అగ్ని మహా పురాణము
యమ నియమములు
అగ్నిదేవుడు పలికెను:
సంసారతాపము తొలగుటకు అష్టాంగయోగములు చెప్పెదను. బ్రహ్మను సాక్షాత్కరింప చేయునది జ్ఞానము. ఏకాగ్రచిత్తత్త్వము యోగము. చిత్తవృత్తులను నిరోధించుట కూడ యోగము. జీవాత్మయందును, పరమాత్మయందును, చిత్తమును స్థాపించుట ఉత్తమ యోగము. అహింసా సత్య, అస్తేయ బ్రహ్మచర్య, అపరిగ్రహములు ఐదు యమములు. యమములు కూడ ఐదు భుక్తి ముక్తి ప్రదములు శౌచ, సంతోష-తపస్-స్వాధ్యాయ, ఈశ్వర పూజనములు నియమములు. ప్రాణులకు పీడ కల్గించకుండుట అహింస. ఇది ఉత్తమ ధర్మము. మార్గమున నడుచు అందరి అడుగును ఏనుగు అడుగులో ఇమిడి పోయినట్లు అన్ని ధర్మములును అహింసలో ఇమిడిపోవును. ఇతరులకు ఉద్వేగమును కల్గించుట, సంతాపము కల్గించుట, రోగము కల్గించుటవాని శరీరము నుండి రక్తము బయటకు వచ్చునట్లు చేయుట, చాడీలు చెప్పుట, ఇతరుల హితమునకు అడ్డుతగులుట, వారి రహస్యములను బయటపెట్టుట, వారికి సుఖము లేకుండ చేయుట అకారణముగ బంధించుట, చంపుట అని హింస పదివిధములు. అట్లు చేయకుండుట అహింస. ప్రాణులకు అత్యంతహితమైన వాక్కుసత్యము. సత్యము పలుకవలెను. ప్రియము పలుకవలెను. సత్యమైనను అప్రియము చెప్పరాదు. ప్రియమైనను అసత్యము చెప్పరాదు. ఇది సనాతన ధర్మము. మైథునమును పరిత్యజించుట బ్రహ్మ చర్యము-స్మరణము, కీర్తనము, విహరించుట, చూచుట, రహస్యముగా మాటలాడుట, పొందవలెనను సంకల్పము అందుకు ప్రయత్నము అది సిద్ధించుట అని మైథునము ఎనిమిది విధములు. బ్రహ్మ చర్యము సమస్త క్రియలకును మూలము. ఆదిలేని క్రియలు వ్యర్థము. వయోవృద్ధులు తపోవృద్ధులు అయిన వశిష్ఠుడు, చంద్రుడు, దేవాచార్యుడు అయిన, గురుడు, శుక్రుడు, పితామహుడు కూడ స్త్రీలచే మోహింపబడిరి. సుర బెల్లముతో చేసినది పిండితో చేసినది మధువుతో చేసినది అని, మూడు విధములు. ఈ జగత్తు నంతను మోహింపచేయు స్త్రీ అను సుర నాలుగవది. స్త్రీని చూచి మత్తు చెందును. సురను త్రాగిన తరువాతనే మత్తు చెందును. ఈ విధముగ చూచినంతమాత్రమునకే మత్తునిచ్చు స్త్రీని చూడకూడదు. పరద్రవ్యము ఏమాత్రమైనను బలాత్కారముగ అపహరించినవాడును, హోమము చేయు హవిస్సును తిన్నవాడును తప్పక తిర్యగ్ జంతువై పుట్టును. కౌపీనమును ఆచ్ఛాదించుటకు వస్త్రమును శీత నివారణార్థమై బొంతను పాదుకలను సంగ్రహించుకొనవలెను. మరి దేనిని సంగ్రహించకూడదు. దేహస్థితి నిమిత్తమగు వస్త్రాదులను పరిగ్రహించవచ్చును. శరీరము ధర్మ యుక్తముగ ప్రయత్న పూర్వకముగ రక్షింపదగినది. శౌచము బాహ్యము అభ్యంతరమని రెండు విధములు. మృత్ జలములతో చేయు శౌచము బాహ్యము. భావశుద్ధి అంతరము. ఈ రెండు విధముల శౌచమున్నవాడే శుచియైనవాడు, ఇతరుడు కాడు.
