అగ్ని మహా పురాణము
దానపరిభాషా కథనము
అగ్ని దేవుడు పలికెను:
మునిశ్రేష్ఠా! ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు దాన ధర్మములను గూర్చి చెప్పెదను. ఇష్టము పూర్తము అని దానము రెండు విధములు. దాన ధర్మములను ఆచరించువాడు సర్వమును పొంద గలడు. దిగుడుబావి, కూపము, చెరువు, దేవాలయము, అన్నసత్రము-వీటిని స్థాపించుట, ఉద్యానాది నిర్మాణము, వీటికి పూరమని పేరు. ఇది ముక్తి ప్రదము. అగ్నిహోత్రము, సత్యభాషణము, స్వాధ్యాయము, అతిథి సత్కారము, బలి వైశ్వదేవము-వీటికి ఇష్టమని పేరు. ఇది స్వర్గ ప్రదము. గ్రహణ సమయమునందును, సూర్య సంక్రాంతియందును, ద్వాదశ్యాది తిథులందును చేయుదానము ‘పూర్తము’ స్వర్గఫలప్రదము. దేశకాల పాత్రలందు చేయబడిన దానము కోట్ల రెట్టింపు ఫలమును ఇచ్చును. సూర్యుని ఉత్తరాయణ, దక్షిణాయన ప్రవేశ కాలములందును, పుణ్యమగు విషువ కాలము నందును, వ్యతీపాత, తిథిక్షయ, యుగారంభ, సంక్రాంతి, చతుర్దశీ, అష్టమీ, పూర్ణిమా, ద్వాదశీ, అష్టకాశ్రాద్ధ, యజ్ఞ ఉత్సవ, వివాహ, మన్వంతరారంభ, వైదృతియోగ, దుఃస్వప్నదర్శన, ధనప్రాప్తి, సద్ బ్రాహ్మణ ప్రాప్తులందును దానము చేయవలెను. ఏ దినమున శ్రద్ధ కలుగునో ఆ దినమునను లేదా ఎల్లపుడు దానము చేయవలెను. రెండు అయనములు, రెండు విషువలు అను నాల్గు సంక్రాంతులందును షడశీతి ముఖములని ప్రసిద్ధమైన నాలుగు సంక్రాంతులందును ‘విష్ణుపద’ అను నాలుగు సంక్రాంతులందును మొత్తము ఈ పండ్రెండు సంక్రాంతులందును దానము ఉత్తమోత్తమము. కన్యా, మిథున, ధనూరాశులలో సూర్య సంక్రాంతికి ‘షడశీతిముఖ’ అని పేరు. ఇవి ఎనుబది యారు రెట్ల ఫలమును ఇచ్చును. ఉత్తరాయణ, దక్షిణాయన సంక్రాంతులందు అతీత, అనాగత ఘటికలు మహా పవిత్రమైనవి. కర్కటక సంక్రాంతి ఇరువది ఘడియలు పుణ్యకార్యములు చేయుటకై ఎల్లప్పుడూ ఉత్తమమైనవి. తులా, మేష సంక్రాంతులందు వెనుకముందు పదిపది ఘడియలు పుణ్య కాలము. షడశీతి ముఖా సంక్రాంతి అయిన పిమ్మట అరువది ఘడియలు పుణ్యకాలము. విష్ణుపదా సంక్రాంతులందు ముందు వెనుక పదునారు ఘడియలు పుణ్యకాలము. శ్రవణ అశ్వనీ ధనిష్ఠా నక్షత్రములందును, ఆశ్లేష ప్రథమచరణమునందును రవివార సంబంధమున్నపుడు ‘వ్యతీపాత యోగము’.
