అగ్ని మహా పురాణము
పవిత్రారోహణ విధానము
పిమ్మట ఉపాసకుడు ప్రాతఃకాలముననే లేచి, స్నానమాచరించి, సమాహిత చిత్తుడై, సంధ్యావందన మాచరించి యజ్ఞమండపము ప్రవేశించి, పవిత్రములను గ్రహించి, దేవతా విసర్జనము చేయకుండగనే వాటిని ఈశాన్యదిక్కునందు, మండలముపై నున్న శుద్ధమగు పాత్రలో ఉంచవలెను. పిమ్మట దేవేశ్వరుడగు శివుని విసర్జించి, నిర్మాల్యమును తొలగించి, వెనుకటివలెనే పరిశుద్ధమగు భూమిమీద రెండు పర్యాయములు ఆహ్నిక కృత్యములు చేయవలెను. పిదప శివాగ్నియందు సూర్య, ద్వారపాల, దిక్పాల, కలశ, ఈశ్వరులకు విశేషరూపమున నైమిత్తికపూజ చేయవలెను. పిమ్మట మంత్రతర్పణమును, అస్త్ర మంత్రముతో నూట ఎనిమిది పర్యాయములు ప్రాయశ్చిత్త హోమములను చేసి, మంత్రము మెల్లగ పఠింపుచు పూర్ణాహుతి చేయవలెను.
పిమ్మట సూర్యునకు పవిత్రకము సమర్పించి, ఆచమనముచేసి, ద్వారపాలాదులకును, దిక్పాలకులకును, కుంభవర్ధని మొదలగువానికి గూడ పవిత్రకము సమర్పించవలెను. శివుని సమీపమున తన ఆసనముపై ఉపవిష్టుడై, తనకును, గణమునకును, గురువునకును, అగ్నికిని పవిత్రకములను ఈయవలెను. శివుని ఇట్లు ప్రార్థించవలెను. ‘దేవా! నీవు కాలస్వరూపుడవు. నా కర్తవ్యవిషయమున నీవు ఇచ్చిన ఆఙ్ఞను సరిగ పాలింప జాలక నేను ఏవైన లోపములను చేసి ఉన్నచో, చేయదగిన దానిని చేయకున్నచో, ప్రకటమైన దానిని గుప్తము చేసినచో, అట్టి సంస్కారశూన్యమగు నే చేసిన కర్మ అంతయు ఈ పవిత్రారోపణముచే పరిపూర్ణమగుగాక. శంభూ! నీవు ఈ పవిత్రకముచే పూర్తిగా ప్రసన్నుడవై, నా నియమమును పరిపూర్ణము చేయుము.’ ‘ఓం పూరయ పూరయమఖ వ్రతం నియమే శ్వరాయ స్వాహా’ అను మంత్రమును ఉచ్చరించవలెను.
ఓ పద్మయోని, పాలితాత్మ, తత్త్వేశ్వరాయ, ప్రకృతిలయాయ ‘ఓం నమః శివాయ’ అను మంత్రము ఉచ్చరించి పవిత్రకముతో శివుని పూజించవలెను. ‘విష్ణు కారణ పాలిత విద్యాతత్త్వేశ్వరాయ ఓం నమః శివాయ’ అను మంత్రము ఉచ్చరించి పవిత్రకమును సమర్పించవలెను. ‘రుద్ర కారణ పాలిత శివతత్త్వేశ్వరాయ ఓం నమః శివాయ’ అను మంత్రము ఉచ్చరించుచు శివునకు పవిత్రకమును నివేదించవలెను. సువ్రతుడైన ఉపాసకుడు ‘సర్వకారణ పాలాయ శివాలయ లయాయ ఓం నమః శివాయ’ అను మంత్రము ఉచ్చరించుచు శివునకు గంగావతారమను సూత్రమును సమర్పింపవలెను, ముముక్షువులు ఆత్మతత్త్వ, విద్యాతత్త్వ, శివతత్త్వముల క్రమమున మంత్రోచ్చారణముచేయుచు పవిత్రకములను సమర్పించవలెను. బుభుక్షువులు (భోగేచ్ఛకలవారు) వరుసగ శివతత్త్వ, విద్యాతత్త్వ, ఆత్మతత్త్వములకు అధిపతియగు శివునకు మంత్రోచ్ఛారణ పూర్వకముగ పవిత్రకమును సమర్పించవలెను. ముముక్షువు స్వాహాంత మంత్రమును, భోగేచ్ఛగలవాడు నమోంత మంత్రమును ఉచ్చరించవలెను. ‘ఓం హాం ఆత్మతత్తాధిపతయే శివాయ స్వాహా’ ‘ఓం హాం విద్యా తత్త్వాధిపతయే శివాయ స్వాహా’ ఓం హం శివతత్త్వాధిపతయే శివాయ స్వాహా’ అనునవి స్వాహా మంత్రములు (‘స్వాహా’కు బదులు ‘నమః’ చేర్చినచో నమోంత మంత్రములు). గంగా వతారకమును సమర్పించిన పిదప శివునకు నమస్కరించి ఈ విధముగ ప్రార్థింపవలెను.
