అగ్ని మహా పురాణము

Table of Contents

అగ్నిపురాణం-వక్తృశ్రోతృ పరంపర

మత్సపురాణంలో వశిష్ఠా యాగ్ని నా ప్రోక్తమ్ (మత్స్య-53-80) అనటంచేత అగ్నిపురాణం అగ్నిచేత వశిష్ఠునికి బోధింపబడినట్టిది అని తెలుస్తున్నది. అగ్నిపురాణ అధ్యయనంలో అనేకులు వక్తృశ్రోతలు కనిపిస్తారు. వాస్తవానికి ప్రధానంగా ఇది అగ్ని వశిష్ఠునికి ఉపదేశించిన పురాణమైనా, ఇందులో చెప్పబడిన అనేక ప్రముఖ గ్రంథాలకు కర్తలు అయినందున ఆ మహానుభావులు ఉపదేశించినట్లుగానే చెప్పడం విశేషం. వీరు కేవలం వక్తలేకాని ముఖ్య వక్త అగ్నియే. అగ్నిని ప్రధానవక్తను చేయడంచేతనే ఈ పురాణానికి పురాణ స్థాయి కలిగినది. ఏయే వక్త, ఏయే విషయాలను వివరించాడో ఈ క్రింద చూపబడింది.

అగ్ని             - విష్ణు అవతారములు, రామాయణ, మహాభారత, హరివంశ కథనము, పురాణ పంచలక్షణ విషయములు వివిధ శాఖలవారి కర్మకాండ, ప్రాయశ్చిత్తాలు, వ్రతాలు, స్తోత్రాలు, పట్టాభిషేక విధానము మొదలైనవి.

నారదుడు     - విష్ణు అర్చన, తాంత్రిక విధానాలు.

హయగ్రీవుడు - దేవాలయ ప్రతిష్ఠ, కలశస్థాపన, వాసుదేవ విగ్రహ లక్షణాలు, విష్ణు అర్చన విధానాలు.

ఈశ్వరుడు    - గణ, సూర్య, శివ, చండ, కపిల, ఆరాధనా విధానాలు. తాంత్రిక పద్ధతులు, చక్రార్చన, వివిధ చక్రాలు.

పుష్కరుడు    - వర్ణాశ్రమ ధర్మాలు, నిత్యాచార విధి, పాప ప్రాయశ్చిత్త విధానాలు, వినాయకాభిషేకం మొదలైనవి.

భగవాన్        -          వివిధ విగ్రహాల లక్షణాలు

రాముడు       -        రాజనీతి

సముద్రుడు    -       సాముద్రిక శాస్త్రము.

ధన్వంతరి      -       వైద్యకశాస్త్రము.

పాలకాప్యుడు -          గజవైద్యము.

శాలిహోత్రుడు-          అశ్వవైద్యము.

స్కందుడు     -       వ్యాకరణము.

కుమారుడు   -       వ్యాకరణము.

శ్రీకృష్ణుడు     -          భగవద్గీత.

యముడు     -          యమగీత,

ఈ విధంగా ఈ పురాణంలో వక్తృ శ్రోతృ పరంపర కనిపిస్తుంది.

సాధారణంగా ఇతర పురాణాలలో చెప్పబడిన విధంగా దీనిని శౌనకాది మహా మునులకు రోమహర్షణ సూతుడు వినిపించినట్లుగానే మొదలు పెట్టబడింది. సూతునికి వశిష్ఠుడు ఉపదేశించగా, వశిష్ఠునికి అగ్ని చెప్పినట్లుగా ఈ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే దీనికి అగ్ని లేక ఆగ్నేయ పురాణమనే పేరువచ్చింది.