కార్తిక శుక్ల నవమినాడు కృతయుగ ప్రారంభము. వైశాఖ శుక్ల తృతీయనాడు త్రేతాయుగ ప్రారంభము. ఇప్పుడు ద్వాపరమును గూర్చి వినుము. మాఘ పూర్ణిమనాడు ద్వాపరము. భాద్రపద కృష్ణ త్రయోదశినాడు కలియుగము ప్రారంభమగును. మన్వంతర ప్రారంభకాలమును ఈ విధముగా గ్రహించవలెను. ఆశ్వయుజ శుక్ల నవమి, కార్తిక ద్వాదశి, మాఘ-భాద్ర పదములు తృతీయా తిథులు, ఫాల్గుణ అమావాస్య, పౌష్యైకాదశి, ఆషాఢ దశమీ, మాఘ సప్తమి, శ్రావణ కృష్ణ అష్టమి, ఆషాఢ పూర్ణిమ, కార్తిక-ఫాల్గుణ -జ్యేష్ఠ పూర్ణిమలు.
మార్గ శీర్ష పూర్ణిమ తరువాత వచ్చు మూడు అష్టములకు అష్టకా అనిపేరు. అష్టమియే అష్టక. ఈ అష్టకలందు చేసిన దానము అక్షయ ఫలము. గంగా, యమునా, ప్రయాగాది తీర్థము లందును దేవాలయమునందును అడుగకుండ ఇచ్చిన దానము ఉత్తమము. కన్యాదాన విషయమున ఇది వర్తించదు. దాత పూర్వాభిముఖుడై దానము ఈయవలెను. ప్రతిగ్రహీత ఉత్తరాభిముఖుడై గ్రహించవలెను. దానము ఇచ్చువాని ఆయుర్దాయమును వృద్ధి పొందించును. అయితే తీసుకొనువాని ఆయుర్దాయము క్షీణించదు. తన పేరును, ప్రతిగ్రహీత పేరును చెప్పుచు దానము ఈయవలెను. కన్యా దానమునందు ఈ విధముగ మూడు సార్లు చేయవలెను. స్నాన పూజాదులుచేసి, చేత జలము గ్రహించి పై సంకల్పము చేయవలెను. సువర్ణ అశ్వ, తిల, గజదాసీ, రథ, భూ, గృహ, కన్యా, కపిలగోవుల దానములు దశమహాదానములు. విద్యా, పరాక్రమ, తపః కన్యా, యజమాన, శిష్యుల వలన లభించినది దానము కాదు. శుల్కము, శిల్ప కలాదుల వలన లభించిన ధనము కూడ శుల్కమే. వడ్డీ, వ్యవసాయము, వాణిజ్యము, ఇతరులకు ఉపకారము చేయుట-వీటివలన లభించిన ధనము సాత్త్వికము. ద్యూతము, దొంగతనము, వేషమువేయుట, సాహసకర్మ-వీటివలన లభించిన ధనము రాజసము. మోసగించి సంపాదించినది తామసము. వీటివలన వచ్చు ఫలము గూడ సాత్త్విక, రాజస, తామస రూపమున నుండును. వివాహ సమయమున లభించినది, అత్తవారింటికి వెళ్ళునపుడు ప్రీతితో ఇచ్చినది, భర్త ఇచ్చినది, సోదరుడు ఇచ్చినది, తల్లిదండ్రులు ఇచ్చినది, ఈ ఆరు విధములైన ధనము స్త్రీధనము. శూద్రునకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల అనుగ్రహముచే లభించినది ధనము. గోవు, గృహము, శయ్య, స్త్రీ ఇవి అనేకులకు దానము చేయరానివి. అట్లు ఇచ్చుట పాపహేతువు. మాట ఇచ్చి తరువాత దానముచేయని వాని నూరు కులములు నశించును. ఎక్కడ సంపాదించిన ధనమునైనను పుణ్య దేవతలకు ఆచార్యులకు, తలిదండ్రులకు ప్రయత్న పూర్వకముగా సమర్పించవలెను. ఏదో లాభమును అపేక్షించి ఇచ్చిన దానము నిష్ఫలము. ధర్మము శ్రద్ధచేత సిద్ధించును. శ్రద్ధతో ఉదకము ఇచ్చినను అది అక్షయమగును. జ్ఞాన, శీల, సద్గుణ సంపన్నుడును, ఇతరులకు ఎన్నడును