అగ్ని మహా పురాణము
నిర్వాణదీక్షావిధి
మహేశ్వరుడు చెప్పెను: విశుద్ధశాంతి కళతో శాంత్యతీత కళను సంధానము చేయవలెను. దానియందుకూడ వెనుకటివలెనే తత్త్వవర్ణాది భావన చేయవలెను. ఎట్లనగా-సంధాన సమయము నందు ‘ఓం హాం హౌం హాం’ అను మంత్రమును ఉచ్చరించవలెను. శాంత్యతీత కళలు శివ, శక్తులు రెండు తత్త్వములు. ఇంధక, దీపక, రోచక, మోచక, ఊర్ధ్వగామి వ్యోమరూప, అనాథ, అనుశ్రితములను ఎనిమిది భువనములు. ఓంకారము పదము. ఈశానము మంత్రము. అకారము మొదలు విసర్గవరకును ఉన్నవి పదునారు అక్షరములు, నాద-హకారములు బీజములు, కుహూ, శంఖినులు రెండునాడులు. దేవదత్త-ధనంజయములు రెండు ప్రాణవాయువులు. వాక్-శ్రోత్రములు రెండు ఇంద్రియములు, శబ్దము విషయము అదియే గుణము కూడ. ఐదవదైన తురీయా అతీతావస్థ. సదా శివుడు ఏకైక కారణము2. శాంత్యతీతకళలో ఈ తత్త్వాదులు అన్నియు ఉన్నవని భావనచేసి తాడనాదికము చేయవలెను. షడంతమగు మంత్రముచే కలాపాశ తాడనము బోధనము చేసి, నమస్కారాంత మంత్రముతో శిష్యుని అంతఃకరణమునందు ప్రవేశము చేయవలెను. పిమ్మట షడంత మంత్రముతో జీవచైతన్యమును పాశవిముక్తము చేయవలెను. ‘వషట్’ ‘నమః’ అను మంత్రములతో సంపుటితమైన స్వాహామంత్రమును ఉచ్చరించి, అంకుశ ముద్రా పూరక ప్రాణాయామములతో పాశమును మస్తక సూత్రముతో ఆకర్షించి, దానిని కుంభక ప్రాణాయామముతో గ్రహించి, రేచక ప్రాణాయామ-ఉద్భవముద్రలతో హృదయ మంత్ర సంపుటితముచేసి, నమస్కారాంత మంత్రముతో దానిని అగ్ని కుండములో స్థాపించ వలెను. దాని పూజనాదికమును అంతను నివృత్తి కళకు చేసినట్లే చేయవలెను. సదాశివుని ఆవాహన, పూజన, తర్పణములుచేసి భక్తి పూర్వకముగ విజ్ఞాపన చేయవలెను. ‘భగవంతుడా! ఈ ముముక్షువునకు సత్పురుషులు చెప్పిన నీ అధికారమున దీక్ష ఇచ్చుచున్నాను. నీవు సర్వదా ఈతనికి అనుకూలుడవుగ ఉండవలెను.’
మాతాపితరుల ఆవాహన, పూజన, తర్పణ సంవిధానములుచేసి, హృదయ సంపుటితమగు ఆత్మబీజముతో శిష్యుని వక్షఃస్థలమున ‘ఓం హాం హాం హః హూం ఫట్’ అను మంత్రముతో తాడనము చేయవలెను. ఆ మంత్రముతోడనే శిష్యుని హృదయము నందు ప్రవేశించి అస్త్ర మంత్రముతో చైతన్యమును పాశమునుండి విముక్తము చేయవలెను. పిదప జేష్ఠాంకుశ ముద్రతో సంపుటితమైన ఆస్వాహాంత మంత్రముతో దానిని ఆకర్షించి, గ్రహించి, నమోంత మంత్రముతో దానిని ఆత్మయందు కూర్చవలెను. ‘ఓం హాం హాం హాం హః హూం ఫట్’ అనునది ఆకర్షణ మంత్రము. ‘ఓం హాం హాం హాం ఆత్మనేనమః’ అను నది ఆత్మ నియోజన మంత్రము. వామా ఉద్భవ ముద్రతో వెనుకటి వలెనే మాతా పితృ సంయోగభావనచేసి, ఆమంత్రముతోడనే జీవచైతన్యమును దేవీ గర్భమునందు ఉంచవలెను. పిమ్మట పూర్వోక్త విధానానుసారము గర్భాధానాది సంస్కారములు అన్నియు చేయవలెను. పాశబంధ శైథిల్యము కొరకై, ప్రశ్చిత్తముగా మూల మంత్రమును నూరుసార్లు జపించవలెను. మలశక్తి తిరోధానము కొరకును, పాశ వియోజనము కొరకును అస్త్ర మంత్రముతో వెనుకటివలెనే ఐదేసి హోమములు చేయవలెను, కళకు