అగ్ని మహా పురాణము

Table of Contents

సూర్యవంశ వర్ణనము

అగ్నిదేవుడు పలికెను.

ఇపుడు సూర్య వంశమును గురించి, ఇతర రాజవంశములను గూర్చి చెప్పెదను. మహావిష్ణువు నాభి కమలము నుండి బ్రహ్మ ఆవిర్భవించెను. బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. ఆతని కుమారుడు వివస్వంతుడు. ఆతనికి సంజ్ఞ, రాజ్ఞి, ప్రభయను ముగ్గురు భార్యలుండిరి. రాజ్ఞి రైవతకుని పుత్రి. ఆమె రేవంతుడను కుమారుని కనెను. ప్రభ ప్రభాతుడను పుత్రుని, త్వష్టకుమార్తెయైన సంజ్ఞ మనువుయను పుత్రుని యమున, యముడు అను కవలలను కనెను. ఛాయ అను నామాంతరముగల సంజ్ఞ సావర్ణ్య మనువును, శనిని, తపతి, విష్టి అను కన్యలను కనెను. పిదప సంజ్ఞకు అశ్వినీ కుమారులు జన్మించిరి. వైవస్వత మనువుకు ఆతనితో సమానులగు పదిమంది కుమారులు పుట్టిరి. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశవు, నృగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు అను ఈ పదిమంది మహాబలులును అయోధ్యలో నివసించిరి. మనువునకు ఇల అను కన్య పుట్టెను. ఆమెయందు బుధునకు, పురూరవుడు పుట్టెను. పురూరవుని కనిన పిమ్మట ఆ ఇలసుద్యుమ్నుడిగా మారిపోయెను. సుద్యుమ్నునకు ఉత్కలుడు, గయుడు వినతాశ్వుడు అను రాజులు జన్మించిరి. ఉత్కలునకు ఉత్కలము రాజ్యము అయ్యెను. పశ్చిమదేశము వినతాశ్వుల రాజ్యమాయెను. రాజశ్రేష్ఠుడైన గయునకు పూర్వ దిక్కున అధికారము లభించెను. ఆతని రాజధాని గయాపురి. వశిష్ఠుని వాక్యము ప్రకారము సుద్యుమ్నుడు ప్రతిష్ఠానపురము చేరెను. అచట రాజ్యమును పొంది దానిని పురూరవసునకు ఇచ్చెను. నరిష్యంతుని పుత్రునకు శకులను పేరు. నాభాగునకు విష్ణు భక్తుడగు అంబరీషుడు జన్మించెను. అతడు ప్రజలను బాగుగ పరిపాలించెను. ధృష్టుని నుండి ధాష్టక వంశము విస్తరించెను. శర్యాతికి సుకన్య, ఆనర్తుడు జనించిరి. ఆనర్తునకు రేవుడు జనించెను. ఆతని దేశము ఆనర్త దేశము. కుశస్థలి ఆతని రాజధాని. రేవునకు రైవతుడు జనించెను. ధార్మికుడైన అతనికి కకుద్మి అని కూడ పేరు. తన తండ్రి నూర్గురు కుమారులలో ఇతడు జ్యేష్ఠుడగుటనే కుశస్థలి రాజ్యము ఆతనికి లభించెను.