పీడ కలుగజేయని వాడును దానము చేయుటకు సత్పాత్ర అనగా యోగ్యుడైనవాడు అజ్ఞాన వంతులైన వారిని పాలించి రక్షించుటచే వారు పాత్రులని చెప్పబడుచున్నారు. తల్లికి ఇచ్చిన దానమునకు నూరు రెట్లు ఫలము, తండ్రికి ఇచ్చిన దానికి వేయి రెట్లు ఉండును. పుత్రికిని, సహోదరునకును ఇచ్చిన దానము అనంతము, అక్షయము. మనుష్యేతర ప్రాణులకు ఇచ్చిన దానము న్యూనాధికము కాక సమముగా ఉండును. పాపాత్మునకు ఇచ్చినది పూర్తిగ నిష్ఫలము. వర్ణసంకరునకు ఇచ్చిన దానము రెట్టింపు ఫలమును, శూద్రునకు ఇచ్చినది నాలుగు రెట్లును, వైశ్యునకు గాని, క్షత్రియునకుగాని ఇచ్చినది ఎనిమిది రెట్లును, నామమాత్ర బ్రాహ్మణునకు ఇచ్చినది పదునారు రెట్లును, వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణునకు ఇచ్చినది నూరు రెట్లును ఫలమును ఇచ్చును. వేదార్థవేత్తయగు ఆచార్యునకు ఇచ్చినది అనంత ఫలము. పురోహిత, యాజకాదులకు ఇచ్చినది అక్షయ ఫలము. దరిద్రుడైన బ్రాహ్మణునకును, యజ్ఞము చేసిన బ్రాహ్మణునకును ఇచ్చినది అనంత ఫలదాయకము. తపోహీనుడును, స్వాధ్యాయ రహితుడు, ప్రతిగ్రహ ప్రియుడును అగు బ్రాహ్మణుడు ఱాతినావ మీద కూర్చున్న వానితో సమానుడు.
అతడు ఆ నావతో కూడ మునిగిపోవును. బ్రాహ్మణుడు స్నాన ఆచమనాదులచే శుద్ధుడై ప్రతిగ్రహము చేయవలెను. దానము పట్టువాడు గాయత్రీ జపము చేయవలెను. దానితోపాటు ప్రతిగ్రహించిన ద్రవ్యమును, దేవత పేరును ఉచ్చరించవలెను. ప్రతిగ్రహము చేయువాడు శ్రేష్ట బ్రాహ్మణుని నుండి ప్రతిగ్రహించినపుడు ఉచ్చైః స్వరమునను, క్షత్రియుని నుండి గ్రహించినపుడు మందర స్వరమునను వైశ్యునినుండి ప్రతిగ్రహించినపుడు ఉపాంశువుగను జపము చేయవలెను. శూద్రుని నుండి ప్రతిగ్రహము చేసినప్పుడు మానసిక జపమును, స్వస్తి వాచనమును చేయవలెను.
మునిశ్రేష్ఠా! అభయమునకు దేవత సర్వ దేవతా గణము. భూమికి దేవత విష్ణువు. కన్యకును, దాసీదాసులకును గజములకును, ప్రజాపతి. అశ్వమునకు యముడు. ఒక డెక్కగల పశువులకు సర్వ దేవతా గణము, మహిషమునకు యముడు, ఉష్ట్రమునకు నిరృతి, ధేనువునకు రుద్రుడు, మేకకు అగ్ని, గొఱ్ఱె, సింహము, వరాహము-వీటికి జల దేవత, వన్య పశువులకు వాయువు, జలపాత్ర-కలశాది జలాశయములకు వరుణుడు, సముద్రము నుండి ఉత్పన్నములైన రత్నములకు, స్వర్ణ లోహాది ధాతువులకును అగ్ని, పక్వాన్నమునకును, ధాన్యమునకును ప్రజాపతి, సుగంధములకు గంధర్వుడు, వస్త్రములకు బృహస్పతి, అన్ని పక్షులకును వాయువు, విద్యా విద్యాంగములకు బ్రహ్మ, పుస్తకాదులకు సరస్వతి, శిల్పమునకు విశ్వకర్మ, వృక్షములకు వనస్పతి దేవతలు. ఈ సమస్త ద్రవ్యములును దేవతలును శ్రీమహావిష్ణువునకు అంగములే.
