అగ్ని మహా పురాణము

Table of Contents

దమనకారోహణ విధానము

ఈశ్వరుడు పలికెను: ఇపుడు దమనకారోహణ విధి చెప్పెదను అన్ని కార్యములను వెనుకటివలెనే చేయవలెను. పూర్వము శివుని కోపమునుండి భైరవుడు జనించి దేవతలను పీడింప ప్రారంభించెను. ఇది చూచి కోపించిన శివుడు ‘నీవు వృక్షమగుదువు గాక’ అని భైరవుని శపించెను. అతడు క్షమింపుమని ప్రార్థించగా శివుడు - ‘నీ పత్రములతోగాని, నీకుగాని పూజించువారి మనో వాంఛితములు సిద్ధించును. వారి కోరికలు నిష్ఫలమగుట అనునది ఉండదు’ అని అనుగ్రహించెను. సప్తమి లేదా త్రయోదశియందు మంత్రవేత్త సంహితా మంత్రములచే దమనక వృక్షమును పూజించి-“ఓ దమనక వృక్షమా! నీవు శివుని ప్రసాదముచే ఆవిర్భవించితివి. నీవు ఇచట సన్నిహితుడవు కమ్ము. శివుని ఆజ్ఞననుసరించి నేను నిన్ను శివకార్యార్థమై తీసికొని వెళ్లవలసి ఉన్నది” అని ప్రార్థించవలెను. ఆ వృక్షమును ఇంటికి తీసికొనివచ్చి సాయంకాలమున అధివాసన కర్మ చేయవలెను, యథావిధిగ సూర్య, శివ, అగ్నుల పూజచేసి, ఇష్టదేవతకు పశ్చిమమున, మట్టితో చేర్చి ఆ వృక్షము మూలమును స్థాపించవలెను. వామదేవ మంత్ర, శిరోమంత్రములతో ఆ వృక్షనాళములను, ఉసిరిక పండ్లను ఉత్తరమునందు ఉంచవలెను. రాలిపోయిన దాని ఆకులను దక్షిణమునందును, పుష్పములను, తూర్పునను ఉంచవలెను. ఈశాన్యమునందు ఒక దొన్నెలో దాని ఫలములను, మూలమును ఉంచి శివుని పూజ చేయవలెను. ఆవృక్షమునకు సంబంధించిన వేళ్లు, కాడలు, పత్రములు, పువ్వులు, ఫలములు అను పంచాంగములను దోసిట గ్రహించి, ఆమంత్రణము చేయుచు శిరస్సుపై ఉంచుకొని ‘దేవేశ్వరా! నేడు నిన్ను ఆహ్వానించుచున్నాను. రేపు ప్రాతః కాలమున నేను తపః ఫలమును సంపాదింపవలెను. చేసిన ఉపాసనను సఫలము చేయవలెను. ఇదంతయు నీ ఆజ్ఞచే పూర్ణమగుగాక” అని ప్రార్థించవలెను. పిమ్మట పాత్రలో ఉంచిన మిగిలిన పవిత్రకములను మూలమంత్రముతో ఆచ్ఛాదించి ప్రాతఃకాలము స్నానానంతరము శివుని గంధ పుష్పాదులతో పూజించవలెను. పిమ్మట నిత్యనైమిత్తిక కర్మలు పూర్తిచేసికొని దమనకమును పూజించి, దానిని దోసిలిలో గ్రహించి ‘ఓం హాం ఆత్మ తత్త్వాధిపతయే శివాయ స్వాహా’, ‘ఓం హాం విద్యాతత్త్వాధిపతయే శివాయ స్వాహా’, ‘ఓం హాం శివతత్వాధిపతయే శివాయస్వాహా’, ‘ఓం హాం సర్వతత్త్వాధి పతయే శివాయ స్వాహా’ అను మంత్రములతో శివునిపై ఉంచి, పూజించి నాల్గవ అంజలిలో దమనకము గ్రహించి ‘ఓం హూం మహేశ్వరాయ మఖం పూరయ పూరయ శూలపాణయే నమః’ అను మంత్రముతో దానిని శివునకు అర్పించవలెను. ఈ విధముగ శివుని, అగ్నిని పూజించి, గురువునకు విశేషపూజచేసి “పూజ్యుడా! నేను దమనకముతో చేసిన పూజులో ఏవైన ఎక్కువ తక్కువలు ఉన్నచో అవి నీ కృపచే సరి యగుగాక’ అని ప్రార్థించవలెను. ఈ విధముగ దమనకారోహణ కర్మ చేసినవాడు చైత్ర మాస జనితమగు సంపూర్ణ ఫలముపొంది అంతమున స్వర్గమునకు పోవును. (80)