ఒకనాడు అతడు కన్యాసహితుడై బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అచట సంగీతమును విను చుండెను. అచట బ్రహ్మకు ముహూర్త మొకటి మాత్రమే గడచెను. అంతలో మర్త్య లోకమున అనేక యుగములు సమాప్తమాయెను. అతడు శీఘ్రముగ యాదవులతో కూడిన తన నగరమునకు వచ్చెను. అచట కుశస్థలి స్థానమున అనేక ద్వారములు కలది, మనోహర మైనదియగు ద్వారవతీ పట్టణము నిర్మితమై యుండెను. వాసుదేవుడు నాయకులుగాగల భోజవృష్టి అంధకులు దానిని రక్షించుచుండిరి. రేవతిని బలరామునకు ఇచ్చి సంసారమును అనిత్యవిషయమును తెలుసుకొని సుమేరు పర్వత శిఖరమున తపస్సుచేసి విష్ణుపదమును చేరెను. నాభాగుని యిద్దరు పుత్రులు వైశ్యులు. వారు బ్రాహ్మణత్వమును పొందిరి. కరూషునకు యుద్ధోన్మత్తులగు కరూషులు అనుక్షత్రియులు జనించిరి. వృషధ్రుడు గురువుయొక్క గోవును హింసించుటచే శూద్రుడాయెను. మనుపుత్రుడైన ఇక్ష్వాకునకు దేవరాజుయైన ‘వికుక్షి’ పుట్టెను. వికుక్షి పుత్రుడు కకుత్సుడు. అతని పుత్రుడు సుయోధనుడు, అతని పుత్రుడు ప్పుథువు, అతని పుత్రుడు విశ్వగాశ్వుడు, అతని పుత్రుడు వాయువు. వాని పుత్రుడు యవనాశ్వుడు, యవనాశ్వుని కుమారుడైన శ్రావంతుడు తూర్పు దిక్కున శ్రావం తికాపురమును నెలకొల్పను. అతని పుత్రుడు బృహదశ్వుడు, వాని కుమారుడు కువలాశ్వుడు. ఇతడు పూర్వము దుంధు అను రాక్షసుని చంపుటచే దుంధుమారుడను పేరు పొందెను. ఆతనికి దృఢాశ్వుడు. దండుడు, కపిలుడు, అను ముగ్గురు రాజులు జన్మించిరి. దృఢాశ్వునకు హర్యశ్వుడు, ప్రమోదకుడు యను పుత్రులు పుట్టిరి. హర్యశ్వుని కుమారుడు నికుంభుడు. అతని కుమారుడు సంహతాశ్వుడు. సంహతాశ్వునకు అకృషాశ్వుడు, రణాశ్వుడుయను పుత్రులు పుట్టిరి. రణాశ్వుని పుత్రుడు యువనాశ్వుడు. ఆతని పుత్రుడు మాంధాత. ఆతనికి పురుకుత్థ్సుడు, ముచికుందుడు అను పుత్రులు పుట్టిరి.

పుకుత్థ్సునకు నర్మదయందు త్రసద్దస్యుడు అనువాడు సంభూతుడను నామాంతరము గల పుత్రుడు పుట్టెను. సంభూతుని కుమారుడు సుధన్వ. ఆతని పుత్రుడు త్రిదన్వ. ఆతని పుత్రుడు తరుణుడు. ఆతని పుత్రుడు సత్యవ్రతుడు. ఆతని పుత్రుడు సత్యరథుడు. ఆతనికి హరిశ్చంద్రుడు, ఆతనికి రోహితాశ్వుడు, ఆతనికి వృకుడు, ఆతనికి బాహువు ఆతనికి సగరుడు పుట్టెను. సగరుని ప్రియురాలగు ప్రభ ఔర్వముని ప్రసాదముచే అరువది వేల పుత్రులను కనెను. రెండవ భార్యయైన భానుమతికి అసమంజసుడను ఒక కుమారుడు జనించెను. సగరుని అరువది వేల మంది కుమారులును భూమిని త్రవ్వుచు కపిలునిచే చేయబడిరి. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. ఆతని కుమారుడు దిలీపుడు. ఆతనికి గంగను భూలోకమునకు తీసుకునివచ్చిన భగీరథుడను కుమారుడు పుట్టెను. అతనికి నాభాగుడు, అతనికి అంబరీషుడు, ఆతనికి సింధుద్వీపుడు వానికి శ్రుతాయువు, వానికి ఋతుపర్ణుడు, వానికి కల్మాషపాదుడు, వానికి సర్వకర్మ, వానికి అనరణ్యుడు; వానికి నిఘ్నుడు, వానికి దిలీపుడు, వానికి రఘువు, వానికి అజుడు, వానికి దశరథుడు పుట్టెను. దశరథునకు నారాయణ స్వరూపులగు నలుగురు కుమారులు పుట్టిరి. వారిలో జ్యేష్ఠుడు రాముడు. రావణాంతకుడైన ఆ రఘోత్తముడు అయోధ్యకు రాజాయెను. అతని చరిత్రమును నారదుని నుండి వినివాల్మీకి రామాయణముగ రచించెను. రామునకు సీత యందు, కులవర్ధనులగు కుశలవులు జన్మించిరి. కుశునకు అతిథి, ఆతనికి నిషధుడు అతనికి నలుడు, ఆతనికి నభుడు, ఆతనికి పుండరీకుడు, ఆతనికి సుధన్వుడు, ఆతనికి దేవానీకుడు, ఆతనికి అహీనాశ్వుడు, ఆతనికి సహస్రాశ్వుడు, ఆతనికి చంద్రాలోకుడు, ఆతనికి తారాపీడుడు, ఆతనికి చంద్రపర్వతుడు. ఆతనికి భానురథుడు, ఆతనికి శ్రుతాయువు జన్మించెను. ఇక్ష్వాకు వంశీయులు అందరును సూర్యవంశ ప్రవర్తకులుగా చెప్పబడుదురు. (273)