అగ్ని మహా పురాణము
సీమా వివాద నిర్ణయము
అగ్నిదేవుడు పలికెను:
క్షేత్రము విషయమున సీమా వివాదము (సరిహద్దు) ఏర్పడినపుడు సామంతులు వృద్ధులు మొదలగువారు గోపాలకులు ఆ సరిహద్దులలో వుండు కర్షకులు వనములో వసించువారు వీరందరును ఎత్తైన ప్రదేశము బొగ్గులు ఊక (పొల్లు) వృక్షములు వంతెనలు, పుట్టలు, పల్లములు, చైత్యములు మొదలైనవాటి సహాయముతో ఆ సరిహద్దును గుర్తించవలెను. సామంతులుగాని, గ్రామములోని నలుగురుని గాని, ఎనమండుగురు గాని, పదిమంది గాని, ఎర్రని పుష్పమాలలను, వస్త్రములను ధరించి, తలపై మట్టిపెట్టు కొని సీమా నిర్ణయము చేయవలెను. ఈ సామంతాదులు అసత్యము చెప్పినచో రాజు వారికి వేరువేరుగా మధ్యమ సాహస దండము ఇవ్వవలెను. సీమను నిర్ణయించు చిహ్నములు లేని పక్షమున రాజే సీమా నిర్ణయము చేయువాడు. తోటలు గృహములు. గ్రామములు తటాకాదులు ఉద్యానములు దేవాలయములు. వర్ష జలములు ప్రవహించు కాలువలు మొదలగు వాటి విషయము గూడ సీమానిర్ణయము ఇట్లే చేయవలెను. సరిహద్దులు తొలగించిన వారికిని, క్షేత్రము హరించినవారికిని, సరిహద్దు దాటినవారికిని రాజు క్రమముగా అధమ ఉత్తమ మధ్యమ దండములు ఇవ్వవలెను. చాల మందికి ఉపయోగించినది కొంచెము మాత్రమే బాధ కలిగించునది యగు సేతువు - పరుల భూమిలోనికి పోవు అత్యధికమగు జలముగలది-అల్ప క్షేత్రమును ఆక్రమించునదియగు కూపము వీటిని అడ్డుపెట్టరాదు. క్షేత్రాధిపతికి తెలుపకుండగనే క్షేత్రమునందు సేతువును నిర్మించినచో దానిని క్షేత్రాధిపతియే అనుభవించవలెను. అతడు లేనిచో అది రాజునకు చెందును. దున్నువాడు తాను దున్నిన భూమిపై పంట పండింపకున్నను, ఇతరులను పండింపకుండ అడ్డుకున్నను దున్నిన భూమిపై వచ్చుటకు అవకాశమున్న పొలమును అతనికి ఇప్పించి ఆ పొలమును మరియొకనిచే చేయించవలెను.
గేదె సస్యమునకు కల్గించినపుడు ఎనిమిది మాషములు, గోవు నష్టము కల్గించినచో నాలుగు మాషములు, మేకలు, గొఱ్ఱెలు, కలిగించినచో దండము విధించవలెను. గేదెలు మొదలగునవి సస్యమును భక్షించి అక్కడ కూర్చున్నచో పైన చెప్పినదానికి రెట్టింపు దండమును విధించవలెను. వివీత క్షేత్రమునందు కూడ పైన చెప్పినట్లే దండమును విధించవలెను. గాడిదలకు ఒంటెలకు కుండ గేదెతో సమానముగా దండము. ఎంత సస్యము నష్టమైనదో అంత క్షేత్రస్వామికి ఆ పశువుల స్వామిచేత ఇప్పించవలెను. పశువుల కాపరికి తాడనమే దండము, గోస్వామికి ఆతడు స్వయముగా మేపినచోపైన చెప్పిన దండము విధించవలెను. ఆ క్షేత్రము మార్గము సందును గ్రామము యొక్క వివీతము చివరను వున్నపుడు తెలియక పశువులు మేసినచో దండములేదు. తెలిసిమేపినచో చోరుని వలె దండించవలెను. ఆబోతు, దేవతలను ఉద్దేశించి విడిచిన పశువులు క్రొత్తగా ఈనిన ఆవు చెదరివచ్చిన ఆవు ఇవి మేసినచో