అగ్ని మహా పురాణము

Table of Contents

శబ్దార్థ అలంకారము -2

అగ్నిదేవుడు పలికెను:

శబ్దార్థాలంకారము ఒకచోట ఉంచగా హారము స్త్రీ యొక్క స్తనమును కంఠమును కూడ అలంకరించినట్లు శబ్దార్థములు రెండింటిని అలంకరించును. ప్రశస్తి, కాంతి, ఔచిత్యము, సంక్షేపము, యావదర్థత, అభివ్యక్తి అని ఇది ఆరు విధములు. ఇతరుల మర్మమును ద్రవింపచేయునట్లు ఉండు వాక్కౌశలము ప్రశస్తి. ప్రేమోక్తి స్తుతి అని ఇది రెండు విధములు. వీటికే ప్రియోక్తి గుణ కీర్తనము అని నామాంతరములు. వాచ్య వాచకములు చక్కగా కలిసియుండుట కాంతి. ఓజో మాధుర్యయుక్త రచనలందు వస్తురీతి వృత్యనుసారముగా రసప్రయోగము కలుగునపుడు ఔచిత్యము ఉండును. తక్కువ శబ్దములతో ఎక్కువ అర్థము చెప్పుట సంక్షేపము. శబ్దార్థముల అన్యూనానధికముగా ఉన్నచో యావదగ్ధత అని పేరు. అర్థ ప్రాకఠ్యమునకు అభివ్యక్తి అని పేరు. శృతి ఆక్షేపమని అది రెండు విధములు. శబ్దముచే అర్థమును ప్రత్యక్షముగ బోధించుట శృతి. అది నైమిత్తికము పారిభాషికము అని రెండు విధములు. పరిభాష అనగా సంకేతము గలది పారిభాషికీ. పారిభాషికికి ముఖ్య అనియు, నైమిత్తికికి ఔపచారికము అని పేరు. ఔపచారికము రెండు విధములు, అభిధేయార్థము చెప్పజాలని శబ్దము ఏదైన ఒక నిమిత్తముచే అముఖ్యమగు అర్థమును బోధించినచో అది ఔపచారికవృత్తి. నైమిత్తికము నందునుకూడ ఈ భేదములుండును. అది లక్షణాయోగముచే లాక్షణికి అనియు గుణ యోగముచే గౌణి యనియు చెప్పబడును. ఎచట అభిధేయ అర్థముతో సంబద్ధమగు అన్యార్ధము ప్రతీతమగునో అచ్చట లక్షణావృత్తి. అభిధేయముతో సంబంధము సామీప్యము, నమవాయము వైపరీత్యము క్రియాయోగము వీటిచే లక్షణలు ఐదు విధములు. అనంతములగు గుణముల వివక్షనుబట్టి గౌనీ వృత్తియందు కూడ అనంత భేదములు ఉండును. లోక వ్యవహారజ్ఞుడగు కవి ప్రస్తుత వస్తువుపై అప్రస్తుత వస్తు ధర్మములను పూర్తిగా ఆరోపించినచో దానికి సమాధి అని పేరు. శ్రవణ మాత్రముచే తెలియని అర్థము బుద్ధి గోచరమైనచో అది ఆక్షేపము. ఇది ధ్వనిచే వ్యజింపచేయబడును. కాన ధ్వనియని పేరు. ధ్వని సంబంధముచే శబ్దార్థ ములు మరియొక అర్థమును వ్యంజింపచేయును. ఒక వస్తువు యందు ఉత్కర్షను సూచించుటకు చేయు నిషేధమునకు ఆక్షేపము అని పేరు. అప్రకృత వస్తువును స్తుతించుట, అస్తుత స్తోత్రము ఒక వస్తువును వర్ణించునపుడు సమాన విశేషణములుగల మరియొక అర్థము ప్రతీతమైనచో దీనిని అర్థ సంక్షేపమును బట్టి సమాసోక్తి అని అందురు. వాస్తవిక పదార్థములు కప్పిపుచ్చి అన్య పదార్థమును సూచించుట అపహ్నుతి. ఒక విషయమును ఋజువుగా చెప్పక మరియొక విధముగా త్రిప్పి చెప్పుట పర్యాయోక్తి. వీటిలో ఒకటి ధ్వని అని చెప్పబడును. (345)