అగ్ని మహా పురాణము

Table of Contents

వివాహ విషయములు

పుష్కరుడు చెప్పెను:

పరశురామా! బ్రాహ్మణుడు తన ఇచ్ఛానుసారముగా నాలుగు వర్ణముల కన్యలను వివాహ మాడవచ్చును, క్షత్రియుడు మూడు వర్ణములవారిని, వైశ్యుడు రెండు వర్ణముల వారిని వివాహ మాడవచ్చును. శూద్రుడు స్వవర్ణము కన్యను వివాహమాడవలెను. అసమాన వర్ణయగు భార్యతో ధార్మిక కర్మ లేవియు చేయరాదు. సమానవర్ణ కన్యను వివాహము చేసికొనినపుడు భర్త ఆమె హస్తము గ్రహించవలెను. బ్రాహ్మణునితో క్షత్రియ కన్యకు వివాహమగునపుడు ఆమె అతని చేతిలో నున్న బాణమును పట్టుకొనవలెను. వైశ్య కన్య బ్రాహ్మణ-క్షత్రియులతో వివాహము చేయునపుడు ఆమె వారి చేతిలో నుంచిన కొరడా పట్టుకొనవలెను. శూద్ర కన్య వస్త్రాగ్రమును పట్టుకొనవలెను. కన్యాదాన మనునది ఒక్క పర్యాయమే జరుగును.

ఇచ్చిన కన్యను అపహరించినవారిని చోరుని దండించి నట్లు దండించవలెను. సంతానము అమ్మువానికి పాపవిముక్తి కలుగదు. కన్యాదానము, శచీపూజ, వివాహము, చతుర్థీకర్మ-ఈ నాల్గింటికిని వివాహము అని పేరు. పతి జాడ తెలియ కుండపోయినను, మరణించినను, సన్యాసియైనను, నపుంసకుడైనను, పతితు డైనను-ఈ ఆపదలందు భార్య మరియొక భర్తను పొందవచ్చును. పతి మరణించిన కన్యను మరిదికి ఇవ్వవలెను. మరిదిలేని పక్షమున ఇష్టము వచ్చిన వారికి ఇవ్వవచ్చును. వర-వధూవరణములకు మూడు ఉత్తరా నక్షత్రములు, కృత్తిక, స్వాతి, మూడు పూర్వా నక్షత్రములును మంచివి. పరశురామా! సమాన గోత్ర ప్రవరలుగల కన్యను వివాహ మాడరాదు. తండ్రి తరువాత ఏడు పురుషములు, తల్లి తరువాత ఐదు పురుషములు దాటిన వారిని వివాహము చేసికొనవచ్చును.

ఉత్తమ వంశమునందు పుట్టిన, సదాచారవంతుడైన వరుని ఇంటికి పిలిచి కన్యాదానము చేయుట ‘బ్రాహ్మ వివాహము’. ఈ వివాహ ప్రభావముచే ఈ దంపతుల పుత్రుడు వెనుకటి తరములవారిని ఉద్ధరించును. వరునినుండి ఒక ఆవును, ఒక ఎద్దును తీసికొని కన్యాదానము చేసినచో అది ‘ఆర్షవివాహము’. అడిగినవానికి కన్యాదానము చేసినచో అది ప్రాజాపత్య’ వివాహము. దీనివలన ధర్మసిద్ధి కలుగును. శుల్కము తీసికొని కన్యాదానము చేసినచో ‘అసుర వివాహము’ ఇది నీచ కృత్యము. వధూవరులు తాము ఇష్టపడి చేసికొనిన వివాహము గాంధర్వము’. యుద్ధముచేసి కన్యను హరించి చేసికొన్నది ‘రాక్షస వివాహము’. మోసగించి కన్యను అపహరించినచో ‘పైశాచ వివాహము’. వివాహ దివసమున కుమ్మరి మట్టితో శచి ప్రతిమ తయారుచేసి, జలాశయ సమీపమున దానికి మంగళవాద్యాదులతో పూజచేయించి, కన్యను ఇంటికి తీసికొని వెళ్లవలెను. ఆషాఢ శుద్ధైకాదశి నుండి కార్తిక శుద్ధైకాదశి వరకు శ్రీమహావిష్ణువు శయనించి ఉన్నపుడు వివాహము చేయరాదు. పౌష చైత్రమాసములందు మంగళవారమునందు రికాభద్రా తిథులందును గురు, శుక్రులు అస్తంగతులైనపుడును, చంద్రగ్రహణము పట్టబోవునపుడును, లగ్నము నందు రవి, శని, కుజులు ఉన్నపుడును, వ్యతీపాత దోషము ఉన్నపుడును వివాహము నిషిద్ధము. మృగశిర, మఘ, స్వాతి, హస్త, రోహిణి, ఉత్తరాత్రయము, మూల, అనురాధ, రేవతి-ఇవి వివాహ నక్షత్రములు. పురుషవాచకమగు లగ్నము, దాని నవమాంశము మంచిది. లగ్నమునుండి తృతీయ, షష్ఠ, దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానములందు రవి, శని, బుధులున్న శుభము. అష్టమమున కుజుడున్న అశుభము. మిగిలిన గ్రహములు సప్తమ, ద్వాదశ, అష్టమ స్థానములందున్నచో శుభము. షష్ఠ శుక్రుడు అశుభుడు. చతుర్థీకర్మ కూడ వైవాహిక నక్షత్రమునందే చేయవలెను. లగ్న చతుర్థాది స్థానములందు గ్రహములు లేకుండుట మంచిది. పర్వదినములను విడచి ఇతర దివసములందే స్త్రీ సమాగమము చేయవలెను. దీనివలన సతీదేవి ఆశీర్వాదముచే సర్వదా సుఖము కలుగును. (154)