అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రాయశ్చిత్తములు-3

పుష్కరుడు చెప్పెను:

మహాపాపులతో సంబంధము కలవారికి ప్రాయశ్చిత్తములను చెప్పెదను. పతితునితో కూడి తిరుగువాడు సంవత్సర కాలములో పతితుడగును. ఈ పతితత్వము, పతితునిచే యజ్ఞము చేయించుటచేతను, అధ్యయనము చేయించుటచేతను వైవాహిక సంబంధము ఏర్పరచుకొనుటచేతను మాత్రమే కలుగును గాని వానితో ప్రయాణము చేయుటచేతను, భుజించుటచేతను, కలిసి కూర్చుండుటచేతను కలుగదు. ఈ పతితులలో ఎవనితో ఒక వ్యక్తి సంసర్గమును పొందునో అతడు అపతితుడు చేయవలసిన ప్రాయశ్చిత్తమును చేసికొనవలెను. పతితుని సపిండులు బంధువులతో కలసి నిందిత దినమునందు, సంధ్యా సమయమున వంశానికి సంబంధించినవారు, ఋత్విక్కులు, గురువులు మొదలగువారి సమక్షమున ఆ పతితునకై (జీవించి యుండగనే) ఉదక క్రియ చేయవలెను. పిదప ప్రేతకు చేసిన విధముగ, ఒక జలము నింపిన కుండను దానిచే తన్నించవలెను. సపిండులు బంధువు లతో కూడ ఒకరోజు అశౌచము పాటించవలెను. అతనితో సంభాషణము చేయకుండవలెను. అతని జ్యేష్ఠభాగమును ఉపసంహరించవలెను. గుణములచే అధికుడగు చిన్నవానికి జ్యేష్ఠ భాగము చెందునట్లు చేయవలెను. అతడు ప్రాయశ్చిత్తము చేసికొనిన పిదప బంధువులు ఆతనితో కలిసి పుణ్యనదిలో స్నానముచేసి, జలము నింపిన క్రొత్త కుండను నీటిలో విసరివేయవలెను. పతిత స్త్రీలకు కూడ ప్రాయశ్చిత్తము ఈ విధముగనే చేయవలెను. వారికి వస్త్రములు, అన్నపానాదికము మాత్రము ఇవ్వవలెను. గృహసమీపమున నివాసమేర్పరుపవలెను. యథాకాలముగ గాయత్రీ ఉపదేశము పొందని ద్విజులచేత మూడు కృచ్ఛ్రములు చేయించి పిదప యథావిధిగా ఉపనయనము చేయవలెను. నిష్ఠి కర్మలు చేయుచు పరిత్యక్తులైన వారి విషయమున గూడ ఇట్లే చేయవలెను. చెడ్డ దానములు పట్టినవాడు మూడువేల గాయత్రీ మంత్రజపముచేసి, సమాహితచిత్తుడై ఒక మాసము గోష్ఠమునందు నివసించుచు పాలు మాత్రము త్రాగినచో పరిశుద్ధుడగును.

