అగ్ని మహా పురాణము

Table of Contents

ఛందస్సారము  - 1

అగ్నిదేవుడు పలికెను:

ఇపుడు వేదమూల మంత్రానుసారముగ పింగళాక్త ఛందస్సులను క్రమముగా వర్ణించెదను. మ, న, భ, య, జ, ర, స, త, గణములు అని గణములు ఎనిమిది. అన్ని గణములందును మూడేసి అక్షరములు ఉండును. మగణములో అన్ని అక్షరములు గురువులు. నగణములో అన్ని అక్షరములు లఘువులు, ఆది గురువు భగణము, ఆది లఘువు యగణము, అంత్య గురువు సగణము, అంత్య లఘువు తగణము. పాదాంతము నందున హ్రస్వాక్షరము వికల్పముగా గురువగును. విసర్గ అనుస్వార సంయుక్తాక్షర జిహ్వా మూలీయ ఉపధ్మానీయములకు అవ్యవహిత పూర్వమునందున్న హ్రస్వము కూడ గురువు. దీర్ఘము గురువు. గురువునకు ‘గ’ లఘువునకు ‘ల’ అని సంకేతము. వసు శబ్దము ఎనిమిదికి, వేద శబ్దము నాలుగుకు సంజ్ఞ అగును. ఈ విషయములను లోకానుసారము తెలుసుకొనవలెను. (328)