అగ్ని మహా పురాణము

Table of Contents

సర్పలక్షణ కథనము

అగ్నిదేవుడు చెప్పుచున్నాడు:

ఇపుడు నాగ ఉత్పత్తి, సర్పదంశన సమయమునందలి అశుభ నక్షత్రాదులు, సర్పదంశములో వివిధ భేదములు దంశస్థానములు, మర్మస్థలము, సూతకము, సర్పదష్టుని చేష్ట-ఈ ఏడు లక్షణ ములను చెప్పెదను. శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు-శంఖపాలుడు, కులికుడు అను ఎనమండుగురు నాగులలో శ్రేష్టులు. వీరిలో ఇద్దరు నాగులు బ్రాహ్మణులు, ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు వైశ్యులు, ఇద్దరు శూద్రులు. ఈ నాలుగు వర్ణముల నాగులకు క్రమముగ వెయ్యి, ఎనిమిది వందలు, ఐదువందలు, మూడువందలు, పడగలు వుండును. వీరివంశమున ఐదువందల నాగులు పుట్టిరి. వారి నుండి పుట్టిన వారు అసంఖ్యాకులు. సర్పములు, ఫణి, మండలి, రాజిలము అని మూడు విధములు. ఇవి. వరుసగ వాత, పిత్త, కఫ ప్రధానములు. ఇవికాక వ్యంతరము, దోష మిశ్రమము, దర్వీకరము అని జాతిగల సర్పములు కూడ ఉన్నవి. వీటిపై చక్రము హలము, ఛత్రము స్వస్తికము, అంకుశము వీటి చిహ్నములుండును. గోనస సర్పముపై విచిత్రములైన మండలములుండును. ఇది దీర్ఘకాయమై మందముగ ప్రాకును. రాజిల సర్పము స్నిగ్ధముగనుండును. దాని పై భాగమునందును పార్శ్వ భాగములందును రేఖలుండును. వ్యంతర సర్పములపై మిశ్రిత చిహ్నములుండును. వీటిలో పార్థివములు, ఆప్యములు, ఆగ్నేయములు, వాయవ్యములు అను నాలుగు భేదములును, ఇరువది ఆరు అవాంతర భేదములును ఉండును. గోనస సర్పములలో పదునారు. రాజిల సర్పములలో పదమూడు, వ్యంతర సర్పములలో ఇరువది యొక్కటి భేదములు ఉండును. సర్పములు పుట్టు కాలమునందు కాక తద్భిన్న కాలమునందు పుట్టిన సర్పములు వ్యంతరములు యని చెప్పబడును. ఆషాఢము మొదలు మూడు మాసములలో సర్పములు గర్భము ధరించును. గర్భము ధరించి నాలుగు మాసములు గడచిన పిమ్మట ఆడ సర్పము రెండు వందల నలుబది గ్రుడ్లను కనును. ఆ గ్రుడ్ల నుండి సర్పము పిల్లలు బయటికి వచ్చి వాటిలో స్త్రీ, పురుష నపుంసక లక్షణములు ఆవిర్భవించుటకు ముందుగానే సాధారణముగ సర్పములు వాటిని తిని వేయును. కృష్ణ సర్పము ఏడు రోజులలో కండ్లు తెరచును. ఒక మాసములో గ్రుడ్డు నుండి బయ టకు వచ్చును. పండ్రెండు దినములు దాటిన పిమ్మట దానికి జ్ఞాపకము కలుగును. ఇరువది దినముల పిమ్మట సూర్య దర్శనము కలుగగానే దానికి ముప్పది రెండు దంతములు మొలచును. వాటిలో నాలుగు విష దంతములు ఉండును. వాటికి కరాళి, మకరి, కాళరాత్రి యమదూతి అని పేర్లు. ఇవి వాటి యెడమ కుడి ప్రక్కలలో ఉండును. సర్పము ఆరు మాసములకొక పర్యాయము కూసము విడుచును. నూట ఇరువది సంవత్సరములు జీవించును, శేషాది సప్తనాగములు వరుసగ సూర్యాది వారములకు అధిపతులు. ఈ ఆధిపత్యము పగలు, రాత్రి కూడ ఉండును. శేషాది సప్త నాగములు తమతమ వారములలో ఉదయించును. కాని కుళికుడు అన్నిటి సంధికాలము నందును ఆవిర్భవించును. లేదా అది మహాపద్మశంఖపాలులతో పాటు