అగ్ని మహా పురాణము

Table of Contents

వ్రతదాన సముచ్చయము

అగ్ని దేవుడు చెప్పెను:

వశిష్ఠా! ఇప్పుడు సామాన్యవ్రతమును గూర్చియు, దానములను గూర్చియు సంక్షిప్తముగా చెప్పెదను. ప్రతిపదాది తిథులందును, సూర్యవారాదులందును, కృత్తికాది నక్షత్రములందును విష్కంభాది యోగములందును, మేషాది రాశులందును, గ్రహణాది సమయములందును చేయదగిన వ్రతములు, దానములు వాటికి సంబంధించిన ద్రవ్యములు, నియమాదులు వీటిని గూర్చి కూడ చెప్పెదను. వ్రత దానోపయోగులగు ద్రవ్యములకును, కాలమునకును, అధిష్ఠాతయైన దేవత శ్రీమహావిష్ణువు. సూర్య శివ బ్రహ్మ లక్ష్మాది దేవతలందరును శ్రీమహావిష్ణు విభూతులే. అందుచే ఆయనను ఉద్దేశించి చేసిన వ్రతదాన పూజనాదులు సకలమనోరథ ప్రదములు. ‘ఓ జగత్పతీ! నీకు నమస్కారము. రమ్ము, ఆసన, అర్ఘ్య, మధుపర్క, ఆచమన, స్నాన, వస్త్ర, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములను గ్రహించుము’ అని ప్రార్థించి పూజించవలెను. పూజా, వ్రత, దానములందు పై మంత్రముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇప్పుడు సామాన్య దాన సంకల్పమును గూర్చి వినుము. ఈ రోజున, ఈ గోత్రముగల, ఈశర్మ అను బ్రాహ్మణునకు నేను సమస్త పాప శాంతి, ఆయురారోగ్య వృద్ధి, సౌభాగ్యోదయము కలుగుటకై, గోత్ర, సంతాన విస్తృతి, ధనవిజయ ప్రాప్తికై, ధర్మ, అర్థ, కామ సంపాదనమునకై, పాపనాశ పూర్వకముగ సంసారము నుండి విముక్తి పొందుటకై, విష్ణువునకు సంబంధించిన ఈ వస్తువును దానము చేయుచున్నాను. ఏతద్దాన సాద్గుణ్యార్థమై మీకు సువర్ణాది ద్రవ్యములను గూడ సమర్పించుచున్నాను. నేను చేసిన ఈ దానముచే సకలలోకేశ్వరుడగు శ్రీహరి సర్వదా ప్రసన్నుడగు గాక. ఓ యజ్ఞ దాన వ్రతాధీశా! నాకు విద్యాయశస్సులను అనుగ్రహించుము. ధర్మార్థ కామమోక్ష రూపములగు నాలుగు పురుషార్థములను, మనోభిలషితములగు వస్తువులను అనుగ్రహించుము’ అని సంకల్పము చేయవలెను. ఈ వ్రతదాన సముచ్చయమును ప్రతి దినము పఠించువాడు అభీష్ట లాభములను పొంది, పాపరహితుడై భుక్తి ముక్తులను రెండింటిని పొందును. వాసుదేవాదులకు సంబంధించిన ఇట్టి పూజా నియమాదులచే అనేక విధములగు తిథి, వార, నక్షత్ర, సంక్రాంతి, యోగ, మన్వాది సంబంధ వ్రతముల అనుష్ఠించిన ఫలము సిద్ధించును. (208)