‘పరమేశ్వరా! నీవే సమస్త ప్రాణులకును గతివి. చరాచర జగత్తునకు ఆశ్రయమైన వాడవు నీవే. నీవు సమస్త ప్రాణులలోపల సంచరించుచు వారికి సాక్షిగా ఉన్నావు. మనోవాక్కాయములచే నీవు తప్ప నాకు వేరొకగతి లేదు. నీకు నేను ప్రతిదినము చేయు పూజలో మంత్ర, క్రియా, ద్రవ్య, జప, హోమ, అర్చనాదులలో ఏ లోపములు జరిగినవో శుద్ధములగు వాక్యములు లేని ఏ కర్మ చేసితినో, ఆ లోపములను అన్నింటిని మన్నించి, నే చేసిన కర్మను పరిపూర్ణము చేయుము. పరమేశ్వరా! నీవు పరమ పవిత్రుడవు, నీకు సమర్పించిన ఈ పవిత్రకము సమస్త పాపములను నశింపచేయునది. నీవు అంతటను వ్యాపించి ఈ సకల చరాచర జగత్తును పవిత్రముచేసితివి. వ్యాకులత్వముచేత గాని, అంగవైకల్యముచేత గాని నేను ఏ వ్రతమును ఖండితము చేసితినో, అది నీ ఆజ్ఞ యనెడు సూత్రముచే గ్రుచ్చబడి అఖండమగుగాక”
పిమ్మట ఉపాసకుడు జపనివేదనముచేసి, భక్తి పూర్వకముగ భగవంతుని స్తుతించి, నమస్కరించి, గురువు అనుమతితో నాలుగు మాసములు, లేదా మూడు మాసములు. లేదా మూడు దినములు లేదా ఒక్క దినము వ్రతనియమమును స్వీకరించవలెను. శివునకు నమస్కరించి, లోపములను క్షమింపుమని ప్రార్ధించి, కుండము వద్దకు వెళ్ళి, అగ్నిలో ఉన్న శివునకుగూడ నాలుగు పవిత్రకములు అర్పించి పుష్ప, ధూప, అక్షతాదులతో పూజించవలెను. రుద్రాదులకు అంతర్బలి, పవిత్రకములు సమర్పింపవలెను. పూజా మండపములోనికి ప్రవేశించి, శివుని స్తుతించి, నమస్కరించి, క్షమాప్రార్ధన చేసి, ప్రాయశ్చిత్త హోమముచేసి, పాయసమును ఆహుతిగా ఈయవలెను. మందస్వరముతో మంత్రము ఉచ్చరించుచు పూర్ణాహుతి చేసి అగ్నిలో నున్న శివుని విసర్జించవలెను. వ్యాహృతి హోమములు చేసి, నిష్ఠురతో అగ్ని నిరోధముచేసి అగ్న్యాదులకు ‘ఓం హాం భూం స్వాహా, ఓం హాం భువః స్వాహా, ఓం హాం స్వః స్వాహా, ఓం హాం భూర్భువః స్వాహా” అను మంత్రములతో ఆహుతులు సమర్పించి; దిక్పాలకులకు పవిత్రములను, బాహ్యబలులను ఇవ్వవలెను. సిద్ధాంత గ్రంథముపై దాని ప్రమాణముగల పవిత్రకము నుంచవలెను. “ఓం హాం అగ్నయే స్వాహా, ఓం హాం సోమాయ స్వాహా, ఓం హం అగ్నీ షోమాభ్యాం స్వాహా, ఓం హం అగ్నయే స్విష్టకృతే స్వాహా” అను మంత్రములతో అగ్న్యాదులను నాలుగు హోమములుచేసి, గురువునకు, శివునకువలె వస్త్ర భూషణాదులను సమర్పించి పూజించవలెను. ఎవని విషయమున గురువు పూర్తిగా సంతోషించునో అతని కాండమంతయు సఫలమగును అనిపరమేశ్వరుడు చెప్పియున్నాడు. ఈ విధముగ గురువును పూజించి ఆయనకు హృదయమువరకును వ్రేలాడు పవిత్రకము సమర్పించి, బ్రాహ్మణాదులకు భోజనము పెట్టి, వస్త్రాదులు ఇచ్చి ‘దేవేశ్వరుడైన సదాశివుడు నేను చేసిన ఈ దానాదులచే సంతసించును గాక’ అని ప్రార్థించవలెను.