ఉదయించును. మహాపద్మ శంఖపాలుల మధ్యనున్న రెండు గడియల కాలమున కుళికోదయము అగునని మరొక మతము. కులికోదయ మతము అన్ని కార్యములకు నిషిద్ధము. సర్పదంశమునందు ప్రధానముగ అశుభము. కృత్తికా, భరణి, స్వాతి, మూల పూర్వ ఫల్గుణీ, పూర్వాషాఢ, పూర్వాభాద్రా, అశ్వినీ, విశాఖా, ఆర్థ, ఆశ్లేష, చిత్ర, శ్రవణ, రోహిణి, హస్త, నక్షత్రములు, శని మంగళ వారములు, పంచమి, అష్టమి, షష్టీ, రిక్త చతుర్థీ, నవమి, చతుర్దశులు తృతీయ తిథి సర్పదంశమున నింద్యములు పంచమి, చతుర్దశీ, తిథులలో సర్పదంశము విశేషించి నిందితము. నాలుగు సంధ్యలందును, దగ్ధరాశులందును సర్పము కరచినచో అది అనిష్టకర మగును. ఒకటి, రెండు, మూడు దంతముల కాట్లు వరుసగ దుష్టము, విద్ధము ఖండితమని చెప్పబడును. సర్పము కేవలము స్పృశించి కరవకున్నచో అది అదంశము. దీనిలో మనుష్యునకు భయముండదు. ఈ నాల్గు విధములగు దంశములలో మూడు రెండు ఒకటి దంశములు వేదనాజనకములై రక్తస్రావమును కలిగించును. ఒక పాదము కూర్మము వీటితో సమానమగు ఆకారము గల కాటు, రాత్రియందు జరిగినచో అది మృత్యు ప్రేరితమని తెలియవలయును. వేడి చీమలు పాకుతున్నట్లు భావము. కంఠ శోధము మొదలగు పీడలతో కూడిన సర్పదంశము నందు విషముండును. ఈ లక్షణములు లేనిచో విషముండదు. దేవాలయము, శూన్య గృహము, పుట్ట, ఉద్యానము, చెట్టుతొర్ర రెండుమార్గముల సంధి, శ్మశానము, నదీ సాగర సంగమము, ద్వీపము, చతుష్పదము, రాజ ప్రాసాదము, గృహము కమలవనము గృహము, పర్వత శిఖరము, బిలద్వారము, జీర్ణకూపము, జీర్ణకుడ్యము సిగ్రు, శ్లేషాత్మక, అక్ష, జంబూ, ఉదుంబర, వేణువన, వట వృక్షములందును, జీర్ణ ప్రాకారాదులందును సర్పములు నివసించును. ఇంద్రియ రంధ్రములు ముఖము హృదయము, కక్షములు, కంఠ మూలము, తాలువు, లలాటము, కంఠము, శిరస్సు గడ్డము నాచరణములు ఈ అంగముపై సర్పదంశము అశుభకరము. సర్పదంశమునుగూర్చి చెప్పుటకు విష చికిత్సకుని వద్దకు వెళ్ళినవాడు చేతులలో పుష్పములు గ్రహించి చక్కగ మాటలాడుచు బుద్ధిమంతుడై సర్పము కరచిన వానితో సమానమైన జాతి అంగాదులు కలిగి శ్వేత వస్త్రధారియై నిర్మలుడుగను పవిత్రుడుగను ఉన్నచో అది శుభకరము. ఇట్లుకాక ఆ వార్త తీసుకొని వచ్చినవాడు, ముఖద్వారమునుండిగాక, మరొక ద్వారమునుండి వచ్చినను, శస్త్రమును ధరించినను, ప్రమాద వంతుడైనను, నేలవైపు చూచుచున్నను, మలిన వస్త్రములు ధరించినను, చేతిలో పాశాదులు ధరించి నను, గద్గద కంఠముతో మాటలాడుచున్నను, ఎండిపోయిన కర్రపై కూర్చున్నను, ఖిన్నుడై చేతిలో తిలను ధరించి, ఎర్రమచ్చలు గల వస్త్రములు ధరించినను లేదా తడిసిన వస్త్రములను ధరించినను, ఆతని శిరస్సుపై నల్లని లేదా ఎర్రని పూవులున్నను, తన కుచస్థానములు మర్దనము చేయుచున్నను, నఖములను ఛేదించుచున్నను, గుద స్థానమును స్పృశించుచున్నను, పాదములతో నేలపై వ్రాయుచున్నను, జుట్టు లాగుకొనుచున్నను, తృణములను త్రుంపుచున్నను, ఇవన్నియు అశుభ సూచకములు-వీటిలో ఏ ఒక్కటియైనను అశుభసూచకములే.