ఛత్ర కృష్ణచర్మ, శయ్యా, రథ, ఆసన, పాదుకా, వాహనములకు ఊర్ధ్వాంగిరసులు దేవత, యుద్ధమునకు ఉపయోగించు సామగ్రికిని, శస్త్రములకును, ధ్వజాదులకును సర్వదేవ గణములు దేవత, గృహమునకుగూడ వారే దేవత-సకల పదార్థములకు దేవత విష్ణువు లేదా శివుడు. ఏలననగా, ఏ పదార్థముకూడ ఆ దేవతలకంటె భిన్నముగ లేదు. దానము చేయు సమయమున ముందుగా ద్రవ్యము పేరు చెప్పి, పిదప దదామి అనిచెప్పి, సంకల్ప జలమును ప్రతిగ్రహీత చేతిలో విడువవలెను. ప్రతిగ్రహీత-విష్ణువే దాత; విష్ణువే ద్రవ్యము; నేను ఈ దానము గ్రహించుచున్నాను. ధర్మాను కూలమగు ఈ ప్రతిగ్రహము కల్యాణ ప్రదమగుగాక’ అని పలుకవలెను. మాతా, పితృ, భృత్యాది పోషణార్థము, దేవతా పితృ పూజార్థము అందరి నుండియు దానము స్వీకరించవచ్చును. కాని దానిని తనకొరకై వినియోగించరాదు. శూద్ర ధనమును యజ్ఞకార్యము నందు వినియోగించరాదు; అట్లు చేసినచో ఆ యజ్ఞఫలము ఆతనికి చెందిపోవును.
వృత్తి విహీనుడైనచో బ్రాహ్మణుడు శూద్రుని నుండి గుడము, మజ్జిగ, రసము మొదలగు పదార్థములను గ్రహించవచ్చును. జీవిక నడవని బ్రాహ్మణుడు అన్నింటిని గ్రహించవచ్చును. ఏలనన బ్రాహ్మణుడు సహజముగ సూర్యాగ్నులవలె పవిత్రుడు. అందు ఆపత్సమయము నందు నిందితులకు చదువు చెప్పుట, యజ్ఞము చేయించుట, దానము గ్రహించుట-వీటివలన ఆతనికి పాపమురాదు. కృత యుగమునందు బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి దానము ఇచ్చెడివారు. త్రేతాయుగమున తమ ఇంటికి పిలచి ఇచ్చెడివారు. ద్వాపరమున అతడు అడిగినచో ఇచ్చెడివారు. కలియుగమున వెంబడించిననే దానము చేయుదురు. సముద్రపారము పొందవచ్చును గాని దానమునకు అంతము పొంద శక్యము కాదు. దాత తన మనస్సులో ఈ క్రింది విధముగ సత్పాత్రుని ఉద్దేశించి సంకల్పించి, జలము నేలపై విడువవలెను. ‘నేను ఈ రోజున సూర్యగ్రహణ సమయమున లేదా చంద్రగ్రహణ సమయమున లేదా సంక్రాంతి సమయమున గంగా, గయా, ప్రయాగాద్యనంత గుణసంపన్నమగు తీర్థదేశమున అముక (ఫలాన) గోత్రము కలవాడు, వేదవేదాంగవేత్త, మహాత్మ, సత్పాత్రము అయిన అముక శర్మకు విష్ణువునకు లేదా శివునకు లేదా మరొక దేవతకు సంబంధించిన అముక ద్రవ్యమును. ‘కీర్తి, విద్యా, మనోరథ, సౌభాగ్య, ఆరోగ్యాదుల ప్రాప్తి కొరకును, సమస్త పాపశాంతి కొరకును, భుక్తిముక్తుల కొరకును దానము చేయుచున్నాను. ద్యు-అంతరిక్ష భూలోక సంబంధి సమస్త ఉత్పాతములను నశింపచేయు శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై నాకు ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించి బ్రహ్మలోకమును ఇచ్చుగాక’. పిదప-‘అముక గోత్రముగల బ్రాహ్మణుడైన, అముకశర్మకు ఈ దానము సఫల మగుటకై సువర్ణ దక్షిణ ఇచ్చుచున్నాను’ అని చెప్పి సమస్త దానములను చేయవలెను. (209)
