అగ్ని మహా పురాణము

Table of Contents

వానప్రస్థ ధర్మములు

పుష్కరుడు చెప్పెను:

ఇపుడు వానప్రస్థాశ్రమ ధర్మములు చెప్పెదను; వినుము. జటలు ధరించుట, అగ్నిహోత్రము చేయుట, నేలపై పండుకొనుట, మృగాజినమును ధరించుట, వనములో నివసించుచు, పాలు, దుంపలు, అడవి ధాన్యము, ఫలములు ఆహారముగా గొనుట, ప్రతి గ్రహము నుండి విరమించుట త్రిషవణ స్నానము, బ్రహ్మ చర్యము, దేవాతిథి పూజ-ఇది వానప్రస్థుని ధర్మము. పౌత్రుడు జనించిన వెంటనే గృహస్థుడు అరణ్యమునకు పోవలెను. అచట ఒంటరిగా గాని, భార్యాసమేతుడుగా గాని, ఆయుర్దాయము నందలి మూడవవంతు గడపవలెను. శరీరబలము ఉన్నంతవరకును గ్రీష్మము నందు పంచాగ్ని మధ్య తపస్సు చేయవలెను. వర్షాకాలమునందు ఆరుబైటను, హేమంతమునందు తడిబట్టలు ధరించియు ఉగ్రమైన తపస్సు చేయవలెను. వెనుకకు మరలక, అవక్రగతియై ముందుకే పోవలెను. అనగా మరల గృహస్థాశ్రమమునకు రాకుండ సన్యాసాశ్రమమునే గ్రహించుటకై ప్రయత్నించవలెను. (160)