సంస్కార హీనులచే యజ్ఞము చేయించినను, ఇతరులకు అంత్యేష్టి కర్మ చేసినను, మంచివారి విషయమున అభిచార ప్రయోగము చేసినను బ్రాహ్మణుడు మూడు ప్రాజాపత్యములు చేయవలెను. ద్విజుడు శరణాగతుని పరిత్యజించినను, అనధికారికి వేదోపదేశము చేసినను, ఒక సంవత్సరము నియమితాహారము భుజించుటచే పాపవిముక్తుడు అగును. కుక్క, నక్క, గాడిద, పిల్లి, ముంగిస, మనుష్యుడు, గుఱ్ఱము, ఒంటె, పంది-ఇవి కరచినచో ప్రాణాయామముచే శుద్ధుడగును. వ్రతలోపము చేసినను, నిత్యకర్మలను ఉల్లంఘించినను, స్నాతకుడు ఉపవాసము చేయవలెను. బ్రాహ్మణుని విషయమున హుంకరించిన వాడును, పెద్దలను తుంకరించిన వాడును (నువ్వు అని అన్నవాడును) స్నానము చేసి, ఆ దినమున మిగిలిన కాలము ఉపవాస ముండి, వారికి నమస్కరించి ప్రసన్నులను చేసికొనవలెను. బ్రాహ్మణునిపై కఱ్ఱ ఎత్తినవాడు ప్రాజాపత్య వ్రతము చేసికొనవలెను. కఱ్ఱతో కొట్టినచో అతికృచ్ఛ్రమును, రక్తము వచ్చునట్లు చేసినచో కృచ్ఛ్రమును, అతికృచ్ఛ్రమును చేయవలెను. తెలియకుండ ఒక చండాలుడు వచ్చి ఇంటిలో కాపురము ఉన్నచో, తెలిసిన పిమ్మట ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. చాంద్రాయణము గాని, పరాక వ్రతమును గాని చేసినచో ద్విజులకు శుద్ధి యగును. శూద్రులకు ప్రాజాపత్య వ్రతముచే శుద్దియగును. మిగిలినదంతయు అతడు కూడ ద్విజులవలెనే చేయవలెను. ఇంటిలో ఉన్న బెల్లము, కుసుంభము (కుంకుమ పువ్వు), లవణము, ధాన్యము మొదలగు పదార్థములను ద్వారమువద్ద కుప్పగా చేసి తగులబెట్టవలెను. మట్టి పాత్రలను పారవేయవలెను. ఇతర ద్రవ్యములకు శాస్త్రోక్త శుద్ధి చేయవలెను. చండాలస్పర్శ దూషితమగు నూతి   నుండి నీరు త్రాగిన బ్రాహ్మణుడు ఉపవాసము గాని, పంచ దివ్యశుద్ధి గాని చేయవలెను. ఇష్టపడి చండాలుని స్పర్శచేసి భోజనముచేసిన బ్రాహ్మణుడు చాంద్రాయణముగాని, తప్త కృచ్ఛ్రముగాని చేయవలెను. చండాలాది నీచజాతుల స్పర్శచే భోజనాది పాత్రలు అపవిత్రమైనచో బ్రాహ్మణుడు షడ్రాత్ర వ్రతము చేయవలెను. అంత్య జాతివాని ఉచ్ఛిష్టము తిన్న ద్విజుడు చాంద్రాయణ వ్రతము చేయవలెను; శూద్రుడు త్రిరాత్ర వ్రతము చేయవలెను. చండాలుని కూపమునుండిగాని, పాత్రనుండిగాని తెలియక త్రాగిన ద్విజుడు సంతపన కృచ్ఛ్రమును, శూద్రుడు ఏకదినోప వాసమును చేయవలెను. చండాల స్పర్శచేసి జలము త్రాగిన ద్విజుడు త్రిరాత్ర వ్రతమును చేయవలెను. శూద్రుడు ఒకదినము ఉపవాసము చేయవలెను.