ప్రాతః కాలమున భక్తి పూర్వకముగ స్నానాదికముచేసి శివుని విగ్రహము నుండి పవిత్రకములను ప్రోగుచేసి శివునకు అష్టపుష్పపూజచేసి విసర్జన చేయవలెను. పిదప వెనుకటివలెనే సవిస్తరముగ నిత్యనైమిత్తిక పూజచేసి పవిత్రకములు సమర్పించి, నమస్కరించి, అగ్నిలో శివపూజ చేయవలెను. పిమ్మట అస్త్రమంత్రముతో ప్రాయశ్చిత్త హోమము చేసి పూర్ణాహుతి ఈయవలెను. భోగేచ్ఛ కలవాడు తాను చేసిన కర్మనంతను శివునకు సమర్పించి - ‘ప్రభో! నీ అనుగ్రహముచే ఈ కర్మవలన నాకు మనోవాంఛిత ఫలములు లభించుగాక’ అని ప్రార్ధించవలెను. మోక్షకాముడు-‘ఓ నాధా నా కర్మ బంధహేతువు కాకుండుగాక’ అని ప్రార్థించవలెను. పిదప అగ్నిలో ఉన్న శివునకు నాడీయోగముచే అంతరాత్మలో ఉన్న శివునితో ఐక్యమును కల్పింపవలెను. అణుసముదాయమును హృదయముగ న్యసించి అగ్నిని విసర్జించి, ఆచమనముచేసి, పూజా మండపమున ప్రవేశించి, కలశములోని జలమును నలుమూలలకు చల్లుచు, శివునితో సంయుక్తమగునట్లు చేసి- ‘ప్రభూ’! నా లోపములను క్షమించుము’ అని ప్రార్ధించి విసర్జించవలెను. పిమ్మట లోకపాలాదులను విసర్జించి, శివుని విగ్రహము నుండి పవిత్రకములనుతీసి, చండేశ్వర పూజానంతరము, వాటిని శివనిర్మాల్యాదులతో పాటు ఆయనకు సమర్పించవలెను. లేదా వీరి మీద, వెనుకటివలె, చండేశ్వరుని పూజచేసి- ‘చండనాథా! నేను చేసిన వార్షిక కర్మయందు న్యూనత్వ రూప దోషముగాని అధికత్వ రూపదోషముగాని ఉన్నచో దానిని తొలగించి, ఆ కర్మ సాంగోపాంగముగ సంపూర్ణమగునట్లు చేయుము’ అని ప్రార్ధించవలెను. పిదప చండేశ్వరుని స్తుతించి, నమస్కరించి, విసర్జించవలెను. నిర్మాల్యమును తొలగించిన పిమ్మట శుద్ధుడై, శివునకు స్నానము చేయించి, పూజించవలెను. గురువు ఐదు యోజనముల దూరమున నున్నను ఆయన వద్దకు వెళ్ళి పవిత్రారోహణ కర్మ చేయవలెను. (79)
