుని పూజ చేయవలెను.

ఓం చండేశాయ నమః అని పూజ చేయవలెను. ఓం ధూలి చండేశ్వరాయ హూం ఫట్ స్వాహా” అనుచు ఆ విగ్రహముపై చండేశ్వరుని ఆవాహనము చేయవలెను. పిమ్మట అంగపూజ ‘ఓం చణ్డ శిరసే హూం ఫట్’ అని శిరస్సును, ‘ఓం చణ్డశిఖాయై హూం ఫట్’ అని శిఖను ‘ఓం చణ్డాయుష్కవచాయ హూం ఫట్’ అని కవచమును, ‘ఓం చణాస్త్రాయ హూంఫట్’ అని అస్త్రమును పూజించవలెను. పిదప రుద్రాగ్ని నుండి జనించిన చండదేవతను ‘చండదేవుడు హస్తములతో శూలమును, టంకమును ధరించి యుండును. నీలవర్ణము కలవాడు మూడవ హస్తమున అక్ష సూత్రమును, నాల్గవ హస్తమున కమండలమును ధరించి యుండును. అది టంకాకారము గలది, లేదా అర్ధచంద్రాకారము గలదిగా మండలమున ఉండును. నాలుగు ముఖములు కలవాడు” అని ధ్యానించి, పూజించి, యథాశక్తి జపము చేయవలెను. హోమ సామాగ్రి సమకూర్చుకొని జపములు దశాంశము హోమము చేయవలెను. భగవంతునకు సమర్పించిన గో, భూ, సువర్ణ, వస్త్ర, రత్నాదులు తప్ప మిగిలిన నిర్మాల్యమునంతను చండేశ్వరునకు సమర్పించవలెను.

సమయమున ఇట్లు చెప్పవలెను “ఓం చండేశ్వరా! శివుని ఆజ్ఞచే ఈ లేహ్య చోషార్వుత్తమాన్నము, తాంబూలము, పుష్పములు, అనులేపనము మొదలగు నిర్మాల్య రూప భోజనమును నీకు సమర్పించుచున్నాను చండా! పూజకు సంబంధించిన ఈ కర్మకాండయు అంతను నేను నీ ఆజ్ఞచే నిర్వర్తించితిని. అజ్ఞానముచే కలిగిన న్యూనత్వాధి కత్వాది దోషములు తొలగి ఈ పూజాదికము పరిపూర్ణమగుగాక.” ఈ విధముగ నివేదించి, ఆ దేవతలను స్మరించుచు, అర్ఘ్యము ఇచ్చి, సంహార మూర్తి మంత్రమును చదివి, సంహార ముద్ర భూములను అన్నింటిని తనలో ఉపసంహరించు కొనవలెను. నిర్మాల్యమును తోసివేసిన ప్రదేశమును గోమయజలముతో అలికి, అర్ఘ్యాదుల ప్రోక్షణము చేసి దేవతా విసర్జనము చేసిన పిమ్మట ఆచమనము చేసి మిగిలిన అవశ్యక కార్యములను ముగించు కొనవలెను. (76)