ఉచ్ఛిష్టమైన కుక్కచేత గాని, శూద్రునిచేతగాని స్పృశించబడిన ద్విజుడు ఒక రాత్రి ఉపవాసముండి పంచగవ్యముచే శుద్ధి పొందును. అట్టి వైశ్యుడుగాని, క్షత్రియుడు గాని స్పృశించినచో రాత్రి స్నానము చేయవలెను. మార్గమధ్యము నందున్న బ్రాహ్మణుడు ఉదకములేని అరణ్యమునందు, పక్వాన్నము చేతిలో నుండగా మూత్ర విసర్జనము చేసినచో, ఆ ఆహారమును క్రింద పెట్టకుండగ, తన శరీరముపైననే ఉంచుకొని, శౌచముచేసికొని ఆ అన్నమును ప్రోక్షించి సూర్యునకును అగ్నికిని చూపవలెను. అరణ్యమునందు మ్లేచ్ఛులతో గాని, చోరులతోగాని సంబంధ మేర్పడినవారికి, లేదా ప్రవాసములో నున్న వారికి భక్షాభక్ష్య శుద్ధి నిమిత్తము ఉపాయమును చెప్పెదను. వర్ణక్రమాను సారముగా బ్రాహ్మణుడైనచో అతడు మరల స్వదేశమునకు తిరిగివచ్చి కృచ్ఛ్రవ్రతము చేసిన పిమ్మట మరల సంస్కారముచేసికొనవలెను. క్షత్రియుడు మూడువంతుల ప్రాయశ్చిత్తము, వైశ్యుడు సగము ప్రాయశ్చిత్తము చేసికొని శుద్ధులగుదురు. శూద్రుడు పాదము ప్రాయశ్చిత్తము చేతగాని, దానముచేత గాని, శుద్ధుడగును. సవర్ణయగు రజస్వలచే స్పృశింపబడిన రజస్వలాస్త్రీ ఆ దినమునందే స్నానము చేసినచో శుద్ధురాలగును. తక్కువవర్ణముగల రజస్వల స్త్రీచే స్పృశింపబడిన రజస్వల శుద్ధ స్నానము చేత శుద్ధురాలగును; స్నానము చేయునంత వరకును భుజించగూడదు. మూత్రోత్సర్గానంతరము ప్రయాణము చేయుచు, మరచి నీళ్లు త్రాగినచో ఒక రాత్రి ఒక పగలు ఉపవాసముండి పంచగవ్యచే శుద్ధుడగును. మూత్రోత్సర్గము చేసిన ద్విజుడు శౌచము చేసికొనకుండ, అజ్ఞానముచే భోజనము చేసినచో మూడు రాత్రులు యవలు త్రాగి శుద్ధిచెందును.

బలాత్కారాది కారణములచేత సన్యసించిన విప్రులు అందుండ అసమర్థులై మరల గృహస్థాశ్రమమునకు రావలెనన్నచో వారికి శుద్ధిని చెప్పుచున్నాము. మూడు కృచ్ఛ్రములుగాని, వారిచే చాంద్రాయణముగాని చేయించవలెను. మరల జాతకర్మాది సంస్కారములచే సంస్కరించవలెను. పాదుకగాని, అమేధ్యముగాని ముఖమునకు తగిలినచో మృత్తిక, గోమయము, పంచగవ్యము వీటిచే శుద్ధిచేసికొనవలెను. నీలిమందు పండించుట, విక్రయము, నీలవస్త్రాది ధారణముచేసిన బ్రాహ్మణుడు పతితుడగును. మూడు కృచ్ఛ్రములచే శుద్ధుడగును. అంత్యజాతివానిచేతను, శ్వపాకునిచేతను స్పృశింపబడిన రజస్వల త్రిరాత్రము చేసినచో నాల్గవ రోజున శుద్ధురాలగును.

చండాలశ్వపచులను, పాసిన వస్తువును, సూతికా స్త్రీని శవమును వీటిని స్పృశించిన వానిని స్మృశించినవాడు సద్యః స్నానముచే శుద్ధుడగును. పచ్చిగానున్న మనిషి ఎముకను స్పృశించిన విప్రుడు స్నానముచే శుద్ధుడగును. మార్గము నందలి బురదనీళ్ళు పడినప్పుడు నాభిక్రింద మట్టితోను, ఉదకముతోను శుద్ధి చేసికొనవలెను. వాంతిచేసుకొన్నవాడు, విరేచనములు వెళ్ళినవాడును స్నానముచేసి ఘృతప్రాశనము చేసినచో శుద్ధుడగును. క్షౌరము చేయించుకొన్నవాడు స్నానముచేతను, గ్రహణ సమయమున అన్నము తిన్నవాడు కృచ్ఛ్రము చేతను శుద్ధుడగును. పంక్తి బాహ్యులతో కలిసి భోజనము చేసినవాడును, కుక్కగాని, కృములుగాని కరచిన వాడును, అశుచియైనవాడును పంచ గవ్యములచే శుద్ధిపొందును. ఆత్మహత్యా ప్రయత్నము చేసినవాడు కృచ్ఛ్రముచేతను, జపముచేతను శుద్ధుడగును. పాపాత్ములు అందరును హోమాదులచేతను, పశ్చాత్తాపము చేతను శుద్ధులు అగుదురు. (170)