అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రాసాద లక్షణము

హయగ్రీవుడు పలికెను- ఇప్పుడు సర్వసాధారణమైన దేవాలయమును గూర్చి చెప్పెదను, వినుము. దేవాలయమును నిర్మింపదలచిన విద్వాంసుడు, నలుపలకలగా ఉన్న క్షేత్రమును పదునారు భాగములుగా విభజింపవలెను. వాటిలో మధ్యనున్న నాలుగు భాగములతో ఆయముతో కూడిన గర్భమును నిశ్చయించి, మిగిలిన పండ్రెండు భాగములను గోడల నిమిత్తము నిర్ణయించుకొనవలెను. పై పండ్రెండు భాగములలో నాలుగు భాగముల పొడవు ఎంత ఉండునో, గోడల ఎత్తు అంత ఉండవలెను, శిఖరము ఎత్తు గోడల ఎత్తునకు రెట్టింపు ఉంచవలెను. శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తు దేవాలయ పరిక్రమ ఎత్తు ఉంచవలెను. రెండు పార్శ్వములందును ఉన్నమార్గము (ద్వారముల) కొలత ఈ కొలతను బట్టియే ఉండవలెను. ఆ ద్వారములు సమాన ప్రమాణములై ఉండవలెను. ఆలయము ఎదుటనున్న ప్రదేశము విస్తారము కూడ శిఖరముతో సమానముగా ఉండవలెను. అందముగా ఉండుటకై దాని విస్తారము శిఖముకంటె రెట్టింపు ఉండునట్లు కూడ చేయవచ్చును. ఆలయము ఎదుటనున్న సభామండపము విస్తారము, గర్భ సూత్రము నకు రెట్టింపు ఉండవలెను. దేవాలయ పాద స్తంభముల పొడవు గోడపొడవుతో సమముగా ఉండవలెను, వాటికి మధ్య స్తంభములు అమర్చి అందముగా ఉండునట్లు చేయవలెను. ముఖమండప ప్రమాణము ఆలయ గర్భప్రమాణముతో సమముగా నుండవలెను. పిమ్మట ఎనుబది ఒక్క పదముల వాస్తు మండపమును ఆరంభింపవలెను.

మొదట ద్వారన్యాసము దగ్గరనున్న పదములలో ఉండు దేవతలను పూజింపవలెను. పిమ్మట ప్రాకార విన్యాసము దగ్గరనున్న దేవతలను, అంతమునందు పదములందు స్థాపింపబడిన ముప్పది ముగ్గురు దేవతలను పూజింపవలెను. ఇది ప్రాసాదముల సర్వసాధారణ లక్షణము. ఇపుడు ప్రతిమా మానానుసారముగ నిర్మించు ఇతర ప్రాసాదములను గూర్చి వినుము.

ప్రతిమ ఎంత పెద్దది ఉండునో, అంత పెద్ద అందమైన పిండి నిర్మింపవలెను. పిండిలో సగము ప్రమాణముగల గర్భమును నిర్మించి, గర్భమానానుసారముగ గోడలు పెట్టవలెను. గోడలఎత్తు వాటి వెడల్పును అనుసరించి ఉండవలెను. విద్వాంసుడు శిఖరము ఎత్తు గోడ ఎత్తుకు రెట్టింపు ఉంచవలెను. శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తున ఆలయమునకు పరిశ్రమ ఏర్పరుపవలెను. ఆలయము ముందున్న ముఖమండపము గూడ అదే ఎత్తుతో నిర్మింపవలెను. గర్భము ఎనిమిదవ వంతు ప్రమాణము ఉండునట్లు రథకములు బైటకువచ్చు మార్గము నిర్మింపవలెను. లేదా పరిధి మూడవ భాగమును అనుసరించి రథకములను (చిన్ని రథములను) నిర్మింపవలెను. వాటి మూడవ వంతు ప్రమాణమున రథ నిర్గమద్వార మేర్పరుపవలెను. మూడు రథములపై సర్వదా మూడు వామములను స్థాపింపవలెను.

శిఖరము కొరకు నాలుగు సూత్ర పాతములు చేయవలెను. శుకనాసపై నుండి సూత్రము అడ్డముగా పడవేయవలెను. శిఖరము సగము భాగమున సింహ ప్రతిమను నిర్మింపవలెను. శుకనాసపై సూత్రము స్థిరముగా నుంచి దానిని మధ్య సంధివరకును తీసికొని వెళ్ళవలెను. రెండవ పార్శ్వమునందు గూడ ఈ విధముగానే సూత్రపాతము చేయవలెను. శుకనాసపై వేది నిర్మించి, దానిపై అమలసారమను పేరుగల, కంఠముతో కూడిన కలశము నిర్మింపవలెను. అది వికరాలముగ ఉండగూడదు. వేదిమానము ఉన్నంత వరకే కలశమును నిర్మింపవలెను. ఆలయద్వారము వెడల్పు ఎంత ఉండునో దానికి రెట్టింపు ఎత్తు ఉండవలెను. ద్వారము చాల అందముగా శోభా సంపన్నముగా ఉండునట్లు నిర్మింపవలెను. ద్వారముల పైభాగమున సుందరములును, మంగళకరములును అగు వస్తువులతోపాటు రెండు ఉదుంబర శాఖలు నిర్మింపవలెను.

ద్వారము నాల్గవ భాగమున చందుడు, ప్రచండుడు, విష్వక్సేనుడు, వత్సదండుడు అను నాలుగు ద్వారపాలకుల మూర్తులను నిర్మింపవలెను. ఉదుంబరశాఖ సగభాగమున సుందరమగు లక్ష్మీ విగ్రహము నిర్మింపవలెను. ఆమె చేతిలో కమలముండవలెను. దిగ్గజములు కలశములతో ఆమెను స్నానము చేయించుచుండవలెను. ప్రాకారము ఎత్తు ఆలయము ఎత్తులో నాల్గవ వంతు ఉంచవలెను. ఆలయ గోపురము ఎత్తు ఆలయము ఎత్తు కంటె నాల్గవవంతు తక్కువ ఉండవలెను. దేవతా విగ్రహము అయిదు హస్తముల విగ్రహమైనచో దాని పీఠిక ఒక హస్తము ఉండవలెను.

విష్ణ్వాలయము ఎదుట ఒక గరుడ మండపము, భౌమాది ధామములను నిర్మింపవలెను. మహావిష్ణువు విగ్రహమునకు చుట్టు, ఎనిమిది వైపులందును విష్ణు ప్రతిమకంటె రెట్టింపు ప్రమాణముగల అవతారమూర్తులను నిర్మింపవలెను తూర్పున వరాహము, దక్షిణమున నృసింహమూర్తి, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున హయగ్రీవుడు, ఆగ్నేయమున పరశురాముడు, నైరృతి దిక్కునందు శ్రీరాముడు, వాయవ్యమున వామనుడు, ఈశాన్యమున వాసుదేవుడు-వీరి మూర్తులను నిర్మింపవలెను. ఆలయ నిర్మాణమును ఎనిమిది, పండ్రెండు మొదలగు సరిసంఖ్యల స్తంభములతో చేయవలెను. ద్వారము అష్టమాద్యంశలు తప్ప, కలుగు వేధచే దోష మేమియును ఉండదు. (42)