అగ్ని మహా పురాణము

Table of Contents

యుద్ధయాత్ర

పుష్కరుడు పలికెను: తన సరిహద్దులలోగల రాజును, ఆతడి సరిహద్దుకావల ఉన్నరాజు జయించెను అని గ్రహించిన రాజు సైన్యమును యుద్ధమునకై తరలించవలెను. ముందుగా సేన బాగుగా బలంగా ఉత్సాహంతో ఉన్నది. భృత్యులందరును చక్కగా పోషింపబడి ఉన్నారు. నావద్ద అధికమైన సేన ఉన్నది; నేను మూల రక్షణ విషయమున అన్ని విధములచే సమర్థుడను’ అను విషయమును నిర్ధారణ చేసికొనవలెను పిదప సైనిక పరివృతుడై శిబిరములోనికి వెళ్ళవలెను. శత్రువు కష్టములలో నున్నపుడును, దైవ-మానుష బాధలలో చిక్కుకొని ఉన్నపుడును, అతని నగరము పీడితమై ఉన్నపుడును యుద్ధయాత్ర చేయవలెను. భూకంపము ఏవైపున వచ్చినదో, కేతువు తన ప్రభావముచే ఏ ప్రక్కదూషితము చేసెనో ఆ వైపునుండి ఆక్రమణము చేయవలెను. శత్రువును నశింపచేయవలెనని సేన ఉత్సాహముతో ఉన్నపుడును, శత్రువులపై యోధులకు కోపమున్నపుడును, శుభసూచకముగ అవయవములు అదరుచున్నపుడును మంచి చిహ్నములు ఉత్తమమైన నిమిత్తములు, శకునములు కనబడుచున్నపుడును శత్రునగరముపై ఆక్రమణము చేయవలెను. వర్షా కాలమునందు యుద్ధ యాత్ర చేయవలసి వచ్చినపుడు కాలిబంటులు, ఏనుగులు అధికముగా ఉన్న సైన్యమును ముందుకు దుమక మని ఆజ్ఞాపించవలెను. హేమంత శిశిర ఋతువు లందు రథములు, అశ్వములు అధికముగా ఉన్న సైన్యమును తీసికొని వెళ్ళవలెను. వసంత-శరదారంభములందు చతురంగ సేనను తీసికొనివెళ్ళవలెను. కాలిబంటులు ఎక్కువగా ఉన్న సైన్యమే శత్రువులపై విజయము సాధించును. శరీరమునందు కుడి భాగమున ఏ అవయవమైన అదురుచున్నచో అది ఉత్తమము.

ఎడమ అవయవము వీపు హృదయము అదురుట మంచిది కాదు. ఈ విధముగ శరీర చిహ్నములు, కురుపులు, బొబ్బలు, అవయవములు అదురుట మొదలగు వాటిచే శుభాశుభ ఫలములను బాగుగా తెలిసికొనవలెను. స్త్రీలకు ఫలము దీనికి విపరీతముగా ఉండును. వాళ్లకు శరీరము ఎడమ భాగము అదురుట మంచిది. (228)