అగ్ని మహా పురాణము

Table of Contents

బ్రహ్మ విజ్ఞానము, నిరూపణము-1

అగ్నిదేవుడు పలికెనుః

సంసారమును, అజ్ఞానమును తొలగించుకొనుటకు సాధనమైన బ్రహ్మ జ్ఞానమును చెప్పెదను. ‘అయం ఆత్మాపరం బ్రహ్మ అహమస్మి’. నేనే పరబ్రహ్మమైన ఆత్మను అని భావించుటచే ముక్తుడగును. ఘటాదులవలె దృశ్యమగుటచే దేహము ఆత్మ కాజాలదు. నిద్ర పోయినపుడున్ను, మరణమునందును, దేహముకంటే ఆత్మ భిన్నమని తెలియుచున్నది. అది నిశ్చితము. దేహమే ఆత్మయైనచో నిద్రా సమయము దును, మరణానంతరమున కూడ అది వ్యవహరించవలెను.

చక్షురాది ఇంద్రియములుకూడ సాధనములే కాని ఆత్మకాదు. మనస్సు బుద్ధియుకూడ దీపము వలె సాధనమే కాని ఆత్మ కాదు. సుషుప్తావస్థలో జ్ఞానము లేకపోవుటచే ప్రాణముకూడ ఆత్మకాడు. జాగ్రత్స్వప్న సమయములందు ప్రాణచైతన్యము కలిచి పోయినట్లుండును. అందుచే వేరువేరుగా తెలియుటలేదు. సుషుప్తి అవస్థలో ప్రాణము విజ్ఞాన రహితమై ఉన్నది. అందుచే ప్రాణము ఆత్మకాదు. ఈ విధముగా ఇంద్రియాదులు ఆత్మకాదు. ఆత్మకు కరణములుమాత్రమే. అహంకారము కూడ ఆత్మకాదు. అదికూడ దేహమువలె వేరుగ కనబడుచున్నది కదా! పైన చెప్పిన దేహాదుల కంటే భిన్న మగు ఆత్మ అందరి హృదయమునందును ఉన్నది. అదియే భోక్త. రాత్రి ప్రకాశించుచున్న దీపమువలె సర్వమును చూచునది.

యోగి సమాధి ప్రారంభమున ఈ విధముగ భావన చేయవలెను. బ్రహ్మ నుండి ఆకాశము, దాని నుండి వాయువు, దాని నుండి అగ్ని, అగ్ని నుండి జలము, దాని నుండి పృథివి, దాని నుండి సూక్ష్మ శరీరము ఆవిర్భవించినది. అపంచీకృత భూతముల నుండి పంచీకృతములగు స్థూల భూతములు జనించినవి. స్థూల శరీరము జనించినదని భావించి అది బ్రహ్మయందు లీనమై నట్లు చింతించవలెను. వాటి నుండి పంచీకృత భూతములకును, వాని కార్యములకును విరాట్ అని పేరు. ఈ స్థూల శరీరము ఆత్మ అజ్ఞాన కల్పితము. ఇంద్రియముల వలన జ్ఞానము జాగ్రదవస్థ అని అందురు. జాగ్రదావస్థ అభిమానియగు ఆత్మకు విశ్వఅనిపేరు. ఈ త్రయము అకారస్వరూపము. అపంచీకృత భూతములు. వాటి కార్యము ‘లింగము’ పదునేడు తత్త్వములతో కూడిన శరీరమునకు హిరణ్యగర్భుడనియు సూక్ష్మమనియు లింగమనియు పేరు. జాగ్రత్సంస్కారము వలన కలిగిన వివిధ విషయ జ్ఞానము స్వప్నము. తదభిమానియగు ఆత్మకు తైజసుడు అని పేరు. స్థూల సూక్ష్మ శరీరము లకు ఆత్మ ఒక్కటియే కారణము. పైన చెప్పిన తైజసము జాగ్రత్ ప్రపంచమున కంటె భిన్నమైనది. ఉకార రూపమైనది. ఆభాస రూపము అగు జ్ఞానమునకు అధ్యాహృతము అని పేరు. ఈ అవస్థలకు సాక్షియైన బ్రహ్మ సత్తుకాదు, అసత్తుకాదు, సదసత్తు కాదు, సావయవము కాదు నిరవయవము కాదు, భిన్నముకాదు, అభిన్నము కాదు, భిన్నా భిన్నము కాదు. అది నిర్వచింప శక్యము గానిది. సంసార బంధన ములకు కారణమైనది ఇదియే. బ్రహ్మ ఒక్కటియే. అది జ్ఞానముచే లభించును. కర్మలచే లభ్యముకాదు.

సాధనములగు ఇంద్రియములు లీనములై బుద్ధి మాత్రమే నిలచియుండు స్థితికి సుషుప్తియని పేరు. ఈ బుద్ధి సుషుప్తులకు అభిమానియగు ఆత్మ ప్రాజ్ఞుడు. ఈ మూడును మకారముగాను, ప్రణవముగాను చెప్పబడుచున్నవి. ఈ ప్రాజ్ఞుడే అకార, ఉకార, మకారములు. అహంపద లక్ష్యభూతుడగు ఆత్మజ్ఞాన స్వరూపుడు, జాగ్రత్స్వప్నాదులకు సాక్షి. వానిలో అజ్ఞానముకాని, తత్కార్యమైన సంసారాది బంధనముగాని లేదు. నిత్యము శుద్ధము, బుద్ధము, ముక్తము, సత్యము, ఆనందము, అద్వయమగు బ్రహ్మయే నేను. జ్యోతి స్వరూపము, ముక్తము అగు పరబ్రహ్మను నేను. ఓంకార రూప పరబ్రహ్మ నేను. నేనే జ్ఞాన రూపమును, సమాధి రూప బ్రహ్మను. చిరము ఆనందమయము, సత్యము, జ్ఞానము అనంతమగు బ్రహ్మ నేనే. ‘అయం ఆత్మా పరంబ్రహ్మ’, ‘తత్ బ్రహ్మత్వం అసి’. ఈవిధముగా గురువుచే బోధింపబడిన జీవుడు దేహ విలక్షణమైన బ్రహ్మను తెలుసుకొనును. నేనే ఓంకారమును, నేనే అఖండ పరమేశ్వరుడను అని ఇట్లు జ్ఞానము కలవాడు అపారమగు సంసారము నుండి విముక్తుడై బ్రహ్మ రూపుడగును. (377)