అగ్ని మహా పురాణము

Table of Contents

వర్ణధర్మ వర్ణనము

పుష్కరుడు పలికెను:

ఇపుడు శ్రౌతస్మార్త ధర్మములను గూర్చి చెప్పెదను. అది ఐదు విధములు. కేవలము వర్ణమును మాత్రమే నిమిత్తముగా చేసికొని చెప్పిన ధర్మము-ఉదా: పై మూడు వర్ణముల వారికి ఉపనయన సంస్కారము ఆవశ్యకము. ఇది వర్ణధర్మము. ఆశ్రమమును బట్టి విధించిన ధర్మము ఆశ్రమ ధర్మము. ఉదా: భిన్న పిండాది విధానము. రెండింటిని పట్టి విధించినది నైమిత్తికము. ఉదా: ప్రాయశ్చిత్త విధానము. నరుడు బ్రహ్మచారియైనను, గృహస్థుడైనను, వానప్రస్థుడైనను, సన్యాసియైనను విధింపబడిన ధర్మము ఆశ్రమధర్మము. మరొకవిధమున గూడ ధర్మము ఐదు విధములు. సంధి విగ్రహాది షాఢుణ్య విధానము దృష్ట ఫలము; మంత్ర యజ్ఞాదులు అదృష్ట ఫలములు అని మనువు చెప్పెను. ఇవి కాక ఉభయ ప్రయోజనములుగల వ్యవహారము, దండధారణము, తుల్యార్థ వికల్పము ఇవి కూడ యజమూలకమగు ధర్మమునకు అంగములు. వేదములో చెప్పిన ధర్మమునే స్మృతులు కూడ బోధించుచున్నవి. కార్యముకొరకై స్మృతి వేదోక్త ధర్మమును అనువదించుచున్నది అని మన్వాడుల అభిప్రాయము. అందుచే స్మృతులలో చెప్పిన ధర్మము వేదోక్త ధర్మమునకు గుణము, పరిసంఖ్య, విశేషతః అనువాదము లేదా విశిష్ట దృష్టఫలము నిరూపించుటకై ఉద్దిష్టమైనది. ఇది మను సిద్ధాంతము.

ఈ క్రింద చెప్పిన నలుబది ఎనిమిది సంస్కారములు చేసికొనిన మానవుడు బ్రహ్మ లోకమును పొందును. గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, చూడాకర్మ, ఉపనయనము, నాలుగు వేద వ్రతములు, స్నానము, వివాహము, దేవ యజ్ఞ, పితృ యజ్ఞ, మనుష్య యజ్ఞ, భూత యజ్ఞ, బ్రహ్మ యజ్ఞములు అను పంచయజ్ఞములు, ఏడు పాకయజ్ఞసంస్థలు, అష్టకా సహితములగు మూడు పార్వణ శ్రాద్ధములు, శ్రావణి, అగ్రహాయణి, చైత్రి, ఆశ్వయుజి, ఆగ్న్యాధేయ, అగ్నిహోత్ర, ధర్మ పౌర్ణమాస, చాతుర్మాస్య, ఆగ్రహాయణేష్టి, నిరూఢపశుబంధ, సౌత్రామణులు ఏడు హవిర్యజ్ఞములు, అత్యగ్నిష్టోమ, ఉక్థ్య, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామములను సప్తసోమ సంస్థలు-ఇవి నలుబది ఎనిమిది సంస్కారములు. దయ, క్షమ, అనసూయ, అనాయాసము, మాంగల్యము, అకార్పణ్యము, అస్పృహ, శౌచము అనునవి ఎనిమిది ఆత్మ గుణములు. ఈ ఎనిమిది ఆత్మగుణములు కలవాడు స్వర్గమును పొందును. మార్గ గమనము, మైథునము, మలమూత్రోత్సర్గము, దంతధావనము, స్నానము, భోజనము-ఈ ఆరు పనులు చేయునపుడు మౌనము పాటింపవలెను. సక్తువుల విషయమున మరల దానముచేయుట, నేయి కలిపి, పాలు కలిపి వేరువేరుగా త్రాగుట, రాత్రి త్రాగుట, దంతములతో కొరకుట, చాలవేడిగా త్రాగుట ఈ ఏడుపనులు త్యజించవలెను. స్నానానంతరము పుష్పములు కోయగూడదు. అవి దేవతాపూజకు పనికిరావు. అన్యగోత్రీయుడు ఎవరికైన అగ్ని సంస్కారము చేసినచో, పది దినముల వరకును పిండోదక దానములు ఆతడే చేయవలెను. జలము, తృణము, భస్మము, ద్వారము, మార్గము ఇవి మధ్యలో ఉన్నచో పంక్తి దోషములేదు. అనామికా-అంగుష్టములను కలిపి పట్టి ప్రాణాహుతులు తీసికొనవలెను. (166)