అగ్ని మహా పురాణము

Table of Contents

నీరాజన విధి

పుష్కరుడు చెప్పెను:

రాజుకు చేయదగిన సాంవత్సర కర్మ చెప్పెదను. రాజు జన్మ నక్షత్రమున ఆ నక్షత్రమును పూజించవలెను. ప్రతి మాసమునందును, సంక్రాంతియందు సూర్య హోమాది దేవతలను అగస్త్యోదయ సమయమున అగస్త్యుని, చాతుర్మాస్యమునందు హరిని పూజించవలెను. శయన ఉత్థాన ఏకాదశులందు ఐదు దినములు ఉత్సవము చేయవలెను. భాద్రపద శుక్ల ప్రతిపత్తున శిబిరమునకు తూర్పున ఇంద్ర పూజకై భవనము నిర్మించవలెను. అచట శక్రధ్వజము స్థాపించి శచీదేవుని ఇంద్రుని ప్రతిపత్తు మొదలు అష్టమి వరకు పూజించవలెను. అష్టమినాడు వాద్య ఘోషములతో ఆ ఇంద్ర ధ్వజమునకు దండము తొడుగవలెను. ఏకాదశినాడు ఉపవాసముండి ద్వాదశినాడు ఆ ధ్వజము ఎత్తవలెను. ఒకకలశముపై వస్త్రాదులచే చుట్టబడిన ఇంద్రుని శచీదేవిని స్థాపించి ‘శత్రువులను జయించు వృత్రనాశకుడవగు ఓ పాకశాసనా! ఓ మహాభాగా ఓ దేవ దేవా! నీకు అభ్యుదయమగుగాక. నీవు ఈ భూమిపైకి వచ్చితివి. నీవు శాశ్వతుడవైన ప్రభువు. సర్వ భూతముల హితమునందు ఆసక్తుడవు. అనంతతేజము కలవాడవు. విరాట్ పురుషుడవు. యశో జయములను వృద్ధి చేయువాడవు. నీవు ఉత్తమ వర్షమును కల్గించు ఇంద్రుడవు. సమస్త దేవతలు, నీ తేజస్సును వృద్ధి పొందించెదరుగాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కార్తికేయుడు, వినాయకుడు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, భృగువులు, దిక్కులు, మరుద్గణములు, లోకపాలకులు, గ్రహములు, యక్షులు, పర్వతములు, నదులు, సముద్రములు, లక్ష్మి, భూమి, గౌరి, చండికా, సరస్వతీ, వీరందరును నీ తేజస్సును వృద్ధి పొందించెదరు గాక! శచీపతివైన ఓ ఇంద్రా! నీవు జయించెదవు గాక! నీ విజయముచే నాకు కూడ సర్వదా శుభము కలుగుగాక! రాజులు, బ్రాహ్మణులు, ప్రజలు, వీరందరిని అనుగ్రహించుము. నీ అనుగ్రహముచే భూమి నిత్యము సస్యసంపన్న అగుగాక: అందరికి విఘ్న విహీనమగు కల్యాణమగు గాక! ఈతిబాధలు పూర్తిగ నశించు గాక!’ అని ప్రార్థించుచు పూజించవలెను. ఈ మంత్రముతో ఇంద్రుని పూజించినవాడు భూమిని జయించి స్వర్గమును పొందును.

ఆశ్వీయుజ శుక్ల అష్టమినాడు వస్త్రముపై భద్రకాళిని చిత్రించి, విజయము కోరువాడు ఆ దేవతలను పూజించవలెను. ఆయుధములు, ధనస్సు, ధ్వజము, ఛత్రము,రాతి చిహ్నములు శస్త్రాడులు వీటిని కూడ పుష్పాదులతో పూజింపవలెను. రాత్రి జాగరణము చేసి బలియిచ్చి, మరునాడు మరల పూజించవలెను. ‘భద్రకాళి, మహాకాళి, దుర్గా, దుర్గ బాధను హరించుదానా! త్రైలోక్య విజయా, చండీ నాకు శాంతి విజయమును ఇమ్ము’ ఇపుడు నీరాజనా విధిని చెప్పెదను. ఈశాన్యమున దేవతా మందిరము నిర్మించి మూడు ద్వారములు ఏర్పరచి అచట సర్వదా దేవతా పూజ చేయ వలయును. సూర్యుడు చిత్తా నక్షత్రమును విడిచి స్వాతిలో ప్రవేశించునప్పుడు ప్రారంభించి, ఆ నక్షత్రములో ఉండు వరకును దేవతా పూజ చేయవలయును. బృహ, విష్ణువు, శంభు, శక్ర, అగ్ని, వాయు, వినాయక, కుమార, వరుణ, కుబేర, విశ్వేదేవ, వైశ్రవసులను, కుముద, ఐరావణ, పద్మ, పుష్పదంత, వామన, సుప్రతీక-అంజననీలులను దిగ్గజములను గృహాదులందు పూజించవలెను, పిదప పురోహితుడు ఆజ్య, సమిత్, సిద్ధార్థ తిలలతో హోమము చేయవలయును. ఎనిమిది కలశములు పూజించి వాటితో ఉత్తమమైన అశ్వములను గజములను స్నానము చేయించి ముందు గజములకు గ్రాసము ఇవ్వవలెను. తోరణ ద్వారము నుండి బయటకు తీసుకుని రావలెను. గోపురాదులను దాటకూడదు. పిదప అందరును బయటకు వచ్చిన పిమ్మట ఇంటియందే రాజ చిహ్నములను పూజించవలెను. శతభిషా నక్షత్రమున వరుడిని పూజించి భూతలములకు బలి యివ్వవలెను. సూర్యుడు విశాఖలో ప్రవేశించిన పిమ్మట రాజు ఆశ్రమములో నివసించవలెను. ఆ దినమున వాహనములను అధికముగ అలంకరించవలెను. రాజచిహ్నములను పూజించి వాటివాటి రక్షకుల చేతికి ఇవ్వవలెను. కాలజ్ఞుడగు జ్యోతిషుడు గజములు, అశ్వములు, ఛత్రము, ఖడ్గము, ధనస్సు, దుందుభి, ధ్వజము, పతాక, వీటిని అభిమంత్రించవలెను. వాటిని ఏనుగుల పైకి ఎక్కించవలెను. జ్యోతిష్కుడు పురోహితుడు కూడ ఏనుగును ఎక్కవలెను. అభిమంత్రితములగు వాటిని ఎక్కి ద్వారమునుంచి నిష్క్రమింపచేయవలయును. ఈ విధముగ నిష్క్రమించి ఏనుగును ఎక్కి, రాజు రాజ ద్వారము నుండి బయటకు వచ్చి విధి పూర్వకముగ బలి ఇవ్వవలెను. పిదప అతడు సుస్థిరచిత్తుడై చతురంగ సైన్యములతో కూడి వారి అందరిచేత జయ ఘోషములు పలికించుచు, దిగంతములను ప్రకాశింపజేయుచున్న కాగడాల సముదాయములకు మూడు పర్యాయములు ప్రదక్షిణములు చేసి, జలాంజలి ఇచ్చి ఇంటికి మరలి రావలయును. నీరాజనమను ఈ పేరుగల శాంతివృద్ధినిచ్చును. శత్రువులను నశింప చేయును. (268)