అగ్ని మహా పురాణము

Table of Contents

గౌర్యాదిపూజా విధానము

పరమేశ్వరుడు చెప్పెను:

భుక్తి ముక్తి ప్రదమును సౌభాగ్యాదిదాయకమును అగు ఉమా పూజను చెప్పెదను. మంత్రధ్యాన మండల ముద్రా హోమాది సాధనములను కూడ చెప్పెదను. ‘గౌరీ మూర్తయే నమః’యిది గౌరీదేవి వాచక మూలమంత్రము. ‘ఓం హ్రీం సః శౌం గౌర్యై నమః’ వీనిలో మూడక్షరముతో ‘నమః ఆదులు చేర్చి షడంగన్యాసము చేయవలెను. ప్రణవముచేత ఆసనమును, హృదయ మంత్రముచే మూర్తిని కల్పించవలెను. కాల బీజ శివ బీజముల ఉద్ధారము చేయవలెను. దీర్ఘ స్వరాక్రాంత ప్రాణముతో (యాం యీం మొదలు) జాతియుక్త షడన్యాసము చేయవలెను. ప్రణవముతో ఆసన న్యాసము, హృదయ మంత్రముతో మూర్తి న్యాసము చేయవలెను. ఇంతవరకు యామల మంత్రము చెప్పితిని. ఇపుడు ఏకవీరమును చెప్పెదను. అగ్ని మాయాకుశానువులతో సృష్టిన్యాస యుక్తమగు వ్యాపక న్యాసము చేయ వలెను. శివశక్తిమయ బీజములు హృదయాదులందు వర్ణితములు. బంగారము, వెండి, శిల మొదలైన వాటితో గౌరీ ప్రతిమచేసి పూజించవలెను. లేదా పంచపిండ ప్రతిమ చేయవలెను. నలువైపుల అవ్యక్త ప్రతిమయు, మధ్యమున వ్యక్త ప్రతిమయు వుంచవలెను. ఆవరణ దేవతా రూపమున క్రమముగా లలితాది శక్తులను పూజించవలెను. మొదట వృత్తాకారమగు అష్టదళ కమలము ఏర్పరచి ఆగ్నేయాది దళములందు క్రమముగ, లలితా, సుభగా, గౌరి క్షోభణీలను, పూర్వాది దళములందు వామాజ్యేష్టా, క్రియా, జ్ఞానాలను, పీఠయుక్త వామ భాగమునందు శివుని అవ్యక్త రూపమున పూజించవలెను. దేవి వ్యక్త రూపమున రెండు లేదా మూడు నేత్రములుండును. ఆమెను శుద్ధ రూపుడగు శివునితో కలిపి పూజించవలెను. ఆ దేవి రెండు పీఠములందు లేదా రెండు పద్మములందు కూర్చుండును. ఆమెకు నాలుగు ఎనిమిది లేదా పదునెనిమిది భుజములు ఉండును. సింహముపై గాని, తోడేలుపై కాని కూర్చుండును. కుడి ప్రక్కన ఉన్న తొమ్మిది హస్తములలో స్రక్, అక్ష సూత్ర, కలికా, ముండ, ఉత్పల, పిండికా, బాణ, చాపములు వుండును. వామ హస్తములందు పుస్తక, తాంబూల, దండ, అభయ, కమండలు, గణేశ, దర్పణ, బాణ చాపములు ఉండును.

ఆమెకు వ్యక్త ముద్రలుగాని, అవ్యక్త ముద్రలుగాని చూపవలెను. ఆసన సమర్పణమున పద్మముద్ర చూపవలెను. శివుని పూజించునపుడు లింగముద్ర చూపవలెను. దీనికే శివ ముద్ర అని పేరు. ఇరువురికి ఆవాహనీ ముద్ర చూపవలెను. శక్తి ముద్రకు యోని అని పేరు. ఇదిచతురస్ర మండలాకారము మధ్యన ఉన్న నాలుగు కోష్టములలో త్రిదళ కమలములను వ్రాయవలెను. మూడు కోణముల ఊర్ధ్వ భాగమునందు రెండేసి పదములలో అర్ధచంద్రుని వ్రాయవలెను. మొదటి దానికంటె రెండవది రెట్టింపు ఉండవలెను. రెండేసి పదముల ద్వార కంఠభాగము, దానికి రెట్టింపు ఉపకంఠము ఉండవలెను. ఒక్కొక్క దిక్కునందు మూడేసి ద్వారములు ఉంచి లేదా సర్వతో భద్ర మండలము ఏర్పరచి పూజించవలెను. లేదా వేదికపై దేవతను స్థాపించి పంచగవ్య పంచామృతాదులతో పూజించవలెను. ఉత్తరాభిముఖుడై పూజించి రక్తపుష్పములను సమర్పించవలెను.

ఆజ్యముతో నూరు హోమములు చేసి పూర్ణాహుతి నిచ్చువాడు సర్వ సిద్ధులను పొందును. బలి సమర్పించు ముగ్గురు లేదా ఎనమండుగురు కన్యకలకు భోజనము పెట్టవలెను. పూజా నైవేద్యమును శివభక్తులకు ఇవ్వవలెను. కాని, తాను ఆ నైవేద్యాన్ని స్వీకరించరాడు. ఇట్లు చేయుటచే కన్య కోరువానికి కన్య లభించును. పుత్రులు లేనివానికి పుత్రులు లభించును. దౌర్భాగ్యవంతురాలు సౌభాగ్యశాలిని అగును. రాజు రణమునందు జయమును రాజ్యమును పొందును. ఎనిమిది లక్షలు జపించుటచే వాక్సిద్ధి కలుగును. దేవతలు వశమగుదురు. ఇష్ట దేవతకు నివేదించ కుండగ భోజనము చేయకూడదు. ఎడమ చేతితో కూడ పూజించవచ్చును. విశేషించి అష్టమీ చతుర్దశీ తృతీయలందు అట్లు చేయవలెను.

ఇప్పుడు మృత్యుంజయ పూజను చెప్పెదను. కలశముపై పూజ చేయవలెను. హోమము నందు ప్రణవము మృత్యుంజయుని మూర్తిమూలమంత్రము చెప్పుచు కుంభముద్ర చూపవలెను. క్షీరదూర్వా, ఆజ్య, అమృత, పునర్నవా, పాయస పురోడాశములతో హోమము చేయవలెను. హోమమునకు పూర్వము పదివేల మంత్రజపము చేయవలెను. మృత్యుంజయునకు నాలుగు ముఖములు నాలుగు భుజములు ఉండును. రెండు హస్తములలో కలశమును రెండు హస్తములలో వరదాభయములను ధరించి ఉండును. కుంభముద్రచే మృత్యుంజయునకు స్నానము చేయించవలెను. ఆరోగ్యైశ్వర్య దీర్ఘాయువులు లభించును. ఈ మంత్రముతో అభిమంత్రించిన ఔషధము శుభకరము. మృత్యుంజయుని ధ్యానించినను పూజించినను అపమృత్యువు తొలగును. (326)