అగ్ని మహా పురాణము

Table of Contents

సూర్యార్చన కథనము

అగ్నిదేవుడు చెప్పెను:

శార్ఙ్గి (గ కారము) దండి (అనుస్వార యుక్తము కావలెను). దానిలో పద్మేశుడు (ఈ కారము) పావకుడు (ర కారము) ఈ నాలుగు అక్షరములను కలుపగ ఏర్పడిన బీజాక్షరము (గ్రీం) సర్వార్థ సాధకము పై బీజమునకు క్రమముగా దీర్ఘ స్వరములను చేర్చి అంగన్యాసము చేయవలయును. గణాధిపతికి గంగః గౌం గః గ్, అను ఐదు బీజాక్షరములు ఉన్నవి. అవి వేరువేరు ఫలములు ఇచ్చును. గణం జయాయ నమః, ఏక దంష్ట్రాయ, చలకర్ణినే గజ వక్త్రాయ, మహోదర హస్తాయ ఇవి సర్వ సామాన్యమైన పంచాంగములు. లక్షపర్యాయములు జపించుటచే మంత్ర సిద్ధి కలుగును. అష్టదళ కమలము ఏర్పరచి దిగ్దళములందు గణేశుని నాలుగు విగ్రహములను పూజించవలయును. క్రమముగా ఐదు అంగములను కూడ పూజించవలయును. నమః చివరచేర్చి గణాధి పతయే, గణేశ్వరాయ, గణనాయకాయ, గణక్రీడాయ అను నాల్గు మంత్రములు దిగ్దళమునందు ఉన్న మూర్తులను పూజించుటకు ఉపయోగించవలెను. అంగపంచకమును వెనుకటి వలెనే పూజించ వలయును. వక్రతుండాయ ఏకదంష్ట్రాయ, మహోదరాయ, గజవక్త్రాయ, వికటాయ, విఘ్నరాజాయ, ధూమ్రవర్ణాయ అని దిగ్విదిక్కులందున్న మూర్తులను పూజించవలయును. పిదప దిక్పాలకులను పూజించవలెను. ముద్రా ప్రదర్శనద్వారా పూజ శ్రేష్ఠము. మధ్యమాతర్జనీల మధ్య బొటన వ్రేలు ఉంచి పిడికిలి బిగించినచో అది గణేశముద్ర. ఈ విధముగా ధ్యానించవలెను. నాలుగు భుజములు కలవాడును మోదకములును గ్రహించినవాడును, దండ పాశాంకుశములతో కూడినవాడును, దంత భక్ష్యములు ధరించినవాడును, రక్తవర్ణుడును, పద్మపాశ అంకుశములను ధరించినవాడును అగు గణేశుని పూజించవలెను. చతుర్ధియందు విశేషముగా పూజించవలెను. శ్వేతార్కమూలముతో మూర్తి నిర్మించి తిలఘృత హోమములు చేసినచో సకల మనోరథములు సిద్ధించును. దధి మధు ఆజ్యములతో తండులములు హోమము చేసినచో సౌభాగ్యము వశిత్వము కలుగును.

ఘోష (హ), అసృక్ (6), ప్రాణ (య), శాంతి (ఔ), అర్థీ (ఉ), దండ (o), కలుపగ ఏర్పడిన {హ్యౌ) ఓం అను మార్తాండ భైరవమును బింబబీజముతో సంపుటితము చేసినచో సాధకునకు ధర్మార్థ కామ మోక్షములు లభించును. ఐదు హ్రస్వాక్షరములను ఆదియందు బీజముగచేర్చి పంచ మూర్తుల న్యాసము చేయవలయును. దీర్ఘస్వర బీజములతో హృదయా ద్యంగన్యాసము చేయవలయును. ధ్యానము సిందూరమువలె ఎర్రగా ఉన్నవాడును, ఈశాన్య దిక్కునందు వామార్ధమున భార్యా సహితుడై ఉన్నవాడును అగు సూర్యునకు నమస్కారము. ఆదిత్యాది పరివృతమగు రవి మండలమును పూజించి ఉదయ సమయమున అర్ఘ్యము ఇవ్వవలెను. ఈశాన్యమునందు కృతాంతునకు నిర్మాల్యమును చండునకు దీపిత తేజస్సును సమర్పించవలెను. రోచన కుంకుమ జల రక్త చందన అక్షతాంకుర వేణు బీజయవశాలి శ్యామాక తిలరాజక జపాపుష్పములు అర్ఘ్యపాత్రమునందుంచి, దానిని శిరస్సుపై ధరించి మోకాళ్ళపై కూర్చుండి సూర్యునకు అర్ఘ్యము ఇవ్వవలెను. స్వమంత్రములచే అభిమంత్రితములగు కలశములతో గ్రహములను పూజించి గ్రహాది శాంతికొరకై శాంతి కలశ జలముతో శాంతిచేసి సూర్య మంత్రము జపించువాడు సకల మనోరథములను పొందును. సంగ్రామ విజయ మంత్రమునందు బిందు పోషక బిందుయుక్త ‘ర’ చేర్చి ఆ మంత్రముతో శిరస్సు నుండి పాదముల వరకు ముద్రా ప్రదర్శన పూర్వకముగ ఆవాహన చేయుచు సూర్యుని పూజించవలెను. అంగన్యాసము చేసి తానే రవి అని భావించవలెను. మారణ స్థంబనములందు సూర్యుని పీతవర్ణునిగాను ఆప్యాయనము నందు శ్వేతవర్ణునిగాను శత్రుసంహారము నందు కృష్ణవర్ణుని గాను మోహన కర్మ యందు ధనుస్సు వంటి ఆకారము కలవానినిగాను భావన చేయవలయును. సూర్యుని అభిషేక, జప, ధ్యానపూజ, హోమములందు సర్వదా లగ్నుడైనవాడు తేజశ్శాలియై అజేయుడై శ్రీమంతుడై యుద్ధాదులందు జయమును పొందును. తాంబూలాదులందు ఈ మంత్ర న్యాసముచేసి దానియందు ఉశీరకము వుంచి తన చేతిలో కూడ సంగ్రామ విజయ బీజమును వ్రాసి ఆ తాంబూలము ఎవరికైన ఇచ్చినను హస్తముతో స్పృశించినను అతడు వశుడగును. (301)