దండములేదు. వాటిని విడిచిపెట్టవలెను. దైవోపహతములు, రాజోపహతములగు పశువులనుకూడ విడిచి పెట్టవలెను. గోపాలకుడు ప్రాతః కాలమున పశువులను తానెట్లు తీసుకొని పోవునో సాయంకాలమున అట్లే తిరిగి స్వామికి అప్పచెప్పవలెను. జీతము తీసుకొను గోపాలుని ప్రమాదముచే పశువులు మరణించినను, నష్టమైనను ఆతనిచే వాటి స్వామికి ఇప్పించవలెను. గోపాలుని పొరపాటుచే పశువు నశించినచో పదమూడున్నర పణముల దండము విధించి పశు మూల్యమునకు సమానమైన ధనమును పశుస్వామికి ఇప్పించ వలెను. గ్రామస్థుల ఇష్టము ప్రకారముగాని, రాజాజ్ఞచేతగాని, గోవుల మేతకై కొంత భూమిని విడువవలెను. బ్రాహ్మణుడు అన్ని క్షేత్రముల నుండియు తృణమును కట్టెలను, పుష్పములను, తన సొంత వస్తువువలె గ్రహింపవచ్చును. గ్రామమునకు పొలమునకు మధ్య వందధనుస్సుల దూర ముండవలెను. ఖర్వటము (పెద్ద గ్రామము) నకు క్షేత్రమునకు మధ్య రెండు వందల ధనుస్సుల అంతరము, నగరమునకు క్షేత్రములకు మధ్య నాలుగు వందల ధనుస్సుల అంతరము వుండవలెను.
తన వస్తువును అపహరించి ఎవరైన ఇతరులకు అమ్మివేసినపుడు అది కనబడినచో దానిని స్వామి తీసుకొనవచ్చును. దానిని బయట కనబడకుండ చేసినచో అది కొన్నవాని దోషము. ఒక నీచుని నుండి తక్కువ మూల్యము ఇచ్చి సమయము కాని సమయము నందు రహస్యముగా ఒక వస్తువును కొన్నవాడు చోరుడే. నష్టమైనను అపహృతమైనను ఒక వస్తువు కనబడినచో అది ఎవని వద్దనుండునో వానిని రాజపురుషులచే పట్టించవలెను. ఆ దేశమునందు ఆ సమయమునందు పట్టించుట కుదరకపోయినను, తాను స్వయముగా పట్టి ఇవ్వవలెను. అపహృత వస్తువును కొన్నవాడు అమ్మిన వానిని చూపించినచో వాడు శుద్ధుడగును. రాజు ఆ ద్రవ్యమును స్వామికి ఇప్పించి అమ్మినవానిని శిక్షించి కొన్నవానికి వానిచే మూల్యమును తిరిగి ఇప్పించవలెను. నష్టమైన వస్తువును దాని స్వామి తనకు ఎట్లు వచ్చినదో తాను ఎట్లు అనుభవించెనో చెప్పి అది తనదని నిరూపించు కొనవలెను. అట్లు చేయజాలనిచో రాజు దానిలో పంచ మాంశమును దండముగ విధించవలెను. హృతమైన లేదా నష్టమైన తన వస్తువును గూర్చి రాజుకు నివేదించక ఇతరుల ద్వారా దానిని పొందినవానికి రాజు తొంబది యాఱు పణములు విధించవలెను. శుల్కాధికారులు కాని, స్థాన పాలకులు గాని తీసుకొనివచ్చి రాజువద్ద వుంచిన నష్ట అపహృత ధనమును దాని స్వామి ఒక సంవత్సరములోపుగ తనదని నిరూపించి మరల పొందవచ్చును. సంవత్సరము దాటినచో అది రాజుకు చెందును. ఏక శఫములు (గుఱ్ఱములు మొదలగునవి) పోయి మరల లభించినచో వాటి స్వామి రాజునకు నాలుగు పణములు ఇవ్వవలెను. మనుష్య జాతికి సంబంధించిన ద్రవ్యము లభించినచో ఐదు పణములు, మహిషము, ఉష్ట్రము, గోవు తిరిగి లభించినపుడు రెండేసి పణములు, మేకలకు గొఱ్ఱెలకు పణములో నాలుగవ వంతు ఇవ్వవలెను.