తనకును ఆ వచ్చిన దూతకును ఇడా పింగళనాడులు రెండును ఆడుచున్నచో దానిని బట్టి సర్పము స్త్రీయా, పురుష, నపుంసకమా అని తెలుసుకొనవచ్చును. దూత యే అంగమును స్పృశించునో ఆ అంగమునందే సర్పదంశమైనట్లు తెలుసుకొనవచ్చును. దూత పాదములు చంచలములైనచో అశుభములు. స్థిరముగనున్నచో శుభము. ఒకజీవుని పార్శ్వము నందున్నదూత, శుభసూచకుడు, ఇతర భాగములందున్నచో అశుభము. దూత నివేదించు సమయమున ఏ ప్రాణియైన వచ్చినచో శుభము. బయటకు వెళ్ళిపోయినచో అశుభము. దూతమాటలు, దోషయుక్తముగా ఉన్నను అస్పష్టముగా ఉన్నను అది నిందితము. ఆతని స్పష్టమైన మాటలనుబట్టి సర్పదంశనము, విషసహితమా! విష రహితమా! అను విషయమును తెలుసుకొనవచ్చును. దూత వాక్యమునందు ప్రారంభమున, స్వరములు వున్నచో వాటిని బట్టియు, ‘క’ ఆది వర్గాక్షరములున్నచో వాటిని బట్టియు, లిపి రెండు విధములుగ ఉండును. వాక్య ప్రారంభమున స్వరమున్నచో సర్ప దష్టుడు జీవించును. ‘క’ ఆది వర్గాక్షరములున్నచో అశుభము కలుగవచ్చును. మాతృకా విధానము ఈవిధముగ గ్రహించవలయును. కాది వర్గములలో మొదటి నాలుగు అక్షరములకును వరుసగ వాయు, అగ్ని, ఇంద్ర, వరుణులు, దేవతలు వీటి పంచమ అక్షరములు, నపుంసకములు. స్వరములు హ్రస్వములైనచో ఇంద్ర దేవతాకములు. దీర్ఘము లైనచో వరుణ దేవతాకములు. దూతవాక్య ప్రారంభమున వాయు, అగ్ని, దేవతాక అక్షరములు చెడ్డవి. ఇంద్రాక్షరము మధ్యమ ఫలప్రదము. వరుణ దైవత్య వర్ణము ఉత్తమము. నపుంసక వర్ణము అత్యంతము అశుభము. చికిత్సకుడు బయలుదేరి వచ్చునపుడు మంగళమయమగు వాక్కులు మేఘగర్జన గజ గర్జనములు, కుడిప్రక్క ఫలయుక్త వృక్షముండుట, వామభాగమున ఏ పక్షియైనను కలరవము చేయుట ఇవి జయమును సాఫల్యమును సూచించును. గీతాది శబ్దములు కూడ శుభకరములు. కుడి ప్రక్కనుండి అనర్థ సూచకములగు మాటలు వినబడుట, చక్రవాకముల రోదనము ఇవికూడ సిద్ధి సూచకములు. పక్షుల అశుభ ధ్వని తుమ్ము ఇవి అనర్థ సూచకములు. వేశ్య. బ్రాహ్మణుడు, రాజకన్య, గోవు, ఏనుగు, మురజము, గజము, క్షీరము, ఆజ్యము, దధి శంఖము, జలము, ఛత్రము, ఫలము, భేరి, మద్యము, అక్షతలు, బంగారము, వెండి ఇవి ఎదురైనపుడు కార్య సిద్ధి కలుగును. కాష్టము, అగ్ని ధరించిన శిల్పి, మాసిన బట్టలు మోసుకొనివచ్చు వాడు టంకమును మెడలో వేసుకొన్నవాడు, నక్క, గ్రద్ద, గుడ్లగూబ, గవ్వలు, తైలము, కపాలము, దూది, భస్మము ఇవి నాశ సూచకములు, విషము ఒక ధాతువు నుండి మరొక ధాతువునకు ప్రవేశించుటచే ఏడు విధములగు విషరోగము కలుగును. విషదంశము ముందుగ లలాటము లోనికి, లలాటము నుండి నేత్రములలోనికి, అచటి నుండి ముఖములోనికి పిదప అన్ని నాడుల లోనికిని ప్రవేశించి క్రమముగ ధాతువులలో ప్రవేశించును. (294)