సంబంధించిన బీజముతో కూడిన ఆయుధ మంత్రముతో ఏడు పర్యాయములు అభిమంత్రించిన ఖడ్గ రూపమగు అస్తముతో పాశములను భేదించవలెను. ‘ఓం హై హాం శాన్త్యతీత కళాపాశాయ హుం ఫట్’ అను నది మంత్రము. పిదప ఆ పాశములను వెనుకటివలె అస్త్ర మంత్రముతో సలిపి, వర్తులాకారముచేసి, నేతితో నింపిన స్రువముల నుంచి, కళాస్త్ర మంత్రముతో హోమము చేయవలెను. పాశాంకుర నివృత్తికొరకై ఐదు హోమములును, ప్రాయశ్చిత్త నిషేధము కొరకు ఎనిమిది హోమములను చేసి హృదయ మంత్రముతో సదాశివుని ఆవాహన-పూజా తర్పణములు చేసి, వెనుక చెప్పిన విధముగ అధికార సమర్పణము చేయవలెను. అందుకు మంత్రము ‘ఓం హాం సదాశివ మనోబిన్దుం శుల్కం గృహాణ స్వాహా’ అనునది. పిదప సదా శివునకు-సదాశివా! ఈ పశువునందలి పాపములు అన్నియు దగ్ధములైనవి. కావున ఈతనికి బంధనము కలిగించుటకై నీవు ఇచట ఉండరాదు’ అని కూడ శివుని ఆజ్ఞను వినిపింపవలెను.
మూల మంత్రముతో పూర్ణాహుతి ఇచ్చి సదాశివుని విసర్జించవలెను. శరత్కాల చంద్ర దృశమై విశుద్ధమైన శిష్యుని జీవాత్మను రౌద్రీ సంహార ముద్రతో తనలో సంయోజితము చేసికొనవలెను. శిష్యుని శరీరములోనున్న జీవాత్మను ఉద్భవముద్రతో ఉద్ధరించి, దాని పోషణము కొరకై, శిష్యుని తలపై అర్ఘ్య జలబిందువు ఒకటి ఉంచవలెను. పిదప పరమ భక్తి భావముతో క్షమార్పణము చెప్పుకొని, ఈ విధముగ పలుకుచు మాతాపితరుల విసర్జనము చేయవలెను. ‘శిష్యునకు దీక్ష ఇచ్చుటకై మిమ్ములను ఇరువురిని కష్టపెట్టితిని. అందులకు నన్ను క్షమించి, మీ ఇరువురును తమ స్థానమునకు వెళ్ళుడు’. అస్తమంత్రముచే అభిమంత్రించిన కర్తరితో, ‘ఓం హూం శిఖాయై హూం ఫట్’ ‘ఓం అస్త్రాయ హూం ఫట్’ అను ఛేదన మంత్రములతో, శిఖాస్త్రముతో, బోధన శక్తి స్వరూపిణియగు, శిష్యుని నాలుగు అంగుళముల శిఖను ఛేదించవలెను. దానిని ఘృత పూర్ణమగు స్రువము నందు ఉంచి ‘హూం ఫట్’ అని అంతమునందుగల అస్త్ర మంత్రముతో అగ్నిలో హోమము చేయవలెను. ‘ఓం ఓం హః అస్త్రాయ హూం ఫట్’ అనునది మంత్రము. పిదప స్రుక్ స్రువములు కడిగి, శిష్యునకు స్నానము చేయించి, తాను ఆచమనముచేసి, యోజనాస్థానము కొరకై అస్త్ర మంత్రముతో తనను తాను తాడనము చేసికొనవలెను. పిమ్మట వియోజన, ఆకర్షణ, సంగ్రహణములు చేసి వెనుకటివలె ద్వాదశాంతము (లలాటముపై భాగము) నుండి జీవచైతన్యమును తీసికొని తన హృదయ కమలకర్ణికా మధ్యమునందు ఉంచవలెను. స్రుక్కును నేతితోనింపి, దానిపై స్రువమును అధోముఖముగా నుంచి, శంఖు తుల్య ముద్రతో, నిత్యోక్త విధి ప్రకారము హస్తమునందు గ్రహించవలెను. పిమ్మట నాదోచ్ఛారణాను సారము శిరస్సును, కంఠమును చాపి, దృష్టిని సమ భావములో ఉంచి, స్థిర, శాంత, పర భావ సంపన్నుడై కలశ, మండల, అగ్ని, శిష్యుల నుండియు, తన నుండియు ఆరు విధములగు అధ్వలను గ్రహించి, స్రుక్కు అగ్రభాగమునందు, ప్రాణమయ నాడిలోపల నుంచి, దానిని ఆ భావము తోడనే భావన చేయవలెను. ఈ విధముగ చింతించి క్రమముగ ఏడు విధములగు విషువులను ధ్యానించవలెను.