తన కుటుంబమునకు నష్టముకాని విధమున తన వస్తువులను దానము చేయవచ్చును. భార్యాపుత్రాదులను ఎన్నడును దానము చేయకూడదు. తన సర్వస్వమును తనవంశము ఉన్నపుడు ఇతరులు ఎవ్వరికిని ఇవ్వకూడదు. ఒకరికి ఇచ్చిన దానిని మరొకరికి ఇవ్వకూడదు. ప్రతిగ్రహము అందరి యెదుటను చేయవలెను, ఇచ్చెదనని చెప్పిన వస్తువును తప్పక ఇవ్వవలెను. ఇచ్చి మరల తీసుకొనగూడదు. బీజములు ఇనుము, వాహనములు, రత్నములు, దాసి, పాలిచ్చు పశువులు, దాసులు వీరిని రక్షించుటకు వరుసగ పది, ఒకటి, ఐదు, ఏడు దినములు మాసము, మూడు దినములు, అర్ధమాసము తీసుకొనవచ్చును. బంగారము అగ్నిలో వేసినను తరగదు. వెండి నూటికి రెండు పలములు తగ్గును. తగరము సీసము నూటికి ఎనిమిది పలములు తగ్గును, రాగికి ఐదు పలములు ఇనుముకు పదిపలములు తరుగువచ్చును. ఉన్ని నూలు వీటితో నేసిన బట్టలకు సూటికి పదిపలములు పెరుగును. మధ్య ప్రమాణముగల దారమైనచో ఐదు పలములు సూక్ష్మమయినచో మూడు పలములు హెచ్చును. అద్దకము బట్టలందును, రోమములు గుచ్చిన బట్టలందును నూటికి ముప్ఫై వంతులు తరుగు వచ్చును. పట్టుబట్టలందు, నారచీరలందు, క్షయముగాని వృద్ధికాని ఉండదు. కుశలులగు వారు దేశమును కాలమును భోగమును దృష్టిలో ఉంచుకొని నష్టమైన వస్తువుల విషయమున బలాబలములను ఏ విధముగా నిర్ణయింతురో ఆ నష్టమును రాజు తప్పక ఇప్పించవలెను.
బలాత్కారముగా, దాసుడుగా చేయబడిన వానిని చోరులచే అమ్మబడినవానిని తన స్వామిని ప్రాణ సంకటము నుండి రక్షించినవానిని, తనకై స్వామి ఎంత వ్యయము చేసెనో అంతధనము తిరిగి ఇచ్చివేసిన వానిని దాసత్వమునుండి విడిపించవలెను. ప్రజ్యావసితుడు (సన్యాసమును స్వీకరించి భ్రష్టుడైన వాడు) ఆమరణాంతము రాజుకు దాసుడుగా వుండవలెను. వర్ణములలో దాస్యము అనులోమ్యముచే (క్రింద వర్ణము వారు పైవర్ణము వారికి) దాస్యముండును. ప్రతిలోమ క్రమముచే కాదు. శిల్పము నేర్చుకొన్న శిష్యుడు నిశ్చితమగు కొంత కాలము పాటు గురు గృహమునందే నివసించుచు, గురువు వంట భోజనము చేయుచు, శిల్పముల వలన సంపాదించిన ధనమును గురువునకు ఇవ్వవలెను. రాజు తన నగరమున స్థానము కల్పించి అచట బ్రాహ్మణులకు నివాస మేర్పరచి వేదవిదులగు వారికి వృత్తి కల్పించి ‘మీరు ఇచట స్వధర్మానుష్ఠానము చేయుడు’ అని ప్రార్థించవలెను. స్వధర్మమునకు అవిరుద్ధమగు ఆయా సమయములందు ఏర్పరచబడిన రాజనిర్ణీత ధర్మమును కూడ ఆ బ్రాహ్మణులు పాలింపవలెను. ఎవడు జనగణము యొక్క ద్రవ్యమును హరించునో, మర్యాదను లంఘించునో అతని సర్వస్వమును తీసుకొని రాష్ట్రము నుండి వెడల గొట్టవలెను. సమాజ హితమును కోరువారు చెప్పిన విషయమును అందరును ఆచరించవలెను. తద్విపరీతముగా ప్రవర్తించుచు వానిని ప్రథమ సాహస దండముచే శిక్షించవలెను. సమాజ కార్యముపై పంపబడినవాడు తనకు లభించిన దంతయు సమాజమునకు సమర్పించవలయును. వాడు అల్లు అర్పించకున్నచో వానిచే పదకొండు రెట్లు ఇప్పించవలెను. వేదజ్ఞులు, పవిత్రులు, లోభము లేనివారు, కార్యచింతకులు కావలెను. సమాజ హితమును చెప్పువారి వచనమును అందరును ఆచరించవలెను. శ్రేణులు, నైగములు, పాషండులు, గణములు వీరికికూడ ఇదివర్తించును. రాజు వీరి ధర్మభేదములను, పూర్వ వృత్తిని పాలించవలెను.
