అగ్ని మహా పురాణము

Table of Contents

కూర్మావతార కథ

అగ్ని పలికెను: పాపములను తొలగించు కూర్మావతారమును గూర్చి మొదట నేను ప్రతిజ్ఞ చేసిన విధమున చెప్పెదను. పూర్వము దేవాసుర యుద్ధములో దేవతలు దూర్వాసుని శాపముచే దైత్యుల చేతిలో ఓడిపోయిరి. అపుడు వారు (ఐశ్వర్య) లక్ష్మీరహితులై పోయిరి. క్షీరాబ్ధిపై ఉన్న విష్ణువును స్తుతించి “మమ్ములను అసురుల నుండి రక్షింపుము” అని వేడికొనిరి.

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతలతో “సురలారా! క్షీరాబ్ధిని మథించి అమృతమును, లక్ష్మిని సంపాదించుటకై అసురులతో సంధి చేసికొనుడు. పని పడినపుడు శత్రువులతో కూడ సంధి చేసికొనవలెను గదా! అమృతము మీకే దక్కునట్లును, దానవులకు దక్కకుండ ఉండునట్లును చేసెదను. మందర పర్వతమును కవ్వముగ చేసి, వాసుకిని కవ్వపుత్రాడుగా చేసి, నా సహాయముతో క్షీరాబ్ధిని మథింపుడు, మాంద్యము వలదు” అని అనెను.

విష్ణువు ఇట్లు పలుకగా దేవతలు దైత్యులతో ఒప్పందము చేసికొని క్షీరాబ్ధికివచ్చి మథింప ప్రారంభించిరి. వాసుకి తోకవైపు దేవతలుండిరి.

సర్పము విడచు నిట్టూర్పుల వేడికి బాధపడుచున్న దేవతలను హరి సేదదీర్చెను. సముద్రమును మథించుచుండగా ఆ పర్వతము క్రింద ఆధారమేదియు లేకపోవుటచే నీటిలో మునిగిపోయెను. విష్ణువు కూర్మరూపమును ధరించి మందర పర్వతమును నిలబెట్టెను. మథింపబడుచున్న క్షీరాబ్ధి నుండి హాలాహల విషము పుట్టెను.

శివుడు ఆ విషమును కంఠమునందు ధరించెను. అందుచే అతడు నీలకంఠుడు అయ్యెను. పిమ్మట వారుణీదేవియు (సురయు), పారిజాతము, కౌస్తుభము, గోవులు, అప్సరసలు పుట్టిరి. లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువును చేరినది. దేవతలందరును ఆమెను చూచుచు స్తోత్రము చేయుటచే శ్రీమంతులైరి.

పిమ్మట ఆయుర్వేదమును ప్రచారములోనికి తీసికొని వచ్చిన ధన్వంతరి రూపుడైన విష్ణువు అమృతపూర్ణమగు కమండలువునుచేత ధరించి ఆవిర్భవించెను.

జంభుడు మొదలగు దైత్యులు ఆతని చేతినుండి అమృతమును గ్రహించి, సగము దేవతలకు ఇచ్చి, వెళ్లిపోయిరి. పిమ్మట విష్ణువు స్త్రీ రూపమును ధరించెను.

మంచి సౌందర్యముగల ఆమెను చూచిన దైత్యులు మోహముచెంది, “ఓ వరాననా! మాకు భార్యవు కమ్ము; ఈ అమృతమును తీసికొని మాకు (త్రాగించుము) పంచిపెట్టుము” అని పలికిరి.

అట్లే అని పలికి హరి వారి చేతినుండి అమృతమును గ్రహించి దేవతలచే త్రాగించెను. రాహువు చంద్రరూపమును ధరించి అమృతము త్రాగుచుండగా సూర్య చంద్రులు అతనిని పట్టి చూపిరి.

అప్పుడు విష్ణువు రాహు శిరస్సును చక్రముచే ఖండించి వేరుచేసి దయతో దానికి మరణము లేకుండునట్లు చేసెను. రాహువు వరమును ఇచ్చు హరితో: “చంద్రసూర్యులు నాచే పట్టుబడుచుందురు. అది గ్రహణమగును. ఆ కాలమునందు ఇచ్చు దానము అక్షయము అగుగాక” అని పలికెను.

“అటులనే అగుగాక” అని విష్ణువు ఆతనితో పలికెను. పిమ్మట స్త్రీ రూపమును త్యజించి దేవతలతో కలిసియుండగా శివుడు “ఆ స్త్రీ రూపమును చూపుము” అని హరితో అనెను.

భగవంతుడైన శ్రీ మహావిష్ణువు, రుద్రునకు స్త్రీ రూపమును చూపెను. శివుడు విష్ణుమాయచే మోహితుడై పార్వతిని విడచి ఆ స్త్రీని వెంబడించెను.

శివుడు ఉన్మత్తుడై, దిగంబరుడై ఆమె కేశపాశమును పట్టుకొనెను. ఆమె జుట్టు విడిపించుకొని వెళ్ళిపోయెను. ఇతడు ఆమె వెంట పరుగెత్తెను.

ఈశ్వరుని వీర్యము స్ఖలితమై భూమిపై పడిన చోటులలో నెల్ల బంగారు లింగముల క్షేత్రము అయ్యెను.

ఇది అంతయు మాయ అని గ్రహించి శివుడు స్వస్థచిత్తుడు ఆయెను. అపుడు విష్ణువు శివునితో: “రుద్రా! నీవు నా మాయను జయించితివి. ఈ లోకములో నీవు తప్ప మరెవ్వరును నా మాయను జయింపజాలరు” అని పలికెను.

అమృతమును పొందజాలని ఆ దైత్యులను దేవతలు యుద్ధములో జయించిరి. దేవతలు స్వర్గములో నివసించిరి, దైత్యులు పాతాళలోక నివాసులు అయిరి. ఈ దేవి విజయకథను పఠించు వాడు స్వర్గమును పొందును అని పల్కెను. (3)