మొదటిది ప్రాణ సంయోగస్వరూపము. రెండవది హృదయాదిక్రమమున ఉచ్చరింపబడిన మంత్రము. మూడవది సుషుమ్నానుగత నాదరూపము. నాడీ సంబద్ధమగు నాదము శక్తిలో లీనమగుటకు ప్రశాంత విషువమని పేరు. శక్తిలో లీనమైన నాదము పునరుజ్జీవితమైపైకి సంచారముచేసి, సమతలో లయము అయినచో అది శక్తి అను విషువము. సంపూర్ణ నాదము శక్తి సీమను లంఘించి, ఉన్మనిలో లీనమైనచో ‘కాలనిషువము’, ఆరవదగు ఇది వక్త్యతీతము. ఏడవ విషువము ‘త్త్వ సంజ్ఞకము’, ఇదియే యోజనా స్థానము. పూరక కుంభకములు చేసి, ముఖము కొంచెము తెరిచి, మెల్ల మెల్లగా మూల మంత్రము నుచ్చరించుచు శిష్యాత్మలయభావన చేయవలెను. దాని క్రమము ఇది-షడధ్వ ప్రాణరూపమును విద్యుత్సదృశములగు షడధ్వల ప్రాణరూపముగ ఫట్కారమును చింతన చేయవలెను. అది నాభికి పైన జానెడు దూరమునందు ఉండును. దానిపైన హృదయము నుండి నాలుగు అంగుళముల దూరమునందు అకారమును చింతన చేయవలెను. దానిపైన ఎనిమిది అంగుళముల దూరమున విష్ణువాచకమగు ఉకారము, దానిపైన నాలుగు అంగుళముల దూరమున తాలు స్థానమున రుద్ర వాచక మకారమును ఉండును. లలాటమధ్యమున ఈశ్వర వాచకమగు బిందువు ఉండును. లలాటముపైన బ్రహ్మ రంధ్రము వరకును నాదమయుడగు సదాశివుడు ఉండును. శక్తి కూడ అచటనే ఉండును. ఈ తత్త్వములను అన్నింటికి క్రమముగ చింతన చేయుచు, త్యజించి చివరికి శక్తి తత్త్వమును కూడ త్యజించవలెను. అచటనే దివ్య పిపీలికా స్పర్శానుభవము పొందిలలాటముపైన పరమతత్త్వము, పరమానంద స్వరూపము, భావశూన్యము, మనోతీతము, నిత్యము గుణోదయశాలి అగు శివతత్త్వమునందు శిష్యాత్మ విలీనమైనట్లు భావన చేయవలెను.
పరమశివుని యందు యోని స్థిరత్వము కొరకై ‘ఓం నమః శివాయ వౌషట్’ అను మంత్రము ఉచ్చరించుచు అగ్ని జ్వాలలో ఘృతధార విడచుచుండవలెను. పిదప విధిపూర్వకముగ పూర్ణాహుతి ఇచ్చి గుణాపాదనము చేయవలెను. అందులకై ‘ఓం హాం ఆత్మనే సర్వజ్ఞోభవ స్వాహా’ ఇత్యాది మంత్రములను (మూలములో ఉన్నవి) పఠించుచు అగ్నిలో హోమము చేయవలెను. ఈ విధముగ షడ్గుణ సంపన్నమగు ఆత్మను పరమశివుని నుండి గ్రహించి, యథావిధిగా శిష్యుని శరీరమునందు కూర్చినట్లు భావన చేయవలెను. తీవ్రము, మందము అయిన శక్తిపాతముచే కలిగిన శ్రమ శాంతించుటకై శిష్యుని శిరముపై న్యాసపూర్వకముగ అమృత బిందువు ఉంచవలెను. ఈశానకలశాది రూపమున పూజింపబడిన శివస్వరూప కలశములకు నమస్కారముచేసి, దక్షిణ మండలమునందు, శిష్యుని తనకు కుడి ప్రక్కన ఉత్తరాభిముఖునిగా కూర్చుండబెట్టి దేవేశ్వరుడైన ఈశ్వరుని ఈ విధముగా ప్రార్థించవలెను. ‘ప్రభూ! నా శరీరమునందు ఉండి నీవే ఈ జీవుని అనుగ్రహించి నావు. అందుచే దేవా! వీనికి దేవతా, అగ్ని, గురువులందు, భక్తిని అధికము చేయుము.’ ఈ విధముగ ప్రార్థించి శివునకు నమస్కరించిన పిదప గురువు శిష్యునకు ఆదరపూర్వకముగా ‘నీకు శుభమగుగాక’ అని ఆశీర్వదించవలెను. పిమ్మట శివునకు భక్తితో ఎనిమిది పుష్పములు సమర్పించి శివ కలశములోని ఉదకముతో శిష్యునకు స్నానము చేయించి యజ్ఞ సమాప్తి చేయవలెను. (88)