వేతనము తీసుకొని పని మానివేసినవాడు వేతనమునకు రెట్టింపు ధనమును స్వామికి ఇవ్వవలెను. అతడు వేతనము తీసుకొనకుండ పనిమానివేసినచో వేతన ధనమును స్వామికి ఇప్పించవలెను. భృత్యుడు ఉపకరణములను రక్షించుచుండవలెను. వేతనము నిశ్చయించకుండగ ఎవరైనా భృత్యునిచే పని చేయించుకున్నచో రాజు వానిచే ఆ భృత్యునికి వాణిజ్యము పశువులు సస్యము వీటిలో పదవవంతు ఇప్పించవలెను. దేశ కాలములను దాటబెట్టుటచే పనిని చెడగొట్టిన భృత్యునకు స్వామి తన ఇష్టము వచ్చినంత వేతనమునే ఇవ్వవలెను. అనుకొనిన దానికంటె అధికము సమకూర్చినచో అధిక వేతనము ఇవ్వవలెను. ఎవడు ఎంత పనిచేయునో అతనికి అంతయే వేతనము-ఇద్దరికి అసాధ్యమైన పనిని ఒకడు ఎంతచేయునో అంతయే వేతనము, సాధ్యమైనచో చెప్పినంత వేతనము ఈయవలెను. భారమును మోయు భృత్యుడు, రాజునకు కాని దైవమునకు కాని సంబంధించిన వస్తువును మోయుచు దానిని నష్టపరచినచో ఆవాహకునిచే అంత ధనము స్వామికి ఇప్పించవలెను. యాత్రలో విఘ్నము కలిగించు భృత్యునిచే వేతనమునకు రెట్టింపు ధనమును ఇప్పించ వలెను. యాత్రా ప్రారంభమున పనిమానివేసిన వానిచే వేతనములోని సప్తమ భాగమును మార్గమునందు మానివేసిన వానిచే చతుర్థ భాగమును, మార్గమధ్యము నందు మానివేసిన వానిచే మొత్తము వేతనమును ఇప్పించవలెను. జూదములో పందెము నందు, నూరుగాని, అంతకంటె అధికముగాని ఎక్కువ సంపాదించిన జూదరి నుండి సభికుడు రాజునకు సభికుడు (ద్యూత గృహాధ్యక్షుడు) నూటిలో పదవ వంతు తీసికొనవలెను. మరల అంత లాభము వచ్చినప్పుడు నూటికి పదవవంతు తీసుకొనవలెను. జయించిన ధనమును జయించిన వానికే ఇచ్చి క్షమాపరాయణుడై సత్యమునే పలుకవలెను. ప్రసిద్ధులగు జూదరుల సముదాయము సభికులతోసహా రాజు వద్దకు వెళ్ళి ఆతని భాగమును చెల్లించిననే రాజు ఓడిపోయిన వానికి జయించిన వారి సొమ్మునే ఇప్పించవలెను. ద్యూతమునకు సంబంధించిన వ్యవహారములను పరిశీలించుటకును, సాక్ష్యము చెప్పుటకును, జూదరులనే నియమించవలెను. తప్పుడు పాచికలతో ఆడించువారి శరీరముపై కొన్ని గుర్తులువేసి దేశము నుండి వెడలగొట్టవలెను. జూదములో దొంగలను తెలుసుకొనుటకు ఒక్క వ్యక్తినే ప్రధానునిగా నియమించవలెను. ప్రాణి ద్యూతమునందు కూడ ఇదియే నియమము. (257)