లభించిన దానితో ఆనందించుట తుష్టి, మనస్సును, ఇంద్రియములను, ఏకాగ్రముగ ఉంచుట తపస్సు. ఇంద్రియ మనస్సులను జయించుట అన్ని ధర్మముల కంటెను ఉత్తమమైన ధర్మము. మంత్ర జపాదికము వాచిక తపస్సు. వైరాగ్యము మానస తపస్సు, దేవ పూజాదికము శారీర తపస్సు. ఈ త్రివిధ తపస్సు సర్వఫలప్రదము. వేదములు ప్రణవముతో ప్రారంభమైనవి. ప్రణవము నందే వాటి స్థితి. వాఙ్మయ మంతయు ప్రణవ రూపము. అందు వలన ప్రణవమును అభ్యసించ వలెను. ప్రణవమున అకార-ఉకార-అర్ధ మాత్ర మకారములున్నవి. ఈమూడు మాత్రము మూడు వేదములు మూడు భూరాది లోకములు మూడు. గుణములు మూడు. జాగత్స్వప్న సుషుప్తి అవస్థలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మూడు మూర్తులు. ప్రద్యుమ్నుడు, శ్రీవాసుదేవుడు సర్వము ఓంకారమే. ‘ఓం’ కారము అమాత్రము లేదా నష్టమాత్రము. ఇది ద్వైతవినాశ రూపమగు శివము. ఓంకారము తెలిసినవాడే ముని, ఇతరుడు కాడు. ఓంకారము యొక్క నాల్గవ మాత్ర గాంధారి. అది ప్రయుక్తమైనపుడు మూర్ధ స్థానమున రక్షింపబడును. అదియే తురీయమైన పరబ్రహ్మ జ్యోతి. కటములోనున్న దీపమువలె, హృత్పద్మమునందున్న ఆ జ్యోతిని నరుడు నిత్యము జపించ వలెను. ప్రణవమే ధనస్సు. ఆత్మ ప్రాణము. బ్రహ్మ లక్ష్యము. సాధకుడు తన్మయుడై అప్రమత్తుడై శరముతో కొట్టినట్లు దానిని కొట్టవలెను. ఈ ఏకాక్షరమే బ్రహ్మ. ఈ అక్షరమే పరతత్త్వము. ఈ ఏకాక్షర బ్రహ్మ తెలిసినవాడు దేనిని కోరునో అది లభించును. ఈ ఓం కారమునకు గాయత్రి ఛందస్సు. అంతర్యామి ఋషి. పరమాత్మ దేవతా, భుక్తి ముక్తులపై వినియోగించవలెను. “ఓం భూః ఆగ్న్యాత్మనే హృదయాయ నమః’ భువః ప్రాజాపత్యాత్మనే శిరసే స్వాహా’, ‘ఓం స్వః సూర్యాత్మనే, శిఖాయై వషట్’ ఓం భూర్భువ స్స్వః’ సత్యాత్మనే కవచాయహుం’ అనియు తరువాత అస్త్రమును విన్యసించి, విష్ణువును పూజించి, భుక్తి ముక్త్యర్థమై తన్నామ జపము చేయవలయును. తిల ఆజ్యాదులను హోమము చేయవలెను. సర్వము లభించును. ప్రతి దినము పండ్రెండు వేలు ప్రణవజపము చేయువానికి పన్నెండు మాసములలో పరబ్రహ్మ జ్ఞానోదయము కలుగును. కోటి జపము చేసినచో ఆణిమాదులు సిద్ధించును. లక్షజపముచే సరస్వత్యాదుల అనుగ్రహము కలుగును. వైదికము, తాంత్రికము, మిశ్రము అని విష్ణుపూజ మూడు విధములు. వీటిలో ఇష్టమైన విధిని ఆశ్రయించి విష్ణువును పూజించవలెను. భూమిపై దండమువలె పడి విష్ణువునకు నమస్కరించుటచే కలుగు సద్గతి వంద క్రతువులచే గూడ కలుగదు. ఎవనికి ఆరాధ్య దేవతయందు ఉత్తమ భక్తి ఉండునో, గురువు యందుగూడ ఆరాధ్య దేవతయందు వున్నంత భక్తి ఉండునో ఆతనికే ఈ చెప్పిన విషయములు స్పష్టముగ అవగతము లగును. (372)
